
ప్లేయర్లంతా టీమ్ బస్సులో ప్రయాణించాల్సిందే
ఐపీఎల్‌లోనూ బీసీసీఐ కఠిన నిబంధనలు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా పాటించాల్సిన నిబంధనల అంశంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠినంగా వ్యవహరించాలని భావిస్తోంది. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు టెస్టు సిరీస్ ‘వైట్‌వాష్’ కావడంతో పాటు... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించలేకపోవడంతో నిబంధనలను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించే సమయంలో కూడా భారత ఆటగాళ్లు టీమ్ బస్సుల్లోనే ప్రయాణించాలని వెల్లడించింది.
» ఆటగాళ్లు తప్పకుండా జట్టు సభ్యులతో కలిసి ‘టీమ్ బస్’లోనే ప్రయాణించేలా చూడాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు ఫ్రాంచైజీ యాజమాన్యాలకు సూచించింది.
» ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కుటుంబ సభ్యులను డ్రెస్సింగ్ రూమ్‌లోకి అనుమతించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. ప్రాక్టీస్ రోజుల్లోనూ దీన్ని కొనసాగించాలని సూచించింది. అనుమతించిన సిబ్బంది మినహా డ్రెస్సింగ్ రూమ్‌లోకి మరెవరికీ ప్రవేశం కల్పించకూడదని ప్రకటించింది.
» ప్లేయర్ల స్నేహితులు, సన్నిహితులు ఇతర వాహనాల్లో ప్రయాణిస్తూ... హాస్పిటాలిటీ ప్రాంతం నుంచి మ్యాచ్ ప్రాక్టీస్ చూడొచ్చు. నెట్ బౌలర్లు, త్రోడౌన్ స్పెషలిస్ట్‌లు కూడా బీసీసీఐ నుంచి అనుమతి తీసుకోవాల్సిందే.
» ఐపీఎల్ సందర్భంగా ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొన్న బీసీసీఐ... ‘ఆరెంజ్ క్యాప్’, ‘పర్పుల్ క్యాప్’ సాధించిన ఆటగాళ్లు మ్యాచ్ ఆరంభంలో కనీసం రెండు ఓవర్ల పాటైనా వాటిని ధరించాలని
సూచించింది. మ్యాచ్ అనంతరం బహుమతి ప్రదానోత్సవంలో ప్లేయర్లు స్లీవ్‌లెస్ జెర్సీలను ధరించకూడదని బీసీసీఐ వెల్లడించింది.
» మార్చి 22 నుంచి కోల్‌కతాలో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుండగా... దానికి ముందు ఈ నెల 20న ముంబై వేదికగా కెపె్టన్‌ల సమావేశం జరగనుంది. సాధారణంగా తొలి మ్యాచ్ జరిగే వేదికలోనే ఈ భేటీ జరుగుతుంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా ముంబైలో నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment