రియల్ ఢాం
ఇతర రంగాలకు వెళ్తున్న వ్యాపారులు
నల్లగొండ : రియల్ ఎస్టేట్ బూమ్ దారుణంగా పడిపోయింది. కోట్ల రూపాయలు వెచ్చించి వ్యవసాయ భూముల్లో వెంచర్లు చేసినవారు ప్లాట్లు అమ్ముడుపోక తలలు పట్టుకుంటున్నారు. వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసిన వారు తిరిగి అప్పులు చెల్లించలేక ప్లాట్లను అంటగుడుతున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రధాన పట్టణాల్లో రోజూ చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న భువనగిరితోపాటు యాదగిరిగుట్ట పరిసరాల్లో మినహా నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేటలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా తగ్గింది.
దీంతో రిజిస్ట్రేషన్ శాఖకు వచ్చే ఆదాయం కూడా పడిపోయింది. జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. కాగా ఆయా కార్యాలయాలకు ఈ ఏడాది ఇప్పటి వరకు విధించిన ఆదాయ లక్ష్యం నెరవేరలేదు. ఈ ఏడాది ఏప్రిల్ మాసం నుంచి జూలై మాసం వరకు రిజిస్ట్రేషన్ శాఖకు 76.97 కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యంగా నిర్ణయించగా 38.98 కోట్ల రూపాయల మేర లభించింది. అంటే ఆదాయ లక్ష్యంలో కేవలం 50 శాతం మాత్రమే వచ్చింది. ఇళ్ల స్థలాలు విక్రయించేవారు కన్పిస్తున్నారే కానీ కొనుగోలు చేసేవారు లేరు.
ఇతర రంగాలకు వ్యాపారులు...
ఇంత కాలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వారు బూమ్ తగ్గడంతో ఇతర రంగాలకు వెళ్తున్నారు. కోట్లు, లక్షల రూపాయల వ్యాపారం చేసిన బడా వ్యాపారులు సైతం పెట్టుబడులు పెట్టి దివాలా తీశారు. దీంతో నష్టపోయిన వారంతా ఇతర రంగాలకు ఎంచుకుంటున్నారు. ఇంకా కొంతకాలంపాటు రియల్ రంగం ఉండే అవకాశం ఉంది. దీంతో భూముల ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉంది.
పడిపోయిన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం
Published Sat, Aug 16 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM
Advertisement
Advertisement