సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సవరించింది. కొత్త రేట్లు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. భూములు, స్థలాల విలువల విషయంలో బహిరంగ మార్కెట్‌లో వచ్చిన మార్పులకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఏటా, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి రిజిస్ట్రేషన్ విలువలను సవరించాల్సి ఉంది. 2017లో గ్రామీణ ప్రాం తాల్లోనూ, 2018లో పట్టణ ప్రాంతాల్లోనూ స్థిరాస్తి విలువలను సవరించారు. ఇప్పుడు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువల సవరణకు ప్రభు త్వం ఆమోదం తెలిపింది. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో భూములు, స్థలాల ప్రస్తుత మార్కెట్ విలువలను పరిశీలించి వాస్తవ పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని పది శాతం లోపు పెంచాలని ఆదేశించింది.
అంతకు మించి ఎక్కడా పెంచడానికి వీలులేదని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ విలువలను కొన్నిచోట్ల పెంచలేదు. ఇంకొన్ని ప్రాంతాల్లో 5 నుంచి పది శాతం వరకూ పెంచారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని మండలాలు, గ్రామాల వారీ రహదారి పక్కనున్న భూములు, మెట్ట, మాగాణిలకు సర్వే నంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ విలువలు ప్రతిపాదిం చారు. ఈ ప్రతిపాదనలను మున్సిపాలిటీల్లో జాయింట్ కలెక్టర్లు, గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ డివిజనల్ అధికారుల అధ్యక్షతన గల మార్కెట్ విలువల సవరణ కమిటీలు ఆమోదించాయి. దీంతో రిజిస్ట్రేషన్ అధికారులు ఈ రేట్లను రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లో నమోదు చేశారు.
కట్టడాల మార్కెట్ విలువలు ఇలా
కట్టడాలకు కొత్త రిజిస్ట్రేషన్ విలువలను రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ కార్యాలయం ఖరారు చేసింది. పట్టణాభివృద్ధి సంస్థలు, నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, మాస్టర్‌ప్లాన్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలను ఒక విభాగంగా, మేజర్ పంచాయతీలు, మున్సిపల్ నోటిఫైడ్ ప్రాంతాల్లోకి వచ్చేవి, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో కలిసే పంచాయతీలను మరో విభాగంగా, మైనర్ పంచాయతీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో కలుస్తున్న మైనర్ పంచాయతీలను మరో విభాగంగా కట్టడాలకు మార్కెట్ విలువలను నిర్ధారించారు.
భవనాలను కొనుగోలు చేసేవారు ఆ కట్టడాల విలువ, భూమి విలువకు కలిపి రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో చదరపు అడుగు మార్కెట్ విలువ రూ.5 వేలు ఉందనుకుంటే 200 చదరపు అడుగుల స్థలం విలువ రూ.10 లక్షలు అవుతుంది. అడుగు కట్టడం విలువ రూ.1,100 ప్రకారం 200 చదరపు అడుగుల కట్టడం విలువ రూ.11 లక్షలు అవుతుంది. ఈ రెండింటినీ కలిపి మొత్తం భవనం విలువ రూ.21 లక్షలు అవుతుంది. దీనిని కొనుగోలు చేసిన వారు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రూ.21 లక్షలపై 5 శాతం స్టాంప్ డ్యూటీ, 1.5 శాతం బదిలీ సుంకం, 1 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి మొత్తం 7.5 శాతం రిజిస్ట్రేషన్ రుసుముల కింద చెల్లించాల్సి ఉంటుంది.
నిర్మాణాలు పూర్తికాకుండా వివిధ దశల్లో ఉన్న వాటికి ఈ ధరల్లో కొన్ని విభాగాలు పెట్టారు. ఫౌండేషన్ స్థాయిలో ఉన్న కట్టడాలకు ఇందులో 25 శాతం, శ్లాబ్ లెవల్ వరకూ ఉన్న వాటికి 65 శాతం, పూర్తికావడానికి సిద్ధంగా ఉన్న వాటికి 85 శాతం ధర నిర్ణయిస్తారు. అలాగే పదేళ్లలోపు నిర్మించిన వాటికి ఎలాంటి తరుగుదల ఉండదు. పదేళ్ల కంటే ముందు నిర్మించిన ఇళ్లకు ఏడాదికి ఒక శాతం చొప్పున తరుగుదల వేస్తారు. ఇది గరిష్టంగా 70 శాతం వరకూ ఉండవచ్చు.
స్థిరాస్తులకు కొత్త రేట్లు
Published Thu, Aug 1 2019 3:57 AM | Last Updated on Thu, Aug 1 2019 8:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment