భూ లావాదేవీల్లో స్థానికేతరులే ఎక్కువ
కీలకపాత్ర పోషిస్తున్న ఏజెంట్లు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని ప్రతిపాదిత ప్రాంతాలే కాకుండా వాటికి సమీపంలో 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలోగల భూములు, స్థలాలు కొనుగోలు చేయడానికి స్థానికేతరులే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. రాజధాని గ్రామా ల తొలి జాబితా విడుదలకు ముందునుం చి తాడికొండ నియోజకవర్గ పరిధిలోనే నవ్యాంధ్ర రాజధాని నిర్మించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. దీంతో కొందరు గ్రామస్తులు తమ సమీప బంధువులు, స్నేహితులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లోని తమ కుటుంబ సభ్యులకు సమాచారాన్ని వివరించి, ఇక్కడ భూము లు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. వీరికితోడు బడా పారిశ్రామికవేత్తలు, పెద్దపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు భూములు కొనుగోలు చేయడం ప్రారంభించారు.
డాక్యుమెంట్ రైటర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా ఇతర ప్రాంతాల్లోని తమ వర్గానికి చెందిన వారికి ఈ వివరాలను అందించారు. తుళ్ళూరు, అమరావతి, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోనే ఈ కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నా యి. అక్టోబర్, నవంబర్‌లలో ఇప్పటి వరకు జరిగిన భూముల కొనుగోళ్లలో స్ధానికేతరులే ఎక్కువగా కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రారు కార్యాలయాల రికార్డులు చెబుతున్నాయి.
మంగళగిరి, తాడికొండల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అక్టోబర్‌లో మంగళగిరి రిజిస్ట్రారు కార్యాలయ పరిధిలో 1,207 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో కృష్ణా జిల్లా రూరల్, విజయవాడకు చెందినవారు ఎక్కువగా కొనుగోలు చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని గ్రామాలన్నీ మంగళగిరి సబ్ రిజిస్ట్రారు కార్యాలయ పరిధిలో ఉండగా, తుళ్ళూరు మండల పరిధిలోని ఐదు గ్రామాలు మంగళగిరి సబ్ రిజస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఉన్నాయి. సెప్టెంబర్‌లో 1,375 రిజస్ట్రేషన్లు జరిగితే అందులో విజయవాడకు చెందిన కొనుగోలుదారులు ఎక్కువగా ఉన్నారు.
తుళ్ళూరు మండలాన్ని రాజధానిగా ప్రకటించిన తరువాత అక్టోబర్‌లో జరిగిన కొనుగోళ్లలో ఎక్కువమంది స్థానికేతరులు ఉన్నారు. వీటిలో 70 శాతం వరకు తుళ్ళూరు మండలంలోని గ్రామాల పరిధిలోని భూములు కొనుగోలు చేశారు. ఈనెల 1వ తేదీ నుంచి ఇప్పటివరకు తుళ్ళూరు మండలంలోని రాయపూడి, మందడం, వెలగపూడి, వెంకటపాలెం, మల్కాపురం గ్రామాలలోని భూములకు సంబంధించి 500కు పైగా రిజస్ట్రేషన్లు నమోదయ్యాయి.
పెదకాకానిలో ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు నెమ్మదించాయి. ఏప్రిల్‌లో 940, మేలో 924, జూన్‌లో 1,481, జూలైలో 1,574, ఆగస్టులో 702, సెప్టెంబర్‌లో 883, అక్టోబర్‌లో 507 రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. అక్టోబర్‌లో జరిగిన 507 రిజిష్ట్రేషన్లలో 95 శాతం ప్లాట్లు, 5 శాతం పొలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు నమోదయ్యాయి. వీటిలోనూ 40 శాతం స్థానికులు కాగా, 60 శాతం మంది స్థానికేతరులున్నట్టు అధికారులు చెబుతున్నారు.
అమరావతి రిజిస్ట్రేషన్ కార్యాలయ పరిధిలోని వైకుంఠపురం, పెద మద్దూరు, తుళ్ళూరు మండలం హరిశ్చంద్రపురం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, దొండపాడు, వడ్లమాను, అనంతవరం గ్రామాలలో పొలాల కొనుగోలు అధికంగా జరుగుతోంది. ఇప్పటి వరకు 160 ఎకరాల వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. మరో 100 ఎకరాలు అగ్రిమెంట్ మీద కొనుగోలు చేశారు. వీటిలో 60 నుంచి 70 శాతం వరకు స్థానికేతరులే ఉన్నారు. పెదకూరపాడు మండలంలో రెండు నెలల నుంచి భూముల కొనుగోళ్లు నామమాత్రంగానే ఉన్నాయి.