
భారత క్రికెటర్ల ప్రాక్టీస్‌కు బోర్డు ప్రణాళిక
టెస్టులకు సిద్ధంగా ఉంచే ఆలోచన
ముంబై: భారత క్రికెట్ జట్టు చక్కటి ప్రదర్శనతో ఇప్పటికే చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ చేరింది. తమ స్థాయికి తగినట్లుగా ఆడితే టైటిల్ కూడా సాధించే అవకాశం ఉంది. ఈ టోర్నీ ముగిసిన వెంటనే ఆటగాళ్లంతా ఐపీఎల్ హడావిడిలో పడిపోతారు. తమ ఫ్రాంచైజీల తరఫున సత్తా చాటేందుకు సిద్ధమైపోతారు. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం టీమిండియా ఇటీవలి టెస్టు ప్రదర్శనను పూర్తిగా మర్చిపోలేదు. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా 0–3తో చిత్తయిన భారత్ ఆ తర్వాత ఆ్రస్టేలియాలో 1–3తో సిరీస్ కోల్పోయింది.
ఇప్పుడు ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా జూన్–జులైలో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్ వెళ్లనుంది. ఈ కీలక సిరీస్‌కు ముందు అంతా ఐపీఎల్‌లోనే ఉంటారు కాబట్టి టెస్టుల సన్నద్ధతకు తగిన సమయమే లభించదు. గతంలో ఐపీఎల్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ వెళ్లిన సందర్భాల్లో (2011, 2014, 2018లలో) భారత్ చిత్తుగా ఓడి సిరీస్‌లు కోల్పోయింది. 2021 సిరీస్‌లో ముందంజలో నిలిచినా... కోవిడ్ కారణంగా కొద్ది రోజుల తర్వాత జరిగిన టెస్టుల ఓడి సిరీస్‌ను 2–2తో సమంగా ముగించింది.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ సమయంలోనూ భారత క్రికెటర్లు టెస్టులకు సిద్ధమయ్యేలా చూసే ప్రణాళికను బీసీసీఐ రూపొందిస్తోంది. పూర్తిగా టి20కే అంకితం కాకుండా టెస్టుల కోసం ఎర్రబంతితో సాధన చేసేలా చేయడమే దీని ఉద్దేశం. ఈ ప్రతిపాదన ప్రకారం టెస్టు జట్టులో సభ్యులైన భారత ఆటగాళ్లు రెండు నెలల పాటు పూర్తిగా ఐపీఎల్‌కే అంకితమైపోరు. ఒకవైపు ఐపీఎల్ ఆడుతూనే మరోవైపు రాబోయే టెస్టుల కోసం ప్రాక్టీస్ కొనసాగించాల్సి ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా సెషన్‌లు ఉంటాయి.
ఆటగాళ్లంతా ఇందులో పాల్గొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ముగిశాక దుబాయ్‌లో దీనికి సంబంధించి ఇప్పటికే బోర్డు అధికారులు చర్చించారు. చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత జరిగే మరో సమావేశంలో ఈ అంశంపై పూర్తి స్పష్టత వస్తుంది. మొత్తంగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను బోర్డు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ముందుగానే సన్నాహాలు మొదలు పెడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment