ఐపీఎల్ వేలం ప్రక్రియ
ఆక్షనర్‌గా మల్లికా సాగర్
ముంబై: ఐపీఎల్–2025 సీజన్ కోసం ఈ నెల 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా లోని జిద్దా నగరంలో వేలం జరగనుంది. వేలంలో మొత్తం 574 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. అయితే ఇంత మంది పేర్లను ఒక్కొక్కరిగా పిలిచి వేలం ప్రక్రియ కొనసాగించడం చాలా సుదీర్ఘంగా, కష్టతరంగా మారే అవకాశం ఉంది. దాంతో బీసీసీఐ ‘యాక్సిలరేటెడ్ ఆక్షన్’ అంటూ వేలాన్ని వేగంగా ముగించేందుకు సిద్ధమైంది. వేలంలో మొదటి 116 మంది కోసం మాత్రమే ఫ్రాంచైజీలు ముందుగా పోటీ పడతాయి.
వరుసగా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మార్క్యూ ప్లేయర్లు, స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, వికెట్‌కీపర్ బ్యాటర్లు, పేస్ బౌలర్లు, స్పిన్ బౌలర్లు... ఇలా వేలం సాగుతుంది. ఈ వరుసలో చివరగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని అన్‌క్యాప్డ్ ప్లేయర్లు వస్తారు. వీరి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దాంతో 117 నుంచి 574 నంబర్ వరకు ఉన్న ఆటగాళ్లను ఎంచుకునే విషయంలో ఫ్రాంచైజీలకు ముందే ఒక అవకాశం ఇస్తున్నారు.
తాము కోరుకుంటున్న ఆటగాళ్ల పేర్లను తొలి రోజు వేలం ముగిసిన తర్వాత రాత్రి 10 గంటల వరకు అందించాలి. వీరి పేర్లనే వేలంలో ప్రకటిస్తారు. అనంతరం అప్పటి వరకు అమ్ముడుపోని ఆటగాళ్లలో ఇంకా ఎవరినైనా తీసుకోవాలనే ఆలోచన ఉంటే వారి పేర్లను కూడా ఈ ‘యాక్సిలరేటెడ్ ఆక్షన్’లో చెప్పాల్సి ఉంటుంది. దీని వల్ల సమయం ఆదా అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
ఈ జాబితాలో 117వ ఆటగాడిగా ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్ ఉండగా... మిగిలిన వారిలో మొయిన్ అలీ, టిమ్ డేవిడ్, స్పెన్సర్ జాన్సన్, ఉమ్రాన్ మలిక్, ముస్తఫిజుర్, సాంట్నర్, నబీ, స్టీవ్ స్మిత్, సర్ఫరాజ్ ఖాన్, జేమ్స్ అండర్సన్ తదితర గుర్తింపు పొందిన ఆటగాళ్లు ఉన్నారు. ఈ వేలం ప్రక్రియను ప్రముఖ ఆక్షనీర్ మల్లికా సాగర్ నిర్వహించనుంది. గత ఏడాది కూడా ఆమెనే ఆక్షనర్‌గా వ్యవహరించింది.
మరోవైపు భారత్, ఆ్రస్టేలియా మధ్య జరిగే పెర్త్ టెస్టు మూడో, నాలుగో రోజుల్లో ఈ వేలం నిర్వహించడంపై కాస్త చర్చ జరిగింది. అయితే సమయం భిన్నంగా ఉండటం వల్ల ఆటగాళ్లు, అభిమానులు కూడా పూర్తి స్థాయిలో వేలం ప్రక్రియను అనుసరించవచ్చు. భారత కాలమానం ప్రకారం టెస్టు ఆట మధ్యాహ్నం గం. 2:50 నిమిషాలకు ముగుస్తుంది. వేలం మధ్యాహ్నం గం. 3:30
నిమిషాలకు ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment