అమెరికాలో ఉగ్రదాడి?
న్యూఇయర్ సంబరాల్లో జనంపైకి దూసుకొచ్చిన వాహనం
విచక్షణారహితంగా కాల్పులు
10 మంది దుర్మరణం, 35 మందికి గాయాలు
ఆగంతకుడిని హతమార్చిన పోలీసులు
న్యూ ఆర్లీన్స్: అమెరికాలో నూతన సంవత్సరం మొదలైన తొలి క్షణాలే కొందరికి ఆఖరి క్షణాలయ్యాయి. నడివీధిలో నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోయిన జనంపైకి ఓ ఆగంతకుడు ట్రక్కుతో ఢీకొట్టి, తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరిపి పది మంది ప్రాణాలు తీశాడు. ఈ కాల్పుల ఘటనలో మరో 35 మంది గాయపడ్డారు. వెంటనే మెరుపువేగంతో స్పందించిన పోలీసులు ఆ ఆగంతకుడిని హతమార్చారు.
లూసియానా రాష్ట్రంలోని న్యూ ఆర్లీన్స్ సిటీలో మిసిసిప్పీ నదీతీరంలోని ఫ్రెంచ్ క్వార్టర్ ప్రాంత బార్బన్ వీధి ఈ దారుణానికి వేదికైంది. జనవరి ఒకటో తేదీ తెల్లవారుజామున 3.15 నిమిషాలకు ఈ ఘోరం జరిగింది. ఇది ఉగ్రదాడి అని, పేలుడు పదార్థాలు లభించాయని సిటీమేయర్ లాటోయా కాంట్రెల్ ప్రకటించారు. కాల్పులు జరిపింది 42 ఏళ్ల షంషుద్దీన్ జబ్బార్‌గా పోలీసులు భావిస్తున్నారు.ఘటనాస్థలిలో ఒక హ్యాండ్ గన్, ఏఆర్ రకం రైఫిల్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. 
అసలేం జరిగింది? 
ఘటన జరగడానికి ముందు బార్బన్ వీధిలో స్థానికులు గుమిగూడి కొత్త ఏడాదివేడుకలు చేసుకుంటున్నారు. సమీప సూపర్‌డోమ్ స్టేడియంలో జార్జియా, నోట్రే డామ్ జట్ల మధ్య షుగర్ బౌల్ కాలేజ్ ఫుట్‌బాల్ ప్లేఆఫ్ మ్యాచ్ జరిగింది. ఇందుకోసం వచ్చిన ప్రేక్షకులు వీళ్లకు జతకావడంతో ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. అదే సమయంలో ఎక్కువ మందిని చంపేయాలన్న ప్రతీకారంతో ఆగంతకుడు పికప్ ట్రక్‌ను వేగంగా ఎక్కువ మందిపై పోనిచ్చాడు. జనం మధ్యలో ఇరుక్కుని ట్రక్కు పోయాక కిందకు దిగిన ఆగంతకుడు పొడవాటి రైఫిల్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
 దీంతో 10 మంది చనిపోగా, 35 మంది గాయాలపాలయ్యారు. వేడుకల్లో జనాన్ని అదుపుచేసేందుకు అక్కడే ఉన్న పోలీసులు ఈ దాడిని చూసి హుతాశులయ్యారు. వెంటనే తేరుకుని ఆగంతకుడిపైకి కాల్పులు జరిపారు. పోలీసులపైకి అతను గురిపెట్టాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. పోలీసు కాల్పుల్లో ఆగంతకుడు అక్కడిక్కడే మరణించాడు. వీలైనంత ఎక్కువ మందిని ట్రక్కుతో ఢీకొట్టి చంపేయాలన్న పక్కా ప్రణాళికతో ఆగంతకుడు దానిని నడుపుకుంటూ వచ్చాడని సిటీ పోలీస్ సూపరింటెండెంట్ అన్నారు.  
జనం ఎగిరిపడ్డారు 
అత్యంత వేగంగా ట్రక్కు ఢీకొనడంతో జనంలో కొందరు ఎగిరిపడ్డారని ప్రత్యక్ష సాక్షి 22 ఏళ్ల కెవిన్ గార్సియా చెప్పారు. ‘‘ జనం మీదకు ట్రక్కు దూసుకొచ్చి తొక్కుకుంటూ పోతోంది. కొందరు బలంగా ఢీకొనడంతో ఎగిరిపడ్డారు. ఒకరి మృతదేహం ఎగిరి నా మీద పడింది’’ అని గార్సియా చెప్పారు. ‘‘ నైట్‌క్లబ్ నుంచి బయటికొచ్చా. అప్పటికే జనం పరుగెడుతున్నారు. ఇక్కడి నుంచి పారిపో అని ఒకాయన హెచ్చరించాడు. అప్పటికే అక్కడ కొన్ని మృతదేహాలు రక్తపుమడుగులో పడి ఉన్నాయి. గాయపడిన వారికి చుట్టుపక్కల వాళ్లు అక్కడే ప్రాథమిక చికిత్స చేశారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఐదు ఆస్పత్రులకు తరలించారు’’ అని విట్ డేవిస్ అనే మరో ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ‘‘వాహనాలను దాడులకు మారణాయుధాలుగా వాడుతున్న దారుణశైలి మొదలైంది. దీన్నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థంకావట్లేదు’’ అని మరొకరు వాపోయారు.  
 
An SUV crashed into a crowd in New Orleans, USA.
At least 10 people were killed and 30 more were injured. After the collision, the driver got out of the car and started shooting.
The perpetrator has not yet been arrested. pic.twitter.com/pOiHhIQu00— S p r i n t e r (@SprinterFamily) January 1, 2025

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
