ఏసీబీ సోదాలతో హడల్
బినామీ ఆస్తులు కాపాడుకునే పనిలో సబ్ రిజిస్ట్రార్లు
విజయవాడ: రిజిస్ట్రేషన్ శాఖలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. గత ఏడాది కాలంగా రియల్ ఎస్టేట్ చతికలపడి, పై రాబడి తగ్గినప్పటికీ ఒకప్పుడు గోల్డెన్ పిరియడ్‌లో కోట్లు గడించి అక్రమ ఆస్తులు కూడగట్టిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌స శాఖలో కుబేరులు ఇప్పుడు బయటకు వస్తున్నారు. అక్రమ ఆస్తులు సంపాదించిన సబ్ రిజిస్ట్రార్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. బినామీపేర్లతో కుబేరులైన సబ్‌రిజిస్ట్రార్ల జాబితాను తయారు చేసిన ఏసీబీ ప్రత్యేకంగా వేట ప్రారంభించింది. నగరంలో గుణదల జాయింట్ 2 సబ్‌రిజిస్ట్రార్‌గా ఏడేళ్లపాటు ఒకే సీటులో సుదీర్ఘకాలం పని చేసిన దుర్గాప్రసాద్ ఇళ్లపై మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా మంగళగిరి సబ్‌రిజిస్ట్రార్ గోపాల్ అక్రమ రిజిస్ట్రేషన్స్ వ్యవహారంలో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో కృష్ణా, గుంటూరు జిల్లాలో రిజిస్ట్రేషన్స్ శాఖ సిబ్బంది, అధికారులు కలవరం చెందుతున్నారు.
కృష్ణా జిల్లాలో 29, గుంటూరు జిల్లాలో 32 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటిలో దాదాపుగా 600 మంది అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో సగానికి సగం మంది రెండు జిల్లాలో కాసులు కురిపించే పోస్టులను అంటి పెట్టుకుని ఉన్నారు. 2010 నుంచి 2014 వరకు రియల్ ఎస్టేట్ రంగం రెండు జిల్లాలో ఉధృతంగా సాగింది. ఆ నాటి గోల్డెన్ పిరియడ్‌లో సబ్ రిజిస్ట్రార్లు కుబేరులయ్యారు. ఏసీబీ సోదాలు జరుపుతుండటంతో అక్రమ ఆస్తులు కూడబెట్టిన వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
20 మంది సబ్ రిజిస్ట్రార్లపై కన్ను!
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 20 మంది సబ్ రిజిస్ట్రార్లపై ఏసీబీ కన్నేసింది. వీరు దీర్ఘకాలికంగా పనిచేస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. పలువురిపై ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక నిఘా పెట్టారు. రాజధాని నేపథ్యంలో భూముల క్రయ విక్రయాలు పెరిగాయి. దీంతో అక్రమ సంపాదనకు తెరతీశారు. ఎక్కడెక్కడ ఎంత మొత్తం వీరి ఆస్తులు ఉన్నాయనే కోణంలో కూడా ఏసీబీ ప్రత్యేక దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
రిజిస్ట్రేషన్‌సలో కుబేరుల వేట !
Published Wed, Jan 20 2016 1:37 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement