బెజవాడకు తరలిన ఆక్టోపస్!
తిరుపతిలో నెలకొల్పాల్సిన ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడలో ప్రధాన కార్యాలయ భవనం, అడిషనల్ డీజీపీ క్యాంపు కార్యాలయం నిర్మాణానికి రూ.4.29 కోట్లను మంజూరు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి బి.ప్రసాదరావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికను తుంగలో తొక్కుతూ తిరుపతిలో ఏర్పాటుచేయాల్సిన ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలను అణచివేయడం.. నిరోధించడం.. తిప్పికొట్టడం కోసం వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు హైదరాబాద్ కేంద్రంగా అక్టోబరు 1, 2007న ఆక్టోపస్‌ను ఏర్పాటుచేశారు. పోలీసుశాఖలో పనిచేసే 500 మంది మెరికల్లాంటి అధికారులను ఎంపిక చేసి.. వారికి కమెండో శిక్షణ ఇప్పించారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందన్న కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సూచనల మేరకు తిరుమల శ్రీవెంకటేశ్వరుని ఆలయానికి 90 మంది సభ్యులున్న ఆక్టోపస్ దళం భద్రత కల్పిస్తోన్న విషయం విదితమే.
రాష్ట్ర విభజన నేపథ్యం లో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేసే ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని తిరుపతిలో నెలకొల్పాలని ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్‌ఐఏ ప్రభుత్వానికి సూచిం చాయి. ఈ నివేదికలపై ఆమోదముద్ర వేసిన ప్రభుత్వం.. తిరుపతిలో ఆక్టోపస్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఆ మేరకు రేణిగుంట సమీపంలో 400 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూములను పరిశీలించిన ఉన్నతాధికారుల బృందం.. అక్కడ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేసేం దుకు అంగీకరిస్తూ జూలై నెలాఖరులో ప్రభుత్వానికి ఇచ్చారు. కానీ.. ఇప్పుడు ప్రభుత్వం మాట మార్చుతోంది.
విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే రాజధానిని ఏర్పాటుచేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలు కూడా అక్కడే ఏర్పాటుచేయాలని నిశ్చయించింది. ఈ క్రమంలోనే ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని కూడా విజయవాడలోనే నెలకొల్పాలని నిర్ణయించింది. విజయవాడలో కార్యాలయం, కమెండో బృందాలకు వసతి, అడిషనల్ డీజీపీ క్యాంపు కార్యాలయాన్ని యుద్ధప్రాతిపదికన నిర్మించడం కోసం రూ.4.29 కోట్లను మంజూరు చేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని తిరుపతి నుంచి విజయవాడకు తరలించడంపై నిఘా వర్గాలే తప్పుపడుతున్నాయి. గత ఏడాది బ్రహ్మోత్సవాల నేపథ్యంలో దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. అక్టోబరు 6, 2013న పుత్తూరులో ఓ ఇంట్లో ఇస్లామిక్ లిబరేషన్ ఫ్రంట్(ఐఎల్‌ఎఫ్) తీవ్రవాద విభాగానికి చెందిన ఫకృద్దీన్, ఇస్మాయిల్ పన్నా, బిలాల్ మాలిక్ తిష్ట వేశారు. ఇందులో ఇస్మాయిల్ పన్నా బెంగళూరులో బీజేపీ కార్యాలయంపై చేసిన దాడిలో ప్రధాన భూమిక పోషిస్తే.. తమిళనాడులో సేలంలో బీజేపీ నేత రమేష్ హత్య కేసులో బిలాల్ మాలిక్ ప్రధాన నిందితుడు. ఫకృద్దీన్ ఐఎల్‌ఎఫ్ తీవ్రవాద సంస్థ అధినేత.
ఈ ముగ్గురూ కలిసి తిరుమలలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళిక రచించినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఎన్‌ఐఏ సూచనల మేరకు రంగంలోకి దిగిన ఆక్టోపస్ బృందం పుత్తూరులో తీవ్రవాదులు మకాం వేసిన ఇంటిపై దాడిచేసి అదుపులోకి తీసుకుంది. తీవ్రవాదులపై ఆక్టోపస్ దాడి చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇటీవల తిరుపతిలో ఉగ్రవాదులు స్థావరం ఏర్పాటుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఎన్‌ఐఏ తనిఖీలు చేయడం గమనార్హం. వీటిని ఉదహరిస్తోన్న నిఘా సంస్థల అధికారులు.. ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటుచేస్తే ఉగ్రవాదుల కదలికలకు చెక్ పెట్టవచ్చునని స్పష్టీకరిస్తున్నారు.
రేణిగుంటలో ఆక్టోపస్ ప్రధాన కార్యాలయం, క్యాంపస్, క్వార్టర్స్‌కు కేటాయించిన భూములు.. విమానాశ్రయానికి అతి సమీపంలో ఉండడం వల్ల రాష్ట్రంలో ఎక్కడ తీవ్రవాదుల కదలికలు కన్పించినా నిముషాల్లో అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుందని వారు విశ్లేషిస్తున్నారు. కానీ.. ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటుచేసేందుకు వడివడిగా అడుగులు వేస్తుండడం గమనార్హం.