ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ఇంటి రుణాలపై వడ్డీని తగ్గించింది. 8.45 శాతంగా ఉన్న వడ్డీ రేటులో 15 పాయింట్లు కట్ చేసింది. తమ బ్యాంకులో తీసుకునే గృహ రుణలపై 8.3 శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభం అవుతుందని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. సదరు రుణానికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు బ్యాంకు పేర్కొంది. ఇది పరిమితకాలపు ఆఫర్ అని, ఈ నెలాఖరు వరకు (మార్చి 31) మాత్రమే అందుబాటులో ఉంటుందని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.
గృహ రుణాల జారీలో ముందు వరుసలో ఉన్న ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలో గృహ రుణాలపై వడ్డీ రేట్లు 8.4 శాతం నుంచి ప్రారంభం అవుతున్నాయి. తమ బ్యాంక్ మాత్రం అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తోందని బ్యాంక్ పేర్కొంది. ఈ వడ్డీ రేటుకు 30 ఏళ్ల కాలానికి రుణం తీసుకుంటే రూ.లక్షకు రూ.755 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని బ్యాంక్ తెలిపింది. రుణ ప్యాకేజీలో భాగంగా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా అందిస్తున్నామని చెప్పింది.
సోలార్ ప్యానెల్స్‌కు..
సంప్రదాయ గృహ రుణాలతో పాటు రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్‌కు సైతం రుణాలు అందిస్తున్నామని బ్యాంక్ తెలిపింది. 7 శాతం వడ్డీకే ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజూ లేకుండా ఈ తరహా రుణాలు అందిస్తున్నట్లు బ్యాంక్ పేర్కొంది. గరిష్ఠంగా 120 నెలలకు గానూ ప్రాజెక్ట్ వ్యయంలో 95 శాతంగా రుణం పొందొచ్చని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రభుత్వం నుంచి రూ.78 వేలు సబ్సిడీ సైతం పొందొచ్చని వివరించింది.
గమనిక: ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా సంబంధిత బ్యాంకు శాఖలు మార్చి 30, 31న పనిచేసేలా చూడాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇప్పటికే బ్యాంకులకు సూచించింది.
ఇదీ చదవండి: శని, ఆదివారాల్లో ఎల్‌ఐసీ ఆఫీసులు ఓపెన్.. కారణం..
Comments
Please login to add a commentAdd a comment