రియల్ ‘భూమ్’
- ఊపందుకుంటున్న క్రయ విక్రయాలు
- రియల్ ఎస్టేట్ వెంచర్లు కళకళ
- నిలకడగా భూముల ధరలు
- పెరుగుతున్న రిజిస్ట్రేషన్‌శాఖ ఆదాయం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో మళ్లీ స్థిరాస్తి రంగంపై ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర విభజనతో స్తబ్ధతగా మారిన ఈ రంగం మళ్లీ పుంజుకుంటోంది. భూములు, ప్లాట్ల క్రయ విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈనెల మొదటి వారంలో ఒకేసారి దస్తావేజుల నమోదు సంఖ్య పెరిగింది. దీంతో నగరంతో పాటు శివారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటికిట లాడుతున్నాయి. మొన్నటి వరకు రాష్ట్ర విభజనతో స్థానికేతరులు ఇక్కడ స్థిరాస్తులు కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో లావాదేవీలు తగ్గాయి. తెలంగాణేతరులు స్థిరాస్తులు, భూముల ధరలపై ఆందోళన చెందినప్పటికీ భూముల ధరలు, విలువలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు.
పెరుగుతున్న రిజిస్ట్రేషన్లు..
తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం స్థిరాస్తి దస్తావేజుల నమోదు సంఖ్య పెరిగి రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం కూడా పెరిగింది. గ్రేటర్ పరిధిలో రెండు నెలల్లో సుమారు 20 వేలకు పైగా స్థిరాస్తి దస్తావేజులు నమోదు కావడం గమనార్హం. దీంతో విభజన వల్ల 40 శాతానికి పడిపోయిన నెలసరి ఆదాయ లక్ష్య సాధన 65 నుంచి 70 శాతానికి చేరింది.
ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల్లో హైదరాబాద్ జిల్లాలో రూ.155.76 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.370.27 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ శాఖకు సమకూరింది. అందులో రాష్ట్ర ఆవతరణ అనంతరం లభించిన ఆదాయాన్ని పరిశీలిస్తే.. రెండు నెలలో హైదరాబాద్ జిల్లాలో రూ.83.71 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.191.62 కోట్ల ఆదాయం వచ్చింది. గత నెలలో హైదరాబాద్ డీఆర్ పరిధిలోని బంజారాహిల్స్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 493 దస్తావేజులు నమోదు కాగా అందులో 167 అమ్మకం దస్తావేజులు, ఆజంపురం ఎస్‌ఆర్ పరిధిలో 482 దస్తావేజులు నమోదు కాగా,అందులో 173 అమ్మకం దస్తావేజులు ఉన్నాయి.
చిక్కడపల్లి సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 445 దస్తావేజులు నమోదు కాగా, అందులో 157 అమ్మకం దస్తావేజులు, ఆర్‌ఓ హైదరాబాద్ (రెడ్‌హిల్స్) పరిధిలో నమోదైన 448 దస్తావేజుల్లో 168 అమ్మకం దస్తావేజులు ఉన్నట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల మొదటి వారంలో శివారు సబ్‌రిజిస్ట్రార్ పరిధిల్లో స్థిరాస్తుల దస్తావేజుల సంఖ్య మరింత పెరిగాయి. ఇదిలా ఉండగా, మహానగర శివారులో రియల్ ఎస్టేట్ వెంచర్లు తిరిగి పుంజుకున్నాయి. దీంతో పాటు రియల్ ఎస్టేట్ వెంచర్లకు వాహనాలు సమకూర్చే ట్రావెల్స్ ఏజెన్సీల వ్యాపారం కూడా పెరిగింది.