ఆస్తి పన్నుకు ‘ఆధార్’ లింకు!
⇒ యజమాని ఆధార్, పాన్, ఫోన్ నంబర్లతో ఆస్తుల అనుసంధానం
⇒ తనఖా ఆస్తుల జాబితాలు బహిర్గతం చేయాలని ప్రభుత్వ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఆస్తి పన్నులు, ఖాళీ స్థలంపై పన్నుల మదింపు సమాచారాన్ని సంబంధిత ఆస్తి యజమానుల ఆధార్, పాన్, ఫోన్ నంబర్లతో తక్షణమే అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అదే విధంగా బ్యాంకుల్లో తనఖా పెట్టిన ఆస్తులు, స్థలాల జాబితాలను సైతం రూపొందించి, బహిర్గతం చేయాలని సూచించింది. రాష్ట్రంలో సులభ వాణిజ్యాన్ని (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ప్రోత్సహించే చర్యల్లో భాగంగా పురపాలక డైరెక్టరేట్ తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది.
వివరాలన్నీ అందుబాటులో: అన్ని పుర పాలికలు అధికారిక వెబ్‌సైట్లను ఏర్పాటు చేసుకోవాలని పురపాలక డైరెక్టరేట్ సూచిం చింది. ఆస్తి పన్నుల డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్ (డీసీబీ) వివరాలతో పాటు సంబంధిత యజమాని పేరు, ఆధార్, పాన్, ఫోన్ నంబర్ల సమాచారాన్ని వాటిలో పొందుపర్చాలని స్పష్టం చేసింది. బ్యాంకుల్లో తనఖా పెట్టిన భవనాలు/ప్లాట్లు/ఖాళీ స్థలాల కు సంబంధించి అయితే.. ఆ ఆస్తి యజమాని పేరు, తనఖా పెట్టిన బ్యాంకు, బ్రాంచీ వివరాలను సైతం పేర్కొనాలని తెలిపింది.
సంబంధిత జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో మున్సిపల్ కమిషనర్లు బ్యాంకర్లతో సమావేశమై తమ ప్రాంత పరిధిలో తనఖా పెట్టిన ఆస్తుల వివరాలను సేకరించాలని సూచించింది. కేంద్రం ప్రవేశపెట్టిన అమృత్ పథకం కింద ఎంపికైన నగరాలు, పట్టణాల్లో సంస్కరణల అమల్లో భాగంగా ఆస్తి పన్నుల మదింపు వివరాలను సంబంధిత పురపాలిక వెబ్‌సైట్లో ప్రదర్శించాలన్న నిబంధనలు న్నాయి. అదే తరహాలో అన్ని మున్సిపాలిటీ ల్లోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్తి పన్నుల మదింపు వివరాలను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేసి, బహిర్గతం చేస్తే సంబంధిత యజ మానుల పేర్ల మీద ఉన్న ఆస్తుల వివరాలన్నీ వెల్లడి కానున్నాయి.
వెబ్‌సైట్ నిర్వహణ తప్పనిసరి
రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ అధికారిక వెబ్‌సైట్‌ను క్రియాశీలకంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో 23 పురపాలికలు క్రియాశీలంగా వెబ్‌సైట్లను నిర్వహిస్తుండగా, మరో 45 పురపాలికలు వెబ్‌సైట్లు రూపొందించుకున్నా సరిగా నిర్వహించడంలేదు. నాలుగు పురపాలికలకు అధికారిక వెబ్‌సైట్ లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి పురపాలిక ఎప్పటికప్పుడు సమాచారాన్ని నవీకరిస్తూ (అప్‌డేట్ చేస్తూ) వెబ్‌సైట్‌ను క్రియాశీలకంగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది.
మ్యూటేషన్ రుసుము పెంపు అధికారం పురపాలికలకే..
స్థిరాస్తుల క్రయవిక్రయాల సందర్భంగా రిజిస్ట్రేషన్ శాఖ వసూలు చేసే మ్యూటేషన్ రుసుముల పెంపుపై నిర్ణయం తీసుకునే అధికారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్స్‌కు ఉందని పురపాలక శాఖ స్పష్టం చేసింది. మ్యూటేషన్ రుసుము పెంపుపై కౌన్సిల్‌లో చేసే తీర్మానాన్ని స్థానిక సబ్ రిజిస్ట్రార్‌కు పంపించాలని సూచించింది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు, ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు స్పష్టతనిస్తూ పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.