ఉచిత ఎల్పీజీలకు ఆధార్ గడువు పెంపు
Published Sat, Aug 5 2017 7:44 PM | Last Updated on Mon, Sep 11 2017 11:21 PM
ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లకు కచ్చితంగా సమర్పించాల్సిన ఆధార్ గడువును కేంద్రప్రభుత్వం సెప్టెంబర్ చివరి వరకు పొడిగించింది. సెప్టెంబర్ చివరికల్లా 12 అంకెల బయోమెట్రిక్ నెంబర్ ఆధార్‌ను సమర్పించాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఏడాది మార్చిలోనే ఆధార్ తప్పనిసరి అని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) కింద ఉచిత ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లను పొందవచ్చని, వీటి కోసం మే 31 వరకు ఆధార్‌ను దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. కానీ పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వశాఖ శుక్రవారం జారీచేసిన గెజెట్ నోటిఫికేషన్‌లో ఈ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది. గతేడాది అక్టోబర్‌లోనే ఎల్‌పీజీలపై సబ్సిడీలను పొందాలంటే ఆధార్ నెంబర్ తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది.
మార్చిలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న గృహమహిళలకు అందించే ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లకు ఆధార్ తప్పనిసరి అని ఆదేశించింది. ప్రస్తుతం ఈ గడువును సెప్టెంబర్ వరకు పొడిగించింది. పీఎంయూవై కింద ప్రయోజనాలు పొందే మహిళలు, ఆధార్ నెంబర్ కలిగి లేకపోతే, 2017 మే 31 వరకు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చేయించుకోవాలని మార్చి 6న జారీచేసిన నోటిఫికేషన్‌లో తెలిపింది. శుక్రవారం జారీచేసిన నోటిఫికేషన్‌లో ఈ గడువును సెప్టెంబర్ వరకు పెంచుతున్నట్టు పేర్కొంది. గతేడాది లాంచ్ చేసిన పీఎంయూవై స్కీమ్ కింద 5 కోట్ల మంది పేదమహిళలు ఉచితంగా మూడేళ్ల పాటు ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లను అందజేయనున్నారు. ఇప్పటికే 2.6 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందించారు.
Advertisement
Advertisement