State Separation
-
రాష్ట్ర విభజనతో మాదిగలకు అన్యాయం
– ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య విస్సన్నపేట : రాష్ట్ర విభజనతో మాదిగలకు అన్యాయం జరిగిందని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ అన్నారు. స్థానిక లయన్స్ క్లబ్ ప్రాంగణంలో ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి మేశపాం కృష్ణచైతన్య అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మాదిగలకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు విస్మరించారని, ఎస్సీ వర్గీకరణ గురించి పట్టించుకోకపోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. వెంటనే ఎస్సీ వర్గీకరణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లెడ్క్యాప్ బోర్డు ఏర్పాటుచేసి మాదిగల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో లెదర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీని నెలకొల్పాలని, ఇందుకోసం 500 ఎకరాలు కేటాయించాలని కోరారు. సంక్షేమ పథకాలకు వయోపరిమితిని ఎత్తివేయాలని, జన్మభూమి కమిటీలు రద్దు చేయాలన్నారు. అక్టోబర్ 6 నుంచి ‘మన మాదిగ పల్లెలు’ అనే కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పర్యటించి డిసెంబర్ 6వ తేదీన ఒంగోలులో ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం.నాగేశ్వరరావు, కంచర్ల సుధాకర్, మోదుగు నాగేశ్వరరావు, జిల్లా కో–కన్వీనర్ ముల్లగిరి రాణి పాల్గొన్నారు. -
తెలుగు జాతి క్షమించదు
రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీని మాటవరసకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అడగక పోవడం దురదృష్టకరమని జన చైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో తిరుపతి సభలో 10 సంవత్సరాలు ప్రత్యేక హాదా హామీ ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ తో చేతులు కలిపి తెలుగు జాతిని విచ్ఛిన్నం చేసిందని.. తెలుగు జాతి వారిని ఎన్నడూ క్షమించదని అన్నారు. ప్రజల్లో మతాచారాలను, భావోద్వేగాలను రెచ్చగొట్టి.. మట్టి, నీరు తెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణంలో పంటల విధ్వంసం, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రధాని ప్రశ్నించక పోవడం అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమానికి ఎంత ప్రజాధనాన్ని వెచ్చించారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
బెజవాడకు తరలిన ఆక్టోపస్!
తిరుపతిలో నెలకొల్పాల్సిన ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడలో ప్రధాన కార్యాలయ భవనం, అడిషనల్ డీజీపీ క్యాంపు కార్యాలయం నిర్మాణానికి రూ.4.29 కోట్లను మంజూరు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి బి.ప్రసాదరావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికను తుంగలో తొక్కుతూ తిరుపతిలో ఏర్పాటుచేయాల్సిన ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలను అణచివేయడం.. నిరోధించడం.. తిప్పికొట్టడం కోసం వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు హైదరాబాద్ కేంద్రంగా అక్టోబరు 1, 2007న ఆక్టోపస్‌ను ఏర్పాటుచేశారు. పోలీసుశాఖలో పనిచేసే 500 మంది మెరికల్లాంటి అధికారులను ఎంపిక చేసి.. వారికి కమెండో శిక్షణ ఇప్పించారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందన్న కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సూచనల మేరకు తిరుమల శ్రీవెంకటేశ్వరుని ఆలయానికి 90 మంది సభ్యులున్న ఆక్టోపస్ దళం భద్రత కల్పిస్తోన్న విషయం విదితమే. రాష్ట్ర విభజన నేపథ్యం లో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేసే ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని తిరుపతిలో నెలకొల్పాలని ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్ఐఏ ప్రభుత్వానికి సూచిం చాయి. ఈ నివేదికలపై ఆమోదముద్ర వేసిన ప్రభుత్వం.. తిరుపతిలో ఆక్టోపస్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఆ మేరకు రేణిగుంట సమీపంలో 400 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూములను పరిశీలించిన ఉన్నతాధికారుల బృందం.. అక్కడ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేసేం దుకు అంగీకరిస్తూ జూలై నెలాఖరులో ప్రభుత్వానికి ఇచ్చారు. కానీ.. ఇప్పుడు ప్రభుత్వం మాట మార్చుతోంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే రాజధానిని ఏర్పాటుచేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలు కూడా అక్కడే ఏర్పాటుచేయాలని నిశ్చయించింది. ఈ క్రమంలోనే ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని కూడా విజయవాడలోనే నెలకొల్పాలని నిర్ణయించింది. విజయవాడలో కార్యాలయం, కమెండో బృందాలకు వసతి, అడిషనల్ డీజీపీ క్యాంపు కార్యాలయాన్ని యుద్ధప్రాతిపదికన నిర్మించడం కోసం రూ.4.29 కోట్లను మంజూరు చేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని తిరుపతి నుంచి విజయవాడకు తరలించడంపై నిఘా వర్గాలే తప్పుపడుతున్నాయి. గత ఏడాది బ్రహ్మోత్సవాల నేపథ్యంలో దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. అక్టోబరు 6, 2013న పుత్తూరులో ఓ ఇంట్లో ఇస్లామిక్ లిబరేషన్ ఫ్రంట్(ఐఎల్ఎఫ్) తీవ్రవాద విభాగానికి చెందిన ఫకృద్దీన్, ఇస్మాయిల్ పన్నా, బిలాల్ మాలిక్ తిష్ట వేశారు. ఇందులో ఇస్మాయిల్ పన్నా బెంగళూరులో బీజేపీ కార్యాలయంపై చేసిన దాడిలో ప్రధాన భూమిక పోషిస్తే.. తమిళనాడులో సేలంలో బీజేపీ నేత రమేష్ హత్య కేసులో బిలాల్ మాలిక్ ప్రధాన నిందితుడు. ఫకృద్దీన్ ఐఎల్ఎఫ్ తీవ్రవాద సంస్థ అధినేత. ఈ ముగ్గురూ కలిసి తిరుమలలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళిక రచించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఎన్ఐఏ సూచనల మేరకు రంగంలోకి దిగిన ఆక్టోపస్ బృందం పుత్తూరులో తీవ్రవాదులు మకాం వేసిన ఇంటిపై దాడిచేసి అదుపులోకి తీసుకుంది. తీవ్రవాదులపై ఆక్టోపస్ దాడి చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇటీవల తిరుపతిలో ఉగ్రవాదులు స్థావరం ఏర్పాటుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఎన్ఐఏ తనిఖీలు చేయడం గమనార్హం. వీటిని ఉదహరిస్తోన్న నిఘా సంస్థల అధికారులు.. ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటుచేస్తే ఉగ్రవాదుల కదలికలకు చెక్ పెట్టవచ్చునని స్పష్టీకరిస్తున్నారు. రేణిగుంటలో ఆక్టోపస్ ప్రధాన కార్యాలయం, క్యాంపస్, క్వార్టర్స్‌కు కేటాయించిన భూములు.. విమానాశ్రయానికి అతి సమీపంలో ఉండడం వల్ల రాష్ట్రంలో ఎక్కడ తీవ్రవాదుల కదలికలు కన్పించినా నిముషాల్లో అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుందని వారు విశ్లేషిస్తున్నారు. కానీ.. ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటుచేసేందుకు వడివడిగా అడుగులు వేస్తుండడం గమనార్హం. -
మన దూరదర్శన్ వచ్చేస్తోంది
ఈ నెలాఖరులో లేదా అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం విజయవాడ నుంచే 24 గంటల ప్రసారాలు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు 13 జిల్లాల కార్యక్రమాలకే ప్రాధాన్యం సాక్షి, విజయవాడ : విజయవాడ కేంద్రంగా దూరదర్శన్ పూర్తిస్థాయి ప్రసారాలకు శ్రీకారం చుడుతోంది. ఇక్కడ నుంచి 24 గంటలూ దూరదర్శన్ కార్యక్రమాలను ప్రసారం చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో కేవలం రెండు గంటల కార్యక్రమాలను మాత్రమే ఇక్కడ నుంచి ప్రసారం చేసేవారు. మిగిలిన కార్యక్రమాలను హైదరాబాద్ కేంద్రంగా ప్రసారం చేసేవారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో దూరదర్శన్ను కూడా ప్రత్యేకంగా కేటాయించాలని ప్రసారభారతికి పలువురు విన్నవించారు. ఈ క్రమంలో దూరదర్శన్ విభజనకు కేంద్ర ప్రభుత్వం జూలైలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మరో పక్షం రోజుల్లో పూర్తి స్థాయిలో విడిపోవడానికి రంగం సిద్ధమైంది. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ దూరదర్శన్ ప్రసారాలను ఈ నెలాఖరులో గానీ, వచ్చే నెల మొదటి వారంలో గానీ ప్రారంభిస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేవకర్ కూడా ప్రకటించారు. శరవేగంగా పనులు విజయవాడ కేంద్రంగా 24 గంటలూ కార్యక్రమాలను ప్రసారం చేయడానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి విడిపోయిన తరువాత ఇక్కడ స్వయంగా ప్రసారాలు చేసుకోవాలంటే కనీసం ఆరు నెలల వ్యవధి పడుతుందని స్థానిక అధికారులు భావించారు. అయితే ఢిల్లీ నుంచి అత్యాధునిక సాంకేతిక పరికరాలు దిగుమతి చేసుకుని ఇక్కడి ఇంజినీర్లు కావాల్సిన ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. స్క్రిప్టు రైటర్లు, కెమెరామెన్లు, యాంకర్లు వంటి వారిని తాత్కాలిక పద్ధతిలో నియమిస్తున్నారు. రోజుకు రెండుసార్లు వార్తలు ప్రసారం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఉన్న స్టూడియోను ఆధునికీకరిస్తున్నారు. వార్తలను రికార్డింగ్ చేయడానికి అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం గల పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటి వార్తలు అప్పుడు సేకరించి పంపేందుకు వీలుగా ఓబీ వ్యాన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేటు చానల్స్ కంటే అత్యాధుని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారని, ఇప్పుడు ఉపయోగించే టెక్నాలజీ మరో 30 ఏళ్ల వరకు సరిపోతుందని ఇక్కడి సిబ్బంది భావిస్తున్నారు. స్థానికతకే ప్రాధాన్యత ఇక నుంచి దూరదర్శన్ ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలోని 13 జిల్లాల వార్తలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. గతంలో చార్మినార్, మ్యూజియాలు చూస్తే ఇక నుంచి ప్రకాశం బ్యారేజీ అందాలు, సూర్యలంక బీచ్ సొగసులు విశాఖ, అరకు సోయగాలు ప్రసారం చేస్తారు. విజయవాడ కేంద్రంగానే 13 జిల్లాలకు చెందిన సాంస్కృతిక, ఆధ్మాత్మిక, వ్యవసాయ తదితర కార్యక్రమాల ప్రసారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ 13 జిల్లాలో పండే పంటలు, వాటిల్లో రైతులు పడే ఇబ్బందులు, తీసుకోవాలని జాగ్రత్తలు తదితర కార్యక్రమాలను దూరదర్శన్ అధికారులు రూపొందిస్తారు. వాస్తవంగా దూరదర్శన్ ఏయే కార్యక్రమాలు ప్రసారం చేయాలనే అంశంపై ఢిల్లీలోనే నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, వాటికి స్థానికతను జోడించడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు చేరువ కావాలని ఇక్కడి అధికారులు యోచిస్తున్నారు. -
రియల్ ‘భూమ్’
ఊపందుకుంటున్న క్రయ విక్రయాలు రియల్ ఎస్టేట్ వెంచర్లు కళకళ నిలకడగా భూముల ధరలు పెరుగుతున్న రిజిస్ట్రేషన్‌శాఖ ఆదాయం హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో మళ్లీ స్థిరాస్తి రంగంపై ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర విభజనతో స్తబ్ధతగా మారిన ఈ రంగం మళ్లీ పుంజుకుంటోంది. భూములు, ప్లాట్ల క్రయ విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈనెల మొదటి వారంలో ఒకేసారి దస్తావేజుల నమోదు సంఖ్య పెరిగింది. దీంతో నగరంతో పాటు శివారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటికిట లాడుతున్నాయి. మొన్నటి వరకు రాష్ట్ర విభజనతో స్థానికేతరులు ఇక్కడ స్థిరాస్తులు కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో లావాదేవీలు తగ్గాయి. తెలంగాణేతరులు స్థిరాస్తులు, భూముల ధరలపై ఆందోళన చెందినప్పటికీ భూముల ధరలు, విలువలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. పెరుగుతున్న రిజిస్ట్రేషన్లు.. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం స్థిరాస్తి దస్తావేజుల నమోదు సంఖ్య పెరిగి రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం కూడా పెరిగింది. గ్రేటర్ పరిధిలో రెండు నెలల్లో సుమారు 20 వేలకు పైగా స్థిరాస్తి దస్తావేజులు నమోదు కావడం గమనార్హం. దీంతో విభజన వల్ల 40 శాతానికి పడిపోయిన నెలసరి ఆదాయ లక్ష్య సాధన 65 నుంచి 70 శాతానికి చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల్లో హైదరాబాద్ జిల్లాలో రూ.155.76 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.370.27 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ శాఖకు సమకూరింది. అందులో రాష్ట్ర ఆవతరణ అనంతరం లభించిన ఆదాయాన్ని పరిశీలిస్తే.. రెండు నెలలో హైదరాబాద్ జిల్లాలో రూ.83.71 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.191.62 కోట్ల ఆదాయం వచ్చింది. గత నెలలో హైదరాబాద్ డీఆర్ పరిధిలోని బంజారాహిల్స్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 493 దస్తావేజులు నమోదు కాగా అందులో 167 అమ్మకం దస్తావేజులు, ఆజంపురం ఎస్ఆర్ పరిధిలో 482 దస్తావేజులు నమోదు కాగా,అందులో 173 అమ్మకం దస్తావేజులు ఉన్నాయి. చిక్కడపల్లి సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 445 దస్తావేజులు నమోదు కాగా, అందులో 157 అమ్మకం దస్తావేజులు, ఆర్ఓ హైదరాబాద్ (రెడ్‌హిల్స్) పరిధిలో నమోదైన 448 దస్తావేజుల్లో 168 అమ్మకం దస్తావేజులు ఉన్నట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల మొదటి వారంలో శివారు సబ్‌రిజిస్ట్రార్ పరిధిల్లో స్థిరాస్తుల దస్తావేజుల సంఖ్య మరింత పెరిగాయి. ఇదిలా ఉండగా, మహానగర శివారులో రియల్ ఎస్టేట్ వెంచర్లు తిరిగి పుంజుకున్నాయి. దీంతో పాటు రియల్ ఎస్టేట్ వెంచర్లకు వాహనాలు సమకూర్చే ట్రావెల్స్ ఏజెన్సీల వ్యాపారం కూడా పెరిగింది. -
రాష్ట్ర విభజన అనివార్యం : జేసీ దివాకర్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనివార్యం అని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా తాడిపత్రి కాంగ్రెస్ శాసనసభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతానికి విభజన జరిగిపోయినట్లేనని, దీనిని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మాత్రమే ఆపగలరన్నారు. సీమాంధ్ర నేతల ప్రయత్నాలు వృధా ప్రయాస అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచడం అనేది ఒక్క సోనియా చేతిలోనే ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని విడగొడితే సీమాంధ్ర కాంగ్రెస్ తీవ్రంగా నష్ట పోతుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనని జెసి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అధిష్టానం రాయల తెలంగాణ విషయం కూడా ఆలోచించడంలేదని ఆయన బాధపడ్డారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం తీసుకున్న నిర్ణయాన్ని అప్పుడే ఆయన తప్పుపట్టారు.