Lands Registrations
-
జోరందుకున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ.. మరింత రద్దీ
సాక్షి, ఖమ్మం : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించడంతో రిజిస్టేషన్ల ప్రక్రియ జోరందుకుంది. మొన్నటి వరకు స్తబ్దుగా నడిచిన రిజిస్టేషన్ల ప్రక్రియ తాజా ప్రభుత్వ నిర్ణయంతో పుంజుకుంది. ఎల్ఆర్ఎస్తో సంబంధం లేకుండా పాత పద్దతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్లు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. పాత వాటికి లింకు డాక్యుమెంట్లు ఉంటే సరిపోతుందని, అయితే కొత్తవాటికి మాత్రం ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్టేషన్ చేస్తున్నామని సబ్ రిజిస్టార్ అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. చదవండి: హమ్మయ్య.. ఎల్ఆర్ఎస్ ఉపశమనం ఎల్ఆర్ఎస్ రద్దుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 11సబ్ రిజిస్ట్రార్ కార్యాయాల పరిధిలో రోజువారి రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే కొంత ఆలస్యమైన ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని క్రయవిక్రయాలకు సంబందించి రిజిస్టర్ కార్యాలయాలకు వచ్చేవారు చెప్పుకొస్తున్నారు. న్యూ ఇయర్‌కు ఒక మంచి గిఫ్ట్‌గా భావిస్తున్నామని చెబుతున్నారు. కాగా రిజిస్టేషన్ల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ధరణి పోర్టల్‌తోపాటు ఎల్ఆర్ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. గతంలో అన్ని రకాల ఆస్తుల రిజిస్టేషన్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిర్వహించేవారు. అయితే కొత్త పద్దతిలో మాత్రం వ్యవసాయ ఆస్తుల రిజిస్టేషన్లను తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించాలని, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. -
హమ్మయ్య.. ఎల్ఆర్ఎస్ ఉపశమనం
ప్లాట్ల యజమానులకు ఉపశమనం ఎల్ఆర్ఎస్ ఊరట సాక్షి, హైదరాబాద్: ఎల్ఆర్ఎస్తో సంబంధం లేకుండానే రాష్ట్రంలో వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రిజిస్టర్ అయిన ప్లాట్లు, నిర్మాణాలు పూర్తయిన వాటికి రిజిస్ట్రేషన్లను గతంలో మాదిరిగా ప్రారంభించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ వి.శేషాద్రి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, డెవలపర్లు మొదటిసారి అమ్మే క్రమంలో కొత్తగా రిజిస్ట్రేషన్‌కు వచ్చే ప్లాట్లకు మాత్రం సంబంధిత అనుమతులు ఉండాలని లేదా ఆ ప్లాటు అనుమతి పొందిన లే–అవుట్లో ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే గతంలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, బీపీఎస్‌ల ద్వారా అనుమతులు పొందిన లే–అవుట్లు, ప్లాట్లు, భవనాలు, నిర్మాణాల విషయంలోనూ ఎలాంటి ఆంక్షలు లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని తెలిపారు. ఈ మేరకు ఈ ఏడాది ఆగస్టు 26న జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు ఉత్తర్వుల ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకునే క్రమంలో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేస్తున్నామని, రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్లు ఈ ఆదేశాలను అమలు చేయాలని ఉత్తర్వుల్లో శేషాద్రి పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్పై సర్కారు నిర్ణయంతో రిజిస్ట్రేషన్లకు తొలగిన అడ్డంకి సాక్షి, హైదరాబాద్: ఇళ్లో, పొలమో, ప్లాటో, ఇతర ఆస్తులో అమ్ముకోనిదే ఈ రోజుల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు, పిల్లల ఉన్నత చదువులు, భారీ వైద్య ఖర్చులు సామాన్యులకు సాధ్యంకాదు. అలాంటిది మూడున్నర నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనధికార ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు లే–అవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్)తో ముడిపెట్టడం దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది. గత సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను అకస్మాత్తుగా నిలిపివేసింది. ఈ నెల 21 నుంచి పాత విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించినా ఎల్ఆర్ఎస్ నిబంధన ఇబ్బందిగా మారింది. ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకున్న ప్రభుత్వం కనీసం ఒకసారి రిజిస్ట్రేషన్ జరిగిన అనధికార ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకోవడం సామాన్యులకు భారీ ఉపశమనం కల్పించినట్లు అయింది. మరోవైపు అనధికార ప్లాట్ల కొనుగోళ్లకు అడ్వాన్సులు చెల్లించిన కొనుగోలుదారులకు సైతం ఊరట లభించింది. అనధికార ప్లాట్లను ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకోకుంటే.. రిజిస్ట్రేషన్లు జరపమని గత ఆగస్టు 31న జారీ చేసిన జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. సామాన్యుల గురించి ఆలోచించాలి... ఎల్ఆర్ఎస్ ఫీజుల విషయంలో సైతం పునరాలోచన చేయాలని ప్రభుత్వంపై పలు వర్గాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ఫీజులు అసాధారణంగా ఉన్నాయని, సామాన్యుల కోణం నుంచి చూసి ఎల్ఆర్ఎస్ ఫీజులను తగ్గించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎప్పుడో ఏళ్ల కింద కొనుగోలు చేసిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు రూ.లక్షలు చెల్లించడం ఇబ్బందికరమేనని స్థిరాస్తి వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. నగరాలు, పట్టణాలు, పల్లెల్లోని అనధికార ప్లాట్ల క్రమబద్ధీకరణను తప్పనిసరి చేస్తూ ఆగస్టు 31న ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ జీవో 131ను తీసుకురాగా, గత అక్టోబర్ 31తో గడువు ముగిసింది. మొత్తం 25.59 లక్షల దరఖాస్తులొచ్చాయి. దరఖాస్తుల పరిష్కారానికి విధివిధానాలను ఇంకా రూపకల్పన చేయలేదు. దీంతో వీటిని పరిష్కరించే ప్రక్రియను ప్రారంభించడం సాధ్యం కావడం లేదు. జీవోలోని నిబంధనల ప్రకారం.. జనవరి 31లోగా దరఖాస్తుదారులు మొత్తం క్రమబద్ధీకరణ ఫీజులు చెల్లించాలి. దీనికి నెల రోజుల వ్యవధి మాత్రమే ఉన్నా ఇప్పటివరకు వారికి ఫీజుల వివరాల లేఖలు అందలేదు. దరఖాస్తుదారుల్లో అత్యధికులు ఇటీవల కొత్తగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారేనని, దీంతో వారు 10 శాతం ఖాళీ స్థలం లేని కారణంగా 14 శాతం ప్లాటు ధరను ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా చెల్లించాల్సి ఉంటుందని, ఇది పెనుభారంగా మారనుందని దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ►ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలి. ఇది ప్రజలకు వ్యతిరేకం. ఎల్ఆర్ఎస్ జీవోలోని నిబంధనల ప్రకారం ఇళ్లను కట్టుకున్న ప్లాట్లను సైతం క్రమబద్ధీకరించుకోవాల్సిందే. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు 10 శాతం ఖాళీ స్థలం లేదన్న కారణంతో 14 శాతం ప్లాటు ధరను ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా చెల్లించాలన్న నిబంధన సరైనది కాదు. – ప్రవీణ్, తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు ►సదుద్దేశంతోనే ప్రభుత్వం ధరణి, ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చింది. అమలులో లోపాల వల్లే ప్రజలకు ఇబ్బందులు వచ్చాయి. సామాన్యుల కోణం నుంచి చూసి ఎల్ఆర్ఎస్ ఫీజుల విషయంలో నిర్ణయం తీసుకోవాలి. రిజిస్ట్రేషన్లను మూడున్నర నెలల పాటు నిలుపుదల చేయడంతో నగదు చేతులు మారక(క్యాష్ ఫ్లో) తీవ్ర ఇబ్బందులు వచ్చాయి. జీతాలు చెల్లించడం, నిర్మాణ పనులు కొనసాగించడం, బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించడం కష్టమైంది. – ట్రెడా, క్రెడా సంస్థల ముఖ్యులు -
ఎల్ఆర్ఎస్ ఎత్తివేత: కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతినిచ్చింది. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కొత్తగా వేసిన లే అవుట్లకు మాత్రం ఎల్ఆర్ఎస్ తప్పనిసరి అని పేర్కొన్నారు. కొత్త ప్లాట్లకు మాత్రం సంబంధిత సంస్థల అప్రూవల్ పొందిన తర్వాతే రిజిస్ట్రేషన్ జరగనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలిగాయి. ఈ మేరకు మంగళవారం ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని భావించిన సర్కార్.. మూడు నెలల క్రితం ఇందుకోసం ధరణి వెబ్‌సైట్‌తో పాటు ఎల్ఆర్ఎస్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ప్రతి ఫ్లాట్‌కు ఎల్ఆర్ఎస్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొన్ని నెలల ప్రతిష్టంభన తరువాత తిరిగి పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేపట్టాలని కొద్దిరోజుల క్రితం నిర్ణయించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన నియంత్రిత సాగు విధానాన్ని సైతం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. -
వినయ విధేయ తహసీల్దార్
విడవలూరు: ఆయనొక తహసీల్దార్. పేదలకు అండగా నిలవాల్సిన వ్యక్తి పెద్దలకు వినయ, విధేయుడిగా మారాడు. అక్రమ సొమ్ముపై ఆశతో సెలవు దినాల్లో కూడా చుక్కల భూములకు పట్టాలు చేస్తున్నారు. ♦ విడవలూరు మండలంలో తీర ప్రాంతమైన ఊటుకూరు పంచాయతీ పరిధిలోని పల్లిపాళెం గ్రామంలో ప్రస్తుతం ఆక్వా గుంతల భూముల్లో సర్వే నంబర్లు 942–1, 942–2, 1300, 1398, 1399లలో దాదాపు 14.5 ఎకరాల చుక్కలు భూములు ఉన్నాయి. వీటికి రికార్డులు తారుమారు చేసి పట్టాలను సృష్టించేందుకు కోవూరు మండలం పడుగుపాడుకు చెందిన టీడీపీ నాయకులతో తహసీల్దార్ నౌషాద్ అహ్మద్ చేతులు కలిపాడని ఆరోపణలున్నాయి. ♦ ముదివర్తిలో ఉన్న 2.5 ఎకరాలు, పల్లిపాళెం వద్ద ఉన్న మరో నాలుగు ఎకరాలకు కూడా రికార్డులు తారుమారు చేసి పట్టాలను ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తహసీల్దార్‌కు భారీ మొత్తంలో నగదు అందినట్లు సమాచారం. ♦ ఈ పనులకు తహసీల్దార్ నౌషాద్ అహ్మద్ సెలవు రోజు శనివారం మధ్యాహ్నం కార్యాలయానికి చేరుకున్నాడు. తన కారులో వస్తే స్థానికులకు అనుమానం వస్తుందని పడుగుపాడుకు చెందిన వ్యక్తి కారులో కార్యాలయానికి చేరుకున్నారు. ♦ తహసీల్దార్‌తో పాటు మరికొందరు రెవెన్యూ అధికారులను కూడా కార్యాలయానికి పిలిపించుకుని గుట్టు చప్పుడు కాకుండా పని ముగించే ప్రయత్నం చేశారు. ♦ విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు సెలవు దినాల్లో కూడా తహసీల్దార్ కార్యాలయం వద్ద కార్లు ఉండటాన్ని గమనించి ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయట పడింది. ♦ చుక్కల భూములకు పట్టాలు సృష్టించేందుకు తహసీల్దార్ ప్రయత్నించడం ప్రభుత్వాన్నే మోసం చేయడమని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు ఈ విషయమై జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబుకు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆదివారం ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి స్థానంలో ఉన్న తహసీల్దార్ ఇలా చుక్కల భూములకు పట్టాలను పుట్టించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. దీనిపై విచారణ జరపాలని ఆయన కోరారు. -
స్థిరాస్తులకు కొత్త రేట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సవరించింది. కొత్త రేట్లు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. భూములు, స్థలాల విలువల విషయంలో బహిరంగ మార్కెట్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఏటా, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి రిజిస్ట్రేషన్ విలువలను సవరించాల్సి ఉంది. 2017లో గ్రామీణ ప్రాం తాల్లోనూ, 2018లో పట్టణ ప్రాంతాల్లోనూ స్థిరాస్తి విలువలను సవరించారు. ఇప్పుడు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువల సవరణకు ప్రభు త్వం ఆమోదం తెలిపింది. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో భూములు, స్థలాల ప్రస్తుత మార్కెట్ విలువలను పరిశీలించి వాస్తవ పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని పది శాతం లోపు పెంచాలని ఆదేశించింది. అంతకు మించి ఎక్కడా పెంచడానికి వీలులేదని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ విలువలను కొన్నిచోట్ల పెంచలేదు. ఇంకొన్ని ప్రాంతాల్లో 5 నుంచి పది శాతం వరకూ పెంచారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని మండలాలు, గ్రామాల వారీ రహదారి పక్కనున్న భూములు, మెట్ట, మాగాణిలకు సర్వే నంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ విలువలు ప్రతిపాదిం చారు. ఈ ప్రతిపాదనలను మున్సిపాలిటీల్లో జాయింట్ కలెక్టర్లు, గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ డివిజనల్ అధికారుల అధ్యక్షతన గల మార్కెట్ విలువల సవరణ కమిటీలు ఆమోదించాయి. దీంతో రిజిస్ట్రేషన్ అధికారులు ఈ రేట్లను రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో నమోదు చేశారు. కట్టడాల మార్కెట్ విలువలు ఇలా కట్టడాలకు కొత్త రిజిస్ట్రేషన్ విలువలను రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ కార్యాలయం ఖరారు చేసింది. పట్టణాభివృద్ధి సంస్థలు, నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, మాస్టర్‌ప్లాన్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలను ఒక విభాగంగా, మేజర్ పంచాయతీలు, మున్సిపల్ నోటిఫైడ్ ప్రాంతాల్లోకి వచ్చేవి, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో కలిసే పంచాయతీలను మరో విభాగంగా, మైనర్ పంచాయతీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో కలుస్తున్న మైనర్ పంచాయతీలను మరో విభాగంగా కట్టడాలకు మార్కెట్ విలువలను నిర్ధారించారు. భవనాలను కొనుగోలు చేసేవారు ఆ కట్టడాల విలువ, భూమి విలువకు కలిపి రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో చదరపు అడుగు మార్కెట్ విలువ రూ.5 వేలు ఉందనుకుంటే 200 చదరపు అడుగుల స్థలం విలువ రూ.10 లక్షలు అవుతుంది. అడుగు కట్టడం విలువ రూ.1,100 ప్రకారం 200 చదరపు అడుగుల కట్టడం విలువ రూ.11 లక్షలు అవుతుంది. ఈ రెండింటినీ కలిపి మొత్తం భవనం విలువ రూ.21 లక్షలు అవుతుంది. దీనిని కొనుగోలు చేసిన వారు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రూ.21 లక్షలపై 5 శాతం స్టాంప్ డ్యూటీ, 1.5 శాతం బదిలీ సుంకం, 1 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి మొత్తం 7.5 శాతం రిజిస్ట్రేషన్ రుసుముల కింద చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణాలు పూర్తికాకుండా వివిధ దశల్లో ఉన్న వాటికి ఈ ధరల్లో కొన్ని విభాగాలు పెట్టారు. ఫౌండేషన్ స్థాయిలో ఉన్న కట్టడాలకు ఇందులో 25 శాతం, శ్లాబ్ లెవల్ వరకూ ఉన్న వాటికి 65 శాతం, పూర్తికావడానికి సిద్ధంగా ఉన్న వాటికి 85 శాతం ధర నిర్ణయిస్తారు. అలాగే పదేళ్లలోపు నిర్మించిన వాటికి ఎలాంటి తరుగుదల ఉండదు. పదేళ్ల కంటే ముందు నిర్మించిన ఇళ్లకు ఏడాదికి ఒక శాతం చొప్పున తరుగుదల వేస్తారు. ఇది గరిష్టంగా 70 శాతం వరకూ ఉండవచ్చు. -
ఈనాం భూములు స్వాహా!
సాక్షి, అమరావతి: ♦ 1956 ఈనాం(అబాలిషన్ అండ్ కన్వర్షన్) చట్టం ప్రకారం.. ఈనాం భూములను చారిటబుల్ సంస్థలు, దేవాలయాలకు సేవలందిస్తున్న వారు కేవలం అనుభవించాలి. ఇతరులకు బదిలీ చేయడానికి, విక్రయించడానికి ఎలాంటి హక్కు ఉండదు. ♦ 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఈనాం భూములకు రైత్వారీ పట్టాలు ఇవ్వడం చట్టవిరుద్ధం. ఆ భూములను ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయడం నేరం. ఇప్పటికే అలాంటివి జరిగితే అవేమీ చెల్లుబాటు కావు. ♦ 2013లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం.. ఈనాం భూములకు ఇచ్చిన రైత్వారీ పట్టాలు చెల్లుబాటు కావు. ఆ భూములను నిర్దేశిత సంస్థలకు సేవలందిస్తున్న వారు ఆ సేవలు అందించే సమయం వరకు మాత్రమే అనుభవించాలి. ♦ 2015 డిసెంబర్లో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఈనాం భూములకు రైత్వారీ పట్టాలు ఇవ్వకూడదు. ఆ భూముల క్రయ విక్రయాలపై నిషేధం విధించాలి. ఈనాం భూముల విషయంలో చట్టాలు, కోర్టు తీర్పులను కూడా ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు లెక్కచేయడం లేదు. రాష్ట్రంలో అత్యంత విలువైన ఈనాం భూములను మింగేసేందుకు చురుగ్గా పావులు కదుపుతున్నారు. రూ.వేల కోట్ల విలువైన వేలాది ఎకరాల ఈనాం భూములను టీడీపీ నేతలకు దఖలు పరిచేందుకు సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ చేసేందుకు సన్నద్ధం కావడంపై అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. చట్టవిరుద్ధంగా చేతులు మారిన ఈనాం భూముల క్రయ విక్రయాలకు అవకాశం లేకుండా నిషేధిత ఆస్తుల జాబితా(పీఓబీ)లో పెట్టాలంటూ ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా తమ వారికి ఈ విలువైన ఆస్తులను కట్టబెట్టేందుకు సర్కారు పెద్దలు చకచకా పావులు కదిపారు. చట్ట సవరణ ముసాయిదాను సిద్ధం చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. దీంతో సర్కారు తీరు కంచే చేను మేసిన చందంగా మారిందని అధికారులు అంటున్నారు. చట్ట సవరణ ప్రతిపాదనలు ఈనాం భూములపై కన్నేసిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు అధికారులతో ఓ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈనాం భూములను రైత్వారీ పట్టాలున్న వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుగా చట్టంలో సవరణలు ప్రతిపాదించాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. అందుకు అనుగుణంగా అధికారుల కమిటీ చట్ట సవరణ ప్రతిపాదనలను రూపొందించి, న్యాయశాఖ పరిశీలనకు పంపించింది. అయితే, హైకోర్టు తీర్పు మేరకు ఈనాం భూముల్లో రైత్వారీ పట్టాలతో ఉన్న వారిని అక్రమణదారులుగా భావించి తొలగించాల్సి ఉంది. అయితే, హైకోర్టు తీర్పును ప్రభుత్వ పెద్దలు లెక్కచేయడం లేదు. చారిటబుల్, దేవాలయాల సంస్థలకు సేవలందించకుండా ఈనాం భూములను అనుభవిస్తున్న వారిని ఆక్రమణదారులుగా పరిగణించి వారి నుంచి ఆ భూములను స్వాధీనం చేసుకుని ఆయా చారిటబుల్ ట్రస్టులు, దేవాలయాల సంస్థల ఆధీనంలో ఉంచాలని హైకోర్టు తీర్పు స్పష్టం చేసింది. రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున చట్టసవరణ చేయించి భూములను చట్టబద్ధంగా సొంతం చేసుకోవాలనే స్వార్థంతో కొందరు టీడీపీ నేతలు చట్టవిరుద్ధంగా బినామీ పేర్లతో ఈనాం భూములకు రైత్వారీ పట్టాలు ఇప్పించుకున్నారు. వారి నుంచి కొనుగోలు చేసుకున్నట్లు పత్రాలు రాయించుకున్నారు. మరికొందరు నామమాత్రపు ధరలతో చట్టవిరుద్ధంగా కొన్నారు. దీంతో అత్యంత విలువైన ఈ భూములన్నీ అధికార టీడీపీ నేతల చేతుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి విక్రయించుకోవడం ద్వారా రూ.వేల కోట్లు ఆర్జించాలనే ఉద్దేశంతో చట్టసవరణకు ప్రభుత్వ పెద్దలను ఒప్పించారు. వారికీ వాటా ఉండటంతో అందుకు తలూపిన ప్రభుత్వ పెద్దలు ఓకే చెప్పేశారు. చట్టం ఉన్నా అమలేదీ? గతంలో కొందరు 1956 ఈనాం(అబాలిషన్ అండ్ కన్వర్షన్) చట్టానికి వ్యతిరేకంగా ఈనాం భూములకు రైత్వారీ పట్టాలు ఇచ్చారు. ఈనాందారులు కొన్ని భూములను ఇతరులకు అమ్మేశారు. ఈ అంశంపై 1996లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఈనాం భూములకు రైత్వారీ పట్టాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని, ఆ భూములను ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయడం నేరమని, ఇప్పటికే అలాంటివి జరిగితే అవేమీ చెల్లుబాటు కావని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2013లో రాష్ట్ర ప్రభుత్వం మరో చట్టాన్ని తీసుకొచ్చింది. ఈనాం భూములకు ఇచ్చిన రైత్వారీ పట్టాలు చెల్లుబాటు కావని, ఆ భూములను ఆయా సంస్థలకు సేవలందిస్తున్న వారు ఆ సేవలు అందించే సమయం వరకు మాత్రమే అనుభవించాలని స్పష్టం చేసింది. అలాగే ఈనాం భూములను విక్రయించడానికి వీల్లేదంటూ 1956 నాటి చట్టానికి 2013లో సవరణ చేశారు. ఆ చట్టం అమల్లో ఉన్నప్పటికీ రైత్వారీ పట్టాలు గల ఈనాందారులు ఈనాం భూములను ఇతరులకు విక్రయించేశారు. అలా విక్రయించినవారు ఆ భూములను కొనుగోలు చేసిన వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈనాం భూములను విక్రయించుకోవడానికి అనుమతించాల్సిందిగా రైత్వారీ పట్టాలున్న కొందరు ఈనాందారులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. కేవలం ఆయా సంస్థలకు సేవలందించిన సమయంలో ఆ భూములను అనుభవించడానికే హక్కు ఉంటుందని, ఈనాం భూములకు రైత్వారీ పట్టాలు ఇవ్వడం చట్ట విరుద్ధమని, ఆ భూముల క్రయ విక్రయాలపై నిషేధం విధించాలని 2015 డిసెంబర్లో హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈనాం భూములను 22–ఎ(1)సి కింద ‘రిజిస్ట్రేషన్ల నిషేధం’ జాబితాలో చేర్చాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఇప్పుడు 2013 నాటి చట్టంలో సవరణలు చేయడం ద్వారా రైత్వారీ పట్టాలు గల 24,614 ఎకరాల ఈనాం భూములను సొంతం చేసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు రంగం సిద్ధం చేశారు. ఈనాం భూములు అంటే? పూర్వం దేవాలయాలను నిర్మించిన వారు అందులో దూప దీప నైవేధ్యాల కోసం పూజారులకు/ పనివారి పేరుతో భూములు/ఆస్తులు రాసి ఇచ్చారు. తర్వాత కాలంలో కూడా దాతలు ఇలా పనివారికి భూములు రాయించారు. వీటినే ఈనాం భూములు అంటారు. పూజారులు/ ఇతర పనివారలు ఆయా ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వర్తించినంత కాలం ఈనాం భూములను అనుభవించుకోవచ్చు. ఈ భూముల్లో పంటలు, ఇతరాల ద్వారా వచ్చే ఆదాయంతో వారు జీవనం సాగిస్తూ స్వామివారికి పూజాధికారాలు నిర్వహించడం కోసం దాతలు ఈ భూములను ఈనాం కింద కేటాయించారు. వీటిపై ఈనాందారులకు అనుభవ హక్కులు తప్ప విక్రయ హక్కులు లేవని చట్టాలతోపాటు కోర్టులు కూడా తేల్చిచెప్పాయి. ఒకవేళ ఇప్పటికే ఎక్కడైనా ఈనాం భూముల క్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు జరిగినా అవి చెల్లవని, వాటిని రద్దు చేసి ఈ భూములను క్రయ విక్రయాలకు అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ చట్టంలోని 22 (ఎ)1 కింద నిషేధిత ఆస్తుల జాబితాలో పెట్టాలని ఉన్నత న్యాయస్థానాలు తీర్పు ఇచ్చాయి. ఆ భూములను సొంతం చేసుకోవడం, ఇతరులకు విక్రయించడం చట్టరీత్యా నేరం. 1956 ఈనాం(అబాలిషన్ అండ్ కన్వర్షన్) చట్టంప్రకారం.. ఈనాం భూములను చారిటబుల్ సంస్థలు, దేవాలయాలకు సేవలందిస్తున్న వారు కేవలం అనుభవించాలి. ఇతరులకు బదిలీ చేయడానికి, విక్రయించడానికి ఎలాంటి హక్కు ఉండదు. -
రిజిస్ట్రేషన్లు రయ్ రయ్!
కొత్త జిల్లాల నేపథ్యంలో పెరిగిన క్రయ విక్రయాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గత ఆర్నెల్లలో భూముల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో భారీగా భూములు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నట్లు భావిస్తున్నారు. మొత్తంగా రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గత ఆరు నెలల్లో దాదాపుగా రూ.2 వేల కోట్లకు చేరువైంది. గతేడాది ఇదే సమయానికన్నా ఇది 31.21 శాతం ఎక్కువ కావడం గమనార్హం. మెదక్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అత్యధికంగా 30 నుంచి 48 శాతం దాకా ఆదాయం పెరగగా... మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు పెరుగుదల కనిపించింది. ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం రిజిస్ట్రేషన్ల ఆదాయం బాగా తగ్గిపోవడం విశేషం. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో రూ.వందల కోట్లలో ఆదాయం పెరిగింది. ప్రభుత్వం గత నాలుగేళ్లుగా భూముల రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచకున్నా.. ఏటా ఆదాయం గణనీయంగా పెరుగుతుండడం పట్ల రిజిస్ట్రేషన్ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. రిజిస్ట్రేషన్ల ఆదాయంలో ఇదే తరహా పెరుగుదల కొనసాగితే ఈ ఏడాది వార్షిక (రూ.4,292 కోట్లు) లక్ష్యాన్ని సులువుగానే చేరుకోగలమని ఉన్నతాధికారులు చె బుతున్నారు. -
ఇకపై భూ భారం
ఇక స్థలాల రిజిస్ట్రేషన్లూ భారమే మార్కెట్ విలువ పెంపుతో అవస్థలు ఇరవై నుంచి నూరు శాతం వరకూ పెంపు ఒంగోలు సబర్బన్ : ఆగస్టు ఒకటో తేదీ నుంచి స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ మార్కెట్ విలువలు పెంచి అన్ని వర్గాల ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఈ నిర్ణయంతో జిల్లా ప్రజలపై ప్రతి ఏడాదికి రూ.20 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ఈ పెంపు వల్ల రిజిస్ట్రేషన్ల శాఖకు రెట్టింపు ఆదాయం సమకూరనుంది. గతంలో ఉన్న మార్కెట్ విలువలకంటే కొన్ని ప్రాంతాల్లో నూరు శాతం పెరగగా మరికొన్ని చోట్ల 50 శాతం పెరగనున్నాయి. స్థిరాస్తి వ్యాపారం జోరుగా ఉన్న సమయంలో భూముల విలువలు విపరీతంగా దళారులు పెంచిన విషయం తెలిసిందే. గత ఐదారు సంవత్సరాలుగా ఈ వ్యాపారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్న చందంగా తయారైంది. చివరకు అప్పుల్లోళ్ళకు తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవటంతో ఐపీలు కూడా పెట్టారు. ఈ పరిస్థితుల్లో స్థలాల, భూములు, నిర్మాణాల మార్కెట్ విలువలు పెంచటంతో అయోమయ పరిస్థితి నెలకొంది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఒంగోలు, మార్కాపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆదాయ లక్ష్యం రూ.18.10 కోట్లుంటే ప్రస్తుతం పెంచిన ధరలతో ఒకేసారి రూ.38 కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
భూ లావాదేవీల్లో స్థానికేతరులే ఎక్కువ
కీలకపాత్ర పోషిస్తున్న ఏజెంట్లు సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని ప్రతిపాదిత ప్రాంతాలే కాకుండా వాటికి సమీపంలో 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలోగల భూములు, స్థలాలు కొనుగోలు చేయడానికి స్థానికేతరులే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. రాజధాని గ్రామా ల తొలి జాబితా విడుదలకు ముందునుం చి తాడికొండ నియోజకవర్గ పరిధిలోనే నవ్యాంధ్ర రాజధాని నిర్మించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. దీంతో కొందరు గ్రామస్తులు తమ సమీప బంధువులు, స్నేహితులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లోని తమ కుటుంబ సభ్యులకు సమాచారాన్ని వివరించి, ఇక్కడ భూము లు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. వీరికితోడు బడా పారిశ్రామికవేత్తలు, పెద్దపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు భూములు కొనుగోలు చేయడం ప్రారంభించారు. డాక్యుమెంట్ రైటర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా ఇతర ప్రాంతాల్లోని తమ వర్గానికి చెందిన వారికి ఈ వివరాలను అందించారు. తుళ్ళూరు, అమరావతి, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోనే ఈ కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నా యి. అక్టోబర్, నవంబర్లలో ఇప్పటి వరకు జరిగిన భూముల కొనుగోళ్లలో స్ధానికేతరులే ఎక్కువగా కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రారు కార్యాలయాల రికార్డులు చెబుతున్నాయి. మంగళగిరి, తాడికొండల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అక్టోబర్‌లో మంగళగిరి రిజిస్ట్రారు కార్యాలయ పరిధిలో 1,207 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో కృష్ణా జిల్లా రూరల్, విజయవాడకు చెందినవారు ఎక్కువగా కొనుగోలు చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని గ్రామాలన్నీ మంగళగిరి సబ్ రిజిస్ట్రారు కార్యాలయ పరిధిలో ఉండగా, తుళ్ళూరు మండల పరిధిలోని ఐదు గ్రామాలు మంగళగిరి సబ్ రిజస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఉన్నాయి. సెప్టెంబర్‌లో 1,375 రిజస్ట్రేషన్లు జరిగితే అందులో విజయవాడకు చెందిన కొనుగోలుదారులు ఎక్కువగా ఉన్నారు. తుళ్ళూరు మండలాన్ని రాజధానిగా ప్రకటించిన తరువాత అక్టోబర్‌లో జరిగిన కొనుగోళ్లలో ఎక్కువమంది స్థానికేతరులు ఉన్నారు. వీటిలో 70 శాతం వరకు తుళ్ళూరు మండలంలోని గ్రామాల పరిధిలోని భూములు కొనుగోలు చేశారు. ఈనెల 1వ తేదీ నుంచి ఇప్పటివరకు తుళ్ళూరు మండలంలోని రాయపూడి, మందడం, వెలగపూడి, వెంకటపాలెం, మల్కాపురం గ్రామాలలోని భూములకు సంబంధించి 500కు పైగా రిజస్ట్రేషన్లు నమోదయ్యాయి. పెదకాకానిలో ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు నెమ్మదించాయి. ఏప్రిల్‌లో 940, మేలో 924, జూన్‌లో 1,481, జూలైలో 1,574, ఆగస్టులో 702, సెప్టెంబర్‌లో 883, అక్టోబర్‌లో 507 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అక్టోబర్‌లో జరిగిన 507 రిజిష్ట్రేషన్లలో 95 శాతం ప్లాట్లు, 5 శాతం పొలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. వీటిలోనూ 40 శాతం స్థానికులు కాగా, 60 శాతం మంది స్థానికేతరులున్నట్టు అధికారులు చెబుతున్నారు. అమరావతి రిజిస్ట్రేషన్ కార్యాలయ పరిధిలోని వైకుంఠపురం, పెద మద్దూరు, తుళ్ళూరు మండలం హరిశ్చంద్రపురం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, దొండపాడు, వడ్లమాను, అనంతవరం గ్రామాలలో పొలాల కొనుగోలు అధికంగా జరుగుతోంది. ఇప్పటి వరకు 160 ఎకరాల వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. మరో 100 ఎకరాలు అగ్రిమెంట్ మీద కొనుగోలు చేశారు. వీటిలో 60 నుంచి 70 శాతం వరకు స్థానికేతరులే ఉన్నారు. పెదకూరపాడు మండలంలో రెండు నెలల నుంచి భూముల కొనుగోళ్లు నామమాత్రంగానే ఉన్నాయి. -
ఏపీలో భూముల రిజిస్ట్రేషన్లకు బ్రేక్!
సర్కారు మౌఖిక ఆదేశాలు సాక్షి, విజయవాడ: విజయవాడ-గుంటూరు పరిసరాల్లో భూముల రిజష్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్ విలువకు దగ్గరగా ప్రభుత్వ విలువను నిర్ధారించడంద్వారా స్టాంపు డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడానికి చేస్తున్న కసరత్తులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని 19 మండలాల్లో భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు జారీ అరుునట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఒకటీ రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులూ వెలువడనున్నట్టు తెలిపారు. భూముల ధరల పెరుగుదల ప్రభావం రాజధాని లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణపై పడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వ భూములతోపాటు ప్రైవేటు భూములను కూడా సేకరించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే భూసేకరణ జరిపే సమయానికి వాటి ధరలు ఇంకా పెరిగిపోతే పరిహారం, ఇతరత్రా ఇబ్బందులు వస్తాయనే కారణంతో భూముల క్రయవిక్రయాలు జరపకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. -
భూముల ధరలకు రెక్కలు!
- ఆదాయం పెంచుకునేందుకు సర్కారు నజర్!! - మార్కెట్ విలువపై 20 శాతం పెంపు? - వారం రోజులుగా ఆర్అండ్ఎస్ అధికారుల కసరత్తు - ఏడాదికి అదనంగా రూ.124 కోట్ల ఆదాయం తాండూరు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరులను పెంపొందించుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా భూముల మార్కెట్ విలువ (ధర)ను పెంచాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. భూముల మార్కెట్ విలువను పెంచి రిజిస్ట్రేషన్ ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ అధికారులకు సూచనప్రాయంగా సర్కారు సంకేతాలిచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఉన్నతాధికారులు ప్రస్తుతం జరుగుతున్న భూముల రిజిస్ట్రేషన్లు, ఆదాయం తదితర వివరాలపై దృష్టి సారించారు. ప్రస్తుతం వస్తున్న ఆదాయాన్ని పెంచడానికి భూముల మార్కెట్ విలువను ఎంత పెంచాలనే అంశాలపై ప్రతిపాదనలు పంపించాలని సర్కారు సంబంధిత ఉన్నతాధికారులకు మౌఖికంగా ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఉన్నతాధికారులు సబ్ రిజిస్ట్రార్ల ద్వారా భూముల విలువ పెంపు ప్రతిపాదనలు చేయాలని కోరినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. జిల్లాలోని ఆయా సబ్రిజిస్ట్రార్లతో వారం రోజులుగా మార్కెట్ విలువను పెంచే విషయమై సంబంధిత ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పట్టణంలో ఎకరా వ్యవసాయ భూమి ప్రస్తుతం మార్కెట్ విలువ రూ.7నుంచి రూ.8లక్షలు, గ్రామీణ ప్రాంతంలో రూ.1 నుంచి రూ.3 లక్షల వరకు ఉంది. రిజిస్ట్రేషన్‌పై రూ.లక్షకు రూ.5.5 శాతం స్టాంప్ డ్యూటీ పడుతుంది. అంటే రూ.2 లక్షల భూమిని ప్రస్తుతం రిజిష్ట్రేషన్ చేసుకుంటే 5.5శాతం ప్రకారం రూ.11వేల స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. ప్రస్తుతం భూముల మార్కెట్ విలువను సుమారు 20శాతం పెంచాలని యోచిస్తున్నందున రూ.2లక్షల భూమి విలువ రూ.2.60లక్షలకు, స్టాంప్ డ్యూటీ రూ.11వేల నుంచి రూ.14,300లకు పెరగనున్నట్టు అంచనా. తద్వారా సర్కారుకు స్టాంప్ డ్యూటీ కింద అదనంగా రూ.3,300 ఆదాయం సమకూరనుందని అనధికారిక అంచనా. ఈ లెక్కన సర్కారుకు రూ.కోట్లలో అదనపు ఆదాయం సమకూరనున్నట్టు స్పష్టమవుతోంది. జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం (ఆర్ఓ)తో సహా జిల్లాలో 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఒక్క వారానికి ఆయా కార్యాలయాల్లో 1700 వరకు రిజిష్ట్రేషన్లపై 5.5శాతం స్టాంప్ ప్రకారం సుమారు రూ.12.93 కోట్ల స్టాంప్ డ్యూటీ ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతోంది. ఈ లెక్కన ప్రస్తుతం నెలకు జిల్లా నుంచి సర్కారుకు సుమారు రూ.51.72 కోట్ల స్టాంప్ డ్యూటీ ఆదాయం వస్తోంది. ఇక భూముల మార్కెట్ విలువ 20 శాతానికి పెంచితే స్టాంప్ డ్యూటీ ఆదాయం నెలకు సుమారు రూ.62.06 కోట్లకు చేరి, ప్రభుత్వానికి రూ.10.34 కోట్ల వరకు అదనంగా ఆదాయం సమకూరనున్నట్టు స్పష్టమవుతోంది. ఈ లెక్కన ఏడాదికి జిల్లా నుంచి రిజిస్ట్రేషన్లపై సుమారు రూ.124.8 కోట్ల అదనపు ఆదాయం సర్కారు ఖజానాకు చేరనున్నట్టు అంచనా. అయితే ప్రస్తుతం భూముల మార్కెట్ విలువ పెంచే విషయంలో కసరత్తు చేస్తున్న సంబంధిత అధికారులు 20 శాతానికే పరిమితమవుతారా లేదా ఇంకా అధికంగా పెంచాలని సర్కారుకు ప్రతిపాదనలు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయంలో సర్కారుకు సాధ్యమైనంత త్వరగా ప్రతిపాదనలు అందజేయాలని అధికారులు భావిస్తున్నారని సమాచారం. చేవెళ్ల, కుత్బుల్లాపూర్, జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం, రాజేంద్రనగర్, గండిపేట్, కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి ప్రస్తుతం సర్కారుకు రిజిస్ట్రేషన్లపై అధిక ఆదాయం వస్తోంది. భూముల ధరలు పెరిగితే ఆయా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి అదనపు ఆదాయం మరింత అధికమవుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.