grama kantam
-
గ్రామ కంఠం భూములు గ్రామ పంచాయతీ భూములు కావు
సాక్షి, అమరావతి: గ్రామ కంఠం భూములు గ్రామ పంచాయతీకి చెందిన భూములు కావని హైకోర్టు తేల్చి చెప్పింది. గ్రామ కంఠం భూమి తమదంటూ ఆ భూమిలో కొందరు వ్యక్తులు నిర్మించిన షాపులను అనకాపల్లి జిల్లా కశింకోట గ్రామ పంచాయతీ అధికారులు కూల్చివేయడాన్ని తప్పుబట్టింది. కూల్చిన షాపులను కూల్చిన చోటే యథాతథంగా 9 నెలల్లో నిర్మించి ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించింది. ఒకవేళ నిర్మాణంలో జాప్యం చేసినా, నిర్మాణాలు చేపట్టకపోయినా పిటిషనర్లే నిర్మాణాలు పూర్తి చేసుకుని, అందుకైన ఖర్చును గ్రామ పంచాయతీ నుంచి రాబట్టుకోవచ్చునని స్పష్టం చేసింది. గ్రామ కంఠం భూముల్లో షాపులు.. కశింకోట గ్రామం సర్వే నంబర్ 110/1లోని గ్రామ కంఠం భూమిలో పి.వెంకటలక్ష్మి, డి.శ్రీదేవి, వి.పాపారావులు దుకాణాలు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. గ్రామ కంఠం భూమి తమ భూమి అని, ఆ భూమిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటున్నామని, అందువల్ల షాపులను ఖాళీ చేసి వెళ్లాలంటూ కళింపేట గ్రామ పంచాయతీ అధికారులు వెంకటలక్ష్మి తదితరులకు 2020లో నోటీసులిచ్చారు. ఆపై 2022లో మరోసారి నోటీసులిచ్చారు. మూడు రోజుల్లో షాపులను ఖాళీ చేయాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులకు వెంకటలక్ష్మి తదితరులు సమాధానమిచ్చారు. అయితే తామిచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకోకుండా తమ షాపులను కూల్చేసేందుకు పంచాయతీ అధికారులు సిద్ధమవుతున్నారంటూ వెంకటలక్ష్మి తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే పంచాయతీ అధికారులు పిటిషనర్ల షాపులను కూల్చివేశారు. ఆ స్థలాన్ని ఓ సామాజిక భవన నిర్మాణం కోసం అప్పగించేందుకు సిద్ధమయ్యారు. వెంకటలక్ష్మి తదితరుల తరఫు న్యాయవాది వీవీ రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. నోటీసుకు తాము సమాధానం ఇచ్చామని, దాన్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా తమ షాపులను కూల్చివేశారని కోర్టుకు నివేదించారు. గ్రామ పంచాయతీ తరఫు న్యాయవాది ఎన్.శ్రీహరి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు పైవిధంగా తీర్పునిచ్చారు. -
గ్రామకంఠం ఆక్రమణలు ఖాళీ చేయాల్సిందే
సాక్షి, అమరావతి: గ్రామకంఠం భూముల్లో 30–40 ఏళ్లుగా ఉంటున్నప్పటికీ ఆక్రమణదారులు వాటిని ఖాళీ చేసి తీరాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రామ కంఠం భూములు ఎన్నటికీ ప్రైవేట్ వ్యక్తులకు చెందినవి కావని తేల్చిచెప్పింది. ఆ భూములకు పంచాయతీనే యజమాని అవుతుందని పేర్కొంది. గ్రామ కంఠం భూములను ఆక్రమించుకుని దశాబ్దాలుగా ఉంటున్నా యాజమాన్య హక్కులు సంక్రమించవని పేర్కొంది. గ్రామ కంఠం భూముల ఆక్రమణల విషయంలో వివిధ సందర్భాల్లో ప్రభుత్వం జారీ చేసిన జీవోలుంటే వాటన్నింటినీ తమ ముందుంచాలని జెడ్పీపీ, ఎంపీపీ, గ్రామ పంచాయతీల తరఫు న్యాయవాది ఐ.కోటిరెడ్డిని ఆదేశించింది. వాటి ఆధారంగా గ్రామ కంఠాల భూముల్లో ఆక్రమణల తొలగింపుపై సమగ్ర ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఏలూరు జిల్లా కలిదిండి మండలం పెదలంక గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ కంఠం భూముల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించే విషయంలో జారీ చేసిన నోటీసులకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పంచాయతీరాజ్, రెవిన్యూ శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 17కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చాలాచోట్ల భూముల ఆక్రమణలకు అధికారుల తీరే కారణమవుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆక్రమించుకున్న భూములని తెలిసి కూడా అందులో చేపట్టిన నిర్మాణాలకు ఇంటి నెంబర్లు, కరెంట్ కనెక్షన్లు ఇవ్వడం, ఇంటి పన్ను వసూలు చేస్తున్నారని, దీంతో ఆక్రమణదారులు వీటన్నింటినీ చూపుతూ యాజమాన్య హక్కులు కోరుతున్నారని పేర్కొంది. ఇంటి పన్ను చెల్లించినంత మాత్రాన ఆ ఇంటిపై యాజమాన్య హక్కులు కలగవని ధర్మాసనం స్పష్టం చేసింది. పశువుల దొడ్డి భూమిలో నిర్మాణాలా..? గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో పశువుల దొడ్డి కోసం ఉద్దేశించిన గ్రామ కంఠం భూములను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఆ గ్రామానికి చెందిన గుంటుపల్లి రామారావు 2019లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై కూడా సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పశువుల దొడ్డి కోసం ఉద్దేశించిన భూముల్లో నిర్మాణాలు చేపట్టడంపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఆ భూముల నుంచి ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని, ముందుగా నోటీసులు జారీ చేసి వివరణ తీసుకున్న తరువాత తగిన ఆదేశాలు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. అంత మాత్రాన యాజమాన్య హక్కులు సంక్రమించవు... ఏలూరు జిల్లా పెదలంక పరిధిలోని ఆర్ఎస్ నెంబర్ 445 భూముల్లో ఉంటున్న తమను ఖాళీ చేయించేందుకు అధికారులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ గ్రామానికి చెందిన కుడిపూడి చంద్రరావు మరో 26 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం.విద్యావతి వాదనలు వినిపిస్తూ 30–40 ఏళ్లుగా ఆ భూముల్లో ఉంటున్నారని తెలిపారు. అవి గ్రామ కంఠం భూములని, ప్రభుత్వ భూములు కాదన్నారు. వారికి ఆ భూములే జీవనాధారమన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఏళ్ల తరబడి స్వాధీనంలో ఉన్నంత మాత్రాన గ్రామ కంఠం భూములపై ఆక్రమణదారులకు యాజమాన్య హక్కులు సంక్రమించవని, వాటిని ఖాళీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ భూముల నుంచి పిటిషనర్లను ఖాళీ చేయించవద్దని అధికారులను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం ధర్మాసనం దృష్టికి రావడంతో ఇలా ఆదేశాలిస్తుండటం వల్లే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలవుతున్నాయని వ్యాఖ్యానించింది. ఈ కేసులో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 17కి వాయిదా వేసింది. -
గ్రామకంఠం భూములకు యాజమాన్య హక్కు పత్రాలు
సాక్షి, అమరావతి: గ్రామకంఠం భూములకు యాజమాన్యహక్కు పత్రాలు జారీచేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. రీసర్వే తర్వాత గ్రామకంఠం భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో తేలాక గ్రామకంఠం భూహక్కు రిజిస్టర్, వ్యక్తిగత గ్రామకంఠం భూహక్కు రిజిస్టర్ తయారు చేసి వాటి ప్రకారం భూ యాజమాన్యహక్కు పత్రాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ రికార్డ్ ఆఫ్ రైట్స్ (గ్రామకంఠం భూముల యాజమాన్యహక్కు పత్రాలు)రూల్స్–2022 పేరుతో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ సోమవారం తుది నోటిఫికేషన్ జారీచేశారు. గతేడాది జూన్‌లో దీనికి సంబంధించి 1971 ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్స్ చట్టాన్ని ప్రభుత్వం సవరించింది. తాజా నోటిఫికేషన్ ద్వారా దాని అమలుకు విధివిధానాలు జారీచేసింది. వీటి ప్రకారం రీసర్వే తర్వాత గ్రామాల్లోని గ్రామకంఠం భూములకు తహశీల్దార్లు భూయాజమాన్యహక్కు పత్రాలు జారీచేస్తారు. ఇప్పటివరకు అనుభవ హక్కే.. ఇప్పటివరకు గ్రామకంఠం భూములున్న వారికి వాటిని అనుభవించడం తప్ప వాటిపై హక్కు లేదు. తాతలు, తండ్రుల నుంచి వచ్చినా హక్కు పత్రాలు లేకపోవడం వల్ల వారికి వాటిపై ఎలాంటి రుణాలు వచ్చేవి కావు. అమ్ముకునేందుకు హక్కు ఉండేది కాదు. 2006లో వాటిని ప్రైవేటు భూములుగా పరిగణించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయినా వాటిని నిషేధిత భూముల జాబితాలోనే కొనసాగించారు. తాజాగా ఇటీవలే గ్రామకంఠాలను ప్రైవేటు భూములని స్పష్టం చేసి నిషేధిత భూముల జాబితా నుంచి పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రస్తుతం భూముల రీసర్వే జరుగుతుండడంతో గ్రామకంఠంలోని భూములను కొలుస్తున్నారు. సర్వే తర్వాత ఆ భూముల్లో ఎవరు ఉన్నారో నిర్థారించి వారికి భూ యాజమాన్యహక్కు పత్రాలు ఇవ్వనున్నారు. అప్పటి నుంచి వాటిపై రుణాలు తెచ్చుకోవడంతోపాటు వారికి అమ్ముకునేందుకు, ఇతర హక్కులు వస్తాయి. రికార్డింగ్ అథారిటీ.. భూ యాజమాన్యహక్కు పత్రాలు ఎలా ఇవ్వాలి, విచారణ ఎలా చేయాలి, ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎన్నాళ్లకు గ్రామసభ పెట్టాలనే అంశాలపై నోటిఫికేషన్లో మార్గదర్శకాలు ఇచ్చారు. రీసర్వేలో గ్రామకంఠం ముసాయిదా భూహక్కు రిజిస్టర్‌ను తయారు చేస్తారు. దాని ఆధారంగా ఆర్వోఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) తయారవుతుంది. ఆ తర్వాత గ్రామంలో అందరికీ నోటీసులిచ్చి గ్రామసభ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ఆయా గ్రామాలకు రికార్డింగ్ అథారిటీని నియమిస్తారు. ఆ అధికారి గ్రామకంఠం స్థలాలపై గ్రామసభలో విచారణ చేసి అభ్యంతరాలు వస్తే పరిశీలిస్తారు. వాటి ప్రకారం రికార్డు తయారు చేసి ఇస్తారు. వాటి ఆధారంగా తహశీల్దార్ ఆయా గ్రామాల్లో మళ్లీ గ్రామసభలు పెట్టి భూ యాజమాన్యహక్కు పత్రాలు ఇస్తారు. వీటికోసం కార్యాలయాల చుట్టూ తిరక్కుండా మీ సేవ కేంద్రాల ద్వారా వాటిని డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. గ్రామకంఠం భూములకు భూ యాజమాన్యహక్కు పత్రాలు ఇవ్వడం చరిత్రలో ఇదే ప్రథమం. దీనివల్ల అనేక భూ సమస్యలు పరిష్కారమవుతాయి. -
గ్రామ కంఠాల్లోని ఆస్తులకు మహర్దశ
బ్యాంకులో లోను తీసుకుని ఓ చిన్న సూపర్ మార్కెట్ ప్రారంభించాలని కలలుకంటున్న రామకోటేశ్వరరావు కల త్వరలో నేరవేరబోతోంది. బ్యాంకు లోను కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా తనఖా ఏం పెడతావ్ అంటూ బ్యాంకు వాళ్లు అడిగే ప్రశ్నకు జవాబు చెప్పలేక ఎప్పటికప్పుడు తన ఆశను చంపుకుంటూ వచ్చాడు. ఊళ్లో నాలుగు సెంట్ల స్థలంలో తల్లిదండ్రులు ఎప్పుడో కట్టిన దాదాపు రూ.20 లక్షలు విలువ చేసే ఇల్లు తప్ప అతనికి మరే ఆస్తిపాస్తుల్లేవు. ఆ ఇంటిని చూసి లోను ఇవ్వమని అడిగితే దస్తావేజులు తెమ్మమనేవారు. ఊళ్లో గ్రామకంఠం కింద ఉండే ఇళ్లకు ఎలాంటి దస్తావేజులు ఉండవని తెలిసి రామ కోటేశ్వరరావు ఆ ప్రయత్నాలు విరమించుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఇలాంటి ఆస్తులకూ ఆస్తి సర్టిఫికెటును మంజూరు చేయబోతుందని తెలిసి రామకోటేశ్వరరావు ఆనందానికి అవధుల్లేవు. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి దస్తావేజుల్లేని ఆస్తుల యజమానులకు ఇది గొప్ప ఊరట. వీరి కష్టాలకు తెరదించుతూ గ్రామకంఠాల పరిధిలోని ఆస్తులకు కొత్తగా యాజమాన్య హక్కు (ఆస్తి సర్టిఫికెట్లు)ను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసేందుకు ఇటీవల సమావేశమైన కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. దీంతో ఇన్నాళ్లూ అవకాశం లేకుండాపోయిన క్రయవిక్రయాలను ఇప్పుడు అధికారికంగా ఎంతో ధీమాగా చేసుకోవచ్చు. పూర్వం ఎప్పుడో గ్రామ కంఠాలుగా వర్గీకరణ చేసిన ప్రాంతంలో ఇళ్లు, ఇతర ఖాళీ స్థలాలున్న వారికి ఇప్పటివరకు వాటిని ఉపయోగించుకోవడమే కానీ, మరే విధంగా అవి అక్కరకు రాని ఆస్తిగా తయారయ్యాయి. దీంతో అవి రూ.లక్షల విలువ చేసినా అవసరమైనప్పుడు వాటి ద్వారా ఒక్క రూపాయి కూడా రుణం పొందే అవకాశంలేదు. వాటిని అమ్మినా, కొన్నా అవన్నీ అనధికారికంగా జరిగే లావాదేవీలే. 90 లక్షల ఇళ్లు.. 30 లక్షల స్థలాలు రాష్ట్రంలో 17,950 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిల్లో గ్రామ కంఠాల పరిధిలో ఇళ్లు, స్థలాలున్న వారికి రెవెన్యూ శాఖ యజమాన్య హక్కు ఇచ్చే విధానంలేదు. వీటికి సంబంధించి రెవెన్యూ లేదా పంచాయతీల వద్ద ఎలాంటి ప్రత్యేక రిజిస్టర్లు లేవు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి గ్రామ కంఠాల పరిధిలో 90 లక్షల ఇళ్లు, మరో 30 లక్షల సంఖ్యలో ఇతర ఖాళీ స్థలాలు ఉంటాయని పంచాయతీరాజ్ శాఖ అధికారుల అంచనా. వీటన్నింటి విలువను లెక్కిస్తే రూ.10 లక్షల కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. చట్ట సవరణ తర్వాత ప్రతి ఆస్తికీ సర్టిఫికెట్ ఈ నేపథ్యంలో.. గ్రామ కంఠం పరిధిలో ప్రతి ఇల్లు, ఖాళీ స్థలానికి వేర్వేరుగా సంబంధిత యజమానులకు ఆస్తి సర్టిఫికెట్ల జారీకి వీలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ చట్టానికి సవరణలు చేస్తోంది. అసెంబ్లీలో ఈ చట్ట సవరణకు ఆమోదం లభించాకే ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత ప్రతి ఆస్తిని యజమాని పేరుతో రెవెన్యూ, గ్రామ పంచాయతీ రికార్డులలో నమోదు చేస్తారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష పథకంలో గ్రామ కంఠంలో ఉండే ఆస్తులకూ డ్రోన్ల సహాయంతో సర్వే నిర్వహిస్తారు. ఒక్కొక్క దానికి ప్రత్యేక నెంబరును కేటాయించి ఆ మేరకు యజమానికి క్యూఆర్ కోడ్‌తో కూడిన ఆస్తి సర్టిఫికెట్‌ను జారీచేస్తారు. కాగా, రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో ఈ సర్వే ప్రక్రియ పూర్తవగా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒకటి చొప్పున 51 గ్రామాలలో సర్వే కొనసాగుతోంది. ఇళ్ల విలువ పెరిగే అవకాశం ఇదిలా ఉంటే.. ఆస్తి సర్టిఫికెట్ జారీతో యజమానికి పూర్తి ఆర్థిక భరోసా లభించినట్లవుతుంది. ఆ ఆస్తిని తాకట్టు పెట్టి బ్యాంకు లోన్లు పొందే వీలుంటుంది. క్రయవిక్రయాలు లేదా ఆస్తి పంపకాలు సులభంగా జరుపుకోవచ్చు. ఇదే సమయంలో ఆ ఆస్తులకు ప్రస్తుతమున్న ధర కంటే భారీగా రేటు పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. -
సీఎం నివాసం గ్రామకంఠం కాదట
* కోర్టు భయంతో ప్లేటు ఫిరాయించిన సీఆర్డీఏ * గతంలో గ్రామకంఠమంటూ మాస్టర్‌ప్లాన్‌లో చేర్పు * క్విడ్‌ప్రోకో వ్యవహారం బయటపడటంతో రూటు మార్పు సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు నివసిస్తున్న అక్రమ భవనాన్ని సక్రమం చేసేందుకు కంకణం కట్టుకుని పనిచేసిన సీఆర్డీఏ ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయించింది. భవనం సక్రమమేనని చూపేందుకు ఏకంగా రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో దాన్ని గ్రామకంఠం పరిధిలో చేర్చి.. ఆనక కోర్టు భయంతో వెనక్కి తగ్గింది. ముఖ్యమంత్రి నివాస భవనంతోపాటు ఆయన కుమారుడు లోకేశ్, మరికొందరు పెద్దల భవనాలను గ్రామకంఠాల నుంచి మినహాయిస్తూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించడంతో పాటు ఆ భవనం స్వాధీనం వెనుక సీఎంకు, లింగమనేని ఎస్టేట్స్‌కు మధ్య క్విడ్‌ప్రోకో జరిగినట్లు బయటపడడంతో సీఆర్డీఏ రూటు మార్చింది. అక్రమమేనన్న జలవనరుల శాఖ మంగళగరి మండలం ఉండవల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో కృష్ణానదికి ఆనుకుని లింగమనేని ఎస్టేట్స్ కంపెనీకి చెందిన అతిథి గృహాన్ని కొద్దినెలల క్రితం ముఖ్యమంత్రి తన నివాసంగా మార్చుకున్న విషయం తెలిసిందే. సర్వే నంబరు 274లో ఈ భవనం ఉంది. నదీ పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా నిర్మించారని గతంలో మంగళగరి తహసీల్దార్ ఈ భవన యజమానికి నోటీసులు కూడా జారీ చేశారు. దీంతోపాటు నదికి ఆనుకున్న ఉన్న 22 ఇతర భవనాల యజమానులకూ నోటీసులు ఇచ్చారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్వయంగా కృష్ణానదిలో బోటు వేసుకుని విలేకరుల బృందాన్ని తన వెంటబెట్టుకుని వెళ్లి ఆభవనాలన్నీ అక్రమమని తేల్చారు. ఆ తర్వాతే లింగమనేని అతిథి గృహంతో పాటు మిగిలినవన్నీ అక్రమ కట్టడాలని జలవనరుల శాఖ నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. కానీ ఆ నివేదికను ప్రభుత్వం తొక్కిపట్టింది. అక్రమమని నిర్థారించిన అదే భవనాన్ని అనూహ్యంగా సీఎం చంద్రబాబు తన నివాసంగా మార్చుకున్నారు. దీనితో లింగమనేని గ్రూపునకు భారీగా లబ్ధి కలిగించినట్లు తేటతెల్లమైంది. ఆ తర్వాత బాబు ఉండడానికి అనువుగా కోట్ల రూపాయలతో ఆ భవంతిని ఆధునీకరించారు. అంతేగాక ఆ భవంతి కోసమని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త విద్యుత్ లైన్లు, రోడ్లు వేశారు. సక్రమం చేయడానికి గ్రామకంఠంలోకి.. ఈ క్రమంలోనే ఆ అక్రమ భవనాన్ని ఉండవల్లి గ్రామకంఠం పరిధిలో చేర్చారు. ఆర్1 (రెసిడెన్షియల్ జోన్) గ్రామకంఠంలోని నివాస సముదాయంగా మార్చడం ద్వారా పూర్తిగా దాన్ని సక్రమంగా చూపించాలని నిర్ణయించారు. అభ్యంతరాల స్వీకరణ ముగిసిన తర్వాత తుది మాస్టర్‌ప్లాన్‌లో దీనికి ఆమోదముద్ర వేసి అక్రమ భవనాన్ని సక్రమం చేసేశారు. దీంతోపాటు ముఖ్యమంత్రి నివాసం పక్కనే సర్వే నంబరు 250లో ఆయనకోసం ఏర్పాటుచేసిన హెలీప్యాడ్, ఆయన కుమారుడు లోకేశ్ నివాసం ఉంటున్న సర్వే నంబరు 277లోని భవనం, సర్వే నంబరు 222లో ఉన్న నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు అతిథిగృహం, 233 సర్వే నంబర్లోని ఆక్వా డెవిల్స్ భవనాలను తుది మాస్టర్‌ప్లాన్‌లో గ్రామకంఠాల పరిధిలో చేర్చారు. వీటితో పాటు 270, 279, 277, 274, 250, 243, 222, 223, 33, 35, 31 సర్వే నంబర్లలో ఉన్న ప్రముఖుల భవనాలను సైతం గ్రామకంఠాలుగా మార్చేశారు. దీంతో గతంలో అక్రమమని ప్రభుత్వం నిర్ధారించిన భవనాలే ప్రభుత్వ పెద్దల కోసం ఏకంగా గ్రామకంఠంలో వచ్చి చేరాయి. హైకోర్టు ఆదేశాలతో కలవరం.. నదీ పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా నిర్మించిన కట్టడంలో నివాసం ఉండటం ఏమిటని ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్షాలు ప్రశ్నించినా ఆయన పట్టించుకోలేదు. కానీ వైఎస్సార్సీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ అక్రమ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించడంతో సీఆర్డీఏ కలవరపడింది. ఆయన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ఒక్కసారిగా ప్రభుత్వ పెద్దలు గుడ్లు తేలేశారు. కోర్టులో ఈ భవనం అక్రమమని తేలిపోతుందని, దీంతో ముఖ్యమంత్రి సహా అందరూ దొరికిపోతారనే భయం మొదలైంది. ఈ భయంతోనే తెల్లారేసరికి భవనాలన్నింటినీ గ్రామకంఠాల నుంచి మినహాయిస్తూ సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ సవరణ నోటిఫికేషన్ జారీ చేశారు. ముఖ్యమంత్రి నివాసాన్ని గ్రామకంఠం నుంచి ఖాళీ స్థలం, రిక్రియేషనల్ అవసరాలకు వినియోగించే కేటగిరీలో చేర్చారు. మిగిలిన భవనాలను ఎస్2 విద్యాజోనులోకి మార్చారు. కోర్టుకు అడ్డంగా దొరికిపోతామనే భయంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఇలా ప్లేటు మార్చింది. దీంతో ఇప్పటివరకూ ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు నిజమేనని ప్రభుత్వమే అంగీకరించినట్లయింది. -
'గూగుల్ మ్యాపింగ్ తో భూములు గుర్తింపు'
హైదరాబాద్: గ్రామకంఠం, భూదాన భూములు, అసైన్డ్ భూముల వివరాలు గూగుల్ మ్యాపింగ్ ద్వారా సేకరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్టు ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. గ్రామకంఠం భూమిని ఇప్పడు అనుభవిస్తున్న వారికే ఇవ్వాలని యోచిస్తున్నట్టు చెప్పారు. అసైన్డ్ భూములు ఒకరి పేరు మీద ఉండి వేరేవారు అనుభవిస్తే ఆ భూములను వెనక్కుతీసుకునే అంశాన్న పరిశీలిస్తున్నామన్నారు. ప్రత్యేక ప్రతిపత్తి కోసం ఢిల్లీలో తమ ఎంపీలు చేయాల్సిందంతా చేస్తున్నారని తెలిపారు.