తవ్వే కొద్దీ బయటపడుతున్న కోట్లు
► 18 గంటలపాటు ఏసీబీ సోదాలు
► సబ్‌రిజిస్ట్రార్ బినామీల పేర్లపై రూ.కోట్ల ఆస్తి
► లంచాల మత్తులో ఇబ్బడిముబ్బడిగా రిజిస్ట్రేషన్లు
► దర్యాప్తు ముమ్మరం చేసిన ఏసీబీ
► నిందితుడికి ఈ నెల16 వరకు రిమాండ్
నెల్లూరు(క్రైమ్): రిజిస్ట్రేషన్‌శాఖలో అవినీతి అనకొండగా పేరొందిన సబ్‌రిజిస్ట్రార్ నందకిషోర్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 18 గంటల పాటు నిర్విరామంగా ఏసీబీ అధికారులు ఆయన ఇంటితోపాటు అతని బంధువులు, స్నేహితుల ఇళల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఆయన బినామీ పేర్లపై రూ.కోట్ల ఆస్తిని కూడగట్టాడని ఏసీబీ అధికారులు గుర్తించారు. పెద్ద ఎత్తున లంచాలు సేకరించి నిబంధనలకు విరుద్ధంగా స్థలాల రిజిస్ట్రేషన్‌లు చేసినట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
పక్కా సమాచారంతో సోదాలు..
రిజిస్ట్రేషన్‌శాఖలో తనకు ఎదురులేదని.. తనను ఎవరూ ఏమీ చేయలేరని అక్రమ ఆస్తులను కూడగట్టిన నందకిషోర్‌పై ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్‌కు పక్కా సమాచారం అందింది. దీంతో శనివారం తెల్లవారుజామున 5గంటల ప్రాంతంలో నెల్లూరు శాంతినగర్‌లోని పూజాపార్క్ ప్లాట్ నంబర్ 304కు డీఎస్పీ, సీఐయూ డీఎస్పీ రమాదేవి, ఇన్‌స్పెక్టర్ ఎన్. శివకుమార్‌రెడ్డి చేరుకున్నారు. నందకిషోర్, కుటుంబసభ్యులందరూ నిద్రమంచంలో ఉండగానే ఏసీబీ అధికారులు దాడిచేశారు. అదే సమయంలో నెల్లూరు, కావలి, చంద్రగిరి, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరులోని అతని బంధువుల ఇళ్లలో సైతం ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. అక్రమ ఆస్తుల విషయంపై ఏసీబీ అధికారులు ఆయనను నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పడం ప్రారంభించారు. అయినప్పటికీ అధికారులు పూర్తిస్థాయిలో విచారించారు. రాత్రి 10.30 గంటల వరకు సోదాలు కొనసాగాయి. విలువైన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో ప్రభుత్వ ధర ప్రకారం నందకిషోర్ రూ. 2.80 కోట్లు ఆదాయానికి మించిన ఆస్తులు కల్గి ఉన్నట్లు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో దీని విలువ రూ.13కోట్లు ఉంటుందని సమాచారం. పలు బ్యాంకుల్లో ఖాతాలు, లాకర్లు ఉండటంతో సోమవారం వాట న్నింటినీ పరిశీలించే అవకాశం ఉంది.
అందరూ బినామీలే..
నందకిషోర్ కుటుంబసభ్యులు, స్నేహితులందరనీ అతని బినామీలుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి గాండ్ల వీధిలో ఉంటున్న తోడల్లుడు శివకోటేశ్వరరావు, కావలి వెంగాయగారిపాలెం రోడ్డులోని స్నేహితుడు బాలయ్య పేర రూ.కోట్ల ఆస్తులను కూడగట్టినట్లు అధికారులు గుర్తించారు. వారిద్దరూ తెల్లరేషన్‌కార్డుదారులు అని.. అలాంటి వారు కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఆయన హయంలో జరిగిన రిజిస్ట్రేషన్‌ల వివరాలను సైతం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కొందరు రాజకీయనాయకులు సైతం అతని అక్రమ ఆస్తుల్లో భాగస్వాములని తేలడంతో వారి గురించి ఆరా తీస్తున్నారు.
గతంలోనే ఫిర్యాదులు
నందకిషోర్ అక్రమాలపై ఏసీబీకి గతంలోనే పలు ఫిర్యాదులు అందాయి. ఆయనపై దాడులకు సిద్ధమైన సమయంలో ముందస్తు సమాచారం అందడంతో ఆయన తప్పించుకునేవాడు. అంతేకాకుండా కొందరు సిబ్బందికి భారీ నజరానాలు ముట్టజెప్పి ఏసీబీ చర్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండేవాడు. దీంతోనే ఏసీబీ అధికారులు ఎన్నిసార్లు ప్రయత్నించినా పట్టుకోలేకపోయారు. తాజాగా ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ పక్కా వ్యూహంతో తన సిబ్బందితో కలిసి దాడిచేయడంతో నందకిషోర్ దొరికిపోయాడు.
14 రోజుల రిమాండ్..
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నందకిషోర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి ఆయనను నాల్గోనగర పోలీసుస్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న సహచరులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పోలీసుస్టేషన్‌కు వచ్చారు. నందకిషోర్‌ను పరామర్శించారు. ఆదివారం ఉదయం ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకు ఈ నెల 16వరకు రిమాండ్ విధించారు. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను జిల్లా కేంద్రకారాగారానికి తరలించారు.