దైనందిన జీవితంలో టీవీ ఒక భాగంగా.. విడదీయలేని బంధంగా మారింది. ఉదయం నిద్ర లేచిన నుంచి పడుకునే వరకు ఇంట్లో టీవీ నడుస్తూనే ఉంటుంది. టీవీలకు పెరుగుతున్న ప్రాముఖ్యతను గుర్తించి ఆస్పత్రులు, దుకాణాలు, చివరకు టీ షాపుల్లో కూడా టీవీ పెడుతున్నారు యజమానులు. మారుతున్న లైఫ్ స్టైల్‌కు తోడుగా కొత్త కొత్త చానళ్లు పుట్టుకోస్తున్నాయి. ఒక్కో వయస్సు వారు ఒక్కో తీరు చానల్‌కు అలవాటు పడిపోతున్నారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఈనెల 29 నుంచి టారిఫ్ ఆర్డర్ ప్రకారం నెలవారి బిల్లు ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది.
అల్లిపురం(విశాఖ దక్షిణం): బుల్లితెర(టీవీ) ప్రేక్షకులకు కొత్త సంవత్సరం నుంచి వినోదం మరింత భారం కానుంది. కేబుల్ టీవీతో పాటు డీటీహెచ్‌ల ద్వారా ప్రసారం అవుతున్న ప్రసారాలను వీక్షించే వినియోగదారులు ఇక అదనపు భారం మోయకతప్పదు. కేబుల్ ప్రసారాలపై టెలికామ్ రెగ్యూలెటరీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) కొత్త టారీఫ్‌ను ప్రకటించింది. కొత్త ఎమ్మార్పీ ప్రకారం టెలివిజన్ ప్రేక్షకులు ప్రస్తుతం ప్రతి నెలా చెల్లిస్తున్న బిల్లుల కన్నా ఎక్కువగా చెల్లించాల్సి పరిస్థితి ఏర్పడనుంది. దీంతో విశాఖ నగర పరిధిలో సుమారు 5 లక్షలు, రూరల్ పరిధిలో దాదాపు 4 లక్షల మంది మొత్తం 9 లక్షల మంది వినియోగదారులపై భారం పడనుంది.
కొత్త విధానంతో బాదుడు
ఇప్పటి వరకు అన్ని చానళ్లు ఒకే ప్యాకేజీలో తక్కువ ధరకే వచ్చేవి. ట్రాయ్ కొత్త నింబంధనలతో ఇక చానళ్ల ధరలు కొండెక్కనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నెలనెలా చెల్లిస్తున్న రూ.150 నుంచి రూ.200 దాదాపు మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. డీటీహెచ్ ధరలు కూడా అమాంతంగా పెరిగే అవకాశం ఉంది. కొత్త కేబుల్ విధానం ద్వారా కేబుల్ టీవీ కనెక్షన్‌కు ప్రీపెయిడ్ పద్ధతిలో ముందే చెల్లించాల్సి ఉంటుంది. ఉచితంగా ప్రసారమవుతున్న చానళ్లకు మాత్రమే కేబుల్ టీవీ సంస్థలకు రూ.130తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. మిగతా చానళ్లు చూడాలనుకుంటే అదనంగా డబ్బులు చెల్లించాలి. ప్రస్తుతం విధానం ప్రకారం వచ్చే చానళ్లన్నీ ఈనెల 29తో నిలిచిపోనున్నాయి. 30 నుంచి ఫ్రీ టూ ఎయిర్ చానళ్లు మాత్రమే వస్తాయి. కేబుల్ టీవీ ప్రసారం చేస్తున్న చానళ్లలో ఉచితంగా వార్తా చానళ్లు, వినోదభరితమైన చానళ్లు, కొన్ని స్పోర్ట్స్ చానళ్లు వీక్షించవచ్చు. ప్రస్తుతం నెలకు రూ.200 నుంచి రూ.250 వరకు చార్జీలు తీసుకుంటున్న తరుణంలో..మారిన టారిఫ్ ప్రకారం రూ.130తో పాటు జీఎస్టీ 18శాతం చెల్లిస్తే ఫ్రీ ఎయిర్ చానళ్లు వస్తాయి. మిగతా చానళ్ల ప్రసారానికి ట్రాయ్ నిర్ధేశింంచిన నింబంధనల ప్రకారం చార్టీలు చెల్లించి రీచార్జ్ చేసుకుంటేనే వీక్షించే అవకాశం ఉంటుంది.
నిరసన బాటలో కేబుల్ ఆపరేటర్లు
కొత్త టారిఫ్‌పై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంటుందని, దీనిని మరికొద్ది రోజులు వాయిదా వేయాలని కేబుల్ ఆపరేటర్లు డిమాండ్ చేస్తూ ఈ నెల 29న నిరసనకు సిద్ధమవుతున్నారు. ప్రజల నుంచి కూడా ఇదే డిమాండ్ వినిపిస్తోంది. ఒకేసారి భారం వేయకుండా, ప్రస్తుతం వస్తున్న చానళ్లను వెంటనే నిలిపివేయకుండా కొద్ది రోజులు ప్రసారం చేయడానికి కేబుల్ ఆపరేటర్లు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తుంది.
చానళ్ల వారీగా రుసుములు
స్టార్ మా చానెల్ ప్యాకేజీ : మా మూవీస్, మా గోల్డ్, మా మ్యూజిక్, స్టార్‌స్పోర్ట్స్, మరో ఎంటర్‌టైన్‌మెంట్ చానల్(నెల ఖర్చు): రూ.39
జెమిని చానెల్ ప్యాకేజీ : జెమిని మూవీస్, జెమిని కామెడీ, జెమిని మ్యూజిక్, ఖుషి టీవీ, జెమిని లైఫ్, జెమిని న్యూస్ : రూ.30
జీ తెలుగు ప్యాకేజీ : జీ తెలుగు,
జీ సినిమా : రూ.20
కేవలం మా టీవీ, జెమిని, జీ తెలుగు, ఈ టీవీ చానళ్లను చూడాలంటే ఒక్కో చానల్ ప్రసారానికి రూ.19
ఈ విధంగా స్టార్ మా, సోనీ, స్పోర్ట్సు చానళ్లకు ప్యాకేజీలు నిర్ణయించారు. వాటికి 18 శాతం జీఎస్‌టీ అదనంగా కట్టాల్సి ఉంటుంది. ఆ పైన ప్రతి చానల్‌కు ఒక రేటు పెట్టి దానిపై కూడా జీఎస్‌టీ కట్టాల్సిన పరిస్థితి. ఈ విధంగా జీఎస్‌టీ భారం ప్రతి చానల్‌కు కట్టడం వల్ల ఎక్కువ శాతం జీఎస్‌టీ కట్టాల్సిందే.
చానళ్ల వారీగా వసూలు దారుణం
ప్రజలు వినోదం, ప్రశాంతత కోసం టీవీ చూస్తుంటారు. దీనిని కూడా కేంద్రం ప్రభుత్వం వదిలిపెట్టడం లేదు. ప్రజలకు టీవీ వినోదాన్ని దూరం చేస్తున్నాయి. ట్రాయ్ కొత్త నిబంధనలతో ప్రజలపై అదనపు భారం పడుతోంది. చానళ్లకు రేటు, ప్యాకేజీలకు డబ్బులు చెల్లించే పరిస్థితులు చాలా దారుణం. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి పెంచిన ధరలు సడలించాలి.– మద్దాల వెంకటవరలక్ష్మి,గృహిణి, పాత వెంకోజిపాలెం
Comments
Please login to add a commentAdd a comment