ట్రాయ్ సంచలన ప్రతిపాదన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కేబుల్ బ్రాడకాస్టర్స్ వసూలు చేసే కేబుల్ టారిఫ్ పై ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) సంచలన నిర్ణయం తీసుకుంది. కేబుల్ ప్రసారాల డిజిటలైజేషన్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో డిజిటలైజేషన్ కేబుల్ ధరలపై కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వినియోగదారుల నుంచి వసూలు చేసే చార్జీలపై పరిమితిని విధించాలని ప్రతిపాదించింది. అధిక మొత్తాలను వసూలు చేయకుండా వంద చానళ్లను ప్రసారం చేసే సెట్ టాప్ బాక్స్ కు నెలకు రూ. 130 మాత్రమే వసూలు చేయాలని చెప్పింది. ఈ నిబంధన కింద కచ్చితంగా 100 చానళ్లను కస్టమర్లకు అందించాల్సిందేనని తెలిపింది.
దీని ప్రకారం ప్రతి ప్రసార లేదా వేర్వేరు భౌగోళిక ప్రాంతాలలో పే, ఫ్రీ ఛానల్స్ వివరాలను స్పష్టంగా ప్రకటించాలని కోరింది. ఇంకా ఎక్కువ చానళ్లు కావాలని భావించే వారి కోసం పలు శ్లాబ్ లను ప్రకటిస్తూ, రూ. 25 చొప్పున అదనంగా చెల్లించి ఆ చానళ్లను తీసుకోవచ్చని పేర్కొంది. తమకు నచ్చిన చానళ్లను వీక్షించే సౌలభ్యాన్ని దగ్గర చేసేందుకే ఈ మార్పులు చేసినట్టు ట్రాయ్ అధికారి ఒకరు వివరించారు. డ్రాఫ్ట్ టెలికమ్యూనికేషన్ (బ్రాడ్కాస్టింగ్ మరియు కేబుల్ సేవలు) (ఎనిమిదవ) (అడ్రస్బుల్ సిస్టమ్స్) టారిఫ్ ఆర్డర్, 2016 ను రిలీజ్ చేసిన ట్రాయ్ దీనిపై లిఖిత పూర్వక అభిప్రాయాలను అక్టోబర్ 24, 2016 లోపు తెలియజేయాలని కోరింది. మరోవైపు ట్రాయ్ ప్రతిపాదనలపై ఎనలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
టెలికాం రెగ్యులేటరీ సరైన నిర్ణయం తీసుకుందని, కానీ పరిష్కరించాల్సిన కొన్ని సమస్యలు ఉన్నాయని పెట్టుబడి బ్యాంకు అమెరికా మెర్రిల్ లించ్ పేర్కొంది. కేటగిరీలను స్పష్టంగా నిర్వచించిన లేదని తెలిపింది. డిజిటైజేషన్ ఇప్పటికీ పూర్తి కాకలేదని, ఎవరెవరు ఎంతెంత చెల్లిస్తున్నారనేది క్లారిటీ లేదని పేర్కొంది. అలాగే ఈ కొత్త ధరలపై వినియోగదారులకు అవగాహన కల్పిండానికి సమయం తీసుకుంటుందని వ్యాఖ్యానించింది. అలాగే ఈ ప్రతిపాదన నచ్చని బ్రాడ్ కాస్టర్స్ కోర్టు కెళ్లి స్టే తెచ్చుకుంటారని అభిప్రాయపడింది. ధర పరిమితి విధించడం సహేతుకమైనదని కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ తెలిపింది. ట్రాయ్ ప్రతిపాదిత టారిఫ్ ముఖ్య లక్ష్యం వినియోగదారుల ఆసక్తిని రక్షించుకోవడమేనని పేర్కొంది.