సెల్‌ఫోన్లో మాట్లాడితే లైసెన్స్ రద్దు
దేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నియమ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. నిర్దిష్ట వేగాన్ని మించి వాహనాన్ని నడిపినా, సిగ్నల్ జంప్ చేసినా, డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్‌లో మాట్లాడినా, మద్యం మత్తులో వాహనం నడిపినా, గూడ్స్ వాహనంలో ఎక్కువ లోడ్ ఉన్నా, గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకున్నా భారీ జరిమానాతో పాటు మూడు నెలల పాటు లైసెన్స్ లను రద్దు చేయాలని నిర్ణయించింది.
అలాగే అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో టూ వీలర్ డ్రైవర్లు, వారి వెనకాల కూర్చున్నవాళ్లకు కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధనలను సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కచ్చితంగా అమలు చేయాలంటూ అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది. ప్రతి మూడు నెలలకోసారి తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని కూడా అందులో ఆదేశించింది.
మద్యం మత్తులో గానీ, మాదక ద్రవ్యాల మత్తులో గానీ వాహనాలను నడిపితే డ్రైవర్లను మోటారు వాహన చట్టంలోని 185వ సెక్షన్ కింద ప్రాసిక్యూట్ చేయాలని, జైలుశిక్ష విధించాలని, మొదటిసారి నేరం చేసినా సరే జైలుశిక్ష విధించాల్సిందేనంటూ సుప్రీం ప్యానెల్ నిర్దేశించింది. హెల్మెట్లు ధరించకుండా టూ వీలర్లు నడిపితే డ్రైవర్లతో పాటు వారి వెనక కూర్చున్న వారికి కూడా జరిమానా విధించాలని.. దానికి ముందు రెండు గంటలు తగ్గకుండా కౌన్సెలింగ్ ఇప్పించాలని సూచించింది. అలాగే నాలుగు చక్రాల వాహనాల్లో సీటు బెల్టులు ధరించని వారికి జరిమానాతో పాటు రెండు గంటలు తగ్గకుండా కౌన్సెలింగ్ ఇప్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.