నూతన సంవత్సరం వస్తోందంటే ఆ సంతోషం వేరే లెవల్‌లో ఉంటుంది. వచ్చే ఏడాదంతా మంచే జరగాలని, కోరిన కోరికలు నెరవేరాలని ఆశపడతారు. తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని అభిలషిస్తారు. మా ఆశలు పండించు అంటూ తమ ఇష్టదైవాన్ని కోరుకుంటారు. కొంగొత్త ఆశలు, కోరికలతో ఉత్సాహంగా న్యూ ఇయర్ స్వాగతం పలుకుతారు. ‘హ్యాపీ న్యూయర్’ అంటూ బంధువులు, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.
ఇక గృహణులు ఇంట్లోని ఆడపిల్లల సందడి మరింత ఉత్సాహంగా ఉంటుంది. కేవలం తాము మాత్రమే అందంగా తయారవ్వడం కాదు. ఇల్లంతా అందంగా అలంకరించుకుంటారు. సరికొత్తగా తమ డ్రీమ్ హౌస్‌ను తీర్చిదిద్దుకుంటారు. ఈ అలంకరణలో ముఖ్యమైంది. ఇంటిముందు తీర్చి దిద్దే రంగవల్లులు. ఎంత చలి అయినా సరే, అర్థరాత్రి దాకా పెద్దపెద్ద ముగ్గులు వేయాల్సిందే. వాటికి చక్కటి రంగులద్ది వాకిళ్లను శోభాయమానంగా రూపొందించాల్సిందే.. వాటిని తిరిగి తిరిగి చూసుకొని మరీ మురిసి పోవాల్సిందే.
ఒక విధంగా చెప్పాలంటే ఈ రంగోలీ వారి కళా నైపుణ్యానికి అద్దం పడతాయి. చక్కటి రంగవల్లులతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికే తీరు చాలా ప్రత్యేకమైంది అనడంలో ఎలాంటి సందేహంలేదు.
ముగ్గులు, రకాలు
చిన్న పక్షి నుంచి, ఆకులు పువ్వులు దాకా ప్రకృతిలో ప్రతీ అంశం, ప్రతీ సంబరం, సంతోషం ముగ్గు రూపంలో ముంగిట వాలిపోతుంది. ఇక సంక్రాంతిలో వేసే చాప, రథం ముగ్గు దాకా ముగ్గుల్లో ఎన్ని రకాలుంటాయో ఒక్క మాటలో చెప్పడం కష్టం. పద్మాల ముగ్గు, గులాబీల ముగ్గు, తూనీగల ముగ్గు, చిలకల ముగ్గు, ఏనుగుల ముగ్గు, శంఖాల ముగ్గు, డప్పు, డోలు ముగ్గు, గంగిరెద్దుల ముగ్గు, దీపాల ముగ్గు, అబ్బో..ఇలా ఎన్నో రకాలు.
ఎవరి ఊహకు తగ్గట్టు, ఎవరి నైపుణ్యానికి తగ్గట్టు వారు ముగ్గులు వేస్తారు. ఇందులో దాదాపు ప్రతీ మహిళ, ప్రతీ కన్నెపిల్ల సిద్దహస్తురాలే. చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు, మెలికల ముగ్గులు, అప్పటికప్పుడు అలా ఊహతో తీర్చిదిద్దే ముగ్గులు.
తీరొక్క చుక్క, చుక్కకో లెక్క
చుక్కల ముగ్గు వేయడంలో చుక్కలు వేయడం ప్రధానం. చుక్కలు లెక్క తప్పినా, ఏ మాత్రం వంకర పోయినా, ఆ ముగ్గు అందమే పోతుంది. చుక్క లెక్క తప్పిందా... ముగ్గు అంతా గోవిందా. అందుకే చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వేయాలి.
న్యూఇయర్, సంక్రాంతి ముగ్గు
సంవత్సరం అంతా వేసే ముగ్గులు ఒక ఎత్తయితే, సంక్రాంతి నెల అంతా, కొత్త ఏడాదికి స్వాగతం చెపుతూ వేసే ముగ్గులు మరో ఎత్తు. చుక్కలతో పెద్ద ముగ్గులు వేసి, మధ్యలో హ్యాపీ న్యూ ఇయర్ (Happy New Year 2025) అని రాసి మురిసిపోయే సంబరం అంతా ఇంతా కాదు.
ముగ్గులు వేయడం కష్టంగా అనిపిస్తే.. రకరకాల డిజైన్లతో ఈజీగా, సింపుల్‌గా రంగోలిని వేసుకోవచ్చు. చూడటానికి చాలా అందంగా, వెరైటీగా కూడా ఉంటాయి. మీ ఊహకు తగినట్టు చక్కగా పద్మాలను, రోజా పువ్వులను తీర్చిదిద్దుకొని వాటిని రంగులద్దుకోవాలి. మనకున్న వాకిలి ఆధారంగా డిజైన్ ఎంచుకోవాలి. వీలైతే ఒకసారి కాగితం మీద వేసుకుంటే చక్కగా అమరినట్టు వస్తుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వెల్కం బొమ్మ వేసి, ఇంద్రధనుస్సురంగులో నింపేసుకోవచ్చు. దీపాలు, పువ్వులను తీర్చిదిద్ది వాకిలిని అలంకరించుకోవచ్చు. ప్రత్యేకంగా రంగు రంగుల పువ్వులతోనే చక్కటి ముగ్గును వేసుకొని కొత్త ఏడాదికి స్వాగతం చెప్పవచ్చు. లేదంటే మార్కెట్‌లో దొరికే అచ్చుల సాయంతో చక్కటి డిజైన్ వేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment