మన దూరదర్శన్ వచ్చేస్తోంది
- ఈ నెలాఖరులో లేదా అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం
- విజయవాడ నుంచే 24 గంటల ప్రసారాలు
- యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు
- 13 జిల్లాల కార్యక్రమాలకే ప్రాధాన్యం
సాక్షి, విజయవాడ : విజయవాడ కేంద్రంగా దూరదర్శన్ పూర్తిస్థాయి ప్రసారాలకు శ్రీకారం చుడుతోంది. ఇక్కడ నుంచి 24 గంటలూ దూరదర్శన్ కార్యక్రమాలను ప్రసారం చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో కేవలం రెండు గంటల కార్యక్రమాలను మాత్రమే ఇక్కడ నుంచి ప్రసారం చేసేవారు. మిగిలిన కార్యక్రమాలను హైదరాబాద్ కేంద్రంగా ప్రసారం చేసేవారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో దూరదర్శన్‌ను కూడా ప్రత్యేకంగా కేటాయించాలని ప్రసారభారతికి పలువురు విన్నవించారు. ఈ క్రమంలో దూరదర్శన్ విభజనకు కేంద్ర ప్రభుత్వం జూలైలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మరో పక్షం రోజుల్లో పూర్తి స్థాయిలో విడిపోవడానికి రంగం సిద్ధమైంది. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ దూరదర్శన్ ప్రసారాలను ఈ నెలాఖరులో గానీ, వచ్చే నెల మొదటి వారంలో గానీ ప్రారంభిస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేవకర్ కూడా ప్రకటించారు.
శరవేగంగా పనులు
విజయవాడ కేంద్రంగా 24 గంటలూ కార్యక్రమాలను ప్రసారం చేయడానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి విడిపోయిన తరువాత ఇక్కడ స్వయంగా ప్రసారాలు చేసుకోవాలంటే కనీసం ఆరు నెలల వ్యవధి పడుతుందని స్థానిక అధికారులు భావించారు. అయితే ఢిల్లీ నుంచి అత్యాధునిక సాంకేతిక పరికరాలు దిగుమతి చేసుకుని ఇక్కడి ఇంజినీర్లు కావాల్సిన ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు.
స్క్రిప్టు రైటర్లు, కెమెరామెన్లు, యాంకర్లు వంటి వారిని తాత్కాలిక పద్ధతిలో నియమిస్తున్నారు. రోజుకు రెండుసార్లు వార్తలు ప్రసారం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఉన్న స్టూడియోను ఆధునికీకరిస్తున్నారు. వార్తలను రికార్డింగ్ చేయడానికి అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం గల పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటి వార్తలు అప్పుడు సేకరించి పంపేందుకు వీలుగా ఓబీ వ్యాన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేటు చానల్స్ కంటే అత్యాధుని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారని, ఇప్పుడు ఉపయోగించే టెక్నాలజీ మరో 30 ఏళ్ల వరకు సరిపోతుందని ఇక్కడి సిబ్బంది భావిస్తున్నారు.
స్థానికతకే ప్రాధాన్యత
ఇక నుంచి దూరదర్శన్ ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలోని 13 జిల్లాల వార్తలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. గతంలో చార్మినార్, మ్యూజియాలు చూస్తే ఇక నుంచి ప్రకాశం బ్యారేజీ అందాలు, సూర్యలంక బీచ్ సొగసులు విశాఖ, అరకు సోయగాలు ప్రసారం చేస్తారు. విజయవాడ కేంద్రంగానే 13 జిల్లాలకు చెందిన సాంస్కృతిక, ఆధ్మాత్మిక, వ్యవసాయ తదితర కార్యక్రమాల ప్రసారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది.
ముఖ్యంగా ఈ 13 జిల్లాలో పండే పంటలు, వాటిల్లో రైతులు పడే ఇబ్బందులు, తీసుకోవాలని జాగ్రత్తలు తదితర కార్యక్రమాలను దూరదర్శన్ అధికారులు రూపొందిస్తారు. వాస్తవంగా దూరదర్శన్ ఏయే కార్యక్రమాలు ప్రసారం చేయాలనే అంశంపై ఢిల్లీలోనే నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, వాటికి స్థానికతను జోడించడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు చేరువ కావాలని ఇక్కడి అధికారులు యోచిస్తున్నారు.