అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఈనెల 22న (సోమవారం) అత్యంత వైభవోపేతంగా జరగబోతోంది. ఈ సందర్భంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రోజున సెలవు దినంగా ప్రకటించాయి. మరోవైపున కేంద్ర ప్రభుత్వం సైతం తమ ఆధ్వర్యంలో నడిచే కార్యాలయాలకు హాఫ్ హాలీడే ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. అయితే మరి బ్యాంకుల మాటేమిటి? బ్యాంకులన్నింటికీ ఈ హాఫ్ హాలీడే వర్తిస్తుందా అన్నది ఇక్కడ తెలుసుకుందాం.
ఎకనమిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. అయోధ్యలోని రామాలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు, సంబంధిత పుణ్యకార్యాల్లో పాల్గొనేందుకు వీలుగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు ఆరోజున సెలవు ఇచ్చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా మధ్యాహ్నం వరకూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు, సంస్థలకు సెలవు ప్రకటించింది.
బ్యాంకులకు వర్తిస్తుందా?
ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలే కాబట్టి ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. జనవరి 22న మధ్యాహ్నం 2.30 గంటల వరకూ ఆయా బ్యాంకులన్నీ మూతబడి ఉంటాయి. మధ్యాహ్నం 2.30 తర్వాత కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. ఇది ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు ఇన్సూరెన్స్ కంపెనీలు, ఆర్థిక సంస్థలు, గ్రామీణ బ్యాంకులకు కూడా వర్తిస్తుంది. ఇక ప్రైవేటు బ్యాంకుల విషయానికి వస్తే ఆర్బీఐ సెలవుల జాబితాలో జనవరి 22 లేదు కాబట్టి ఆరోజును పనిదినంగా పరిగణించాలి. ఈ నేపథ్యంలో ప్రైవేటు బ్యాంకుల పనివేళల్లో ఎలాంటి మార్పు ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment