
అయోధ్యలో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్యను దర్శించుకునే భక్తుల కోసం పలు విమానయాన సంస్థలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ అయోధ్యలో రామ మందిరాన్ని దర్శించుకునే భక్తుల కోసం విమాన ఛార్జీలపై రాయితీలు అందిస్తున్నట్లు ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భక్తులు రామ మందిర దర్శన కోసం విమాన టికెట్‌ను ప్రారంభ ధర రూ.1622గా నిర్ధేశించింది. నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రయాణికులు బుక్ చేసుకున్న తేదీని మార్చుకోవచ్చని, ఇందుకోసం ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించే అవసరం లేదని తెలిపింది.
ఫిబ్రవరి 1, 2024 నుంచి దేశంలో చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై,బెంగళూరు, జైపూర్, పాట్నా, దర్భంగా నుంచి నేరుగా అయోధ్యకు వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఇక అయోధ్య నుంచి వారి నివాస ప్రాంతాలు చేరుకునేందుకు వీలుగా కొత్త విమానాల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది.
ప్రపంచంలోని పలు దేశాల నుంచి దాదాపూ 200 విమానాల్లో అయోధ్యకు చేరుకునే సౌకర్యం ఉంది. భారత్‌లో ప్రారంభ విమాన టికెట్ ధర రూ.5000 ఉండగా.. ఇతర దేశాల నుంచి అయోధ్యకు చేరుకునేందుకు విమానయాన సంస్థను బట్టి టికెట్ ధర మారుతుంది. కానీ, స్పైస్‌జెట్ మాత్రం ప్రత్యేక ఆఫర్ కింద రూ.1622కే అందిస్తుంది. జనవరి 22 నుంచి జనవరి 28 మధ్య బుక్ చేసుకుంటే జనవరి 22 నుంచి సెప్టెంబర్ 30,2024లోపు మీరు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. తేదీలను మార్చుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment