Department of Registration
-
పారదర్శక పాలనలో మరో ముందడుగు
సాక్షి, అమరావతి: అవినీతి రహిత, పారదర్శక పాలన లక్ష్యంగా రిజిస్ట్రేషన్ శాఖ వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దళారుల ప్రమేయం లేకుండా సామాన్యులు సైతం సులువుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్న ఆలోచనతో అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అక్రమాలకు చెక్ పెట్టడమే ధ్యేయంగా రిజిస్ట్రేషన్ శాఖ.. న్యాయ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రంగాల నిపుణులతో సంప్రదించి ఏయే అంశాలు తప్పనిసరిగా ఉండాలో చర్చించి సులభమైన రీతిలో నమూనా దస్తావేజులను రూపొందించింది. దీంతో ఎవరి డాక్యుమెంట్లను వారే సులభంగా రూపొందించుకునేలా కసరత్తు ప్రారంభించింది. భూములు, స్థలాలు, భవనాలు స్థిరాస్తుల అమ్మకం, బహుమతి, భాగం (పార్టిషన్), తనఖా, విడుదల (రిలీజ్)కు సంబంధించిన రిజిస్ట్రేషన్లకు 16 రకాల నమూనా డాక్యుమెంట్లను తెలుగు, ఇంగ్లిష్‌లో రూపొందించి రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ దిశగా కొత్త విధానాన్ని రూపొందించి కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఇప్పటిదాకా దళారులే ఆధారం ప్రస్తుతం రిజిస్ట్రేషన్లకు డాక్యుమెంట్లు (దస్తావేజులను) రాయడం కోసం ఎంత చదువుకున్న వారైనా దస్తావేజు లేఖరులు/దళారులను ఆశ్రయిస్తున్నారు. సొంతంగా దస్తావేజులు రాసుకునే వారు ఒక శాతం కూడా లేరు. దస్తావేజులు రాయడం అనేది సంక్లిష్టంగా ఉండటమే ఇందుకు కారణం. అందువల్ల వివిధ రకాల రిజిస్ట్రేషన్లు చేసుకోదలచిన వారు లేఖరులను కలిసి దస్తావేజులను రాయించుకుంటున్నారు. ఒక్కో దస్తావేజు తయారీకి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ తీసుకుంటున్నారు. చాలాచోట్ల దస్తావేజు లేఖరులు/దళారులు తామే రిజిస్ట్రేషన్లు చేయిస్తామంటూ రిజిస్ట్రేషన్ అధికారులకు ముడుపులు ఇచ్చేందుకంటూ వేలల్లో డబ్బు వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఇలా.. అవసరం ఉన్న వారెవరైనా రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లోకి వెళ్లి కావాల్సిన డాక్యుమెంట్లను (విక్రయం, బహుమతి, భాగం..) డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లోనే అమ్మకందారులు, కొనుగోలుదారులు, ఆస్తులు, సర్వే/ ఇంటి నంబరు, సాక్షులు, చిరునామాలు లాంటి ఖాళీలను పూరిస్తే సమగ్రమైన డాక్యుమెంట్ తయారవుతుంది. దానిని ప్రింటవుట్ తీసుకుని సబ్మిట్/అప్లోడ్ చేస్తే నమోదు చేసిన రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళుతుంది. ఆస్తి వివరాలు (సర్వే నంబరు, విస్తీర్ణం/ ప్లాట్ నంబరు విస్తీర్ణం) లాంటివి నమోదు చేయగానే ఆటోమేటిగ్గా రిజిస్ట్రేషన్ కోసం ఎంత రుసుం (రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీ, బదిలీ సుంకం) చెల్లించాలో కూడా ఆన్లైన్లో కనిపిస్తుంది. ఆ మేరకు ఆన్లైన్లోనే చెల్లించే విధానం ఇప్పటికే ఉంది. ఏరోజు, ఏసమయంలో రిజిస్ట్రేషన్ చేసుకోదలిచారో కూడా ఆన్లైన్లోనే నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. నిర్ధిష్ట సమయానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి అరగంటలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. డబ్బు , సమయం ఆదా నూతన విధానం వల్ల డాక్యుమెంట్ల (దస్తావేజుల) తయారీ కోసం దళారులను ఆశ్రయించి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. దీనివల్ల అటు డబ్బు, ఇటు సమయం ఆదా అవుతాయి. రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న ఈ వినూత్న విధానం వల్ల పూర్తిగా అవినీతికి చెక్ పడుతుందని, పారదర్శకత పెరుగుతుందని అన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఈ కొత్త విధానాన్ని ఇప్పటికే విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇక్కడ ఎదురయ్యే సాధకబాధకాలను పరిశీలించి తగు మార్పు చేర్పులతో నవంబర్ ఒకటో తేదీ నుంచి దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించింది. నేటి నుంచి అవగాహన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు రిజిస్ట్రేషన్ శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఈ శాఖ అధికారులు రెండు బృందాలుగా ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఒక్కో రోజు రెండు జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ఈ సదస్సులకు విద్యావంతులు, పుర ప్రముఖులు, న్యాయవాదులు, వైద్యులు, రియల్టర్లు, బిల్డర్లు లాంటి వివిధ వర్గాల వారిని ఆహ్వానిస్తున్నారు. కొత్త విధానం గురించి వివరించడంతోపాటు అవసరమైన మార్పు చేర్పులకు సంబంధించి వీరి నుంచి సూచనలు, సలహాలు కూడా స్వీకరిస్తారు. ఇందులో విలువైన, ఆచరణాత్మక సూచనలు ఉంటే వీటిని కూడా చేర్చి నవంబర్ నుంచి రాష్ట్రమంతటా అమలు చేయనున్నారు. ఈ నెల 14న కర్నూలు, విజయనగరం, 15న అనంతపురం, శ్రీకాకుళం, 16న వైఎస్సార్, విశాఖపట్నం, 17న చిత్తూరు, తూర్పు గోదావరి, 18న నెల్లూరు, పశ్చిమ గోదావరి, 19న ప్రకాశం, కృష్ణా, 21వ తేదీన గుంటూరు జిల్లాల్లో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. దళారులకు బ్రేక్ ప్రస్తుతం ప్రజలు స్థిరాస్తుల విక్రయం, బహుమతి, తనఖా ఇతరత్రా ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా దస్తావేజులు రాయించుకోవడం కోసం లేఖరులు/దళారులను ఆశ్రయిస్తున్నారు. కొత్త విధానం వల్ల ఎవరూ ఎవరి వద్దకు వెళ్లాల్సిన పని ఉండదు. దస్తావేజులను కంప్యూటర్లోనే రూపొందించి సంబంధిత సబ్ రిజిస్ట్రారు కార్యాలయానికి ఆన్లైన్లోనే పంపవచ్చు. ఆన్లైన్లోనే స్లాట్ బుకింగ్ చేసుకుని నిర్ధిష్ట సమయానికి వెళ్లి గంటలోగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని దస్తావేజు నకళ్లు కూడా తీసుకుని వెళ్లవచ్చు. చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే చేసుకునే వెసులుబాటు ఉన్నందున ఎవరికీ నయాపైసా లంచం చెల్లించాల్సిన అవసరం ఉండదు. అవినీతి రహిత సుపరిపాలన అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆశయాల మేరకు ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నాం. – పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అందరి సమస్యా ఇదే.. విశాఖ నగరానికి చెందిన ఒక వ్యాపారి సబ్బవరంలో నాలుగెకరాల భూమి కొనుగోలు చేశారు. దీనిని తన భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దస్తావేజు రాయించుకోవడం కోసం దస్తావేజు లేఖరుడైన దళారీని సంప్రదించారు. దస్తావేజు రాయడం, రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని సిబ్బందికి ముడుపులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించడం కోసం ఆ దళారి రూ.60 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. దస్తావేజు రాసినందుకే రూ.6 వేలు తీసుకున్నాడు. ప్రస్తుతం రాష్ట్రమంతా దాదాపు ఇదే పరిస్థితి. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా వైఎస్ జగన్ సర్కారు ‘మీ దస్తావేజును మీరే తయారు చేసుకోండి..’ అనే వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. -
స్థిరాస్తులకు కొత్త రేట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సవరించింది. కొత్త రేట్లు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. భూములు, స్థలాల విలువల విషయంలో బహిరంగ మార్కెట్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఏటా, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి రిజిస్ట్రేషన్ విలువలను సవరించాల్సి ఉంది. 2017లో గ్రామీణ ప్రాం తాల్లోనూ, 2018లో పట్టణ ప్రాంతాల్లోనూ స్థిరాస్తి విలువలను సవరించారు. ఇప్పుడు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువల సవరణకు ప్రభు త్వం ఆమోదం తెలిపింది. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో భూములు, స్థలాల ప్రస్తుత మార్కెట్ విలువలను పరిశీలించి వాస్తవ పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని పది శాతం లోపు పెంచాలని ఆదేశించింది. అంతకు మించి ఎక్కడా పెంచడానికి వీలులేదని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ విలువలను కొన్నిచోట్ల పెంచలేదు. ఇంకొన్ని ప్రాంతాల్లో 5 నుంచి పది శాతం వరకూ పెంచారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని మండలాలు, గ్రామాల వారీ రహదారి పక్కనున్న భూములు, మెట్ట, మాగాణిలకు సర్వే నంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ విలువలు ప్రతిపాదిం చారు. ఈ ప్రతిపాదనలను మున్సిపాలిటీల్లో జాయింట్ కలెక్టర్లు, గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ డివిజనల్ అధికారుల అధ్యక్షతన గల మార్కెట్ విలువల సవరణ కమిటీలు ఆమోదించాయి. దీంతో రిజిస్ట్రేషన్ అధికారులు ఈ రేట్లను రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో నమోదు చేశారు. కట్టడాల మార్కెట్ విలువలు ఇలా కట్టడాలకు కొత్త రిజిస్ట్రేషన్ విలువలను రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ కార్యాలయం ఖరారు చేసింది. పట్టణాభివృద్ధి సంస్థలు, నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, మాస్టర్‌ప్లాన్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలను ఒక విభాగంగా, మేజర్ పంచాయతీలు, మున్సిపల్ నోటిఫైడ్ ప్రాంతాల్లోకి వచ్చేవి, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో కలిసే పంచాయతీలను మరో విభాగంగా, మైనర్ పంచాయతీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో కలుస్తున్న మైనర్ పంచాయతీలను మరో విభాగంగా కట్టడాలకు మార్కెట్ విలువలను నిర్ధారించారు. భవనాలను కొనుగోలు చేసేవారు ఆ కట్టడాల విలువ, భూమి విలువకు కలిపి రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో చదరపు అడుగు మార్కెట్ విలువ రూ.5 వేలు ఉందనుకుంటే 200 చదరపు అడుగుల స్థలం విలువ రూ.10 లక్షలు అవుతుంది. అడుగు కట్టడం విలువ రూ.1,100 ప్రకారం 200 చదరపు అడుగుల కట్టడం విలువ రూ.11 లక్షలు అవుతుంది. ఈ రెండింటినీ కలిపి మొత్తం భవనం విలువ రూ.21 లక్షలు అవుతుంది. దీనిని కొనుగోలు చేసిన వారు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రూ.21 లక్షలపై 5 శాతం స్టాంప్ డ్యూటీ, 1.5 శాతం బదిలీ సుంకం, 1 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి మొత్తం 7.5 శాతం రిజిస్ట్రేషన్ రుసుముల కింద చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణాలు పూర్తికాకుండా వివిధ దశల్లో ఉన్న వాటికి ఈ ధరల్లో కొన్ని విభాగాలు పెట్టారు. ఫౌండేషన్ స్థాయిలో ఉన్న కట్టడాలకు ఇందులో 25 శాతం, శ్లాబ్ లెవల్ వరకూ ఉన్న వాటికి 65 శాతం, పూర్తికావడానికి సిద్ధంగా ఉన్న వాటికి 85 శాతం ధర నిర్ణయిస్తారు. అలాగే పదేళ్లలోపు నిర్మించిన వాటికి ఎలాంటి తరుగుదల ఉండదు. పదేళ్ల కంటే ముందు నిర్మించిన ఇళ్లకు ఏడాదికి ఒక శాతం చొప్పున తరుగుదల వేస్తారు. ఇది గరిష్టంగా 70 శాతం వరకూ ఉండవచ్చు. -
దండుమైలారంలో ‘భూ మాయ’
► 38 ఎకరాల అటవీ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ ► ఇబ్రహీంపట్నం ఇన్చార్జి సబ్‌రిజిస్ట్రార్ సస్పెన్షన్ సాక్షి, హైదరాబాద్: తనిఖీలు జరుపుతున్న కొద్దీ రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా దండుమైలారం గ్రామ శివార్లలో 38 ఎకరాల అటవీ భూము లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి.. కాజేసినట్లు గుర్తిం చారు. దీనికి సంబంధించి ఇన్చార్జి సబ్‌రిజిస్ట్రార్ సలేహా ఖాదిర్‌ను గురువారం సస్పెండ్ చేశారు. దండుమైలారం గ్రామ శివార్లలోని సర్వే నంబర్ 36లో దాదాపు 3,200 ఎకరాల ప్రభుత్వ/అటవీ భూములు ఉన్నాయి. అయితే ఈ సర్వే నంబర్లోని 38 ఎకరాల అటవీ భూమిని పార్థసారథి, మరో 17 మంది వ్యక్తులు తమ భూమిగా చూపుతూ... గద్వాల విజయలక్ష్మి అనే మహిళ పేరిట ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. 2007లో జరిగిన ఓ రిజిస్ట్రేషన్ ద్వారా తమకు అక్కడ 2,000 ఎకరాల భూమి సంక్రమించిందని పార్థసారథి దస్తావేజులో పేర్కొన్నారు. అయితే తొలుత ఈ రిజిస్ట్రేషన్ దరఖాస్తు 2015 నుంచి దాదా పు ఏడాది పాటు ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రార్ కార్యాల యంలో పెండింగ్‌లోనే ఉంది. కానీ కొంతకాలం పాటు ఇన్చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా వ్యవహరించిన సలేహా ఖాదిర్.. ఆ రిజిస్ట్రేషన్ తంతును పూర్తిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ బాగోతాలను ప్రత్యేక బృందాలు వెలికితీస్తున్న క్రమంలో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇందులో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో.. సలేహా ఖాదిర్‌ను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యా యి. కాగా.. ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏడేళ్లుగా సలేహా సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె గతంలో బదిలీ అయినా.. ఓ మంత్రి ఒత్తిడి మేరకు ఉన్నతా ధికారులు ఆ బదిలీని నిలిపివేశారని తెలిసింది. -
ఆస్తి పన్నుకు ‘ఆధార్’ లింకు!
⇒ యజమాని ఆధార్, పాన్, ఫోన్ నంబర్లతో ఆస్తుల అనుసంధానం ⇒ తనఖా ఆస్తుల జాబితాలు బహిర్గతం చేయాలని ప్రభుత్వ ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఆస్తి పన్నులు, ఖాళీ స్థలంపై పన్నుల మదింపు సమాచారాన్ని సంబంధిత ఆస్తి యజమానుల ఆధార్, పాన్, ఫోన్ నంబర్లతో తక్షణమే అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అదే విధంగా బ్యాంకుల్లో తనఖా పెట్టిన ఆస్తులు, స్థలాల జాబితాలను సైతం రూపొందించి, బహిర్గతం చేయాలని సూచించింది. రాష్ట్రంలో సులభ వాణిజ్యాన్ని (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ప్రోత్సహించే చర్యల్లో భాగంగా పురపాలక డైరెక్టరేట్ తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. వివరాలన్నీ అందుబాటులో: అన్ని పుర పాలికలు అధికారిక వెబ్సైట్లను ఏర్పాటు చేసుకోవాలని పురపాలక డైరెక్టరేట్ సూచిం చింది. ఆస్తి పన్నుల డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్ (డీసీబీ) వివరాలతో పాటు సంబంధిత యజమాని పేరు, ఆధార్, పాన్, ఫోన్ నంబర్ల సమాచారాన్ని వాటిలో పొందుపర్చాలని స్పష్టం చేసింది. బ్యాంకుల్లో తనఖా పెట్టిన భవనాలు/ప్లాట్లు/ఖాళీ స్థలాల కు సంబంధించి అయితే.. ఆ ఆస్తి యజమాని పేరు, తనఖా పెట్టిన బ్యాంకు, బ్రాంచీ వివరాలను సైతం పేర్కొనాలని తెలిపింది. సంబంధిత జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో మున్సిపల్ కమిషనర్లు బ్యాంకర్లతో సమావేశమై తమ ప్రాంత పరిధిలో తనఖా పెట్టిన ఆస్తుల వివరాలను సేకరించాలని సూచించింది. కేంద్రం ప్రవేశపెట్టిన అమృత్ పథకం కింద ఎంపికైన నగరాలు, పట్టణాల్లో సంస్కరణల అమల్లో భాగంగా ఆస్తి పన్నుల మదింపు వివరాలను సంబంధిత పురపాలిక వెబ్సైట్లో ప్రదర్శించాలన్న నిబంధనలు న్నాయి. అదే తరహాలో అన్ని మున్సిపాలిటీ ల్లోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్తి పన్నుల మదింపు వివరాలను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేసి, బహిర్గతం చేస్తే సంబంధిత యజ మానుల పేర్ల మీద ఉన్న ఆస్తుల వివరాలన్నీ వెల్లడి కానున్నాయి. వెబ్సైట్ నిర్వహణ తప్పనిసరి రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ అధికారిక వెబ్‌సైట్‌ను క్రియాశీలకంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో 23 పురపాలికలు క్రియాశీలంగా వెబ్సైట్లను నిర్వహిస్తుండగా, మరో 45 పురపాలికలు వెబ్సైట్లు రూపొందించుకున్నా సరిగా నిర్వహించడంలేదు. నాలుగు పురపాలికలకు అధికారిక వెబ్సైట్ లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి పురపాలిక ఎప్పటికప్పుడు సమాచారాన్ని నవీకరిస్తూ (అప్డేట్ చేస్తూ) వెబ్‌సైట్‌ను క్రియాశీలకంగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. మ్యూటేషన్ రుసుము పెంపు అధికారం పురపాలికలకే.. స్థిరాస్తుల క్రయవిక్రయాల సందర్భంగా రిజిస్ట్రేషన్ శాఖ వసూలు చేసే మ్యూటేషన్ రుసుముల పెంపుపై నిర్ణయం తీసుకునే అధికారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్స్‌కు ఉందని పురపాలక శాఖ స్పష్టం చేసింది. మ్యూటేషన్ రుసుము పెంపుపై కౌన్సిల్లో చేసే తీర్మానాన్ని స్థానిక సబ్ రిజిస్ట్రార్‌కు పంపించాలని సూచించింది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు, ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు స్పష్టతనిస్తూ పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. -
ఐటీ శాఖ దూకుడు
రూ.10 లక్షల దాటిన లావాదేవీలపై ఆరా రిజిస్ట్రేషన్, బ్యాంకుల లావాదేవీల పరిశీలన నెల్లూరు(సెంట్రల్): పెద్ద నోట్ల రద్దు చేసినప్పటి నుంచి మౌనంగా ఉన్న ఐటీ శాఖ అధికారులు కొత్త సంవత్సరంలో దూకుడు పెంచారు. కొత్త నోట్లు ఎక్కువ మొత్తంలో ఎవరి ఖాతాలోకి వెళ్లాయి. ఎవరి ద్వారా చేతులు మారాయి. అనే విషయాలతో పాటు నోట్ల రద్దు నుంచి రిజిస్ట్రేషన్ శాఖలో జరిగిన లావాదేవీలపై కూడా ఐటీ శాఖ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు బ్యాంకు అధికారుల్లో ఆందోళన నెలకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రూ.10 లక్షలు దాటిన వాటిపై ఆరా.. బ్యాంకులలో జరిగే లావాదేవీలలో రూ.10 లక్షలు దాటిన వాటిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రత్యేకించి రెండేళ్ల నుంచి అకౌంటులో జరిగిన లావాదేవీలు ఎంత?, నోట్ల రద్దు తరువాత జరిగిన లావాదేవీలలో ఏ ఖాతాలో ఎక్కువ జరిగాయి. అనేది ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అనుమానితంగా ఉన్న ఖాతాలలో జరిగిన నగదు లావాదేవీలపై ఆరా తీస్తూ వారికి బ్యాంకు అధికారులకు ఏమిటి సంబంధం అనే వాటిపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పలు బ్యాంకు అధికారులు ఫోన్ కాల్స్ వివరాలు కూడా సేకరిస్తున్నట్లు సమాచారం. ఖాతాదారుని ఫోన్ నంబరుకు, బ్యాంకు అధికారులతో మాట్లాడిన ఫోన్ నంబరుకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా నోట్ల రద్దు తర్వాత జిల్లాలో భూములు, స్థలాల రిజిస్ట్రేషన్ చాలా వరకు తగ్గుముఖం పట్టింది. అయితే జరిగిన రిజిస్ట్రేషన్‌లో కూడా ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? గతంలో వారు ఏమైనా లావాదేవీలు నడిపారా? నోట్ల రద్దు తర్వాతే రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడులు పెట్టి రిజిస్ట్రేషన్లు జరిపారా? అని విషయాలు కూడా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. వివరాల సేకరణకు ప్రత్యేక బృందాలు జిల్లాలోని బ్యాంకులలోని వివరాలకు, రిజిస్ట్రేషన్ శాఖలోని వివరాలు సేకరణకు సంబంధించి పూర్తి వివరాలు సేకరణకు నెల్లూరు ఐటీ శాఖకు ఎటువంటి సంబంధం లేకుండా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. మొత్తం ఈ వ్యవహారం హైదరాబాద్‌లోని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివరాల సేకరణలో నిమగ్నం అయినట్లు సమాచారం. మొత్తం ఈ వ్యవహారం ఎటు పోయి ఎవరి మెడకు చుట్టుకుంటుందో అని పలు బ్యాంకు అధికారులతో పాటు ఎక్కువ మొత్తంలో లావాదేవీలు నడిపిన వారు సైతం ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. -
రాజధాని భూ గద్దలపై ఐటీ వేట!
-
రాజధాని భూ గద్దలపై ఐటీ వేట!
- పెద్ద మొత్తంలో భూముల కొనుగోలుదారులపై కన్ను - రిజిస్ట్రేషన్ శాఖ నుంచి పది మంది పేర్లు సేకరణ - బినామీలు, కుటుంబ సభ్యులకు వచ్చిన డబ్బులపై దృష్టి - ఏ ఖాతాల నుంచి చెల్లింపులు చేశారో ఆరా సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసిన వారిని వేటాడేందుకు ఐటీ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. రాజధానిని ఏ ప్రాంతంలో నెలకొల్పాలో ముందుగానే ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా భూములను కొనుగోలు చేసుకున్న విషయం తెలిసిందే . అలా కొనుగోలు చేసిన వారిలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికారపార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కొంత మంది ఐఏఎస్ అధికారులు, ఆర్డీవోలతో పాటు ‘ముఖ్య’ నేత బినామీలు కూడా ఉన్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంటోంది. వందల ఎకరాల భూములను కొనుగోలు చేసిన వారిలో మొదటగా పది మందికి సంబంధించిన లావాదేవీల వివరాలను ఐటీ శాఖ ఇటీవలే రిజిస్ట్రేషన్ శాఖ నుంచి తీసుకున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. భూములు పెద్దల పేరుమీద లేకుండా వారికి చెందిన కుటుంబ సభ్యులు, బినామీల పేరు మీద ఉన్నప్పటికీ ఆ భూముల కొనుగోలుకు అవసరమైన డబ్బులు ఎవరి ఖాతాల నుంచి వచ్చాయనే దానిపైనే ఐటీ శాఖ దృష్టి సారించనుందని పేర్కొన్నాయి. తద్వారా బినామీల వెనకున్న పెద్దల పాత్ర బయటపడుతుందనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోలు వ్యవహారాలపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారనే విషయం తెలిసిందే. రాజధానిలో ముందుగానే భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన తరువాత రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారనే విమర్శలున్న విషయం తెలిసిందే. దర్యాప్తు తూతూ మంత్రమేనా..! అమరావతి ప్రాంతంలో రెండేళ్లలో జరిగిన భూ కొనుగోలు లావాదేవీలపై ఐటీశాఖ పూర్తిస్థాయిలో, నిజాయితీగా దృష్టి సారిస్తే చాలామంది పెద్ద చేపలు చిక్కుకుంటాయని, కీలక నేతల పదవులకే ఎసరు వస్తుందని ఐటీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందువల్ల పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగకుండా తూతూమంత్రంగా ముగింపజేసేందుకే కేవలం పది మంది డేటా సేకరించారని అంటున్నారు. ‘భూముల ధరలు అమరావతి ప్రాంతంలో అమాంతం పెరిగాయని, ఉన్నతస్థాయి నేతలు, ఉన్నతాధికారులు బినామీ పేర్లతో భారీగా భూములు కొనుగోలు చేశారని అందరికీ తెలుసు. ఇలాంటి లావాదేవీలపై ఐటీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టకపోవడం వెనుక చాలా మతలబు ఉంది’ అని ఒక ఐటీ శాఖ అధికారి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. -
రిజిస్ట్రేషన్ శాఖలో ‘సర్వర్’ కష్టాలు!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు చేసుకునేవారికి తిప్పలు తప్పడం లేదు. రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో దస్తావేజుల నమోదు నత్త నడక సాగుతున్నాయి. మహా నగరం నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నా మెరుగైన సాంకేతిక సేవల కల్పనలో మాత్రం ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది. నిరంతరం సర్వర్ డౌన్, నెట్వర్క్ మోరాయింపు వంటి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇటీవల రిజిస్ట్రేషన్ శాఖకు టీసీఎస్ నెట్‌వర్క్‌తో గల కాంట్రాక్ట్ గడువు ముగియడంతో సమస్య మరింత జఠిలమైంది. తాత్కాలికంగా మరో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. కేవలం పదంటే పది నిమిషాల్లో పూర్తి కావాల్సిన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సర్వర్ డౌన్, నెట్వర్క్ సమస్యల కార ణంగా గంటల కొద్దీ వేచిచూడాల్సి వస్తోంది. సాధారణంగా నగరంలోని ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోlరోజుకు 100 నుంచి 150 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఒక్కో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 10 నిమిషాల్లో పూర్తి కావాల్సి ఉండగా, సర్వర్ సమస్యతో 40 నుంచి 60 నిమిషాల సమయం తీసుకుంటోంది. అన్నింట్లో ఇదే దుస్థితి హైదరాబాద్–రంగారెడ్డి జిల్లాలోని నాలుగు డీఆర్ (డిస్ట్రిక్ రిజిస్ట్రార్ ఆఫీస్) పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నెల రోజుల నుంచి సర్వర్ సమస్య సర్వసాధారణమైంది. రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రత్యేక సర్వర్ లేకుండా పోయింది. ఇప్పటి వరకు ఉమ్మడిగానే సర్వర్, ఇంటర్నెట్ కోసం స్టేట్‌వైడ్ ఏరియా నెట్వర్క్ (స్వాన్)ను వినియోగిస్తున్నారు. ఇదే సర్వర్‌ను, ఇంటర్నెట్ సదుపాయాలను రెండు రాష్ట్రాలకు చెందిన మున్సిపల్, రెవెన్యూ, ట్రెజరీ.. తదితర ప్రభు త్వ శాఖలన్నీ వినియోగించుకుంటున్నాయి. 2 ఎంబీపీఎస్ సామర్థ్యంగల బ్రాండ్ బ్యాండ్ నెట్వర్క్ రిజిస్ట్రేషన్ ్ల శాఖ అవసరాలను తీర్చలేకపోతోంది. ఏదైనా సాఫ్ట్వేర్ చేర్చాల్సి వచ్చినప్పుడు సర్వర్ మరింత డౌన్ అవుతోంది. 1998 నుంచి కార్డ్ (కంప్యూటరైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్) సిస్టమ్ ద్వారానే రిజి స్ట్రేషన్ ప్రక్రియను ఆన్లైన్లో మాత్రమే చేయా ల్సి ఉంది. దీంతో రిజిస్ట్రేషన్ చేయాల్సిన ఆస్తి మార్కెట్ విలువను తెలుసుకోవాలన్నా, ప్రభు త్వ భూముల(పీవోబీ) వివరాల్లో తనిఖీ చేయాలన్నా ఇంటర్నెట్ వేగవంతమైన ఇంటర్నెట్ అవసరం. మరోవైపు ఐదేళ్ల కిందట ఇచ్చిన కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు పనిచేయని స్థితికి చేరాయి. దీంతో పనిభారం పెరగడంతో పాటు అధిక సమయం తీసుకుంటోంది. కాలం చెల్లిన యూపీఎస్‌లతో పవర్ బ్యాకప్ సరిపోక రిజిస్ట్రేషన్లు నిలిపివేయాల్సిన సంఘటనలూ తరచూ జరుగుతున్నాయి. -
రైతులపై కక్ష
ఆదాయాన్నే వదులుకున్న సర్కారు రిజిస్ట్రేషన్ శాఖకు రోజుకు రూ.45 లక్షలు నష్టం రిజిస్ట్రేషన్లపై అధికారులకే స్పష్టత లేని వైనం అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే ఆర్కే అమరావతి : భూములను లాక్కోవటమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతోంది. ఆ భూముల కోసం నష్టం భరించటానికైనా తెగించింది. అందులో భాగంగానే రాజధాని ప్రాంతాల్లో క్రయవిక్రయాలను నిలిపివేసింది. దీంతో రోజుకు సుమారు రూ.45 లక్షలకుపైనే ప్రభుత్వాదాయానికి గండిపడుతోంది. ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవ్యాంధ్ర నిర్మాణం కోసం ప్రభుత్వం మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల పరిధిలోని 29 గ్రామాల పరిధిలో రైతుల నుంచి భూములను సమీకరించిన విషయం తెలిసిందే. కొందరు మాత్రం కోర్టును ఆశ్రయించటంతో సుమారు 5,700 ఎకరాలు రైతుల వద్దే ఉన్నాయి. ఆ భూములపై కన్నేసిన పాలకులు రైతులను లొంగదీసుకునేందుకు ఏకంగా రిజిస్ట్రేషన్లనే నిలిపివేశారు. మంగళగిరి, తాడికొండ, అమరావతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నేటి నుంచి క్రయవిక్రయాలను నిలిపివేసింది. దీంతో శుక్రవారం రాజధాని ప్రాంత రైతులు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద వేచి ఉండటం కనిపించింది. మంగళగిరి, తాడికొండ, అమరావతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజుకు సుమారు 250 వరకు భూములకు సంబంధించి క్రయవిక్రయాలు నడిచేవని అధికారులు వెల్లడించారు. ఒక్కో రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి సుమారు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకుపైనే ఆదాయం సమకూరేదని అధికారులు చెపుతున్నారు. ఈ లెక్కన గురువారం మధ్యాహ్నం నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపివేయటంతో సుమారు రూ.65 లక్షల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్లు అంచనా. ఇలాగే నెలరోజులు కొనసాగితే రూ.13.50 కోట్లు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. ఎన్వోసీ ఇవ్వని సీఆర్డీఏ అధికారులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇవ్వని రైతులకు ఎన్వోసీ అవసరం లేదు. అయితే వారిని కూడా ఎన్వోసీ తీసుకురమ్మని సీఆర్డీఏ అధికారులు చెప్పినట్లు తెలిసింది. ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన వారికి సైతం ఎన్వోసీ సర్టిఫికెట్లు ఇవ్వలేదని రైతులు చెపుతున్నారు. ఎన్వోసీల విషయంపై తమకు ఎటువంటి ఆదేశాలూ లేవని సీఆర్డీఏ అధికారులు తెలియజేయటంతో రైతులు వెనుదిరిగి రావటం కనిపించింది. ఈ విషయంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) శుక్రవారం మంగళగిరి సబ్‌రిజిస్ట్రార్‌తో మాట్లాడారు. ఎన్వోసీలపై స్పష్టత ఇవ్వాలని అదేశించారు. దీంతో సబ్‌రిజిస్ట్రార్ అధికారులు ఉన్నతాధికారులతో సంప్రదించి ఎన్వోసీలకు సంబంధించిన నియమ నిబంధనలను తెప్పించటం గమనార్హం. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు సోమవారం ఎన్వోసీలు ఇస్తారా, లేదా -
మాకివ్వండి.. మీరూ తినండి
► సబ్ రిజిస్ట్రార్లకు అధికార పార్టీ నేతల ► బంపర్ ఆఫర్ కాదూ కూడదంటే వేధింపులు ► నెలనెలా ముడుపులివ్వాలని డిమాండ్ అనంతపురం టౌన్ : రిజిస్ట్రేషన్ శాఖ అధికారులపై టీడీపీ నేతల పెత్తనం అధికమవుతోంది. తాము చెప్పినట్లు వింటే సరే. లేదంటే కథ చూస్తామంటూ బెదిరిస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులైతే తమ నియోజకవర్గ పరిధిలో జరిగే పలు కార్యక్రమాలకు కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఆయా కార్యాలయాల్లో పనిచేయడానికి అధికారులు హడలిపోతున్నారు. అనంతపురం రిజిస్ట్రార్ జిల్లా పరిధిలో 12, హిందూపురం రిజిస్ట్రార్ జిల్లా పరిధిలో తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో టీడీపీ ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు జులుం ప్రదర్శిస్తున్నారు. మాట వినకుంటే మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు. బదిలీ చేయిస్తామని బెదిరిస్తున్నారు. ఇటీవల ధర్మవరం సబ్ రిజిస్ట్రార్ బజారీ అధికార పార్టీ నేత వేధింపులు తాళలేక సెలవులో వెళ్లిపోయారు. రోజువారీగా కార్యాలయంలో జరిగే రిజిస్ట్రేషన్లకు సంబంధించి లెక్కగట్టి మరీ వసూళ్లకు పాల్పడుతుండటంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. గతంలో కూడా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల పేరుతో నేతలు బెదిరింపులకు పాల్పడటంతో అక్కడి అధికారులు హడలెత్తిపోయారు. బజారీ స్థానంలో అనంతపురం రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న శ్రీనివాసులును ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా పంపారు. మొదట ఆయన ధర్మవరం వెళ్లేందుకు అయిష్టత వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు సర్దిచెప్పి పంపినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితే హిందూపురం, కళ్యాణదుర్గం, కదిరి, ఉరవకొండ, రాయదుర్గం, చిలమత్తూరు ప్రాంతాల్లోనూ ఉంది. కొందరు సబ్ రిజిస్ట్రార్లు కూడా కాసులకు కక్కుర్తి పడడం అధికార పార్టీ నేతలకు కలిసొస్తోంది. ‘మీరూ తినండి.. మాకూ ఇవ్వండి’ అన్న ధోరణిలో నేతలు వెళ్తున్నారు. లేపాక్షి ఉత్సవాల సందర్భంగా హిందూపురంలో ఎమ్మెల్యే తర్వాత అంతటి స్థాయిలో ఫీలవుతున్న ఓ వ్యక్తి భారీగా డబ్బు డిమాండ్ చేసినట్లు తెలిసింది. రూ.5 లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేయగా.. అధికారులు చివరకు రూ.1.50 లక్షలు ముట్టజెప్పినట్లు సమాచారం. హిందూపురం మునిసిపాలిటీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ టీడీపీ నాయకుడు కూడా నెలవారీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కళ్యాణదుర్గంలో ఓ ప్రజాప్రతినిధి కుమారుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలు సాగించాలని అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇలా ప్రతి చోటా అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతుండటంతో కొందరు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు ఇదే తడువుగా అక్రమార్జనకు బరితెగించి సదరు నేతలకు గులాంగిరీ చేస్తున్నట్లు విమర్శలున్నాయి. సబ్ రిజిస్ట్రార్లపై అధికార జులుం గురించి తెలిసినా ఉన్నతాధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఈ విషయమై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ గిరికుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. రాజకీయ ఒత్తిళ్లు వాస్తవమేనన్నారు. ఇంతకుమించి మరేమీ మాట్లాడనన్నారు. దీన్నిబట్టి ప్రజాప్రతినిధులంటే అధికారులకు ఎంత భయం పట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. -
నిలిచిన భూముల క్రమబద్ధీకరణ
♦ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ♦ మధ్య కొరవడిన సమన్వయం సాక్షి, హైదరాబాద్: రెండు ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయలేమి.. భూముల క్రమబద్ధీకరణ రిజిస్ట్రేషన్లకు ప్రతిబంధకంగా మారింది. చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణ నిమిత్తం రెవెన్యూ శాఖ జారీ చేసిన జీవో 59, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు కోసం ఇచ్చిన జీవో 12 ప్రతులను చూపినా సబ్ రిజిస్ట్రార్లు ససేమిరా అంటున్నారని తహసీల్దార్లు వాపోతున్నారు. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు విషయమై తమ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఆదేశాల అందలేదని సబ్రిజిస్ట్రార్లు చెబుతున్నారు. దీంతో సొమ్ము చెల్లించి ఏడాది గడచినా భూముల రిజిస్ట్రేషన్ కాకపోవడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. రెవెన్యూ శాఖ ఉత్తర్వులు తమకు అందలేదని, దీంతో సబ్ రిజిస్ట్రార్లకు తాము ఆదేశాలివ్వలేదని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలు సాంకేతిక ఇబ్బందులతో అస్తవ్యస్తంగా తయారైన క్రమబద్ధీకరణ ప్రక్రియ, తాజాగా ఉన్నతాధికారుల సమన్వయలోపంతో మరింత అధ్వానంగా మారింది. మరో 10 రోజుల్లో గడువు ముగుస్తుండగా, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోవడం లబ్ధిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ‘‘స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ల ఫీజు మినహాయింపు విషయమై రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి సబ్ రిజిస్ట్రార్లకు ఎటువంటి ఆదేశాలందలేదు. రిజిస్ట్రేషన్ల శాఖ నోటిఫికేషన్లు వచ్చేవరకు క్రమబద్ధీకరణ రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సబ్ రిజిస్ట్రార్లందరికీ సూచించాం’’ అని తెలంగాణ సబ్ రిజిస్ట్రార్ల సంఘం అధ్యక్షుడు కె.విజయ భాస్కర్‌రావు చెప్పారు. -
తవ్వే కొద్దీ బయటపడుతున్న కోట్లు
► 18 గంటలపాటు ఏసీబీ సోదాలు ► సబ్‌రిజిస్ట్రార్ బినామీల పేర్లపై రూ.కోట్ల ఆస్తి ► లంచాల మత్తులో ఇబ్బడిముబ్బడిగా రిజిస్ట్రేషన్లు ► దర్యాప్తు ముమ్మరం చేసిన ఏసీబీ ► నిందితుడికి ఈ నెల16 వరకు రిమాండ్ నెల్లూరు(క్రైమ్): రిజిస్ట్రేషన్‌శాఖలో అవినీతి అనకొండగా పేరొందిన సబ్‌రిజిస్ట్రార్ నందకిషోర్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 18 గంటల పాటు నిర్విరామంగా ఏసీబీ అధికారులు ఆయన ఇంటితోపాటు అతని బంధువులు, స్నేహితుల ఇళల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఆయన బినామీ పేర్లపై రూ.కోట్ల ఆస్తిని కూడగట్టాడని ఏసీబీ అధికారులు గుర్తించారు. పెద్ద ఎత్తున లంచాలు సేకరించి నిబంధనలకు విరుద్ధంగా స్థలాల రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పక్కా సమాచారంతో సోదాలు.. రిజిస్ట్రేషన్‌శాఖలో తనకు ఎదురులేదని.. తనను ఎవరూ ఏమీ చేయలేరని అక్రమ ఆస్తులను కూడగట్టిన నందకిషోర్‌పై ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్‌కు పక్కా సమాచారం అందింది. దీంతో శనివారం తెల్లవారుజామున 5గంటల ప్రాంతంలో నెల్లూరు శాంతినగర్‌లోని పూజాపార్క్ ప్లాట్ నంబర్ 304కు డీఎస్పీ, సీఐయూ డీఎస్పీ రమాదేవి, ఇన్స్పెక్టర్ ఎన్. శివకుమార్‌రెడ్డి చేరుకున్నారు. నందకిషోర్, కుటుంబసభ్యులందరూ నిద్రమంచంలో ఉండగానే ఏసీబీ అధికారులు దాడిచేశారు. అదే సమయంలో నెల్లూరు, కావలి, చంద్రగిరి, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరులోని అతని బంధువుల ఇళ్లలో సైతం ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. అక్రమ ఆస్తుల విషయంపై ఏసీబీ అధికారులు ఆయనను నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పడం ప్రారంభించారు. అయినప్పటికీ అధికారులు పూర్తిస్థాయిలో విచారించారు. రాత్రి 10.30 గంటల వరకు సోదాలు కొనసాగాయి. విలువైన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో ప్రభుత్వ ధర ప్రకారం నందకిషోర్ రూ. 2.80 కోట్లు ఆదాయానికి మించిన ఆస్తులు కల్గి ఉన్నట్లు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ.13కోట్లు ఉంటుందని సమాచారం. పలు బ్యాంకుల్లో ఖాతాలు, లాకర్లు ఉండటంతో సోమవారం వాట న్నింటినీ పరిశీలించే అవకాశం ఉంది. అందరూ బినామీలే.. నందకిషోర్ కుటుంబసభ్యులు, స్నేహితులందరనీ అతని బినామీలుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి గాండ్ల వీధిలో ఉంటున్న తోడల్లుడు శివకోటేశ్వరరావు, కావలి వెంగాయగారిపాలెం రోడ్డులోని స్నేహితుడు బాలయ్య పేర రూ.కోట్ల ఆస్తులను కూడగట్టినట్లు అధికారులు గుర్తించారు. వారిద్దరూ తెల్లరేషన్‌కార్డుదారులు అని.. అలాంటి వారు కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఆయన హయంలో జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలను సైతం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కొందరు రాజకీయనాయకులు సైతం అతని అక్రమ ఆస్తుల్లో భాగస్వాములని తేలడంతో వారి గురించి ఆరా తీస్తున్నారు. గతంలోనే ఫిర్యాదులు నందకిషోర్ అక్రమాలపై ఏసీబీకి గతంలోనే పలు ఫిర్యాదులు అందాయి. ఆయనపై దాడులకు సిద్ధమైన సమయంలో ముందస్తు సమాచారం అందడంతో ఆయన తప్పించుకునేవాడు. అంతేకాకుండా కొందరు సిబ్బందికి భారీ నజరానాలు ముట్టజెప్పి ఏసీబీ చర్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండేవాడు. దీంతోనే ఏసీబీ అధికారులు ఎన్నిసార్లు ప్రయత్నించినా పట్టుకోలేకపోయారు. తాజాగా ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ పక్కా వ్యూహంతో తన సిబ్బందితో కలిసి దాడిచేయడంతో నందకిషోర్ దొరికిపోయాడు. 14 రోజుల రిమాండ్.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నందకిషోర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి ఆయనను నాల్గోనగర పోలీసుస్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న సహచరులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పోలీసుస్టేషన్‌కు వచ్చారు. నందకిషోర్‌ను పరామర్శించారు. ఆదివారం ఉదయం ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకు ఈ నెల 16వరకు రిమాండ్ విధించారు. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను జిల్లా కేంద్రకారాగారానికి తరలించారు. -
రిజిస్ట్రేషన్ శాఖకు కాసుల వర్షం
► గడువుకు ముందే లక్ష్య సాధన ► ఫిబ్రవరి నాటికే రూ.162.12 కోట్ల ఆదాయం ► 1,05,415 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ అనంతపురం టౌన్: రిజిస్ట్రేషన్ శాఖ లక్ష్యానికి మించిన ఆదాయంతో దూసుకెళ్తోంది. అనంతపురం రిజిస్ట్రేషన్ జిల్లా పరిధిలో 12, హిందూపురం రిజిస్ట్రేషన్ జిల్లా పరిధిలో 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. 2015-16 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి నెలాఖరుకు ఈ రెండు రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలో రూ.153.99 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా ఏకంగా 162.12 కోట్ల ఆదాయ లభించింది. అనంతపురం పరిధిలో రూ.93.28 కోట్లకు రూ.103.69 కోట్లు రాగా, హిందూపురం పరిధిలో రూ.60.71 కోట్లకు రూ.58.43 కోట్లు వచ్చింది. సాధారణంగా లక్ష్యాలను మార్చి 31 నాటికి ఇస్తారు. ఈ శాఖ లక్ష్యాలను మందుగానే సాధించింది. రాష్ట్ర విభజన, రియల్ వ్యాపారం పెరగడం, ఎక్కువ మంది స్థిరాస్తి పైన పెట్టుబడులకు ఆకర్షితులు కావడంతో క్రయ విక్రయాలు జోరందుకున్నాయి. ఈ ఆర్థిక ఏడాదిలో రిజిస్ట్రేషన్ శాఖ తొలి నుంచి లక్ష్యాలను మించి ఆదాయం ఆర్జించడం విశేషం. కాగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో రెండు రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలో రూ.173.46 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నా రూ.137.03 కోట్లు మాత్రమే ఆదాయం లభించింది. అయితే ఈ సారి మాత్రం లక్ష్యాలను మించి ఆదాయం సమకూరింది. ఫిబ్రవరి నాటికి అనంతపురం పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 58,042 డాక్యుమెంట్లు, హిందూపురం పరిధిలో 47,373 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా ఫిబ్రవరి నాటికి సాధించిన లక్ష్యాలను పరిశీలిస్తే ప్రథమ స్థానంలో అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నిలిచింది. ద్వితీయ స్థానంలో హిందూపురం, తృతీయ స్థానంలో అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉన్నాయి. లక్ష్య సాధనలో ముందున్నాం అనంతపురం, హిందూపురం రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలో ఆదాయం బాగా సమకూరుతోంది. గత ఆర్థిక సంవత్సరం కన్నా ఈ సారి లక్ష్యసాధనలో ముందున్నాం. ఫిబ్రవరి వరకు చూస్తే సుమారు రూ.9 కోట్ల వరకు లక్ష్యానికి మించి ఆదాయం వచ్చింది. మార్చి నెలాఖరుకు మరింత ఆదాయం వస్తుంది. - ఎ.గిరికుమార్, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ -
రిజిస్ట్రేషన్సలో కుబేరుల వేట !
ఏసీబీ సోదాలతో హడల్ బినామీ ఆస్తులు కాపాడుకునే పనిలో సబ్ రిజిస్ట్రార్లు విజయవాడ: రిజిస్ట్రేషన్ శాఖలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. గత ఏడాది కాలంగా రియల్ ఎస్టేట్ చతికలపడి, పై రాబడి తగ్గినప్పటికీ ఒకప్పుడు గోల్డెన్ పిరియడ్‌లో కోట్లు గడించి అక్రమ ఆస్తులు కూడగట్టిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స శాఖలో కుబేరులు ఇప్పుడు బయటకు వస్తున్నారు. అక్రమ ఆస్తులు సంపాదించిన సబ్ రిజిస్ట్రార్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. బినామీపేర్లతో కుబేరులైన సబ్రిజిస్ట్రార్ల జాబితాను తయారు చేసిన ఏసీబీ ప్రత్యేకంగా వేట ప్రారంభించింది. నగరంలో గుణదల జాయింట్ 2 సబ్‌రిజిస్ట్రార్‌గా ఏడేళ్లపాటు ఒకే సీటులో సుదీర్ఘకాలం పని చేసిన దుర్గాప్రసాద్ ఇళ్లపై మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా మంగళగిరి సబ్‌రిజిస్ట్రార్ గోపాల్ అక్రమ రిజిస్ట్రేషన్స్ వ్యవహారంలో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో కృష్ణా, గుంటూరు జిల్లాలో రిజిస్ట్రేషన్స్ శాఖ సిబ్బంది, అధికారులు కలవరం చెందుతున్నారు. కృష్ణా జిల్లాలో 29, గుంటూరు జిల్లాలో 32 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటిలో దాదాపుగా 600 మంది అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో సగానికి సగం మంది రెండు జిల్లాలో కాసులు కురిపించే పోస్టులను అంటి పెట్టుకుని ఉన్నారు. 2010 నుంచి 2014 వరకు రియల్ ఎస్టేట్ రంగం రెండు జిల్లాలో ఉధృతంగా సాగింది. ఆ నాటి గోల్డెన్ పిరియడ్‌లో సబ్ రిజిస్ట్రార్లు కుబేరులయ్యారు. ఏసీబీ సోదాలు జరుపుతుండటంతో అక్రమ ఆస్తులు కూడబెట్టిన వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 20 మంది సబ్ రిజిస్ట్రార్లపై కన్ను! కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 20 మంది సబ్ రిజిస్ట్రార్లపై ఏసీబీ కన్నేసింది. వీరు దీర్ఘకాలికంగా పనిచేస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. పలువురిపై ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక నిఘా పెట్టారు. రాజధాని నేపథ్యంలో భూముల క్రయ విక్రయాలు పెరిగాయి. దీంతో అక్రమ సంపాదనకు తెరతీశారు. ఎక్కడెక్కడ ఎంత మొత్తం వీరి ఆస్తులు ఉన్నాయనే కోణంలో కూడా ఏసీబీ ప్రత్యేక దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. -
ఆదాయంలో రిజిస్ట్రేషన్ శాఖ దూకుడు
గడిచిన తొమ్మిది నెలల్లో జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రార్ కార్యాలయాల ఆదాయం ఇలా ఉంది. నెల్లిమర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ లక్ష్యం కోటీ 86 లక్షల రూపాయలు. కాగా రికార్డు స్థాయిలో రూ.5 కోట్ల ఆదాయం సాధించింది. 268.92 శాతంతో జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో నిలిచిన కురుపాం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లక్ష్యం రూ.39 లక్షలు. రూ.71 లక్షల ఆదాయం సాధించింది. చీపురుపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లక్ష్యం 2.49 కోట్ల రూపాయలు కాగా, రూ.4.320 కోట్ల రాబడితో మూడోస్థానంలో నిలిచింది. సాలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ లక్ష్యం రూ.3.12 కోట్లు కాగా.. రూ.5.19 కోట్లు సాధించింది. గజపతినగరం కార్యాలయం లక్ష్యం 3.44 కోట్ల రూపాయలు కాగా.. రూ.5 కోట్లు సంపాదించింది. విజయనగరం పశ్చిమ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లక్ష్యం రూ.16.53 కోట్లు కాగా.. రూ.23 కోట్ల రెండు లక్షల ఆదాయంసాధించి 139.26 శాతంతో ఆరో స్థానంలో నిలిచింది. తెర్లాం కార్యాలయ లక్ష్యం ఒక కోటీ34 లక్షల రూపాయలు కాగా.. కోటీ 83 లక్షల రూపాయలు సంపాదించింది. కొత్తవలస కార్యాలయం లక్ష్యం 11 కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు కాగా.. 14.96 కోట్ల రూపాయల ఆదాయంతో 134.86 శాతం పొంది ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఎస్.కోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లక్ష్యం మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు కాగా.. నాలుగు కోట్ల 37 లక్షల రూపాయలు సాధించింది. పార్వతీపురం కార్యాలయం లక్ష్యం ఆరు కోట్ల ఏడు లక్షల రూపాయలు కాగా, రూ.6 కోట్ల 82 లక్షల ఆదాయాన్ని సముపార్జించింది. భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లక్ష్యం రూ.25.37 కోట్లు కాగా రూ.27.21 కోట్లు సాధించి 107 శాతం ఆదాయంతో 11వ స్థానంలో నిలిచింది. బొబ్బిలి కార్యాలయం లక్ష్యం 7.98 కోట్ల రూపాయలు కాగా 8.52 కోట్లు సంపాదించింది. విజయనగరం ఆర్వో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మాత్రం లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. లక్ష్యం 24.79 కోట్ల రూపాయలు కాగా.. రూ.23.45 రూపాయలు మాత్రమే సంపాదించింది. 94.58 శాతం ఆదాయంతో చివరి స్థానంలో నిలిచింది. తొమ్మిది నెలల కాలంలో జిల్లాలో ఉన్న 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వందశాతం నుంచి 200 శాతం పైబడి ఆదాయం సాధించడం విశేషం. -
మోహన్‌రెడ్డి బ్యాంక్ ఖాతాల స్తంభన..!
-
మోహన్‌రెడ్డి బ్యాంక్ ఖాతాల స్తంభన..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం: సంచలనం సృష్టిస్తున్న ఏఎస్సై మోహన్‌రెడ్డి దందాలపై సీఐడీ, ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. మోహన్‌రెడ్డితో పాటు బినామీలుగా వ్యవహరించిన 19 మందికి సంబంధిం చి వివిధ బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లను స్తం భింపజేయాలని బ్యాంక్ మేనేజర్లకు సీఐడీ అధికారులు లేఖలు రాశారు. ఒక్క కరీంనగర్‌లోనే వివిధ బ్యాంకుల్లో మోహన్‌రెడ్డి, ఆయన కు టుంబసభ్యులకు సంబంధించి సుమారు 40 బ్యాంక్ అకౌంట్లను గుర్తించినట్లు తెలిసింది. అలాగే, జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల నుంచి మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యు లు, బినామీల పేరిట ఉన్న ఖాతాల వివరాల ను ఇవ్వాలని సీఐడీ అధికారులు ఆయా బ్యాం కుల ఉన్నతాధికారులకు లేఖలు పంపారు. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్టు చేసి రిమాం డ్కు పంపించిన సీఐడీ అధికారు లు జిల్లా కోర్టు అనుమతితో సోమవారం మోహన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, బినామీ పూర్మ శ్రీధర్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ విచారణలో తెరవెనుక ఉన్న పోలీస్ అధికారులు జాతకాలు బయటపడే అవకాశాలున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు మోహన్‌రెడ్డి సెల్ఫోన్లు.... గత నెల 29న కరీంనగర్‌లోని కెన్ క్రెస్ట్ విద్యాసంస్థల అధినేత రామగిరి ప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన భర్త చావుకు మోహన్‌రెడ్డి కారణమని ప్రసాదరావు సతీమణి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మోహన్‌రెడ్డికి చెందిన రెండు ఫోన్లను సీఐడీ అధికారు లు సోమవారం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించా రు. ప్రసాదరావు ఆత్మహత్యకు ముందు మో హన్‌రెడ్డి, ప్రసాదరావుకు మధ్య జరిగిన ఫోన్, సంక్షిప్త సందేశాలతోపాటు అంతకుముందు మోహన్‌రెడ్డి ఎవరెవరితో మాట్లాడారనే అంశాలపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నందున ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక కీలకం కానుంది. ప్రసాద్‌రావు కుమారుడు ఆత్రేష్తోనూ మోహన్‌రెడ్డి సంభాషించిన నేపథ్యంలో అతని సెల్‌ఫోన్‌ను కూడా ల్యాబ్‌కు పంపించా రు. కాగా, మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్ దం దాలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖుల ప్రమేయం ఉన్న నేపథ్యంలో జైలు లో భద్రత పెంచినట్లు తెలిసింది. ఆయనను ప్రత్యేక బ్యారక్‌లో ఉంచినట్లు సమాచారం. జ్ఞానేశ్వర్ కుమారుడి వద్ద కీలక రిజిస్టర్ మోహన్‌రెడ్డి అరెస్టు తర్వాత ఆయన అకౌంట్ జ్ఞానేశ్వర్ ప్రైవేట్ ఫైనాన్స్‌కు సంబంధించి ప లు రికార్డులు మాయం చేసినట్లు భావిస్తున్నా రు. వాటిలో అత్యంత కీలకమైన డాక్యుమెం ట్లు, రిజిస్టర్లు జ్ఞానేశ్వర్ కుమారుడి వద్ద ఉన్న ట్లు అనుమానిస్తున్నారు. అతను అజ్ఞాతంలో ఉ న్నట్లు తెలిసింది. మోహన్‌రెడ్డి సతీమణి, కు మారుడు కూడా అజ్ఞాతంలో ఉన్నారు. సీఐడీ, ఏసీబీ అధికారులు ఫిర్యాదులను పరిశీలించి వారి నుంచి స్టెట్మెం ట్లు రికార్డు చేసే పనిలో ఉన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి ఆయా భూములను, ఇళ్లను పరిశీలిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ ఇచ్చిన 550 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే సుమారు 100 డాక్యుమెంట్ల వరకు రిజిస్ట్రేషన్ విలువతోపాటు బ హిరంగ మార్కెట్లో విలువ కూడా అంచనా వేసినట్లు తెలిసింది. మిగిలిన వాటి విలువ అం చనా కోసం క్షేత్రస్థాయిలో ఆయా ప్రాంతాలను తిరిగారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్‌లో ఈ కేసు లో ప్రమేయమున్న అధికారులు, వారి బంధువుల పేర్ల మీద ఏయే ఆస్తులున్నాయనే వివరాలను సేకరిస్తున్నారు. సినీ ఫైనాన్స్ చేశాడా? సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా ఏఎస్సై మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్ వ్యవహారాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యేలకే అప్పులిచ్చిన వ్యవహారం బయటకు రాగా... తాజాగా సినీ పరిశ్రమలో కూడా మో హన్‌రెడ్డి పెట్టుబడులు పెట్టారని, కొందరు నిర్మాతలకు అప్పులు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇదివరకే స్వాధీనం చేసుకున్న 80 డాక్యుమెంట్లలో పలువురు నిర్మాతల పేర్లు బయటకొచ్చినట్లు తెలిసింది. దీంతో సీఐడీ అధికారులు సినీ నిర్మాతలను విచారిం చేందుకు సన్నద్ధమవుతున్నారు. అలాగే అ ప్పులు తీసుకున్న ఎమ్మెల్యేల స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. సీఐడీ కానిస్టేబుల్ పరుశురాంగౌడ్తో పాటు, ఫైనాన్స్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఎస్పీ జనార్ధన్‌రెడ్డిని మరోసారి ప్రశ్నించారు. జనార్ధన్‌రెడ్డి మాత్రం.. ఫోన్‌కాల్స్ తన వ్యక్తిగతమని, తా ను ఎలాంటి ఫైనాన్స్ చేయలేదని పేర్కొన్న ట్లు సమాచారం. ఈ దందాలో ఒక ఐపీఎస్ అధికారి ఉన్నట్లు సీఐడీ అనుమానిస్తోంది. -
ప్రమాణాలపై తనిఖీలు!
డిగ్రీ కాలేజీల్లో సదుపాయాలు, ఫ్యాకల్టీపై సర్కారు దృష్టి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలపై సర్కా రు దృష్టి సారించింది. ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసిన డిగ్రీ కాలేజీల్లో విద్యా బోధన ఎలా ఉంది? కాలేజీల్లో అధ్యాపకులు ఉన్నారా? లేదా? వారి అర్హతలు ఏంటి? ల్యాబ్, లైబ్రరీలు ఉన్నాయా? లేదా? ఎలాంటి సదుపాయాలు ఉన్నాయన్న సమగ్ర వివరాలను సేకరించే పని లో పడింది. ఈ నెలాఖరు లోగా రాష్ట్రంలోని 1,150 వరకు ఉన్న డిగ్రీ కాలేజీలు సమగ్ర సమాచారాన్ని ఉన్నత విద్యా మండలికి అందే లా వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేయాలని ఆదేశించింది. రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్(రూసా) ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) సమావేశం వచ్చే జనవరి/ఫిబ్రవరి నెలల్లో ఉండనున్న నేపథ్యంలో కాలేజీల వారీగా పరిస్థితులను తెలుసుకునే పనిలో పడింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతోపాటు నాణ్యతా ప్రమాణాల పెంపునకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. కాలేజీల వారీ సమాచారం అంద గానే నవంబర్/డిసెంబర్ నెలల్లో బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాలని భావిస్తోంది. గతంలో ఏర్పాటు చేసినవి 850వరకు ఉండగా, రాష్ట్ర విభజనకు ముందు 300 వరకు ప్రైవేటు కాలేజీలకు అనుమతులు ఇచ్చేశారు. అవసరం లేని ప్రాంతాల్లోనూ కాలేజీల ఏర్పాటుకు అప్పటి ఏపీ ఉన్నత విద్యా మండలి ఓకే చెప్పింది. నిబంధనలు పా టించారా? లేదా? అన్నది కూడా చూడకుండానే ఫోర్జరీ డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకున్న కాలేజీలకు అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. కొత్త వాటిల్లోనే కాకుండా గతంలో ఏర్పాటు చేసిన 850 కాలేజీల్లోనూ అదే దుస్థితి నెలకొన్నట్లు ఆరోపణలున్నాయి. అప్పట్లో రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రవేశాలపై గందరగోళం నెలకొనడంతో కాలేజీల వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాలేజీల వ్యవహారాన్ని తేల్చాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి మొదటి నుంచి భావిస్తోంది. కాలేజీల భవనాలు, స్థలాల డాక్యుమెంట్ల విషయంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ సహకారం తీసుకుని.. ఎన్ని కాలేజీలు ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టాయి.. కాలేజీల్లో సౌకర్యాల వంటి అంశాలపై దృష్టి పెట్టి తనిఖీలు చేయాలని భావిస్తోంది. -
ఊరూరా ‘రిజిస్ట్రేషన్’ స్టాంపులు
పోస్టల్ శాఖతో సర్కారు ఎంవోయూ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రా మాల్లోనూ నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్లు ల భ్యమయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. సెప్టెంబరు 1 నుంచి పట్టణ ప్రాంతాల్లోని 859 పోస్టాఫీసుల్లోనూ, త్వరలో 6,500 గ్రామీణ పోస్టాఫీసుల ద్వారా ఈ సదుపాయాన్ని కల్పించబోతున్నట్లు చెప్పారు. సచివాలయంలో గురువారం ఉప ముఖ్యమంత్రి సమక్షంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, పోస్టల్ శాఖల ఉన్నతాధికారులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎన్ఐసీ సహకారంతో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆధునీకరించిన వెబ్‌పోర్టల్ ను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రిజి స్ట్రేషన్ల శాఖకు సంబంధించిన మరికొన్ని ఐటీ ఆధారిత సేవలను ప్రజలకు అందుబాట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. కార్యక్రమం లో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యద ర్శి వీకే అగర్వాల్, కమిషనర్ అహ్మద్ నదీమ్, జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ వెంకట రాజేశ్, పోస్ట్ మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డి, ఎన్ఐసీ ఉన్నతాధికారి రామ్మోహన్రావు పాల్గొన్నారు. కొత్త ‘రిజిస్ట్రేషన్’ సేవలిలా.. పోర్టల్ నుంచే అధికారులతో ఇంట రాక్షన్ నవీకరించిన రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్ పోర్టల్ ద్వారా వినియోగదారులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు నేరుగా రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో ఇంటరాక్ట్ కావచ్చు. తమ ఆస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి స్టాంపు డ్యూటీలు, రిజిస్ట్రేషన్ ఫీజు తదితర వివరాలను పొందవచ్చు. వెబ్ పోర్టల్ సేవలు ఈ నెల 11 నుంచి లభ్యమవుతాయి. పబ్లిక్ డేటా ఎంట్రీ వ్యవస్థ రిజిస్ట్రేషన్ చేయాల్సిన ఆస్తుల వివరాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సమర్పించేందుకు కనీసం గంట పడుతోంది. వెబ్ పోర్టల్‌లోని పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ఏ కంప్యూటర్ నుంచైనా ముందుగానే డేటాను ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ క్షణాల్లో పూర్తి అవుతుంది. ముందుగానే స్లాట్ బుకింగ్ ఆస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి ఎవరైనా తాము కోరుకున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. దీని కోసం ఆయా కార్యాలయాల వద్ద తమ వంతు వచ్చిందాక ఇక నుంచి నిరీక్షించాల్సిన పనిలేదు. వెబ్ పోర్టల్ ద్వారా ముందుగా స్లాట్ (ఫలానా రోజు, సమయం)ను బుక్ చేసుకోవచ్చు. ఒకరికి కేటాయించిన స్లాట్(సమయం)లో మరొకరు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుకాదు. పెండింగ్ పత్రాలూ ఈసీలో ప్రత్యక్షం ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ పూర్తయిన డాక్యుమెంట్ల వివరాలే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్(ఈసీ)లో కనిపిస్తాయి. తాజాగా రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో ఉన్న పత్రాల వివరాలను కూడా ఇకపై ఈసీలో కనిపించేలా అధికారులు ఏర్పాటు చేశారు. పెండింగ్‌కు తగిన కారణాలను కూడా పేర్కొంటారు. ఎస్ఎంఎస్ అలర్ట్ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వివిధ దశల్లో డాక్యుమెంట్ స్టేటస్‌ను సంక్షిప్త సమాచారం(ఎస్ఎంఎస్) రూపంలో వినియోగదారుని మొబైల్‌కు అందనుంది. రిజిస్ట్రేషన్ దరఖాస్తు నుంచి రిజిస్ట్రేషన్ ముగింపు వరకు వివిధ దశల్లో డాక్యుమెంట్ స్టేటస్‌ను తెలుసుకునేందుకు వీలవుతుంది. 2 షిఫ్టుల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రాష్ట్రవ్యాప్తంగా రద్దీగా ఉండే రిజిస్ట్రేషన్ కార్యాలయాలను రెండు షిఫ్టులుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్‌లోని బోయినపల్లి, మారేడ్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ కా ర్యాలయాలను ఎంపిక చేశారు. ఈ నెల 17 నుంచి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 9 గంటలవరకు ఈ కార్యాలయాలు పనిచేస్తాయి. దీనిద్వారా ఉద్యోగులు, వ్యాపారులు వీలైన సమయాల్లోనే రిజిస్ట్రేషన్‌కు వెళ్లవచ్చు. పోస్టాఫీసుల ద్వారా స్టాంపుల విక్రయం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతమైన నెట్వర్క్ కలిగిన పోస్టల్‌శాఖతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబరు 1 నుంచి పోస్టాఫీసుల్లో నాన్ జ్యుడీషియల్ స్టాంపులను నగదు చెల్లించి లేదా క్రెడిట్ కార్డు ద్వారా(క్యాష్‌లెస్) కొనుగోలు చే యవచ్చు. పోస్టల్ శాఖ అందించే 343 రకాల సేవలను‘వన్ స్టాప్ షాప్’ల ద్వారా ప్రజలకు మరింత అందుబాట్లోకి తెచ్చేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారు. మున్ముందు మరిన్ని సేవలు కీలకమైన పాత రికార్డులను డిజిటలైజేషన్ చేయాలని, ప్రతి రిజిస్ట్రేషన్‌ను ఆధార్‌తో లింక్ చేయాని సర్కారు భావిస్తోంది. త్వరలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ ఆదివారం కూడా పని చేసేవిధంగా సర్కార్ చర్యలు చేపడతామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. -
రిజిస్ట్రేషన్ మరింత భారం
- రేపటి నుంచి భూముల విలువలు పెంపు - ప్రాతాన్ని బట్టి 20 నుంచి 30 శాతం వరకూ.. - భవనాలు, నిర్మాణాల దరలకూ వర్తింపు - 2015-16లో జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ లక్ష్యం రూ. 530 కోట్లు కాకినాడ లీగల్ : ఆదాయమార్గాల అన్వేషణలో భాగంగా రిజిస్ట్రేషన్ శాఖపై దృష్టి పెట్టిన ప్రభుత్వం..భూముల విలువను 20 నుంచి 30శాతం పెంచింది. గతంలో రిజిస్ట్రేషన్ల ఫీజులు పెంచి, భూముల విలువలు పెంచని సర్కారు ఇప్పుడు భూముల విలువను పెంచి రిజిస్ట్రేషన్ల ఫీజు పెంచలేదు. అరుుతే.. ఏ రారుుతో కొట్టినా పళ్లూడతాయన్న చందంగా విలువల పెంపు వల్ల కొనుగోలుదారుడికి రిజిస్ట్రేషన్ ఫీజు పెరిగి అదనపు భారం తప్పడం లేదు. ఇప్పటి వరకు రూ.10 లక్షలవిలువైన భూమికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.75వేలు అయ్యేది. ఇప్పుడు భూమి విలువ 20శాతం పెరిగితే రిజిస్ట్రేషన్ ఫీజు రూ.90 వేలు అవుతుంది. అంటే కొనుగోలుదారుడికి రూ.15 వేల అదనపుభారం పడే అవకాశం ఉంది. జిల్లాలో 32 సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రభుత్వం 2014-15 రెవెన్యూ లక్ష్యాన్ని రూ.480 కోట్లుగా నిర్ధారించగా, రూ.380కోట్లు ఆదాయాన్ని సమకూర్చి లక్ష్యానికి చేరువగా నిలవడంతో రాష్ట్రంలో ద్వితీయస్థానంలో నిలిచింది. ప్రస్తుతం 2015-16 సంవత్సరానికి రూ.530 కోట్ల రాబడిని లక్ష్యంగా నిర్దేశించారు. మార్కెట్ విలువలకు చేరువలో ఉండాలని.. 2013 తరువాత భూముల మార్కెట్ విలువను సవరించలేదు. దీంతో మార్కెట్లో ధరలకు, రిజిస్ట్రేషన్‌శాఖ దగ్గర ఉన్న పుస్తకాల్లో ధరలకు పొంతనలేకుండా పోయింది. రాష్ట్ర విభజన తరువాత జిల్లాలోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అదే సమయంలో బంగారం విలువ తగ్గడంతో అధికశాతం మంది భూములపై పెట్టుబడి పెట్టడంతో భూముల విలువ విపరీతంగా పెరిగింది. సామాన్యుడికి అందుబాటులోలేని రీతిలో భూముల ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో వాస్తవ మార్కెట్ విలువను అధ్యయనం చేసి, ఆ విలువలో 50 నుంచి 60 శాతం వరకు రిజిస్ట్రేషన్‌శాఖ పుస్తకాల్లో ధరగా నిర్ణయించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఉదాహరణకు ఒక ప్రాంతంలో గజం భూమి మార్కెట్‌ధర రూ.10వేలు ఉండగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పుస్తకాల్లో విలువ రూ.5 వేల నుంచి రూ.6వేలుగా ఉండాలని ప్రభుత్వం నిర్ధారించింది. అలా కాక వెయ్యి నుంచి రెండువేలుగా పుస్తకాల్లో ఉంటే ఆ భూమి విలువను 50 నుంచి 60శాతం పెంచాలని రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశించింది. సాధారణంగా రిజిస్ట్రేషన్‌శాఖ పట్టణ ప్రాంతాల్లో ఏటా, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకోసారి భూముల విలువను పెంచుతుంటుంది. ఈ లెక్కన గతేడాది పట్టణ ప్రాంతాల్లో భూముల విలువను పెంచాల్సి ఉంది. నూతనరాష్ట్రం ఏర్పడే క్రమంలో గతేడాది భూముల మార్కెట్ విలువను పెంచలేదు. గతేడాది కాలంలో పట్టణ ప్రాంతాల్లో, వాటి ఆనుకొని ఉన్న గ్రామాల్లో భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది తప్పనిసరిగా భూముల విలువను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భూముల విలువతో పాటు భవనాలు, కట్టడాల విలువనూ సవరించారు. ఉదాహరణకు ఇప్పటి వరకు చదరపు అడుగు ధర (ఆర్సీసీ రూఫ్)కు రూ.700 ఉంటే ఉంది. ఆగస్టు 1 నుంచి ప్రాంతాన్ని బట్టి రూ.100 నుంచి రూ.150 పెరగనుంది. అలాగే సిమెంట్ రేకుతో ఉన్న ఇల్లు, మద్రాస్ టైతో ఉన్న ఇంటికి కూడా చదరపు అడుగుకు గతం కంటే ధర పెరిగింది. కిటకిటలాడుతున్న రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆగస్టు 1 నుంచి భూముల విలువలు పెరగనుండడంతో కొనుగోలుదారులు అధిక సంఖ్యలో భూములు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. అదే సమయంలో బంగారం విలువ తగ్గిపోతుండడంతో పెట్టుబడులు పెట్టేవారు అధికశాతం భూములు కొనడంతో జూలై 25 నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. -
‘ఆటోమ్యాటిక్’గా ఆస్తుల బదిలీ..!
కొత్తపేట(గుంటూరు) : రిజిస్ట్రేషన్, స్టాంపులు శాఖలో అధునాతన సాంకేతిక ప్రక్రియే ఆటోమ్యాటిక్ మ్యూటేషన్. అడంగళ్లు, ఇంటిపన్ను, ఆస్తుల సర్వహక్కులూ రిజిస్ట్రేషన్ రోజునే కొనుగోలుదారుని పేరు మీదకు బదిలీ అవటం ఈ విధానం విశిష్టత. ఈ నూతన విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అమలు పరచనున్నది. ప్రస్తుతం జిల్లాలో కొల్లిపర సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ రూపుదిద్దుకుంటుంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అధికారికంగా అమలు చేయనున్నారు. ఆస్తుల బదిలీ ఇక సులభం.. కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్ మొదలు, ఆస్తులపై సర్వహక్కులు పొందేంత వరకు ప్రస్తుతం నానా తంటాలు పడాల్సి వస్తోంది. భూములు క్రయవిక్రయ దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేసుకున్న పిదప, వీటి తాలుకా ఈసీలను రిజిస్ట్రారు కార్యాలయం నుంచి పొంది, పూర్తి ఆధారాలతో తహశీల్దార్ కార్యాలయంలో పాసు పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. దీనికోసం అక్కడున్న గ్రామ రెవిన్యూ అధికారుల నుంచి తహశీల్దార్ వరకు అందరినీ ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి. రోజుల తరబడి వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తప్ప, పాసు పుస్తకాలు పొందలేని దుస్థితి. అయితే ఈ సమస్యలన్నింటికీ ఆటోమ్యాటిక్ మ్యూటేషన్ త్వరలో చెక్ పెట్టనుంది. ప్రభుత్వం క్షేత్రస్థాయి క సరత్తుల అనంతరం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్ అయిన రోజునే కొనుగోలుదారుని పేరు అడంగల్‌లో ఆటోమ్యాటిక్‌గా నమోదు అవుతుంది. అడంగల్ కాపీని కొనుగోలుదారునికి సాఫ్ట్వేర్ ద్వారా అందజేస్తారు. ఫలితంగా భూమిని కొనుగోలు చేసిన మరుసటి రోజే విక్రయం చేసుకునే వెసులుబాటు కలుగుతోంది. ఆస్తుల సత్వర బదిలీలకు ఇదొక సాంకేతిక విప్లవంగా అధికార వర్గాలు చెబుతున్నాయి. కొల్లిపరలో నూతనంగా ప్రవేశపెట్టిన ఆటోమాటిక్ మ్యూటేషన్ ప్రక్రియ విజయవంతంగా పనిచేస్తుంది. 27 నుంచి మరిన్ని సేవలు.. ప్రస్తుతం భూముల తాలుకా అడంగల్‌లో పేరులు మార్పుకే కాకుండా త్వరలో మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలో కొనుగోలు చేసిన ఆస్తులను కూడా ఆటోమ్యాటికి మ్యూటేషన్ ప్రక్రియలోకి క్రోడీకరించనున్నారు. స్థలాలు, భవనాలు వంటి ఆస్తులను కొనుగోలు చేసినా వెంటనే మున్సిపల్, కార్పొరేషన్ కార్యాలయాలు చుట్టూ తిరగకుండానే ఈ సాఫ్ట్వేర్ ప్రక్రియతో కొనుగోలుదారుని పేరుమీదకు మొత్తం బదిలీ అవుతాయి. ఆస్తి విడుదల, పవర్ ఆఫ్ అటార్నీ , గిఫ్ట్ తదితర రిజిస్ట్రేషన్లు వంటివి కూడా ఆటోమ్యాటికి మ్యూటేషన్ ప్రక్రియలో పొందుపరుస్తున్నారు. సేవలు సరళీకృతమౌతున్నాయి.. - డీఐజీ బి.సూర్యనారాయణ ఆటోమ్యాటిక్ మ్యూటేషన్ ప్రక్రి య ద్వారా ఆస్తుల సత్వర బదిలీలు, ప్రజాహిత సేవలు వంటివి ఎన్నో ప్రభుత్వం సరళీకృతం చేస్తోంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటోమ్యాటిక్ మ్యూటేషన్ ప్రక్రియను అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అధునాతన సాంకేతిక నైపుణ్యంతో తయారు చేసినా సాఫ్ట్‌వేర్‌ను రాష్ట్రంలో 12 మంది సబ్ రిజిస్ట్రారులు ఐజీ కార్యాలయంలో శిక్షణ తీసుకున్నారు. అడంగళ్లు, ఇంటి పన్ను, ఆస్తుల సర్వహక్కులూ రిజిస్ట్రేషన్ రోజునే కొనుగోలుదారు పేరున బదిలీ అవుతాయి. -
భాగ్యనగరంలో భూమి బంగారమే!
ఆగస్టు 1 నుంచి నగరంలో పెరగనున్న భూముల ధరలు స్టాంపు డ్యూటీ తగ్గిస్తే మరింత లాభమంటున్న నిపుణులు ప్రస్తుతం హైదరాబాద్‌లో సెంటు జాగా కొనాలంటేనే లక్షలు కావాలి. అలాంటిది మరో రెండు వారాల్లో అయితే కోట్లు వెచ్చించాల్సిందే. ఎందుకంటే ఆగస్టు 1 నుంచి ఆయా ప్రాంతాలను బట్టి ఇప్పుడున్న ధరల కంటే 10-30 శాతం మేర భూముల ధరలను ప్రభుత్వం పెంచనుంది. అయితే స్టాంపు డ్యూటీని తగ్గించకుండా భూముల ధరలను పెంచితే రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం అంతగా పెరగదనేది స్థిరాస్తి నిపుణుల అభిప్రాయం. సాక్షి, హైదరాబాద్ : మాంద్యం, స్థానిక రాజకీయాంశాలతో కొన్నేళ్లుగా కుదేలైన భాగ్యనగర స్థిరాస్తి అభివృద్ధి తిరిగి పుంజుకోనుంది. మెట్రో రైల్, ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీఐఆర్ ప్రాజెక్ట్, ఫార్మా, హెల్త్, ఫిల్మ్ సిటీలు, సత్వర అనుమతుల కోసం పారిశ్రామిక విధానం.. వంటి వాటితో నగరంలో భూములకు తిరిగి రెక్కలురానున్నాయి. అపార్ట్మెంట్ల అమ్మకాలు పెరిగి, విల్లాల జోరు అధికమై, వాణిజ్య సముదాయాలకు గిరాకీ రెట్టింపై దేశ, విదేశీ పెట్టుబడుదారులను హైదరాబాద్ వైపు దృష్టి సారించేలా చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పలు ఐటీ, ఈ-కామర్స్ కంపెనీలు నగరంలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. మరికొన్ని విస్తరణ యోచనలో ఉన్నాయి. దీంతో ఉత్పత్తి, సేవా, ఆతిథ్యం, షాపింగ్ మాళ్లకు ఆదరణ పెరగనుంది. భారీగా పెరగనున్న ఉద్యోగులు, వేతనాలు.. వంటి కారణాల వల్ల స్థిరాస్తి రంగానికి ఢోకాలేదని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ కూడా సానుకూలంగా ఉండటం వల్ల వివిధ నిర్మాణాల్లో అమ్మకాలు మెరుగ్గా సాగుతున్నాయంటున్నారు. గచ్చిబౌలి-పెద్ద అంబర్పేట్.. గతంలో స్థిరాస్తి వ్యాపారమంటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్ వంటి ప్రాంతాల మీదే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్డులతో నగరం చుట్టూ అభివృద్ధికి బాటలు పరచుకుంది. మియాపూర్, గచ్చిబౌలి, నార్సింగి, అప్పా జంక్షన్, మణికొండ, ఉప్పల్ వంటి ప్రాంతాల్లోనే అభివృద్ధి జరుగుతుంది. 50 శాతం అభివృద్ధి తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్యే ఉందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. ప్రత్యేకించి గచ్చిబౌలి నుంచి పెద్ద అంబర్‌పేట వరకు హాట్‌స్పాట్. ఎందుకంటే ఇక్కడ భూమి ఉంది. ధరలూ అందుబాటులోనే ఉన్నాయి. విద్యుత్, నీరు వంటి మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయి. పెపైచ్చు అంతర్జాతీయ విమానాశ్రయం. ఆ తర్వాత అభివృద్ధి విజయవాడ హైవే మీదు గా వరంగల్ హైవేకు మళ్లే అవకాశాలున్నాయి. మరో 8 నెలల్లో 40-50 శాతం మేర ధరలు పెరిగే అవకాశాలూ లేకపోలేదు. త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఔటర్ రింగురోడ్డు, మెట్రో రైల్ కారణంగా భవిష్యత్తులో నగరమంతా అభివృద్ధి జరుగుతుందని స్థిరాస్తి వ్యాపారులు చెబుతున్నారు. ఫ్లాట్లకు గిరాకీ.. గతంలో సొంతూర్లలో స్థలాలు, ఇళ్లను కొనడం మీద దృష్టిసారించిన వారు సైతం నగరానికి ఉన్న ప్రత్యేకతను గుర్తించి భవిష్యత్తు అభివృద్ధిని అంచనా వేసుకొని ఇక్కడ ఫ్లాట్లను కొనడంపై మక్కువ చూపుతున్నారు. దీంతో ఒకప్పుడు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలో మాత్రమే కన్పించే అపార్ట్మెంట్ సంస్కృతి ఇప్పుడు శివారు ప్రాంతాలైన నార్సింగి, అప్పా జంక్షన్ , మణికొండ వంటి ప్రాంతాలకు కూడా విస్తరించింది. ప్రసు ్తతం నిర్మిస్తున్న అపార్ట్మెంట్లలో చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకునే రియల్టర్లు నిర్మాణాలు చేపడుతున్నారంటే ఫ్లాట్లకు ఉన్న గిరాకీని అర ్థం చేసుకోవచ్చు. నాణ్యత, వసతుల కల్పనలో ఏమాత్రం తగ్గకుండా లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు కూడా. వాణిజ్య స్థిరాస్తి జోష్.. నగరంలో ఏటా 50 లక్షల చ.అ. వాణిజ్య స్థలం అభివృద్ధి చెందుతుంది. 2015 నాటికల్లా ఆఫీసు సముదాయాల విస్తీర్ణం 50 కోట్ల చ.అ.లకు చేరుకుంటుందని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో వృద్ధిని నమోదు చేయడం వల్లే ప్రపంచంలో హైదరాబాద్ రియల్ మార్కెట్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో విస్తరణ కారణంగా నిర్మాణ సంస్థలు ఐటీ పార్కులు, షాపింగ్ మాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. రెండేళ్ల నుంచి ఖాళీగా ఉన్న వాణిజ్య ఆఫీసు సముదాయాల్లో స్థలాల్ని తీసుకునేవారు విపరీతంగా పెరుగుతున్నారు. స్టాంపు డ్యూటీని తగ్గించాల్సిందే.. సరిగ్గా రెండేళ్ల తర్వాత నగరంలో భూముల ధరలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బహిరంగ మార్కెట్ ధరలను ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వం భూముల ధరలను పెంచనుంది. అయితే ఈ నిర్ణయం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆదిభట్ల, మహేశ్వరం, ఘట్కేసర్, భువనగిరి, షామీర్పేట వంటి ప్రాంతాలకు బాగా కలిసొస్తుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ అధ్యక్షుడు ఎస్ రాంరెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. అయితే స్టాంప్ డ్యూటీని తగ్గించకుండా భూముల విలువను పెంచితే సామాన్యుల రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ముందుకురారని ఆయన పేర్కొన్నారు. అందుకే 6 శాతంగా ఉన్న స్టాంప్ డ్యూటీని 4 శాతానికి తగ్గించాలని ఆయన కోరారు. అప్పుడే రిజిస్ట్రేషన్లలో పారదర్శకత పెరుగుతుందని, ప్రభుత్వానికి ఆదాయమూ దండిగా వస్తుందన్నారు. ఇదిలా ఉంటే భూముల ధరలు తక్కువగా ఉన్నచోట ఎలాగైతే పెంచనుందో.. అలాగే ఎక్కువగా ఉన్న చోట ధరలను అదుపులో ఉంచడం కూడా అవసరమేననేది ఆయన అభిప్రాయం. -
మరో అవినీతి చేప
ఏసీబీకి చిక్కిన రిజిస్ట్రేషన్‌శాఖ సీనియర్ అసిస్టెంట్ - రూ.3,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన వైన - పట్టించిన హైకోర్టు న్యాయవాది.. ఖమ్మం క్రైం: కిందిస్థాయి ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోరుున సత్తుపల్లి ట్రాన్స్‌కో డీఈఈ సుదర్శన్ ఉదంతం మరవకముందే మరో అవినీతి చేప పట్టుబడింది. జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని పరిపాలన విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ జె.గణపతిరావు రూ.3,000 లంచం తీసుకుంటూ బుధవారం రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టు బడ్డాడు. కామేపల్లి మండలం లింగాల గ్రామానికి చెందిన బెరైడ్డి సీతారాంరెడ్డి హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. ఆయనకు సంబంధిం చిన వాల్యుడేషన్ సర్టిఫికెట్ కోసం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. రూ.100తో చలా నా కూడా చెల్లించాడు. ఈ సర్టిఫికెట్ ఇవ్వడం కోసం ఆ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జె.గణపతిరావు రూ.3వేలు లం చం అడిగాడు. సీతారాంరెడ్డి రూ.100 చలానాతో వచ్చే వ్యాలిడేషన్ సర్టిఫికెట్‌కు రూ.3వేలు లంచం ఏమిటని ప్రశ్నించగా.. లంచం ఇస్తే కాని సర్టిఫికెట్ ఇవ్వనని సీనియర్ అసిస్టెంట్ తెగేసి చెప్పాడు. సీతారాంరెడ్డి ఏసీబీ సిబ్బందిని ఆశ్రయించారు. వారు పథకం ప్రకారం లంచం తీసుకుంటున్న గణపతిరావును అరెస్ట్ చేసి ఆయన వద్ద ఉన్నరూ.3వేలు స్వాధీనం చేసుకున్నారు. పూర్వాపరాలు.. హైకోర్టు లాయర్ సీతారాంరెడ్డికి ముగ్గురు కుమారులు. వీరిలో గౌతమ్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నకుమారుడు అరుణ్‌రెడ్డి సినీ హీరోగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. పెద్దకుమారుడు గౌతమ్‌రెడ్డికి, ఆయన భార్యకు మధ్య ఇటీవల వివదాలు పొడచూపారుు. సీతారాంరెడ్డి కుటుంబంపై కేసులు అయ్యాయి. అమెరికాలో ఉంటున్న ఆయన ఇద్దరు కుమారులు ఇక్కడున్న వారి ఆస్తులకు సంబంధించి తండ్రి పేరు మీద ఆదేశం నుంచి పవర్ ఆఫ్ అటార్నీ చేయించారు. దీనికి సంబంధించి రూ.100 చలానా కట్టి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వాల్యుడేషన్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంది. దీనికోసం సీతారాంరెడ్డి ఈనెల 13న చలానా కట్టారు. వాల్యుడేషన్ సర్టిఫికెట్ కోసం జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయూనికి వచ్చారు. దీనికి సంబంధించిన విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న జె. గణపతిరావుని సంప్రదించారు. ఆయన రూ.3,000 లంచం అడిగారు. ఖంగుతిన్న సీతారాంరెడ్డి రూ.100 చలనా కడితే వచ్చే సర్టిఫికెట్ కోసం రూ.3,000 ఇవ్వడమేంటని ప్రశ్నించారు. తాను హైకోర్టు న్యాయవాదినని కూడా చెప్పారు. అవన్నీ పక్కనబెట్టు డబ్బులిస్తే గానీ సర్టిఫికెట్ ఇవ్వనని సీనియర్ అసిస్టెంట్ గణపతిరావు తెగేసి చెప్పారు. బాధితుడు జిల్లా రిజిస్ట్రార్‌ను కలవడానికి ప్రయత్నించారు. వరంగల్ ఇన్చార్జి సుభాషిణి జిల్లాకు ఇన్చార్జ్గా వ్యవహరిస్తుండటంతో ఆమె అందుబాటులో లేరు. వాస్తవానికి 18వ తేదీనే రిజిస్ట్రార్ ఈ సర్టిఫికెట్‌పై సంతకం చేశారు. సీతారాంరెడ్డి వస్తే ఇవ్వమని సీనియర్ అసిస్టెంట్‌కు అప్పగించి వెళ్లారు. ఆయన రూ.3,000 ఇస్తేనే పనవుతుందని ఈనెల 24వ తేదీ నుంచి తిప్పించుకుంటున్నాడు. గత్యంతరం లేక బాధితుడు ఏసీబీని ఆశ్రరుుంచారు. ఏసీబీ నిఘా వేసిందిలా.. రూ.500 నోట్లు ఆరింటికి ఏసీబీ సిబ్బంది రసాయనం పూశారు. వాటిని సీతారాంరెడ్డి చేతిలో పెట్టి కార్యాలయంలో పలికి పంపించారు. రూ.3,000 లంచం తీసుకుంటుండగా ఏసీ బీడీఎస్పీ సాయిబాబా దాడి చేసి పట్టుకున్నారు. గణపతిరావు గతంలో సత్తుపల్లి, కూసుమంచి తదితర ప్రాంతాల్లో పనిచేశారని ఆయనపై అప్పట్లోనూ అవినీతి ఆరోపణలున్నాయని ఏసీబీ సిబ్బంది తెలిపారు. ఆయన పదవీ విరమణకు దగ్గరలో ఉన్నారని రిజిస్ట్రేషన్ సిబ్బంది పేర్కొన్నారు.ఈ దాడిలో ఏసీబీ సీఐ వెంకటేశ్వర్లు, పాపారావు పాల్గొన్నారు. -
జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వడ్డన
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం చడీచప్పుడు లేకుండా జిల్లా ప్రజలపై అదనపు బాదుడికి సన్నద్ధమైంది. ముఖ్యమంత్రి జపాన్ పర్యటనకు వెళ్తూ అత్యంత రహస్యంగా రెండు జీవోలను రాష్ట్ర ప్రజలపై రుద్దారు. రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచేశారు. అది కూడా బుధవారం నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జిల్లాలో రెండు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్నాయి. ఒకటి ఒంగోలు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం కాగా, రెండోది మార్కాపురం జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం. ఈ రెండింటి పరిధిలో తొమ్మిదేసి చొప్పున సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. మొత్తం 18 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ల క్రయ, విక్రయాలు జరుగుతుంటాయి. భూములు, స్థలాలు నిర్ణయించిన మార్కెట్ విలువను బట్టీ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను నిర్ణయిస్తారు. గతంలో కంటే ప్రతి రిజిస్ట్రేషన్‌పై చార్జీల మోత మోగించిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే దక్కింది. ముందెన్నడూ ఈ విధంగా అన్ని రకాల సేవలపై చార్జీలు పెంచలేదు. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లా మొత్తం మీద 209 కోట్ల రిజిస్ట్రేషన్ ఆదాయలక్ష్యంగా విధించారు. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, రాష్ట్రం విడిపోయినప్పటికీ జిల్లాకు ప్రత్యేకంగా ఎలాంటి పారిశ్రామిక అభివృద్ధి జరగకపోవడంతో భూముల ధరలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంలా తయారైంది. రిజిస్ట్రేషన్ పరంగా జిల్లావ్యాప్తంగా స్టాంప్ డ్యూటీదే సింహభాగం. ఒంగోలు జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి 125 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ణయించారు. దీంతో పాటు ప్రభుత్వం పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీల వలన అదనంగా 15 కోట్ల భారం జిల్లా ప్రజలపై పడనుంది. మార్కాపురం జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరానికి 84 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ణయించారు. దీంతో పాటు పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీల వల్ల అదనంగా మరో 10 కోట్ల భారం ప్రజలపై పడనుంది. స్టాంప్‌డ్యూటీ గతంలో 4 శాతం ఉంటే ప్రస్తుతం ఒక శాతం పెంచడంతో అది 5 శాతమైంది. అదే విధంగా రిజిస్ట్రేషన్ చార్జీల కింద గతంలో స్టాంప్ డ్యూటీ మీద 0.5 శాతం విధించేవారు దానిని ఇప్పుడు ఒక శాతానికి పెంచారు. సెటిల్మెంట్స్, గిఫ్ట్ డీడ్లపై మార్కెట్ విలువను బట్టీ ఒకశాతం స్టాంప్ డ్యూటీ విధించేవారు, దానిని ప్రస్తుతం 2 శాతంగా పెంచారు. దీంతో పాటు రక్త సంబంధీకులకు కానుకల రూపంలో ఇచ్చే రిజిస్ట్రేషన్లు, కుటుంబ సభ్యుల మధ్య జరిగే ఒప్పందానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు, ఇతరుల మధ్య జరిగే భాగస్వామ్య ఒప్పందాల రిజిస్ట్రేషన్ల స్టాంప్ డ్యూటీని కూడా ఒకటి నుంచి 2 శాతానికి పెంచారు. ఇతరుల మధ్య జరిగే ఒప్పందాలు (అగ్రిమెంట్లు) రిజిస్ట్రేషన్లపై గతంలో 2 శాతం స్టాంప్‌డ్యూటీ ఉండేది. ప్రస్తుతం దానిని 3 శాతానికి పెంచారు. అదే విధంగా ఇతరుల మధ్య కానుకలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు జరిగితే గతంలో 4 శాతం డ్యూటీ విధించేవారు, దానిని ప్రస్తుతం 4 నుంచి 5 శాతానికి పెంచారు. కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందాలు (అగ్రిమెంట్లు) రూపంలో రిజిస్ట్రేషన్లు చేసుకుంటే గతంలో 0.5 శాతంగా ఉండేది, దానిని ఒక శాతానికి పెంచారు. అన్ని రకాల ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లపై పెంచి కూర్చోవడంతో ప్రజలు ఇక రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. -
స్టాంపుడ్యూటీ బకాయిలు రూ.3.20కోట్లు
మంచిర్యాల టౌన్ : మంచిర్యాల పురపాలక సంఘానికి రిజిస్ట్రేషన్ శాఖ నుంచి సుమారు రూ.3.20 కోట్లపైగా స్టాంపు డ్యూటీ రావాల్సి ఉంది. అధికారుల నిర్లక్ష్యంతో గత పది నెలలుగా బకాయిలు పెండింగ్ పడ్డాయి. ప్రతీ నెల మంచిర్యాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చే ఆదాయం మొత్తంపై 1.50 శాతం స్టాంపు డ్యూటీని మున్సిపల్‌శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. 2014 జనవరి నుంచి మున్సిపాలిటీకి రావాల్సిన స్టాంపు డ్యూటీ మున్సిపల్ ఖాతాలో జమకావడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతోపాటు సిబ్బంది కొరత వల్ల జమ నిలిచిపోయింది. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్ డ్యాకుమెంట్లు, వాటిపై వచ్చిన ఆదాయం వివరాలు ఏ నెలకు ఆ నెలా జిల్లా రిజిస్ట్రార్‌కు పంపించాలి. ఆ వివరాల ప్రకారం 1.50 శాతం స్టాంపు డ్యూటీని మున్సిపల్ పద్దులో జమ చేస్తారు. ఈ మొత్తాన్ని మున్సిపాలిటీ వివిధ పనుల కోసం వినియోగిస్తుంది. జనవరి నుంచి అక్టోబర్ వరకు రావాల్సిన స్టాంప్ డ్యూటీ ఇంత వరకు రాలేదు. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి నెలనెలా వివరాలు పంపించకపోవడంతోనే ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. పన్నుల వసూలు సమయం కాకపోవడంతో ప్రస్తుతం మున్సిపాలిటీలో సాధారణ నిధులు (జనరల్ ఫండ్) తక్కువగా ఉన్నాయి. స్టాంప్‌డ్యూటీ రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తడంతో మున్సిపల్ అధికారులు సబ్ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. గత సబ్ రిజిస్ట్రార్ పలు ఆరోపణలతో సస్పెండ్ కాగా ప్రస్తుతం కొత్తగా వచ్చిన అధికారికి కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించానని, త్వరలోనే స్టాంపు డ్యూటీ చెల్లించేలా చర్యలు తీసుకుంటానని చెబుతున్నారు. స్టాంపు డ్యూటీ వస్తే పట్టణ అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతుందని, ఈ మేరకు ఎప్పటికప్పుడు సబ్ రిజిస్ట్రేషన్ అధికారులను సంప్రదిస్తున్నామని కమిషనర్ వెంకన్న తెలిపారు. -
చుక్కల్లో రిజిస్ట్రేషన్ చార్జీలు
విజయవాడ : రిజిస్ట్రేషన్ శాఖలో స్టాంప్ డ్యూటీ చార్జీలు గురువారం నుంచి భారీగా పెరగనున్నాయి. గతంలో ఉన్న చార్జీల కంటే సగానికి సగం పెంచుతూ టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలపై మరింత అదనపు భారం పడనుంది. జిల్లాలోని 28 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ ఏడాది రూ.600 కోట్ల ఆదాయం లక్ష్యంగా విధించింది. ఇప్పటికే అక్టోబర్ నాటికి రూ.350 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ల ద్వారా లభించింది. సేల్ డీడ్ల (అమ్మకాలు)పై ఒక శాతం స్టాంప్ డ్యూటీ పెరిగింది. ఫీజులు కూడా 0.5 శాతం పెంచారు. మొత్తం మీద సేల్ డీడ్లపై ఆరు శాతం నుంచి 7.5 శాతానికి స్టాంప్ డ్యూటీ, ఫీజులు పెరిగాయి. అంటే లక్ష రూపాయల విలువ గల ఆస్తి రిజిస్ట్రేషన్ చేసేవారిపై రూ.1,500 అదనంగా భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా గిఫ్ట్ డీడ్లు, సెటిల్మెంట్లకు కూడా స్టాంప్ డ్యూటీని ప్రభుత్వం పెంచింది. గతంలో గిఫ్ట్ డీడ్లకు సంబంధించి ఒక శాతం స్టాంప్ డ్యూటీ ఉండగా, అది మూడు శాతానికి పెరిగింది. సెటిల్మెంట్ డీడ్‌కు సంబంధించి ఒక శాతం నుంచి రెండు శాతానికి పెంచారు. పార్టిషన్ డీడ్‌కు సంబంధించి గతంలో ఉన్న రూ.20 వేల ఫీజును రద్దు చేసి, దానికి కూడా ఒక శాతం స్టాంప్ డ్యూటీ వసూలు చేసే విధంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా స్టాంప్ డ్యూటీలు, ఫీజులు పెంచడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పడిపోయిన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం
రియల్ ఢాం ఇతర రంగాలకు వెళ్తున్న వ్యాపారులు నల్లగొండ : రియల్ ఎస్టేట్ బూమ్ దారుణంగా పడిపోయింది. కోట్ల రూపాయలు వెచ్చించి వ్యవసాయ భూముల్లో వెంచర్లు చేసినవారు ప్లాట్లు అమ్ముడుపోక తలలు పట్టుకుంటున్నారు. వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి రియల్ఎస్టేట్ వ్యాపారం చేసిన వారు తిరిగి అప్పులు చెల్లించలేక ప్లాట్లను అంటగుడుతున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రధాన పట్టణాల్లో రోజూ చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న భువనగిరితోపాటు యాదగిరిగుట్ట పరిసరాల్లో మినహా నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేటలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా తగ్గింది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖకు వచ్చే ఆదాయం కూడా పడిపోయింది. జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. కాగా ఆయా కార్యాలయాలకు ఈ ఏడాది ఇప్పటి వరకు విధించిన ఆదాయ లక్ష్యం నెరవేరలేదు. ఈ ఏడాది ఏప్రిల్ మాసం నుంచి జూలై మాసం వరకు రిజిస్ట్రేషన్ శాఖకు 76.97 కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యంగా నిర్ణయించగా 38.98 కోట్ల రూపాయల మేర లభించింది. అంటే ఆదాయ లక్ష్యంలో కేవలం 50 శాతం మాత్రమే వచ్చింది. ఇళ్ల స్థలాలు విక్రయించేవారు కన్పిస్తున్నారే కానీ కొనుగోలు చేసేవారు లేరు. ఇతర రంగాలకు వ్యాపారులు... ఇంత కాలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వారు బూమ్ తగ్గడంతో ఇతర రంగాలకు వెళ్తున్నారు. కోట్లు, లక్షల రూపాయల వ్యాపారం చేసిన బడా వ్యాపారులు సైతం పెట్టుబడులు పెట్టి దివాలా తీశారు. దీంతో నష్టపోయిన వారంతా ఇతర రంగాలకు ఎంచుకుంటున్నారు. ఇంకా కొంతకాలంపాటు రియల్ రంగం ఉండే అవకాశం ఉంది. దీంతో భూముల ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉంది. -
రియల్ ‘భూమ్’
ఊపందుకుంటున్న క్రయ విక్రయాలు రియల్ ఎస్టేట్ వెంచర్లు కళకళ నిలకడగా భూముల ధరలు పెరుగుతున్న రిజిస్ట్రేషన్‌శాఖ ఆదాయం హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో మళ్లీ స్థిరాస్తి రంగంపై ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర విభజనతో స్తబ్ధతగా మారిన ఈ రంగం మళ్లీ పుంజుకుంటోంది. భూములు, ప్లాట్ల క్రయ విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈనెల మొదటి వారంలో ఒకేసారి దస్తావేజుల నమోదు సంఖ్య పెరిగింది. దీంతో నగరంతో పాటు శివారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటికిట లాడుతున్నాయి. మొన్నటి వరకు రాష్ట్ర విభజనతో స్థానికేతరులు ఇక్కడ స్థిరాస్తులు కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో లావాదేవీలు తగ్గాయి. తెలంగాణేతరులు స్థిరాస్తులు, భూముల ధరలపై ఆందోళన చెందినప్పటికీ భూముల ధరలు, విలువలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. పెరుగుతున్న రిజిస్ట్రేషన్లు.. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం స్థిరాస్తి దస్తావేజుల నమోదు సంఖ్య పెరిగి రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం కూడా పెరిగింది. గ్రేటర్ పరిధిలో రెండు నెలల్లో సుమారు 20 వేలకు పైగా స్థిరాస్తి దస్తావేజులు నమోదు కావడం గమనార్హం. దీంతో విభజన వల్ల 40 శాతానికి పడిపోయిన నెలసరి ఆదాయ లక్ష్య సాధన 65 నుంచి 70 శాతానికి చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల్లో హైదరాబాద్ జిల్లాలో రూ.155.76 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.370.27 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ శాఖకు సమకూరింది. అందులో రాష్ట్ర ఆవతరణ అనంతరం లభించిన ఆదాయాన్ని పరిశీలిస్తే.. రెండు నెలలో హైదరాబాద్ జిల్లాలో రూ.83.71 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.191.62 కోట్ల ఆదాయం వచ్చింది. గత నెలలో హైదరాబాద్ డీఆర్ పరిధిలోని బంజారాహిల్స్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 493 దస్తావేజులు నమోదు కాగా అందులో 167 అమ్మకం దస్తావేజులు, ఆజంపురం ఎస్ఆర్ పరిధిలో 482 దస్తావేజులు నమోదు కాగా,అందులో 173 అమ్మకం దస్తావేజులు ఉన్నాయి. చిక్కడపల్లి సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 445 దస్తావేజులు నమోదు కాగా, అందులో 157 అమ్మకం దస్తావేజులు, ఆర్ఓ హైదరాబాద్ (రెడ్‌హిల్స్) పరిధిలో నమోదైన 448 దస్తావేజుల్లో 168 అమ్మకం దస్తావేజులు ఉన్నట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల మొదటి వారంలో శివారు సబ్‌రిజిస్ట్రార్ పరిధిల్లో స్థిరాస్తుల దస్తావేజుల సంఖ్య మరింత పెరిగాయి. ఇదిలా ఉండగా, మహానగర శివారులో రియల్ ఎస్టేట్ వెంచర్లు తిరిగి పుంజుకున్నాయి. దీంతో పాటు రియల్ ఎస్టేట్ వెంచర్లకు వాహనాలు సమకూర్చే ట్రావెల్స్ ఏజెన్సీల వ్యాపారం కూడా పెరిగింది.