real estate boom
-
రామ జన్మభూమిలో రియల్ ఎస్టేట్ బూమ్.. భారీగా పెరిగిన భూముల ధరలు
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. జనవరి 22వ తేదీన రామ మందిరం ప్రారంభోత్సవం కన్నుల పండువలా జరగనుంది. రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచే అందరి దృష్టి అయోధ్యపై పడింది. సర్వత్రా ఆసక్తి రామ మందిర నిర్మాణం కారణంగా అయోధ్య నగరంలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే అయోధ్య రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయంగా పెరుగుతోంది. భూముల ధరలు నాలుగు రెట్లు పెరిగాయి. ఈ ధరలు మరింత పెరుగుతాయని ప్రాపర్టీ మార్కెట్ నిపుణుల అభిప్రాయపడుతున్నారు. స్థానికులే కాకుండా బయటివారు కూడా ఇక్కడ భూములు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తాజ్, రాడిసన్ వంటి ప్రముఖ హోటల్ చైన్లు ఈ ప్రాంతంలో భూమి కొనేందుకు ఆసక్తిని కనబరిచాయి. శివార్లలోనూ భూముల ధరలకు రెక్కలు అయోధ్యలోని రామ మందిరం ప్రాంతంలోనే కాకుండా శివార్లలోనూ భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. ఫైజాబాద్ రోడ్ ప్రాంతంలో 2019లో చదరపు అడుగుకు రూ. 400–700 ఉంటే 2023 అక్టోబర్ నాటికి రూ. 1,500–3,000కి భూమి ధరలు పెరిగాయి. ఇక అయోధ్య నగరంలో భూమి సగటు ధరలు 2019లో చదరపు అడుగుకు రూ. 1,000–2,000 ఉండగా ప్రస్తుతం రూ. 4,000–6,000లకు పెరిగినట్లు అనరాక్ అధ్యయనాన్ని ఉటంకిస్తూ ‘మనీకంట్రోల్’ పేర్కొంది. అభినందన్ లోధా హౌస్ ఈ జనవరిలోనే అయోధ్యలో 25 ఎకరాల రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. అలాగే రాడిసన్, తాజ్ వంటి ప్రముఖ హోటల్ చైన్లు కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నాయి. ఆధ్యాత్మికగా కేంద్రంగా అయోధ్య రామ మందిరం ప్రారంభమయ్యాక అయోధ్య దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మికగా కేంద్రంగా, పుణ్యక్షేత్రంగా ఆవిర్భంచబోతోంది. దేశ నలుమూలల నుంచి భక్తులు, యాత్రికుల తాకిడి అధికంగా ఉండబోతోంది. ఇందుకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మెరుగైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్య నగరంతోపాటు చుట్టపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ప్రాధాన్యం పెరిగింది. ఇన్వెస్టర్లు ఇప్పుడు అయోధ్య నగరాన్ని రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అత్యంత లాభదాయకమైన గమ్యస్థానంగా చూస్తున్నారు. -
చంద్రబాబు ప్లాన్ అట్టర్‌ప్లాప్.. ఆంధ్రజ్యోతి ఎంత పనిచేసింది!
ఇది అందరూ తెలుసుకోవలసిన విషయం. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఒక ప్రచారం చేశారు. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్‌లో ఒక ఎకరా అమ్మితే ఏపీలో వంద ఎకరాలు కొనవచ్చని. అంతలా తెలంగాణలో రేట్లు పెరిగిపోయాయని, ఏపీలో ధరలు దెబ్బతిన్నాయన్నది ఆయన చెప్పిన మాట. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఆయన ఈ అవకాశాన్ని వాడుకున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆయనకు మద్దతు ఇచ్చే ఆంధ్రజ్యోతి దిన పత్రిక హైదరాబాద్‌లో హెచ్ఎండీఏ వేలంపాటలో విపరీతమైన రేట్లను కొందరు పెట్టడంపై ఒక కథనాన్ని ఇస్తూ అదంతా రియల్ ఎస్టేట్ మాఫియా పని అని, నిజానికి రేట్లు పెరిగినట్లు చూపి తమ భూముల విలువ పెంచుకునే కుట్ర అని వెల్లడించింది. అంతేకాక, గజం లక్ష రూపాయలకో, లేక ఎకరా వంద కోట్లకో పాట పాడినవారు చాలా మంది అసలు ఆ తర్వాత డబ్బులే చెల్లించడం లేదని తెలిపింది. కేవలం ఒక లక్ష రూపాయల డిపాజిట్ కట్టి ఈ తంతు సాగిస్తున్నారని తెలియచేసింది. తెలంగాణ ప్రాంతంలో ఈ కథనాన్ని ఇచ్చిన ఆ పత్రిక ఏపీలో మాత్రం ఇవ్వకుండా జాగ్రత్తపడింది. బాబు బూమ్ మాయ.. ఇక్కడ మాత్రం చంద్రబాబు చెప్పిన విషయానికి మాత్రం ప్రాధాన్యం ఇచ్చారు. దీనిని బట్టి ఒకటి అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ మాఫియాలకు అనుకూలంగా ఉంటారని అనుకోవచ్చు కదా!. ఎందుకంటే అమరావతి రాజధాని గ్రామాల్లో అచ్చంగా ఇలాగే రియల్ ఎస్టేట్ కృత్రిమ బూమ్ కోసం చంద్రబాబు కృషి చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో రాజధాని గ్రామాలలో తెల్లవారేసరికి భూముల విలువ ఐదు నుంచి పది రెట్లు పెరిగిపోయాయి. అబ్బో అదంతా చంద్రబాబు ఘనతే అని ఆయనకు మద్దతు ఇచ్చే పత్రికలు, టీవీలు ఊదరగొట్టాయి. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ఆంధ్రజ్యోతి రాసిన ఈ కథనం చూస్తే కారణం ఏమైనా కానీ.. కొంత వాస్తవమే ఉన్నట్లు అనిపిస్తుంది. మేడిపల్లి అనే చోట జరిగిన హెచ్ఎండీఏ వేలంపాటలో నారాయణమూర్తి అనే వ్యక్తి గజం యాభై వేలకు ప్లాట్ కొన్నారట. ఆ తర్వాత ఆయన హెచ్ఎండీఏ ఆఫీస్‌కు వెళ్లి తన పక్క ప్లాట్ల వారి గురించి ఆరా తీశారట. అప్పుడు అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారట. తనతో పాటు ఆయా ప్లాట్లను వేలంలో అధిక ధరకు కొనుగోలు చేసినవారిలో ఎనభై శాతం అసలు డబ్బు చెల్లించలేదట. లక్ష రూపాయల డిపాజిట్ కూడా వదలుకోవడానికి సిద్దపడటంలో రహస్యం వారి ఆ చుట్టుపక్కల ఉన్న ఆస్తుల విలువను పెంచుకోవడానికి ప్రయత్నిస్తుండటమేనట. రియల్ ఎస్టేట్ ట్రిక్స్.. ఫ్రీలాంచ్ ఆఫర్ల పేరుతో తమ విల్లాలు, అపార్టుమెంట్లను అమ్ముకోవడానికి అత్యాశతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేలం మాఫియాగా మారారని ఆ పత్రిక రాసింది. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత సుమారు లక్ష ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చింది. దాంతో ఓవరాల్‌గా రియల్ ఎస్టేట్ రంగం సబ్దుగా మారిందని, ఆ నేపథ్యంలోనే ఇలాంటి ట్రిక్కులను ప్లే చేస్తున్నారని మీడియా రాసింది. ఇంకో విశేషం ఏమిటంటే తెలంగాణలో 2023 మొదటి నాలుగు నెలల్లో గత ఏడాది కన్నా రిజిస్ట్రేషన్లు తగ్గాయట. ఆదాయం కూడా 150 కోట్లు తక్కువగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఈ రియల్ మాఫియాకు ప్రభుత్వ సహకారం కూడా ఉందని ఈ పత్రిక ఆరోపించింది. మార్కెట్ దెబ్బతిందన్న భావన కలగకుండా ఉండడానికి ప్రభుత్వం అలా చేస్తోందని రాశారు. మోకిలా అనేచోట హెచ్ఎండీఏ వేసిన ప్లాట్ల వేలంలో కూడా ఇలాగే స్కామ్ జరిగిందని మీడియా చెబుతోంది. ఒకే సంస్థకు చెందిన పదిహేను మంది అక్కడ గజం 35వేల రూపాయల వరకు వెళ్లవచ్చని అనుకుంటే అరవైఐదు వేల నుంచి లక్ష రూపాయలవరకు పెట్టారట. తీరా చూస్తే ఆ సంస్థకు ఆ పక్కనే 350 ఎకరాల భూమి ఉందట. హైదరాబాద్‌లో ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్త మందగించిందని, అంతర్జాతీయంగా ఉన్న ఆర్ధిక సంక్షోభం కొంత కారణమని, ఐటి రంగంలో ఉన్న ఒడిదుడుకులు తోడవుతున్నాయని.. ఇలా రకరకాల రీజన్స్ చెబుతూ కొంతకాలం క్రితం ఒక టీవీ చానల్ కూడా కథనాన్ని ఇచ్చింది. టీడీపీ మాఫియా పని.. ఇదే టైమ్‌లో చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఏ పరిణామం జరిగినా అదంతా తన ఘనతేనని చెప్పుకుంటారు. నిజానికి ఆయన ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం సీఎంగా ఉన్నారు. అప్పటికి, ఇప్పటికి ఎంతో తేడా వచ్చింది. ఆయన టైమ్‌లో మాదాపూర్ వరకు పూర్తి స్థాయిలో రోడ్డు కూడా లేదు. వైఎస్సార్ వచ్చాక దానిని పెద్ద ఎత్తున విస్తరించారు. ఆ విషయాలు పక్కనబెడితే చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని గ్రామాలలో కూడా ఇలాంటి మాఫియా వారినే ప్రోత్సహించారన్న అభిప్రాయం కలగదా?. వెలగపూడి చుట్టుపక్కల రాజధాని అని ప్రకటించేలోపే ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగి తక్కువ ధరకు కొందరు టీడీపీ నేతలు భూములు కొన్నారని ఆరోపణ వచ్చింది. తదుపరి ఆ భూములను అధిక ధరలకు అమ్ముకుని కొందరు లాభ పడ్డారు. పది, పదిహేను లక్షల రూపాయల చొప్పున ఎకరా భూమి అమ్ముడు పోయిన పరిస్థితి నుంచి ఏకంగా ఎకరా ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలకు అమరావతి గ్రామాలలో వెళ్లింది. ఆనాటి మంత్రి నారాయణ, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే పలుమార్లు ఎకరం నాలుగు కోట్ల వరకు పలుకుతోందని, అదంతా తమ ఘనత అని చెప్పుకునేవారు. అసలు రాజధానికి సంబంధించిన భవనాలే రాకముందే అంతంత ధర ఎలా వచ్చింది. ఆ చుట్టుపక్కలే, చంద్రబాబుకు సంబంధించిన హెరిటేజ్ కంపెనీ భూములు కొనడం, నారాయణ తన బినామీల పేరుతో భూములు కొనడం ఏమిటి?. అమరావతితో రియల్ దందా.. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అచ్చంగా మాఫియాలా మారారన్న విమర్శలు అప్పట్లో కూడా వచ్చాయి కదా?. చంద్రబాబు ప్రభుత్వం కొన్ని ప్రైవేటు సంస్థలకు చాలా తక్కువ ధరకు భూముల ఇచ్చి, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మాత్రం ఎకరా నాలుగు కోట్ల రూపాయల ధర పెట్టడంలోని హేతుబద్దత ఏమిటన్న ప్రశ్నలుకూడా వచ్చాయి. అమరావతి గ్రామాలలో మాత్రమే రియల్ ఎస్టేట్ రేట్లు పెరగడానికి అప్పట్లో మిగిలిన ప్రాంతాన్ని గ్రీన్ జోన్‌గా ప్రకటించడం జరిగిందని చెబుతారు. దానివల్ల చాలా రాజధానియేతర గ్రామాలలో పొలాలు అమ్ముకోవడమే కష్టం అయ్యేది. ధరలు కూడా పడిపోయాయి. అయినా ఇప్పటికీ చంద్రబాబు అమరావతి మోడల్ గురించే ప్రచారం చేస్తుంటారు. లక్షల కోట్లు వ్యయం చేస్తేకానీ.. తయారు కాని అమరావతిని సంపద సృష్టించే నగరంగా ప్రచారం చేసుకుంటారు. ఏది ఏమైనా హైదరాబాద్‌లో అయినా, అమరావతి గ్రామాలలో అయినా కృత్రిమంగా విలువలు పెంచుకోవడంలో ఉన్న మతలబు ఇది అని తెలిసిన తర్వాత అంతా ముక్కున వేలేసుకోవలసిందే. అలాంటివాటిని తన ఘనతగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గురించి ఏమనుకోవాలి?. కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్. -
రికార్డు స్థాయిలో గృహ విక్రయాలు.. దేశంలోనే దూసుకుపోతున్న హైదరాబాద్!
సాక్షి, హైదరాబాద్: 2022 హైదరాబాద్ రియల్టీ నామ సంవత్సరంగా నిలిచింది. గృహ విక్రయాలు, ప్రారంభాలలో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. కరోనా, గృహాల ధరలు, వడ్డీ రేట్లు పెరుగుదల ఉన్నప్పటికీ.. హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో ఇళ్ల విక్రయాలు జరిగాయి. గతేడాది 47,487 అమ్మకాలు, 68 వేల యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. 2021తో పోలిస్తే విక్రయాలలో 87 శాతం వృద్ధి రేటుతో నగరం తొలిస్థానంలో నిలిచింది. 2021లో హైదరాబాద్‌లో 25,406 గృహాలు అమ్ముడుపోగా.. 2022లో దేశంలోని ఏ నగరంలో లేనివిధంగా భాగ్యనగరంలో రికార్డు స్థాయిలో 87 శాతం వృద్ధి రేటు నమోదయింది. 2022లో విక్రయాలలో తొలి స్థానంలో నిలిచిన ముంబైలో 44 శాతం మాత్రమే వృద్ధి కాగా.. ఎన్సీఆర్లో 59 శాతం, బెంగళూరులో 50%, పుణేలో 59 శాతం, చెన్నైలో 29 శాతం, కోల్‌కత్తాలో 62 శాతం వృద్ధి నమోదయింది. గతేడాది హైదరాబాద్‌లో 51,500 యూనిట్లు లాంచింగ్ కాగా.. ఈ ఏడాది 32% పెరుగుదల కనిపించిందని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది. లాంచింగ్స్‌లో 51 శాతం పెరుగుదల.. దేశంలో గతేడాది 3,57,600 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. 2021లో 2,36,700 గృహాలు ప్రారంభమయ్యాయి. ఏడాదిలో 51 శాతం వృద్ధి. అయితే 2014తో పోలిస్తే మాత్రం 2022లో లాంచింగ్‌లు తక్కువే. 2014లో 5.45 లక్షల యూనిట్లు ప్రారంభమయ్యాయి. లాంచింగ్స్‌లో ముంబై, హైదరాబాద్ పోటీపడ్డాయి. ఈ రెండు నగరాల వాటా 54 శాతంగా ఉంది. 2014 రికార్డు బద్దలు.. 2022లో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 3,64,900 గృహాలు విక్రయమయ్యాయి. 2021లో 2,36,500 యూనిట్లు అమ్ముడుపోయాయి. అంటే ఏడాదిలో 54 శాతం వృద్ధి. 2014 తర్వాత ఈ స్థాయిలో గృహాలు అమ్ముడుపోవటం ఇదే తొలిసారి. 2014లో 3.43 లక్షల ఇళ్లు విక్రయమయ్యాయి. ఇళ్ల అమ్మకాలలో ముంబై తొలిస్థానంలో నిలిచింది. ఇక్కడ 1,09,700 యూనిట్లు అమ్ముడుపోగా.. 63,700 యూనిట్లతో ఎన్సీఆర్ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. -
మీ పిచ్చి తగలెయ్యా..? డబ్బులుంటే చాలు..చార్మినార్‌ను ఈఫిల్ టవర్‌ను కొనేస్తారు
మీ పిచ్చి తగలెయ్యా..? ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే చేతిలో డబ్బులుంటే చాలు హైదరాబాద్‌లో చార్మినార్‌ను అంతెందుకు పారిస్‌లో ఉన్న ఈఫిల్ టవర్‌ను ఈజీగా కొనేస్తారు. ఆ పిచ్చితోటే వర్చువల్ రియాల్టీ సంస్థ డిసెంట్రాల్యాండ్‌లో ఔత్సాహికులు 2.4 మిలియన్ల విలువైన క్రిప్టో కరెన్సీతో వర్చువల్ రియల్ ఎస్టేట్ ప్లాట్లను కొనుగోలు చేశారు. ఏమిటీ డీసెంట్రాల్యాండ్? డిసెంట్రలైజ్డ్ 3డీ వర్చువల్ రియాలిటీ ప్లాట్‌ఫామ్ ఇది.మ్యాప్‌బాక్స్ టెక్నాలజీతో సృష్టించిన వర్చువల్ ల్యాండ్ ఇది. భూగ్రహాన్ని డిజిటల్ గ్రిడ్ లేయర్స్, టైల్స్గా విభజిస్తారు. ఈ టైల్స్ విలువ యూఎస్‌లో ఒకరకంగా, ఆస్ట్రేలియాలో ఒక రకంగా, ఇండియాలో ఒకరకంగా ఉంటుంది. దీన్ని డిజిటల్ ఎస్టేట్ అని కూడా పిలుస్తున్నారు. ఈజీగా చెప్పాలంటే ఫేస్బుక్ అధినేత జుకర్ బెర్గ్ మెటా పేరుతో కొత్త టెక్నాలజీపై పనిచేస్తున్నారు. ఈ టెక్నాలజీతో మీరు ఎక్కడ ఉన్నా అవతార్ రూపంలో ఎదురుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీన్ని ఇప్పటికే ఫేస్బుక్ ఇంటర్నల్‌గా జరిగే మీటింగ్‌లో ఉపయోగిస్తుంది. ఇక డిసెంట్రాల్యాండ్ కూడా అంతే ఇందులో మనకు కావాల్సిన ల్యాండ్స్‌ను, బిల్డింగ్స్‌ను నిర్మించొచ్చు. డిజిటల్ భూభాగంలో కొనవచ్చు. వాటిని డెవలప్ చేయవచ్చు.అమ్మవచ్చు. జుకర్ దెబ్బకు పెరిగిన డిమాండ్ డిసెంట్రాలాండ్లోని ల్యాండ్ ఇతర వస్తువులు నాన్-ఫంగబుల్ టోకెన్ల (NFTలు) రూపంలో విక్రయిస్తారు. ఇది ఒక రకమైన క్రిప్టోకరెన్సీ తరహాలో డిజిటల్ మనీగా చెప్పుకోవచ్చు. డిసెంట్రాల్యాండ్‌లో కరెన్సీ 'మన' రూపంలో కొనుగోలు చేయొచ్చు. సోమవారం 618,000 కరెన్నీతో రియల్ ఎస్టేట్ ప్లాట్ల అమ్మకాలు జరిగాయి. వాటి విలువ సుమారు $2,428,740 అని డీసెంట్రాల్యాండ్ ప్రతినిధులు ప్రకటించారు. ఈ డిజిటల్ భూమిలో 6,090 వర్చువల్ చదరపు అడుగుల పరిమాణంలో ఒక్కొక్కటి 52.5 చదరపు అడుగులో 116 చిన్న చిన్న ప్లాట్లను తయారు చేశారు. అయితే వాటిని పలువురు ఔత్సాహికులు 2.4 మిలియన్ల తో కొనుగోలు చేశారు. కాగా మెటావర్స్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నట్లు జుకర్ ప్రకటించారు. ఆ ప్రకటనతో డిసెంట్రాల్యాండ్‌లో డిజిటల్ అమ్మకాలు భారీగా పెరిగాయి. అదే సమయంలో డిసెంట్రాల్యాండ్కు చెందిన అధికారిక కరెన్సీ 'మన' వ్యాల్యూ 400శాతం పెరిగినట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. -
‘కల్లు గీత’పై ‘రియల్’ వేటు!
సాక్షి, హుస్నాబాద్: పట్టణాలు పెద్ద ఎత్తున విస్తరిస్తుండటంతో రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో పట్టణాల శివారుల్లోని బీడు భూములకు అధిక ధరలు చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు తాటి వనాలు ఉన్న భూములను కొనుగోలు చేయడంతో ఆయా గ్రామాల ‘కల్లు గీత’ కార్మికుల పై రియల్ కత్తి వేటు పడుతోంది. కొనుగోలు చేసిన వ్యాపారులు తాటి చెట్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేయడంతో కల్లు గీత కార్మికులు ప్రతిఘటిస్తున్నారు. పగటిపూట చెట్లను నరికితే అడ్డొస్తున్నారని రాత్రి వేళల్లో అధునాతన మిషన్లతో పది నిమిషాల్లో కల్లు పారే ఒక్కో చెట్టును నేల కూల్చుతున్నారు. దీంతో వందల మంది గీత కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. దీంతో రియల్ వ్యాపారులు చుట్టు పక్కల గ్రామాల్లోని భూములను కొనుగోలు చేస్తున్నారు. పట్టణ శివారు గ్రామాలైన పందిల్ల , తోటపల్లి తాటి వనంలో వేల సంఖ్యలో తాటి చెట్లు ఉండటంతో ఇక్కడ వందలాది గీత కార్మిక కుటుంబాలు కల్లు గీతపై జీవనం సాగిస్తున్నాయి. ఒక్కొక్క కార్మికుడు సీజన్లో రోజుకు వేయి రూపాలయల కల్లు విక్రయిస్తుంటారు. ఇతర గ్రామాల నుంచి కూడ ఇక్కడకి కల్లు గీయడానికి వస్తుంటారు. హుస్నాబాద్, సిద్దపేట కేంద్రం రోడ్డులో ఉన్న తాటి వనంపై రియల్ వ్యాపారుల కన్ను పడింది. ఆ భూములను కొనుగోలు చేసిన వారు సాగు పేరు చెప్పి తాటి చెట్లను తొలగించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులకు ముడుపులు.. ఏ రైతు భూమిలో తాటి చెట్లు ఉన్నా.. వాటికి కల్లు గీసే హక్కు గీతా కార్మికులకు ఉంటుంది. తాటి చెట్టు కల్లు గీసినందుకు చెట్టుకు సొసైటీల ద్వారా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కల్లు పారే చెట్లను నరికేందుకు ఎట్టి పరిస్థితిలో అనుమతులు ఇవ్వకూడదు. ఒక వేల భూ యాజమాని చెట్లను కొట్టాలని ప్రభుత్వ అధికారులకు దరఖాస్తులు పెట్టినా అనుమతి ఇచ్చే ముందు ఎక్సైయిజ్ అధికారుల నుంచి కల్లు పారుతుందా..? లేదా..? అనే విషయం తెలుసుకుంటారు. సంబంధిత అధికారులు భూ యాజమానులు ఇచ్చిన ముడపులకు ఆశపడి అక్రమంగా అనుమతులు ఇస్తున్నారని గీత కార్మికులు ఆరోపిస్తున్నారు. పందిల్ల తాటి వనంలో 32 రెండు చెట్లను తొలగించుటకు అధికారులు అనుమతులు ఇవ్వడంతో రాత్రి రాత్రికే మిషన్లు తెచ్చి తొలగించి కార్మికుల పొట్ట కొట్టారు. చెట్టుకు పరిహారం .... గీత కార్మికులకు ఉపాధినిచ్చే తాటి చెట్లు కూలిపోతే వాటికి ఎక్సైయిజ్శాఖ నుంచి పరిహారంను గీతా కార్మిక సొసైటీలకు అందిస్తారు. ఒక్కొక్క చెట్టుకు రూ.1,960లు చెల్లించగా ఇందులో 50శాతం భూ యాజమానికి, 50శాతం గీతా కార్మిక సొసైటీకి అందించడం జరుగుతుంది. అయితే ఇది ప్రకృతి వైపర్యాల వల్ల కూలిపోయిన చెట్లకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాల్సి ఉంది. అధికారులు మాత్రం యాజమానులకు చెట్లు నరికేందుకు అడ్డదారిలో అనుమతులు ఇచ్చి పరిహారం ఇస్తామని కార్మికులను బుజ్జగిస్తున్నారు. రోజుకు రూ.500 కల్లు అమ్ముకునే కార్మికునికి రూ.930లు ఇస్తే ఏట్లా సరిపోతుందని వారు ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా అనుమతులు ఇవ్వడంతో భూ యాజమానులకు ఇచ్చే పరిహారంను కూడ అధికారులు కాజేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. హరితహారం మాటే లేదు..... ప్రభుత్వం గీతా కార్మికులకు ఉపాధి కల్పించుటకు హరితహారంలో తాటి, ఈత, ఖర్జుర చెట్లను పెంచాలని ఎక్సైయిజ్ అధికారులచేత మొక్కలు నాటించి వాటిని సంరక్షణకు చర్యలు తీసుకుంటోంది. హుస్నాబాద్ ఎక్సైయిజ్ అధికారులు మాత్రం ఆ మొక్కలు పెంచడం పక్కన పెట్టి కల్లు పారే తాటి చెట్ల నరికివేసేందుకు అడ్డదారుల్లో అనుమతులు ఇస్తున్నారని బాధిత గీతా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు హరిత హారంలో మొక్కలు నాటిన ఎక్సైయిజ్ అధికారులు వాటిని రక్షించుటకు ఎప్పుడు చర్యలు తీసుకోనే లేదు. ప్రతి ఏటా హారితహారం మొక్కలు నాటడం వాటిని వదిలేయడం. పరిహారం పెంచాలి తాటి చెట్టును నమ్ముకొని బతికే కుటుంబాలు వందల సంఖ్యలో ఉన్నాయి. మా పందిల్ల గ్రామంలోనే 86 కుటుంబాలు ఈ వృత్తి మీదనే ఆధారపడి ఉన్నాయి. పొరుగు గ్రామాల కార్మికులు సైతం వచ్చి కల్లు గీతా వృత్తిలో జీవిస్తున్నారు. రాత్రి వేళలో వచ్చిన చెట్లను నరకడం వల్ల కార్మికులు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. ఒక్కొక్క చెట్టుకు రూ. 10 వేల పరిహారం ఇవ్వాలి. మల్లన్నసాగర్లో తాటి చెట్లు పోయిన కార్మికులకు ఇచ్చినట్లు మా గ్రామ గీత కార్మికులకు కూడా ఇవ్వాలి. అధికారుల నిర్లక్ష్యం వల్లే తాటి వనాలు నరికేస్తున్నారు. ఒకరిపై కేసులు నమోదు చేస్తే మరెప్పుడు తాటి చెట్లను నరికేందుకు భయపడుతారు. –తోడేటి రమేశ్, సర్పంచ్ పందిల్ల -
పడిపోయిన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం
రియల్ ఢాం ఇతర రంగాలకు వెళ్తున్న వ్యాపారులు నల్లగొండ : రియల్ ఎస్టేట్ బూమ్ దారుణంగా పడిపోయింది. కోట్ల రూపాయలు వెచ్చించి వ్యవసాయ భూముల్లో వెంచర్లు చేసినవారు ప్లాట్లు అమ్ముడుపోక తలలు పట్టుకుంటున్నారు. వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి రియల్ఎస్టేట్ వ్యాపారం చేసిన వారు తిరిగి అప్పులు చెల్లించలేక ప్లాట్లను అంటగుడుతున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రధాన పట్టణాల్లో రోజూ చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న భువనగిరితోపాటు యాదగిరిగుట్ట పరిసరాల్లో మినహా నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేటలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా తగ్గింది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖకు వచ్చే ఆదాయం కూడా పడిపోయింది. జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. కాగా ఆయా కార్యాలయాలకు ఈ ఏడాది ఇప్పటి వరకు విధించిన ఆదాయ లక్ష్యం నెరవేరలేదు. ఈ ఏడాది ఏప్రిల్ మాసం నుంచి జూలై మాసం వరకు రిజిస్ట్రేషన్ శాఖకు 76.97 కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యంగా నిర్ణయించగా 38.98 కోట్ల రూపాయల మేర లభించింది. అంటే ఆదాయ లక్ష్యంలో కేవలం 50 శాతం మాత్రమే వచ్చింది. ఇళ్ల స్థలాలు విక్రయించేవారు కన్పిస్తున్నారే కానీ కొనుగోలు చేసేవారు లేరు. ఇతర రంగాలకు వ్యాపారులు... ఇంత కాలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వారు బూమ్ తగ్గడంతో ఇతర రంగాలకు వెళ్తున్నారు. కోట్లు, లక్షల రూపాయల వ్యాపారం చేసిన బడా వ్యాపారులు సైతం పెట్టుబడులు పెట్టి దివాలా తీశారు. దీంతో నష్టపోయిన వారంతా ఇతర రంగాలకు ఎంచుకుంటున్నారు. ఇంకా కొంతకాలంపాటు రియల్ రంగం ఉండే అవకాశం ఉంది. దీంతో భూముల ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉంది. -
