ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. జనవరి 22వ తేదీన రామ మందిరం ప్రారంభోత్సవం కన్నుల పండువలా జరగనుంది. రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచే అందరి దృష్టి అయోధ్యపై పడింది.
సర్వత్రా ఆసక్తి
రామ మందిర నిర్మాణం కారణంగా అయోధ్య నగరంలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే అయోధ్య రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయంగా పెరుగుతోంది. భూముల ధరలు నాలుగు రెట్లు పెరిగాయి. ఈ ధరలు మరింత పెరుగుతాయని ప్రాపర్టీ మార్కెట్ నిపుణుల అభిప్రాయపడుతున్నారు. స్థానికులే కాకుండా బయటివారు కూడా ఇక్కడ భూములు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తాజ్, రాడిసన్ వంటి ప్రముఖ హోటల్ చైన్‌లు ఈ ప్రాంతంలో భూమి కొనేందుకు ఆసక్తిని కనబరిచాయి.
శివార్లలోనూ భూముల ధరలకు రెక్కలు
అయోధ్యలోని రామ మందిరం ప్రాంతంలోనే కాకుండా శివార్లలోనూ భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. ఫైజాబాద్ రోడ్ ప్రాంతంలో 2019లో చదరపు అడుగుకు రూ. 400–700 ఉంటే 2023 అక్టోబర్ నాటికి రూ. 1,500–3,000కి భూమి ధరలు పెరిగాయి. ఇక అయోధ్య నగరంలో భూమి సగటు ధరలు 2019లో చదరపు అడుగుకు రూ. 1,000–2,000 ఉండగా ప్రస్తుతం రూ. 4,000–6,000లకు పెరిగినట్లు అనరాక్ అధ్యయనాన్ని ఉటంకిస్తూ ‘మనీకంట్రోల్’ పేర్కొంది.
అభినందన్ లోధా హౌస్ ఈ జనవరిలోనే అయోధ్యలో 25 ఎకరాల రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. అలాగే రాడిసన్, తాజ్ వంటి ప్రముఖ హోటల్ చైన్‌లు కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నాయి.
ఆధ్యాత్మికగా కేంద్రంగా అయోధ్య
రామ మందిరం ప్రారంభమయ్యాక అయోధ్య దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మికగా కేంద్రంగా, పుణ్యక్షేత్రంగా ఆవిర్భంచబోతోంది. దేశ నలుమూలల నుంచి భక్తులు, యాత్రికుల తాకిడి అధికంగా ఉండబోతోంది. ఇందుకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మెరుగైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్య నగరంతోపాటు చుట్టపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ప్రాధాన్యం పెరిగింది. ఇన్వెస్టర్లు ఇప్పుడు అయోధ్య నగరాన్ని రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అత్యంత లాభదాయకమైన గమ్యస్థానంగా చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment