సాక్షి, హైదరాబాద్: హైకోర్టులోని 29 కోర్టు హాళ్లలో విచారణల ప్రత్యక్ష ప్రసారాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే సోమవారం ప్రారంభించారు. ఉదయం 10.15 గంటలకు హైకోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రత్యక్ష ప్రసార సేవలను ప్రారంభించి.. న్యాయవాదులకు, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత 10.30 గంటల నుంచి కోర్టుల విచారణలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. ప్రత్యక్ష ప్రసారాలతో న్యాయ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువవుతుందని సీజే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
లింక్ క్లిక్ చేస్తే...
హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించిన లింక్ ఇచ్చారు. ఈ లింక్ ద్వారా కోర్టును ఎంపిక చేసుకుని ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించవచ్చు. ఫస్ట్ కోర్టు విచారణ ప్రత్యక్ష ప్రసారం ఇప్పటికే అందుబాటులో ఉంది. కరోనా సమయంలో ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగగా, ఆ తర్వాత హైబ్రిడ్ విధానంలో విచారణ చేపడుతున్నారు. 2020లో ప్రత్యక్ష ప్రసారాలను అందుబాటులోకి తెచ్చిన గుజరాత్ హైకోర్టు, ఆ తర్వాత యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించింది.
కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, కోల్‌కతా, ఛత్తీస్‌గడ్ హైకోర్టులు కూడా ప్రత్యక్ష ప్రసారాలు, యూట్యూబ్ చానల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ప్రత్యక్ష ప్రసారాలతో పారదర్శకత పెరుగుతుందని న్యాయ నిపుణులు పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, హైకోర్టు, కిందికోర్టుల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతూ 2022లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) కూడా దాఖలైంది.
దీనిపై విచారణ చేపట్టిన నాటి సీజే ధర్మాసనం.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రత్యక్ష ప్రసారాలకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోభాగంగా ప్రసారాలకు కావాల్సిన మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కలి్పంచింది.
Comments
Please login to add a commentAdd a comment