సరిగ్గా ఏడు నెలల క్రితం ఐపీఎల్ మ్యాచ్ హక్కులను బీసీసీఐ రూ.16, 347.5 కోట్లకు స్టార్ సంస్థకు విక్రయించింది. క్రికెట్ చరిత్రలోనే అది అతి పెద్ద టీవీ హక్కుల ఒప్పందంగా నిలిచింది. ఇప్పుడు భారత క్రికెట్ జట్టు సొంతగడ్డపై ఆడే మ్యాచ్‌ల ప్రసారం కోసం కూడా బీసీసీఐ అంతే స్థాయిలో భారీ మొత్తాన్ని ఆశిస్తోంది. ఐదేళ్ల కాలం కోసం లభించే హక్కుల కోసం ఆరు ప్రఖ్యాత సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు ‘సీల్డ్ కవర్’ పద్ధతిలో హక్కులు అందజేసిన బోర్డు... తొలిసారి ఈ–ఆక్షన్ ద్వారా వేలం పాట నిర్వహించనుండటం ఈసారి విశేషం.
న్యూఢిల్లీ: జూన్ 2018 నుంచి మార్చి 2023 మధ్య భారత గడ్డపై మొత్తం 102 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 22 టెస్టులు కాగా...45 వన్డేలు, మరో 35 టి20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఈ అన్ని మ్యాచ్‌ల ప్రసార హక్కుల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నేడు వేలం నిర్వహిస్తోంది. సుప్రీం కోర్టు నియమించిన క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ), బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి కలిసి ఈసారి సీల్డ్ కవర్ విధానానికి బదులుగా ఈ–ఆక్షన్ పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించారు. దీని వల్ల మరింత పారదర్శకతకు అవకాశం ఉంటుందని, బోర్డు అధికారులతో ప్రసార సంస్థలు లోపాయికారీగా సమాచారం తెలుసుకొని అవినీతికి పాల్పడకుండా ఉంటుందని వారు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో వేలం ప్రక్రియ ప్రారంభమయ్యాక బిడ్డర్లు తాము చెల్లించగలిగే మొత్తాన్ని అందులో పేర్కొనాల్సి ఉంటుంది. అది పెరుగుతూ వెళ్లి చివరకు అత్యధిక మొత్తం వేసిన బిడ్డర్‌కు హక్కులు దక్కుతాయి. అయితే స్క్రీన్‌పై బిడ్డింగ్ మొత్తం చూపించినా... అది ఎవరు వేస్తున్నారనేది మాత్రం ప్రదర్శించరు.
మూడు రకాల హక్కులు...
తాజా వేలంలో బీసీసీఐ మూడు రకాల హక్కులకు బిడ్‌లను ఆహ్వానించింది. భారతదేశం వరకు టీవీ హక్కులతో పాటు మిగిలిన అన్ని దేశాలకు కలిపి డిజిటల్ హక్కులు ఇందులో మొదటిది. భారత ఉపఖండానికి మాత్రమే పరిమితమయ్యే విధంగా డిజిటల్ హక్కులు రెండోది. భారత ఉపఖండం, ఇతర ప్రపంచ దేశాల టీవీ హక్కులతో పాటు ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ హక్కులు (గ్లోబల్ కన్సాలిడేటెడ్ రైట్స్) మూడోది. 2018–19 సీజన్‌కు ఒక్కో మ్యాచ్ కనీస ధర, ఆ తర్వాతి నాలుగేళ్లకు ఒక్కో మ్యాచ్ కనీస ధరను వేర్వేరుగా నిర్ణయించారు. వచ్చే సీజన్‌లో డిజిటల్ హక్కుల కనీస ధర రూ. 8 కోట్లు కాగా, ఆ తర్వాత అది రూ. 7 కోట్లుగా ఉంది. గ్లోబల్ హక్కుల కోసం తర్వాతి నాలుగేళ్ల కాలానికి ప్రతీ మ్యాచ్‌కు రూ. 40 కోట్ల కనీస ధర ఉండటం విశేషం.
పోటీలో ఎవరెవరు?
భారత క్రికెట్‌కు సంబంధించి ప్రసార హక్కులంటే సహజంగా ఉండే భారీ పోటీ ఈసారి కూడా కనిపిస్తోంది. టీవీ, డిజిటల్ హక్కుల కోసం దిగ్గజ సంస్థలు రంగంలో ఉన్నాయి. ఇప్పటి వరకు భారత క్రికెట్ హక్కులు ఉన్న స్టార్ సంస్థ మరోసారి దానిని దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. ఐపీఎల్ కూడా చేతిలో ఉన్న స్టార్‌కు ఇది కూడా లభిస్తే ఇక తిరుగుండదు. మరోవైపు ఐపీఎల్‌ను స్టార్‌కు కోల్పోయిన సోనీ కూడా పెద్ద మొత్తం ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది. స్టార్, సోనీలతో పాటు డిజిటల్ కోసం జియో, ఫేస్‌బుక్, గూగుల్ పోటీ పడుతున్నాయి. మరో డిజిటల్ సంస్థ ‘యప్ టీవీ’ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
అన్నింటికీ ఒకే రేటు...
ఈ ఐదేళ్ల కాలంలో భారత్ సొంతగడ్డపై పాకిస్తాన్, ఐర్లాండ్ మినహా అన్ని టెస్టు జట్లతో మ్యాచ్‌లు ఆడుతుంది. పెద్ద మొత్తంలో వీక్షకులను ఆకర్షించే సిరీస్‌లను చూస్తే 2019లో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టెస్టుల సిరీస్, 2021లో ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్, 2023లో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్ ముఖ్యమైనవి. అయితే బంగ్లాదేశ్, జింబాబ్వేలాంటి జట్లు కూడా పాల్గొనే ముక్కోణపు సిరీస్‌లు, అఫ్గానిస్తాన్‌తో టెస్టు కూడా ఉన్నాయి. దీనిపైనే స్టార్, సోనీ సంస్థలు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. భారత్ ఆడే మ్యాచ్‌లకు, వాటికి ఒకే కనీస ధర ఎలా నిర్ధారిస్తారని వారు ప్రశ్నించారు. అయితే బీసీసీఐ దీనిని కొట్టిపారేసింది. ‘ఐదేళ్లలో 80 శాతం మ్యాచ్‌లు భారత్ పెద్ద జట్లతోనే ఆడుతుంది. ప్రసారకర్తలకు అందులోనే డబ్బులు వచ్చేస్తాయి. మిగతా 20 శాతం చిన్న టీమ్‌లే అయినా వారి ఆదాయానికి నష్టం మాత్రం జరగదు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment