సాక్షి, అమరావతి: గ్రామకంఠం భూముల్లో 30–40 ఏళ్లుగా ఉంటున్నప్పటికీ ఆక్రమణదారులు వాటిని ఖాళీ చేసి తీరాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రామ కంఠం భూములు ఎన్నటికీ ప్రైవేట్ వ్యక్తులకు చెందినవి కావని తేల్చిచెప్పింది. ఆ భూములకు పంచాయతీనే యజమాని అవుతుందని పేర్కొంది. గ్రామ కంఠం భూములను ఆక్రమించుకుని దశాబ్దాలుగా ఉంటున్నా యాజమాన్య హక్కులు సంక్రమించవని పేర్కొంది. గ్రామ కంఠం భూముల ఆక్రమణల విషయంలో వివిధ సందర్భాల్లో ప్రభుత్వం జారీ చేసిన జీవోలుంటే వాటన్నింటినీ తమ ముందుంచాలని జెడ్పీపీ, ఎంపీపీ, గ్రామ పంచాయతీల తరఫు న్యాయవాది ఐ.కోటిరెడ్డిని ఆదేశించింది.
వాటి ఆధారంగా గ్రామ కంఠాల భూముల్లో ఆక్రమణల తొలగింపుపై సమగ్ర ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఏలూరు జిల్లా కలిదిండి మండలం పెదలంక గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ కంఠం భూముల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించే విషయంలో జారీ చేసిన నోటీసులకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పంచాయతీరాజ్, రెవిన్యూ శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 17కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చాలాచోట్ల భూముల ఆక్రమణలకు అధికారుల తీరే కారణమవుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆక్రమించుకున్న భూములని తెలిసి కూడా అందులో చేపట్టిన నిర్మాణాలకు ఇంటి నెంబర్లు, కరెంట్ కనెక్షన్లు ఇవ్వడం, ఇంటి పన్ను వసూలు చేస్తున్నారని, దీంతో ఆక్రమణదారులు వీటన్నింటినీ చూపుతూ యాజమాన్య హక్కులు కోరుతున్నారని పేర్కొంది. ఇంటి పన్ను చెల్లించినంత మాత్రాన ఆ ఇంటిపై యాజమాన్య హక్కులు కలగవని ధర్మాసనం స్పష్టం చేసింది.
పశువుల దొడ్డి భూమిలో నిర్మాణాలా..?
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో పశువుల దొడ్డి కోసం ఉద్దేశించిన గ్రామ కంఠం భూములను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఆ గ్రామానికి చెందిన గుంటుపల్లి రామారావు 2019లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై కూడా సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పశువుల దొడ్డి కోసం ఉద్దేశించిన భూముల్లో నిర్మాణాలు చేపట్టడంపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఆ భూముల నుంచి ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని, ముందుగా నోటీసులు జారీ చేసి వివరణ తీసుకున్న తరువాత తగిన ఆదేశాలు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.
అంత మాత్రాన యాజమాన్య హక్కులు సంక్రమించవు...
ఏలూరు జిల్లా పెదలంక పరిధిలోని ఆర్‌ఎస్ నెంబర్ 445 భూముల్లో ఉంటున్న తమను ఖాళీ చేయించేందుకు అధికారులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ గ్రామానికి చెందిన కుడిపూడి చంద్రరావు మరో 26 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం.విద్యావతి వాదనలు వినిపిస్తూ 30–40 ఏళ్లుగా ఆ భూముల్లో ఉంటున్నారని తెలిపారు. అవి గ్రామ కంఠం భూములని, ప్రభుత్వ భూములు కాదన్నారు.
వారికి ఆ భూములే జీవనాధారమన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఏళ్ల తరబడి స్వాధీనంలో ఉన్నంత మాత్రాన గ్రామ కంఠం భూములపై ఆక్రమణదారులకు యాజమాన్య హక్కులు సంక్రమించవని, వాటిని ఖాళీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ భూముల నుంచి పిటిషనర్లను ఖాళీ చేయించవద్దని అధికారులను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం ధర్మాసనం దృష్టికి రావడంతో ఇలా ఆదేశాలిస్తుండటం వల్లే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలవుతున్నాయని వ్యాఖ్యానించింది. ఈ కేసులో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 17కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment