న్యూఢిల్లీ: నిర్భయపై పాశవిక అత్యాచారానికి పాల్పడిన ముకేశ్ సింగ్ ఇంటర్వ్యూ ఉన్న డాక్యుమెంటరీని విదేశాల్లో సహా ఎక్కడా, ఏ విధంగానూ.. ప్రసారం కానీ, ప్రచురణ కానీ కాకుండా చూస్తామని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియా సహా ఎక్కడ, ఏ విధంగా కూడా ఆ డాక్యుమెంటరీ టెలికాస్ట్ కాకుండా చర్యలు తీసుకోవాలని బీబీసీ, భారతీయ విదేశాంగ శాఖ, సమాచార సాంకేతిక విభాగాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ డాక్యుమెంటరీ ప్రసారం, ప్రచురణ కాకుండా చూస్తామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం పార్లమెంటు ఉభయసభల్లో ప్రకటన చేశారు.
దీనిపై దేశమంతా సిగ్గుపడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇంటర్వ్యూకు అనుమతి ఎలా లభించిందనే విషయంపై దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తీహార్ జైలు డెరైక్టర్ జనరల్ అలోక్ కుమార్ వర్మను రాజ్‌నాథ్ పిలిపించి వివరణ తీసుకున్నారు. కాగా, ఈ లఘుచిత్రాన్ని ఈ నెల 8వ తేదీన మహిళాదినోత్సవం సందర్భంగా ప్రసారం చేయాలనుకున్న బీబీసీ.. అంతకన్నా ముందుగానే బుధవారం రాత్రి 10 గంటలకు బ్రిటన్‌లో ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. తమపై చర్య తీసుకునే ముందు ప్రధాని మోదీ ఆ లఘు చిత్రాన్ని ఒకసారి చూడాలని కోరింది.
మహిళాసభ్యుల వాకౌట్
ఈ ఉదంతంపై బుధవారం పార్లమెంటు అట్టుడికింది. ముఖ్యంగా మహిళా సభ్యులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీహార్ జైళ్లో ఉన్న గ్యాంగ్ రేప్ దోషిని ఇంటర్వ్యూ చేసేందుకు అనుమతి లభించడానికి కారణమైన వారిపైచర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేశారు. ఆ డాక్యుమెంటరీలో అశ్లీల పదజాలం వాడటాన్ని బార్‌కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. దీనిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజ్యసభలో విపక్ష పార్టీలకు చెందిన మహ ళా సభ్యులంతా వెల్‌లోకి దూసుకెళ్లారు.
ఆ డాక్యుమెంటరీని ప్రసారం కానివ్వం!
Published Thu, Mar 5 2015 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM
Advertisement