broadcast
-
ఈటింగ్ ఛాలెంజ్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్ మృతి..అంత ప్రమాదమా?
సోషల్ మీడియాలో ఇటీవల పలు ఫిట్నెస్ ఛాలెంజ్‌లు, డేరింగ్ ఛాలెంజ్‌లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. సెలబ్రెటీల దగ్గర నుంచి సాధారణ వ్యక్తులు వరకు ప్రతిఒక్కరూ వాటిని చేసి చూపిస్తూ మరొకరికి ఛాలెంజ్ విసరడం వంటివి చేస్తారు. మొదట ఐస్ కూలింగ్ బకెట్ ఛాలెంజ్ అంటూ మొదలై అలా పలు రకాలు వచ్చాయి. అయితే వాటిలో కొన్ని ఫిట్నెస్ పరంగానూ ఆరోగ్యపరంగానూ మంచివి అయితే ఎలాంటి సమస్య ఉండదు. కొన్ని ప్రమాదకర స్టంట్లే లేనిపోని సమస్యలు తెచ్చిపెడతాయి. అలాంటి రిస్కీ ఛాలెంజ్ ఫేస్ చేసి ప్రాణాలు కోల్పోయింది ఓ ఇన్ఫ్లుయెన్సర్. ఏంటా ఛాలెంజ్? అంత డేంజరా అంటే..?చైనాలోని పాన్ జియోటింగ్ అనే ఇన్ఫ్లుయెన్సర్కి ఆన్‌లైన ఛాలెంజ్‌లను తీసుకోవడం అంటే మహా సరదా. అలాంటివి ఎన్నో ఛాలెంజ్‌లు తీసుకుంది. అలానే ఇటీవల ఆమె ఈటింగ్ ఛాలెంజ్ తీసుకుంది. దీన్ని లైవ్‌లో చేస్తూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఛాలెంజ్‌లో జియోటింగ్ పదిగంటలకు పైగా ఎక్కువసేపు తినవలసి ఉంటుంది. ఇది కాస్త ఇబ్బందికరమైనది వద్దు అని ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు హెచ్చరించినా..పది కిలోలకు పైగా ఆహారాన్ని తినేందుకు ఉపక్రమించింది. ఒక దశలో ఆమె శరీరం హెవీ ఫుడ్‌ని తట్టుకోలేకపోవడంతో చివరికీ ఆమె మరణానికి దారితీసింది. అంతేగాదు పోస్ట్‌మార్టం రిపోర్టులో డా ఆమె కడుపు వైకల్యంతో మరణించిందని రావడం గమనార్హం. ఆమె కడుపులో జీర్ణకానీ ఆహారం పెద్ద మొత్తంలో పేరుకుపోవడంతో మరణించిందని పోస్టమార్టం రిపోర్టులో తేలింది. అతిగా తినడం ఇంత ప్రమాదకరమైనదా అంటే..కొంతమంది రుచిలో మైమరిచి బాగా లాగించేస్తుంటారు. అలాగే అతని బ్రెయిన్ సైతం నచ్చిన ఫుడ్‌ని చూసి బాగా తినేలా ప్రేరేపించేస్తుంది. దీంతో కంట్రోల్ లేకుండా తింటాం. ఇలాంటప్పుడూ వెంటనే భయానక సమస్యలు రావుగానీ. పనిగట్టుకుని ఇలా పెద్ద మొత్తంలో ఆహారం తీసుకుంటే మాత్రం ప్రాణాల మీదకు వస్తుందని అంటున్నారు నిపుణులు. ఇలా అతిగా పెద్ద మొత్తంలో పొట్టలోకి ఆహారాన్ని పంపిస్తారో అప్పుడూ గ్యాస్ట్రిక్, ఆమ్లత్వం, కడుపునొప్పి, ఉబ్బరం, గుండెల్లో మంట వంటివి ఎదురవ్వుతాయి.అదీగాక జీర్ణశయం కూడా అంత మొత్తంలోని ఆహారాలను జీర్ణించుకోలేకపోతుంది. పైగా ఆ ఆహారం కొవ్వుగా మారుతుంది. ఇది ఊబకాయం లేదా అధిక బరువు వంటి వాటికి దారితీసి, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. పెద్ద మొత్తంలో తినాలన్నా ఆత్రుతలో సరిగా నమలితినం. దీంతో ఆహారం సాఫీగా జీర్ణం గాక పొట్ట బరువై ఉక్కిరిబిక్కరిగా అయిపోయి ప్రాణాలు కోల్పోతారని చెబుతున్నారు నిపుణులు. ఆహారం విషయంలో మనసుపెట్టి బాగా నమిలి ఆస్వాదిస్తూ మితంగా తీసుకోవడమే మంచిదని లేదంటే లేనిపోని అనర్థాలకు దారితీసే ప్రమాదం ఉందని అంటున్నారు నిపుణులు. అంతేగా ఫుడ్ ఛాలెంజ్‌ల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం అని సూచిస్తున్నారు.(చదవండి: ఇదేం వింత చట్టం! భార్య పుట్టినరోజు మర్చిపోవడమే నేరమా..!) -
హైకోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులోని 29 కోర్టు హాళ్లలో విచారణల ప్రత్యక్ష ప్రసారాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే సోమవారం ప్రారంభించారు. ఉదయం 10.15 గంటలకు హైకోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రత్యక్ష ప్రసార సేవలను ప్రారంభించి.. న్యాయవాదులకు, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత 10.30 గంటల నుంచి కోర్టుల విచారణలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. ప్రత్యక్ష ప్రసారాలతో న్యాయ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువవుతుందని సీజే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. లింక్ క్లిక్ చేస్తే... హైకోర్టు అధికారిక వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించిన లింక్ ఇచ్చారు. ఈ లింక్ ద్వారా కోర్టును ఎంపిక చేసుకుని ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించవచ్చు. ఫస్ట్ కోర్టు విచారణ ప్రత్యక్ష ప్రసారం ఇప్పటికే అందుబాటులో ఉంది. కరోనా సమయంలో ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగగా, ఆ తర్వాత హైబ్రిడ్ విధానంలో విచారణ చేపడుతున్నారు. 2020లో ప్రత్యక్ష ప్రసారాలను అందుబాటులోకి తెచ్చిన గుజరాత్ హైకోర్టు, ఆ తర్వాత యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించింది. కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, కోల్‌కతా, ఛత్తీస్గడ్ హైకోర్టులు కూడా ప్రత్యక్ష ప్రసారాలు, యూట్యూబ్ చానల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ప్రత్యక్ష ప్రసారాలతో పారదర్శకత పెరుగుతుందని న్యాయ నిపుణులు పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, హైకోర్టు, కిందికోర్టుల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతూ 2022లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) కూడా దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన నాటి సీజే ధర్మాసనం.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రత్యక్ష ప్రసారాలకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోభాగంగా ప్రసారాలకు కావాల్సిన మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కలి్పంచింది. -
స్వదేశంలో టీమిండియా ఆడే మ్యాచ్‌లు ఇవే.. ఇంగ్లండ్, ఆసీస్లతోనే అధికం
రానున్న బ్రాడ్కాస్ట్ సైకిల్లో (సెప్టెంబర్ 2023-మార్చి 2028, ఐదేళ్లు) టీమిండియా స్వదేశంలో 88 మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలుస్తుంది. ఇందులో దాదాపు సగం మ్యాచ్‌లు (39) ఇంగ్లండ్, ఆసీస్లతోనే జరుగుతాయని ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్‌బజ్ వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో మొదలయ్యే ఈ సైకిల్ 2028 మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో ముగుస్తుంది. కాగా, రానున్న బ్రాడ్కాస్ట్ సైకిల్లో మీడియా హక్కుల కోసం బీసీసీఐ ఇటీవలే టెండర్లకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 25 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి పేర్కొంది. ఆసక్తిగల మీడియా సంస్థలు 15 లక్షల నాన్ రీఫండబుల్ ఫీజ్ చెల్లించాలని తెలిపింది. సెప్టెంబర్ 2023-మార్చి 2028 మధ్యలో స్వదేశంలో టీమిండియా ఆడబోయే సిరీస్‌ల వివరాలు.. 2023 సెప్టెంబర్: ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ 2023 నవంబర్: ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2024 జనవరి: ఆఫ్ఘనిస్తాన్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2024 జనవరి-మార్చి: ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 2024 సెప్టెంబర్-అక్టోబర్: బంగ్లాదేశ్‌తో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2024 అక్టోబర్-నవంబర్: న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 2025 జనవరి-ఫిబ్రవరి: ఇంగ్లండ్‌తో 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2025 అక్టోబర్: విండీస్‌తో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 2025 నవంబర్-డిసెంబర్: సౌతాఫ్రికాతో 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2026 జనవరి: న్యూజిలాండ్‌తో 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2026 జూన్: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ 2026 సెప్టెంబర్-అక్టోబర్: విండీస్‌తో 3 వన్డేలు, 5 టీ20లు 2026 డిసెంబర్: శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20లు 2027 జనవరి-మార్చి: ఆస్ట్రేలియాతో 5 టెస్ట్‌లు 2027 నవంబర్-డిసెంబర్: ఆస్ట్రేలియాతో 3 వన్డేలు, 5 టీ20లు 2028 జనవరి-మార్చి: ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ -
ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాల ప్రసారంపై నిషేధం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లేలా, పౌరుల మధ్య విద్వేషం పెంచేలా ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాల ప్రసారం వెంటనే ఆపేయాలని టీవీ చానళ్లను దేశ ఎలక్ట్రానిక్ మీడియా, రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్ఏ) ఆదేశించింది. వీటిని ఉల్లంఘిస్తే షోకాజ్ కూడా ఇవ్వకుండా నేరుగా లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది. ‘లాంగ్ మార్చ్ పేరిట ఇమ్రాన్ చేపట్టిన ర్యాలీ సందర్భంగా ఇటీవల చేసిన పలు ప్రసంగాల్లో.. తన హత్యకు కుట్ర పన్నాయంటూ సైన్యంసహా దేశ అత్యున్నత విభాగాలపై నిరాధార ఆరోపణలు చేశారు. ఈ ప్రసంగాలు ప్రజల మధ్య విద్వేషం పెంచే ప్రమాదముంది. శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ఇలాంటి ప్రసంగాల ప్రసారం ఆపేయండి’ అని పేర్కొంది. -
ICC Media Rights Auction: ఎన్ని వేల కోట్లో!
దుబాయ్: క్రికెట్‌కు కామధేనువు భారత మార్కెట్ నుంచి భారీగా ఆర్జించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సిద్ధమైంది. వచ్చే ఎనిమిదేళ్లలో (2023–2031 మధ్య) జరిగే ఐసీసీ టోర్నీలను భారత్‌లో ప్రసారం చేసేందుకు ఇచ్చే హక్కుల కోసం నేడు వేలం జరగనుంది. ఐపీఎల్ వేలం ద్వారా బీసీసీఐ జాక్‌పాట్ కొట్టడంతో ఇప్పుడు అదే తరహాలో ఐసీసీ వేలం నిర్వహించనుంది. టీవీ, డిజిటల్, టీవీ అండ్ డిజిటల్ అంటూ మూడు వేర్వేరు కేటగిరీల కోసం వేలం జరుగుతుంది. నాలుగేళ్ల కాలానికి లేదా ఎనిమిదేళ్ల కాలానికి హక్కులను కేటాయిస్తారు. 2023–2031 మధ్య పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం 22 ఐసీసీ ఈవెంట్లు ఉన్నాయి. వన్డే, టి20 ప్రపంచకప్‌లతో పాటు చాంపియన్స్ ట్రోఫీ, అండర్–19 వరల్డ్‌కప్‌లు కూడా ఇందులో భాగమే. హక్కులను చేజిక్కించుకునేందుకు ప్రధానంగా ఐదు కంపెనీలు బరిలో నిలిచాయి. డిస్నీ స్టార్, సోనీ, జీ, వయాకామ్, అమెజాన్ సంస్థలు వేలంలో పెద్ద మొత్తం చెల్లించేందుకు పోటీ పడనున్నాయి. మొత్తంగా ఒక్క భారత మార్కెట్ నుంచి ఐసీసీ సుమారు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 32 వేల కోట్లు) ఆశిస్తోంది. చదవండి: Asia Cup- Highest Run Scorers: టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్! కానీ కోహ్లి మాత్రం.. ICC T20 WC 2022: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. అభిమానులకు గుడ్‌న్యూస్ -
ICC auction: అసంబద్ధ వేలంలో పాల్గొనలేం
ముంబై: భారత్‌లో ఐసీసీ టోర్నమెంట్ల ప్రసార హక్కుల కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలక్ట్రానిక్ వేలం (ఇ–వేలం) నిర్వహించేందుకు ప్రముఖ ప్రసారకర్తల నుంచి టెండర్లు ఆహ్వానించింది. అయితే ఇ–వేలం ప్రక్రియకు సంబంధించిన పత్రాల్లో అస్పష్టమైన వివరాలే ఉన్నాయని, ఇలాంటి అసంబద్ధ టెండర్ల ప్రక్రియలో పాల్గొనలేమని భారతీయ బ్రాడ్కాస్టర్లు డిస్నీ–స్టార్, వయాకామ్–18, సోనీ, జీ నెట్వర్క్ సంస్థలు ఐసీసీకి లేఖ రాశాయి. టెండర్ల పత్రాల్లో పొందుపరిచిన అంశాల్లో మరింత స్పష్టత కావాలని లేఖలో కోరింది. ఇంచుమించు నాలుగు బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు కూడా ఒకే రకంగా స్పందించాయి. ‘నాలుగు ప్రసారకర్తలు తమ అభ్యంతరాలను తెలుపుతూ ఐసీసీకి లేఖ రాశా యి. అమెజాన్ సంస్థ ఇందులో ఎలా ముందుకెళుతుందో అర్థం కావట్లేదు. స్పష్టతలేని అంశాలతో ఆ సంస్థ సంతృప్తిగా ఉందా లేదో తెలియదు. అలాంటపుడు ఆ సంస్థ ఎందుకంత ఉత్సాహంగా ముందకెళుతుందో మరి! మేం అయితే ఇప్పుడున్న టెండర్ల ప్రక్రియపై అసంతృప్తితో ఉన్నాం. బిడ్లు దాఖలు చేయలేం’ అని ఓ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ అధికారి తెలిపారు. ఐసీసీ కమిటీ మీటింగ్‌లలో పాల్గొనే భారత క్రికెట్ నియంత్రన మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా బ్రాడ్కాస్టర్లకు మరింత సమాచారం ఇవ్వాలని ఐసీసీని కోరినట్లు తెలిసింది. ఐపీఎల్ మీడియా హ క్కుల కోసం బీసీసీఐ నిర్వహించిన ఇ–వేలం ప్రక్రియను అనుసరించేందుకు ఐసీసీ ఆసక్తిచూపడం లేదు. -
టీవీ18 బ్రాడ్కాస్ట్ ఆదాయం రూ.1,197 కోట్లు
న్యూఢిల్లీ: మీడియా కంపెనీ, టీవీ–18 బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో రూ.30 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.5 కోట్ల నికర లాభం వచ్చిందని టీవీ18 బ్రాడ్కాస్ట్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.765 కోట్ల నుంచి రూ.1,197 కోట్లకు పెరిగింది. వయాకామ్ 18 మీడియా, ఇండియాకాస్ట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లు గత ఏడాది మార్చి 1 నుంచి తమకు పూర్తి అనుబంధ సంస్థలుగా మారాయని కంపెనీ తెలియజేసింది. అందుకే ఈ క్యూ4 ఫలితాలను, గతేడాది ఫలితాలతో పోల్చడం సరికాదని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభం 30 శాతం వృద్ధితో రూ.314 కోట్లకు పెరిగింది. నికర లాభం రూ.167 కోట్లుగా, నిర్వహణ ఆదాయం రూ.4,993 కోట్లుగా నమోదయింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టీవీ18 బ్రాడ్కాస్ట్ షేరు 5 శాతం నష్టంతో రూ.36.70 వద్ద ముగిసింది. -
ఇక యప్టీవీలో ఐపీఎల్ ప్రసారాలు
ముంబై : వివో ఐపీఎల్ - 12వ సీజన్ భారతదేశ విదేశీ ప్రసార హక్కులను దక్షిణాసియా అంతటా ప్రఖ్యాతి గాంచిన యప్‌టీవీ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా, కాంటినెంటల్ యూరోప్, సింగపూర్, మలేషియా, శ్రీలంక, దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికాతో పాటు సెంట్రల్ ఆసియా, ఆగ్నేయ ఆసియాలలో ఉన్న పాత, కొత్త వినియోగదారులకు కూడా ఈ సదుపాయం వర్తిస్తుందని యప్ టీవీ యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా యప్‌టీవీ వ్యవస్థాపకుడు, సీఈవో ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ 2019 ప్రసార హక్కులు మాకు దక్కాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా ప్రేక్షకులకు వారి అభిమాన క్రీడలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాం. ఇంటర్నెట్ ఆధారితంగా ఈ ప్రసారాలు కొనసాగుతాయని తెలిపారు. ఇందుకు గాను యూజర్లు https://www.yupptv.com/cricket/ipl-2019/live-streaming లాగిన్ అయ్యి ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించవచ్చు. అంతేకాక స్మార్ట్ టీవీలలో యప్‌టీవీ యాప్ ద్వారా, స్మార్ట్ బ్లూ - రే ప్లేయర్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారాలను పొందవచ్చు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానలు ఎదురు చూస్తున్న ఐపీఎల్ - 1 2వ సీజన్ ఈ నెల 23 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
క్రికెటర్ పాత్ర పోషించాలంటే భయమేస్తోంది
‘‘ధోనీ బయోపిక్ చాలా బాగా తీశారు. ఒక సినిమా హీరోగా... క్రికెటర్ అనే ఒక నేషనల్ లెవల్ హీరో పాత్ర పోషిం^è మని ఎవరైనా సంప్రదిస్తే మాత్రం కొంత భయంగానే అనిపిస్తుంది’’ అన్నారు ఎన్టీఆర్. స్టార్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఐపీఎల్ క్రికెట్ పోటీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ – ‘‘చిన్నప్పటి నంచి నాకు క్రికెట్ అంటే ఇష్టం. ఎప్పుడూ గెలిచే టీమ్ పట్లే ప్రేమ చూపించేవాణ్ణి. సచిన్ ఆట చూస్తూ పెరగడం వల్ల అభిమాన క్రికెటర్ అనగానే సచిన్ అని మాత్రమే చెబుతా. నేను తొలిసారి సిక్స్ కొట్టింది ‘సింహాద్రి’ సినిమాతో (నవ్వుతూ). ఆ సిక్స్‌ను బాగా ఎంజాయ్ చేశాను. కాలక్రమంలో సిక్స్‌లే కాదు భయంకరమైన డకౌట్స్ కూడా నా కెరీర్లో ఉన్నాయి. అయితే ఆటల్లోలాగానే ఒక స్టేజ్ దాటాక సక్సెస్, ఫెయిల్యూర్స్ చాలా మామూలుగా అయిపోతాయి. గెలుపోటములుకి ఎవరూ అతీతులు కాదు’’ అన్నారు. అభిరామ్ క్రికెటర్ అయితే ఓకే తనయుడు అభిరామ్ గురించి మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం నాకు క్రికెట్ చూడడం కన్నా ఆడడం బాగా ఇష్టం. మా అబ్బాయి అభిరామ్ ఈ మధ్యే థర్మాకోల్‌తో తయారైన బ్యాట్, ఓ ప్లాస్టిక్ బాల్ కొని నాతో క్రికెట్ ఆడేస్తున్నాడు. మరి.. క్రికెట్ మీద ఆ ఇష్టం ఎన్నాళ్లు ఉంటుందో చెప్పలేను. ఒకవేళ అభిరామ్ క్రికెటర్ అయితే నాకు ఇష్టమే. మన ఇష్టాలను పిల్లల మీద రుద్దకూడదు. పిల్లలకి చక్కగా ఎదగడానికి మంచి తిండి, చదువు, సురక్షితమైన ఇల్లు ఇవ్వడం, ఒక మంచి పౌరుడిగా ఉండడానికి తోడ్పడడమే పెద్దల బాధ్యత. వారి భవిష్యత్తు గురించి వాళ్లే నిర్ణయించుకునేలా చేయాలనేది నా అభిప్రాయం. మా నాన్నగారు నేను బాగా చదువుకోవాలని కోరుకున్నారు. మా అమ్మగారు నన్ను మంచి నృత్యకళాకారుడిగా చూడాలని కోరుకున్నారు. అయితే విధి నన్ను నటనవైపు తీసుకొచ్చింది’’ అని చెప్పారు. బయోపిక్‌కి పిలుపు రాలేదు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలసి చేయబోతున్న సినిమా గురించి అడగ్గా – ‘‘రాజమౌళిగారు పూర్తి కథ చెప్పలేదు. మమ్మల్ని మాత్రం సినిమాలో నటించడానికి రెడీగా ఉండమన్నారు. మా పాత్రలు అలరించే విధంగా ఉంటాయి’’ అని చెప్పారు. మీ తాత ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తీస్తున్న బయోపిక్‌లో మీరు నటిస్తారా? అనే ప్రశ్నకు – ‘‘నాకు పిలుపు రాలేదు. ఒకవేళ వస్తే మీ అందరికీ చెబుతా’’ అన్నారు. -
ఈసారి ఎన్ని కోట్లో?
సరిగ్గా ఏడు నెలల క్రితం ఐపీఎల్ మ్యాచ్ హక్కులను బీసీసీఐ రూ.16, 347.5 కోట్లకు స్టార్ సంస్థకు విక్రయించింది. క్రికెట్ చరిత్రలోనే అది అతి పెద్ద టీవీ హక్కుల ఒప్పందంగా నిలిచింది. ఇప్పుడు భారత క్రికెట్ జట్టు సొంతగడ్డపై ఆడే మ్యాచ్‌ల ప్రసారం కోసం కూడా బీసీసీఐ అంతే స్థాయిలో భారీ మొత్తాన్ని ఆశిస్తోంది. ఐదేళ్ల కాలం కోసం లభించే హక్కుల కోసం ఆరు ప్రఖ్యాత సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు ‘సీల్డ్ కవర్’ పద్ధతిలో హక్కులు అందజేసిన బోర్డు... తొలిసారి ఈ–ఆక్షన్ ద్వారా వేలం పాట నిర్వహించనుండటం ఈసారి విశేషం. న్యూఢిల్లీ: జూన్ 2018 నుంచి మార్చి 2023 మధ్య భారత గడ్డపై మొత్తం 102 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 22 టెస్టులు కాగా...45 వన్డేలు, మరో 35 టి20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఈ అన్ని మ్యాచ్‌ల ప్రసార హక్కుల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నేడు వేలం నిర్వహిస్తోంది. సుప్రీం కోర్టు నియమించిన క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ), బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి కలిసి ఈసారి సీల్డ్ కవర్ విధానానికి బదులుగా ఈ–ఆక్షన్ పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించారు. దీని వల్ల మరింత పారదర్శకతకు అవకాశం ఉంటుందని, బోర్డు అధికారులతో ప్రసార సంస్థలు లోపాయికారీగా సమాచారం తెలుసుకొని అవినీతికి పాల్పడకుండా ఉంటుందని వారు చెబుతున్నారు. ఆన్లైన్లో వేలం ప్రక్రియ ప్రారంభమయ్యాక బిడ్డర్లు తాము చెల్లించగలిగే మొత్తాన్ని అందులో పేర్కొనాల్సి ఉంటుంది. అది పెరుగుతూ వెళ్లి చివరకు అత్యధిక మొత్తం వేసిన బిడ్డర్‌కు హక్కులు దక్కుతాయి. అయితే స్క్రీన్‌పై బిడ్డింగ్ మొత్తం చూపించినా... అది ఎవరు వేస్తున్నారనేది మాత్రం ప్రదర్శించరు. మూడు రకాల హక్కులు... తాజా వేలంలో బీసీసీఐ మూడు రకాల హక్కులకు బిడ్లను ఆహ్వానించింది. భారతదేశం వరకు టీవీ హక్కులతో పాటు మిగిలిన అన్ని దేశాలకు కలిపి డిజిటల్ హక్కులు ఇందులో మొదటిది. భారత ఉపఖండానికి మాత్రమే పరిమితమయ్యే విధంగా డిజిటల్ హక్కులు రెండోది. భారత ఉపఖండం, ఇతర ప్రపంచ దేశాల టీవీ హక్కులతో పాటు ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ హక్కులు (గ్లోబల్ కన్సాలిడేటెడ్ రైట్స్) మూడోది. 2018–19 సీజన్‌కు ఒక్కో మ్యాచ్ కనీస ధర, ఆ తర్వాతి నాలుగేళ్లకు ఒక్కో మ్యాచ్ కనీస ధరను వేర్వేరుగా నిర్ణయించారు. వచ్చే సీజన్లో డిజిటల్ హక్కుల కనీస ధర రూ. 8 కోట్లు కాగా, ఆ తర్వాత అది రూ. 7 కోట్లుగా ఉంది. గ్లోబల్ హక్కుల కోసం తర్వాతి నాలుగేళ్ల కాలానికి ప్రతీ మ్యాచ్‌కు రూ. 40 కోట్ల కనీస ధర ఉండటం విశేషం. పోటీలో ఎవరెవరు? భారత క్రికెట్‌కు సంబంధించి ప్రసార హక్కులంటే సహజంగా ఉండే భారీ పోటీ ఈసారి కూడా కనిపిస్తోంది. టీవీ, డిజిటల్ హక్కుల కోసం దిగ్గజ సంస్థలు రంగంలో ఉన్నాయి. ఇప్పటి వరకు భారత క్రికెట్ హక్కులు ఉన్న స్టార్ సంస్థ మరోసారి దానిని దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. ఐపీఎల్ కూడా చేతిలో ఉన్న స్టార్‌కు ఇది కూడా లభిస్తే ఇక తిరుగుండదు. మరోవైపు ఐపీఎల్‌ను స్టార్‌కు కోల్పోయిన సోనీ కూడా పెద్ద మొత్తం ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది. స్టార్, సోనీలతో పాటు డిజిటల్ కోసం జియో, ఫేస్బుక్, గూగుల్ పోటీ పడుతున్నాయి. మరో డిజిటల్ సంస్థ ‘యప్ టీవీ’ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అన్నింటికీ ఒకే రేటు... ఈ ఐదేళ్ల కాలంలో భారత్ సొంతగడ్డపై పాకిస్తాన్, ఐర్లాండ్ మినహా అన్ని టెస్టు జట్లతో మ్యాచ్‌లు ఆడుతుంది. పెద్ద మొత్తంలో వీక్షకులను ఆకర్షించే సిరీస్‌లను చూస్తే 2019లో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టెస్టుల సిరీస్, 2021లో ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్, 2023లో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్ ముఖ్యమైనవి. అయితే బంగ్లాదేశ్, జింబాబ్వేలాంటి జట్లు కూడా పాల్గొనే ముక్కోణపు సిరీస్‌లు, అఫ్గానిస్తాన్‌తో టెస్టు కూడా ఉన్నాయి. దీనిపైనే స్టార్, సోనీ సంస్థలు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. భారత్ ఆడే మ్యాచ్‌లకు, వాటికి ఒకే కనీస ధర ఎలా నిర్ధారిస్తారని వారు ప్రశ్నించారు. అయితే బీసీసీఐ దీనిని కొట్టిపారేసింది. ‘ఐదేళ్లలో 80 శాతం మ్యాచ్‌లు భారత్ పెద్ద జట్లతోనే ఆడుతుంది. ప్రసారకర్తలకు అందులోనే డబ్బులు వచ్చేస్తాయి. మిగతా 20 శాతం చిన్న టీమ్‌లే అయినా వారి ఆదాయానికి నష్టం మాత్రం జరగదు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
క్రీడాభిమానులకు జియో గుడ్‌న్యూస్
క్రీడాభిమానులకు రిలయన్స్ జియో చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. రేపటినుంచి ప్రారంభం కానున్న (ఫిబ్రవరి 9) పియాంగ్ చాంగ్ వింటర్ ఒలింపిక్స్ 2018ను పాపులర్ జియో టీవీ యాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఫిబ్రవరి 9-25వ తేదీవరకు దక్షిణ కోరియాలో అట్టహాసంగా నిర్వహించనున్న వింటర్ ఒలింపిక్స్ లైవ్ అప్డేట్స్ను దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా అందించనున్నామని రిలయన్స్ జియో ప్రకటించింది. దీనికి సంబంధించిన డిజిటల్ హక్కులను పియాంగ్ చాంగ్ 2018 ఒలింపిక్ కమిటీనుంచి సాధించామని వెల్లడించింది. జియో టీవీ యాప్‌లో లైవ్ కవరేజీని అందించడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆటల సమగ్ర కవరేజీని అందించడానికి ఐవోసీతో కలిసి జియో టీవీ పనిచేస్తుంది, తద్వారా లక్షలాది మంది తమ మొబైల్స్‌లో లైవ్ అండ్ క్యాచ్-అప్ కంటెంట్‌ను వీక్షించే అవకాశం కల్పిస్తున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు డిజిటల్ ప్లాట్‌ఫాంలో మొట్టమొదటి, కీలక ముందడుగు అని పేర్కొన్నారు. అలాగే పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్ దీవుల్లో కూడా ఆసియా ఫసిఫిక్ యూనియన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని ఐవోసీ ప్రకటించింది. వందల కోట్ల ఖర్చుతో సరికొత్త హంగులతో, అద్భుతంగా నిర్మించిన భారీ స్టేడియంలో ‘ఒలింపిక్ వింటర్ గేమ్స్ 2018’ దక్షిణ కొరియా, పియాంగ్ చాంగ్ కౌంటీలో జరుగనున్నాయి. స్కీయింగ్, స్కేటింగ్, ల్యుగే, స్కై జంపింగ్, ఐస్ హాకీ, మంచు బోర్డింగ్ సహా 15 క్రీడల్లో 102 ఈవెంట్స్ నిర్వహించనున్నారు. భారతదేశంతో సహా 90కి పైగా దేశాలు ఈ క్రీడల్లో పాల్గొంటాయి. కాగా ఆండ్రాయిడ్‌లో రిలయన్స జియో టీవీ యాప్ లక్షల డోన్లోడ్లను కలిగింది. సుమారు 400 చానల్స్‌ను, 60హెచ్డీ చానల్స్‌ను వీక్షించే అవకాశాన్ని చందాదారులకు అందిస్తోంది. తెలుగు, హిందీ, మరాఠీ, పంజాబీ, ఉర్దూ, బెంగాలీ, ఇంగ్లీష్, మలయాళం, తమిళం, గుజరాతి, ఒడియ, భోజ్‌పురి, కన్నడ, అస్సామీ, నేపాలీ, ఫ్రెంచ్ లాంటి వివిధ భాషలలోని ఛానెళ్లకు జియో టీవీ యాప్‌లో యాక్సెస్ లభిస్తుంది. -
ట్రాయ్ సంచలన ప్రతిపాదన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కేబుల్ బ్రాడకాస్టర్స్ వసూలు చేసే కేబుల్ టారిఫ్ పై ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) సంచలన నిర్ణయం తీసుకుంది. కేబుల్ ప్రసారాల డిజిటలైజేషన్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో డిజిటలైజేషన్ కేబుల్ ధరలపై కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వినియోగదారుల నుంచి వసూలు చేసే చార్జీలపై పరిమితిని విధించాలని ప్రతిపాదించింది. అధిక మొత్తాలను వసూలు చేయకుండా వంద చానళ్లను ప్రసారం చేసే సెట్ టాప్ బాక్స్ కు నెలకు రూ. 130 మాత్రమే వసూలు చేయాలని చెప్పింది. ఈ నిబంధన కింద కచ్చితంగా 100 చానళ్లను కస్టమర్లకు అందించాల్సిందేనని తెలిపింది. దీని ప్రకారం ప్రతి ప్రసార లేదా వేర్వేరు భౌగోళిక ప్రాంతాలలో పే, ఫ్రీ ఛానల్స్ వివరాలను స్పష్టంగా ప్రకటించాలని కోరింది. ఇంకా ఎక్కువ చానళ్లు కావాలని భావించే వారి కోసం పలు శ్లాబ్ లను ప్రకటిస్తూ, రూ. 25 చొప్పున అదనంగా చెల్లించి ఆ చానళ్లను తీసుకోవచ్చని పేర్కొంది. తమకు నచ్చిన చానళ్లను వీక్షించే సౌలభ్యాన్ని దగ్గర చేసేందుకే ఈ మార్పులు చేసినట్టు ట్రాయ్ అధికారి ఒకరు వివరించారు. డ్రాఫ్ట్ టెలికమ్యూనికేషన్ (బ్రాడ్‌కాస్టింగ్ మరియు కేబుల్ సేవలు) (ఎనిమిదవ) (అడ్రస్బుల్ సిస్టమ్స్) టారిఫ్ ఆర్డర్, 2016 ను రిలీజ్ చేసిన ట్రాయ్ దీనిపై లిఖిత పూర్వక అభిప్రాయాలను అక్టోబర్ 24, 2016 లోపు తెలియజేయాలని కోరింది. మరోవైపు ట్రాయ్ ప్రతిపాదనలపై ఎనలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టెలికాం రెగ్యులేటరీ సరైన నిర్ణయం తీసుకుందని, కానీ పరిష్కరించాల్సిన కొన్ని సమస్యలు ఉన్నాయని పెట్టుబడి బ్యాంకు అమెరికా మెర్రిల్ లించ్ పేర్కొంది. కేటగిరీలను స్పష్టంగా నిర్వచించిన లేదని తెలిపింది. డిజిటైజేషన్ ఇప్పటికీ పూర్తి కాకలేదని, ఎవరెవరు ఎంతెంత చెల్లిస్తున్నారనేది క్లారిటీ లేదని పేర్కొంది. అలాగే ఈ కొత్త ధరలపై వినియోగదారులకు అవగాహన కల్పిండానికి సమయం తీసుకుంటుందని వ్యాఖ్యానించింది. అలాగే ఈ ప్రతిపాదన నచ్చని బ్రాడ్ కాస్టర్స్ కోర్టు కెళ్లి స్టే తెచ్చుకుంటారని అభిప్రాయపడింది. ధర పరిమితి విధించడం సహేతుకమైనదని కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ తెలిపింది. ట్రాయ్ ప్రతిపాదిత టారిఫ్ ముఖ్య లక్ష్యం వినియోగదారుల ఆసక్తిని రక్షించుకోవడమేనని పేర్కొంది. -
ఫేస్బుక్ లో సీపీఎల్ లైవ్
క్రికెట్ అభిమానులకు ఇక పండగే. మొట్టమొదటిసారి హీరో కరీబియన్ ప్రీమియం లీగ్(సీపీఎల్) మ్యాచ్ లను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లైవ్ గా ప్రసారం చేయబోతోంది. కంపెనీ ప్రముఖ ప్రొడక్ట్ ఫీచర్ ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఈ మ్యాచ్ లను ప్రసారం చేసేందుకు బ్రాడ్ కాస్టింగ్ డీల్ కుదుర్చుకుంది. ట్వంటీ 20 టోర్నమెంట్ లో జరగబోయే 34 మ్యాచ్ లను భారత్ తో పాటు 40 దేశాల్లో ఫేస్ బుక్ లైవ్ ద్వారా ప్రసారం చేయబోతున్నామని క్రికెట్ లీగ్ గురువారం వెల్లడించింది. ఫేస్ బుక్ లైవ్ ప్లాట్ ఫామ్ తో 40 దేశాల్లో ప్రసారం చేసే మొట్టమొదటి స్పోర్ట్ లీగ్ సీపీఎల్ మాత్రమేనని, పాకిస్తాన్, దక్షిణ ఆఫ్రికా, ఫిలిప్పీన్స్ దేశాల్లో కూడా ఈ లైవ్ ను వీక్షించవచ్చని సీపీఎల్ ప్రకటించింది. ఫేస్ బుక్ లైవ్ తో అందించే మొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కూడా ఇదేనని పేర్కొంది. ఈ బ్రాండ్ కాస్టింగ్ తో సీపీఎల్ ను విస్తరించుకుని అంతర్జాతీయ ప్రేక్షకులను పెంచకుంటామని సీపీఎల్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ పీట్ రస్సెల్ పేర్కొన్నారు. 2015లో 930లక్షల ప్రపంచ వీక్షకులను సంపాదించిందని, వచ్చే టోర్నమెంట్ తో వీక్షకులను మరింత పెంచుతామని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. దీంతో అంతర్జాతీయంగా ఎక్కువ ఫాలోవర్స్ ను సంపాదిస్తామని పేర్కొన్నారు. క్రికెట్ అభిమానులకు ఈ లైవ్ తో క్రికెట్ ప్రసారాలను అందించడమే కాకుండా.. పేవరెట్ స్టార్లను కనెక్ట్ అయ్యేలా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆరు టీమ్ లతో బుధవారం నుంచి ఈ లీగ్ ప్రారంభమైంది. క్రిస్ గేల్, ఏబీ డీ విలియర్స్, కుమార్ సంగక్కర, డేల్ స్టెయిన్, డ్వేన్ బ్రేవో, కీరాన్ పోలార్డ్, బ్రెండన్ మెక్‌కలమ్ ఇతర క్రికెటర్లు ఈ మ్యాచ్ లో పాల్గొంటున్నారు. మొబైల్ వీడియో, అడ్వర్ టైజింగ్ కంపెనీ గ్రేబ్యో ద్వారా ఈ లైవ్ ను ఫేస్ బుక్ బ్రాండ్ కాస్ట్ చేస్తుంది. -
‘నిర్భయ’ డాక్యుమెంటరీ ప్రసారం నిలుపుదలపై బాలివుడ్ విమర్శలు
విచారణ కూడా ఇదే వేగంతో చేయాలని డిమాండ్ న్యూఢిల్లీ: నిర్భయ ఘటనకు సంబంధించి బ్రీటీష్ దర్శకుడు తీసిన డాక్యుమెంటరీ(ఇండియన్ డాటర్) ప్రసారం నిలిపివేయడంపై బాలివుడ్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. నిలుపుదల విషయంలో వేగంగా నిర్ణయం తీసుకున్నట్లే కేసు విచారణనూ ఇదే వేగంతో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించింది. ప్రభుత్వం ఎందుకు వారిపై వేంటనే చర్య తీసుకోకుండా, మూడేళ్లుగా కూర్చోబెట్టి మేపుతున్నారని మండిపడింది. ఈ మేరకు పలువురు బాలివుడ్ ప్రముఖులు అభిషేక్ కపూర్, అనురాగ్ బసు, పునిత్ మల్హోత్రా, సిద్ధార్థ్ తదితరులు ప్రభుత్వ నిర్ణయాన్ని ట్వీటర్లో ప్రశ్నించారు. -
ఆ డాక్యుమెంటరీని ప్రసారం కానివ్వం!
న్యూఢిల్లీ: నిర్భయపై పాశవిక అత్యాచారానికి పాల్పడిన ముకేశ్ సింగ్ ఇంటర్వ్యూ ఉన్న డాక్యుమెంటరీని విదేశాల్లో సహా ఎక్కడా, ఏ విధంగానూ.. ప్రసారం కానీ, ప్రచురణ కానీ కాకుండా చూస్తామని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియా సహా ఎక్కడ, ఏ విధంగా కూడా ఆ డాక్యుమెంటరీ టెలికాస్ట్ కాకుండా చర్యలు తీసుకోవాలని బీబీసీ, భారతీయ విదేశాంగ శాఖ, సమాచార సాంకేతిక విభాగాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ డాక్యుమెంటరీ ప్రసారం, ప్రచురణ కాకుండా చూస్తామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం పార్లమెంటు ఉభయసభల్లో ప్రకటన చేశారు. దీనిపై దేశమంతా సిగ్గుపడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇంటర్వ్యూకు అనుమతి ఎలా లభించిందనే విషయంపై దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తీహార్ జైలు డెరైక్టర్ జనరల్ అలోక్ కుమార్ వర్మను రాజ్‌నాథ్ పిలిపించి వివరణ తీసుకున్నారు. కాగా, ఈ లఘుచిత్రాన్ని ఈ నెల 8వ తేదీన మహిళాదినోత్సవం సందర్భంగా ప్రసారం చేయాలనుకున్న బీబీసీ.. అంతకన్నా ముందుగానే బుధవారం రాత్రి 10 గంటలకు బ్రిటన్‌లో ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. తమపై చర్య తీసుకునే ముందు ప్రధాని మోదీ ఆ లఘు చిత్రాన్ని ఒకసారి చూడాలని కోరింది. మహిళాసభ్యుల వాకౌట్ ఈ ఉదంతంపై బుధవారం పార్లమెంటు అట్టుడికింది. ముఖ్యంగా మహిళా సభ్యులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీహార్ జైళ్లో ఉన్న గ్యాంగ్ రేప్ దోషిని ఇంటర్వ్యూ చేసేందుకు అనుమతి లభించడానికి కారణమైన వారిపైచర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేశారు. ఆ డాక్యుమెంటరీలో అశ్లీల పదజాలం వాడటాన్ని బార్‌కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. దీనిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజ్యసభలో విపక్ష పార్టీలకు చెందిన మహ ళా సభ్యులంతా వెల్‌లోకి దూసుకెళ్లారు. -
మన దూరదర్శన్ వచ్చేస్తోంది
ఈ నెలాఖరులో లేదా అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం విజయవాడ నుంచే 24 గంటల ప్రసారాలు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు 13 జిల్లాల కార్యక్రమాలకే ప్రాధాన్యం సాక్షి, విజయవాడ : విజయవాడ కేంద్రంగా దూరదర్శన్ పూర్తిస్థాయి ప్రసారాలకు శ్రీకారం చుడుతోంది. ఇక్కడ నుంచి 24 గంటలూ దూరదర్శన్ కార్యక్రమాలను ప్రసారం చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో కేవలం రెండు గంటల కార్యక్రమాలను మాత్రమే ఇక్కడ నుంచి ప్రసారం చేసేవారు. మిగిలిన కార్యక్రమాలను హైదరాబాద్ కేంద్రంగా ప్రసారం చేసేవారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో దూరదర్శన్ను కూడా ప్రత్యేకంగా కేటాయించాలని ప్రసారభారతికి పలువురు విన్నవించారు. ఈ క్రమంలో దూరదర్శన్ విభజనకు కేంద్ర ప్రభుత్వం జూలైలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మరో పక్షం రోజుల్లో పూర్తి స్థాయిలో విడిపోవడానికి రంగం సిద్ధమైంది. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ దూరదర్శన్ ప్రసారాలను ఈ నెలాఖరులో గానీ, వచ్చే నెల మొదటి వారంలో గానీ ప్రారంభిస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేవకర్ కూడా ప్రకటించారు. శరవేగంగా పనులు విజయవాడ కేంద్రంగా 24 గంటలూ కార్యక్రమాలను ప్రసారం చేయడానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి విడిపోయిన తరువాత ఇక్కడ స్వయంగా ప్రసారాలు చేసుకోవాలంటే కనీసం ఆరు నెలల వ్యవధి పడుతుందని స్థానిక అధికారులు భావించారు. అయితే ఢిల్లీ నుంచి అత్యాధునిక సాంకేతిక పరికరాలు దిగుమతి చేసుకుని ఇక్కడి ఇంజినీర్లు కావాల్సిన ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. స్క్రిప్టు రైటర్లు, కెమెరామెన్లు, యాంకర్లు వంటి వారిని తాత్కాలిక పద్ధతిలో నియమిస్తున్నారు. రోజుకు రెండుసార్లు వార్తలు ప్రసారం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఉన్న స్టూడియోను ఆధునికీకరిస్తున్నారు. వార్తలను రికార్డింగ్ చేయడానికి అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం గల పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటి వార్తలు అప్పుడు సేకరించి పంపేందుకు వీలుగా ఓబీ వ్యాన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేటు చానల్స్ కంటే అత్యాధుని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారని, ఇప్పుడు ఉపయోగించే టెక్నాలజీ మరో 30 ఏళ్ల వరకు సరిపోతుందని ఇక్కడి సిబ్బంది భావిస్తున్నారు. స్థానికతకే ప్రాధాన్యత ఇక నుంచి దూరదర్శన్ ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలోని 13 జిల్లాల వార్తలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. గతంలో చార్మినార్, మ్యూజియాలు చూస్తే ఇక నుంచి ప్రకాశం బ్యారేజీ అందాలు, సూర్యలంక బీచ్ సొగసులు విశాఖ, అరకు సోయగాలు ప్రసారం చేస్తారు. విజయవాడ కేంద్రంగానే 13 జిల్లాలకు చెందిన సాంస్కృతిక, ఆధ్మాత్మిక, వ్యవసాయ తదితర కార్యక్రమాల ప్రసారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ 13 జిల్లాలో పండే పంటలు, వాటిల్లో రైతులు పడే ఇబ్బందులు, తీసుకోవాలని జాగ్రత్తలు తదితర కార్యక్రమాలను దూరదర్శన్ అధికారులు రూపొందిస్తారు. వాస్తవంగా దూరదర్శన్ ఏయే కార్యక్రమాలు ప్రసారం చేయాలనే అంశంపై ఢిల్లీలోనే నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, వాటికి స్థానికతను జోడించడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు చేరువ కావాలని ఇక్కడి అధికారులు యోచిస్తున్నారు.