రియల్ ‘భూమ్’
ఊపందుకుంటున్న క్రయ విక్రయాలు రియల్ ఎస్టేట్ వెంచర్లు కళకళ నిలకడగా భూముల ధరలు పెరుగుతున్న రిజిస్ట్రేషన్‌శాఖ ఆదాయం హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో మళ్లీ స్థిరాస్తి రంగంపై ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర విభజనతో స్తబ్ధతగా మారిన ఈ రంగం మళ్లీ పుంజుకుంటోంది. భూములు, ప్లాట్ల క్రయ విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈనెల మొదటి వారంలో ఒకేసారి దస్తావేజుల నమోదు సంఖ్య పెరిగింది. దీంతో నగరంతో పాటు శివారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటికిట లాడుతున్నాయి. మొన్నటి వరకు రాష్ట్ర విభజనతో స్థానికేతరులు ఇక్కడ స్థిరాస్తులు కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో లావాదేవీలు తగ్గాయి. తెలంగాణేతరులు స్థిరాస్తులు, భూముల ధరలపై ఆందోళన చెందినప్పటికీ భూముల ధరలు, విలువలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. పెరుగుతున్న రిజిస్ట్రేషన్లు.. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం స్థిరాస్తి దస్తావేజుల నమోదు సంఖ్య పెరిగి రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం కూడా పెరిగింది. గ్రేటర్ పరిధిలో రెండు నెలల్లో సుమారు 20 వేలకు పైగా స్థిరాస్తి దస్తావేజులు నమోదు కావడం గమనార్హం. దీంతో విభజన వల్ల 40 శాతానికి పడిపోయిన నెలసరి ఆదాయ లక్ష్య సాధన 65 నుంచి 70 శాతానికి చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల్లో హైదరాబాద్ జిల్లాలో రూ.155.76 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.370.27 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ శాఖకు సమకూరింది. అందులో రాష్ట్ర ఆవతరణ అనంతరం లభించిన ఆదాయాన్ని పరిశీలిస్తే.. రెండు నెలలో హైదరాబాద్ జిల్లాలో రూ.83.71 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.191.62 కోట్ల ఆదాయం వచ్చింది. గత నెలలో హైదరాబాద్ డీఆర్ పరిధిలోని బంజారాహిల్స్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 493 దస్తావేజులు నమోదు కాగా అందులో 167 అమ్మకం దస్తావేజులు, ఆజంపురం ఎస్ఆర్ పరిధిలో 482 దస్తావేజులు నమోదు కాగా,అందులో 173 అమ్మకం దస్తావేజులు ఉన్నాయి. చిక్కడపల్లి సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 445 దస్తావేజులు నమోదు కాగా, అందులో 157 అమ్మకం దస్తావేజులు, ఆర్ఓ హైదరాబాద్ (రెడ్‌హిల్స్) పరిధిలో నమోదైన 448 దస్తావేజుల్లో 168 అమ్మకం దస్తావేజులు ఉన్నట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల మొదటి వారంలో శివారు సబ్‌రిజిస్ట్రార్ పరిధిల్లో స్థిరాస్తుల దస్తావేజుల సంఖ్య మరింత పెరిగాయి. ఇదిలా ఉండగా, మహానగర శివారులో రియల్ ఎస్టేట్ వెంచర్లు తిరిగి పుంజుకున్నాయి. దీంతో పాటు రియల్ ఎస్టేట్ వెంచర్లకు వాహనాలు సమకూర్చే ట్రావెల్స్ ఏజెన్సీల వ్యాపారం కూడా పెరిగింది.