ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద మహిళకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్ అందజేస్తున్న మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: దారిద్య్ర రేఖకు దిగువనున్న గ్రామీణ పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు 2016, మే నెలలో ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ కింద ఇప్పటి వరకు 3,30,00,000 కనెక్షన్లు ఇచ్చామని, తన ప్రభుత్వం కాలపరిమితి ముగిసేలోగా ఐదు కోట్ల లక్ష్యాన్ని అలవోకగా అందుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘టైమ్స్ నౌ’ పత్రికకు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఘనంగా చెప్పుకున్నారు. కట్టె పుల్లలు, పిడకలతో పొయ్యి రాజేసి అనారోగ్యం పాలవుతున్నా ఆడపడుచులను ఆదుకునేందుకు, వారి సాధికారికతకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని కూడా మోదీ భావోద్వేగంతో చెప్పారు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం విజయాన్ని ప్రస్తావించినప్పుడు ప్రధాని మోదీ సహా పాలకపక్ష పార్లమెంట్ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉజ్వల యోజన పథకం కింద ఉచిత ఎల్పీజీ కనెక్షన్ల టార్గెట్‌ను ఎనిమిది కోట్లకు పెంచుతున్నట్లు గర్వంగా ప్రకటించారు కూడా. నిజంగా ఈ పథకం విజయవంతమైందా? ప్రధాని మోదీ, అరుణ్ జైట్లీ చెబుతున్నట్లు అంత మంది గ్రామీణ పేదలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయడం నిజమేనా? తద్వారా ప్రధాని ఆశించిన పథకం లక్ష్యం నెరవేరుతుందా? (సాక్షి ప్రత్యేకం)
కనెక్షన్లు ఇవ్వడం మాత్రం అక్షర సత్యం. పథకం లక్ష్యం మాత్రం ‘ పక్కన’ పడిపోయింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్యాస్ కనెక్షన్‌కు సెక్యూరిటీ డిపాజిట్‌తో సహా 1600 రూపాయల సబ్సిడీని ప్రభుత్వ చమురు కంపెనీలకు అందజేస్తోంది. పథకం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ‘ప్రభుత్వ పెట్రోలియం ప్రణాళిక, విశ్లేషణా విభాగం’ లెక్కల ప్రకారం అదనపు గ్యాస్ కనెక్షన్లు 16.26 శాతం పెరగ్గా, సిలిండర్ల విక్రయ సంఖ్య మాత్రం 9.83 శాతం మాత్రమే పెరిగింది. ఈ సిలిండర్ల పెరుగుదల ప్రధాని ఉజ్వల పథకం అమల్లో లేనప్పుడు అంటే, 2014–15 సంవత్సరానికి పెరిగిన సిలిండర్ల సంఖ్య కన్నా తక్కువగా ఉండడం ఆశ్చర్యకరం. ప్రభుత్వ సంస్థ అంచనాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఓ పేద కుటుంబం సంవత్సరానికి సగటున కనీసం 5 సిలిండర్లను వాడాలి. అప్పడు సిలిండర్ల వినిమయ సంఖ్య భారీగా పెరగాలి. మరి ఎందుకు తగ్గింది?
ఎల్పీజీ గ్యాస్ ఉన్నప్పటికీ పొయ్యి మీద వంట చేస్తున్న మహిళ (ప్రతీకాత్మక చిత్రం)
కనెక్షన్ తీసుకున్నప్పుడు వచ్చిన సిలిండర్‌ను మినహా ఇస్తే ఎక్కువ కుటుంబాలు మళ్లీ సిలిండర్‌ను రీఫిల్ చేయడం లేదని స్పష్టం అవుతుంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ప్రకారం 2015–16 సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాల్లో ఓ గ్యాస్ కనెక్షన్‌కు సరాసరి ఏడాదికి 6.27 సిలిండర్లు వాడగా, ఉజ్వల పథకం అమల్లోకి వచ్చాక 2016–17 సంవత్సరానికి ఏడాదికి సిలిండర్ల వినిమయ సంఖ్య 5.6 శాతానికి పడిపోయింది. అంటే గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న పేదలు తమ గ్యాస్ కనెక్షన్ల పక్కన పడేయడమే కాకుండా, వారిలో కొందరి కనెక్షన్లను ఇతరులు వాడుకుంటున్నట్లు స్పష్టం అవుతుంది. (సాక్షి ప్రత్యేకం) టూకీగా చెప్పాలంటే ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న పేదల్లో కేవలం 18 శాతం మంది మాత్రమే గ్యాస్ స్టౌలు ఉపయోగిస్తున్నారని, 32 శాతం మంది గ్యాస్ స్టౌవ్‌లను పక్కన పడేస్తున్నారని, 50 శాతం మంది తమ సిలిండర్లను ఇతరులకు అమ్ముకుంటున్నారన్నది ఓ అంచనా.
గ్రామీణ ప్రాంతాల్లో పేదలు పొయ్యిలోకి అవసరమైన కట్టెలు, పిడకలు లాంటి వాటిని ఉచితంగా తెచ్చుకుంటారు. వారు వాటి కోసం ఒక్క పైసా ఖర్చు పెట్టరు. వంట చెరకు ఉచితంగా వస్తుండగా, నెలకు దాదాపు 600 రూపాయలను గ్యాస్ పేరిట ఖర్చు పెట్టడం వారికి మనసొప్పదు. అదే సిలిండర్ పక్కింటి వారికో మరొకరికో ఇస్తే వందో, రెండు వందలో ఉచితంగా వస్తాయి. పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఓ సిలిండర్ ఫిల్లింగ్ కోసం 15 రోజులు నిరీక్షించాల్సి వస్తోంది. తీరా సిలిండర్ ఇంటిదాకా వచ్చాక వారి వద్ద డబ్బులు ఉండవు. ఈ కారణంగా కూడా గ్యాస్‌ను వదులుకునే వారు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ కనెక్షన్ల పట్ల ప్రజలు ఎందుకు మొగ్గు చూపడం లేదన్న అంశంపై క్రిసిల్ (సీఆర్‌ఐఎస్‌ఐఎల్) 2015 సంవత్సరంలోనే ఓ అధ్యయనం జరిపింది.
గ్యాస్ కనెక్షన్లు డబ్బులు ఎక్కువగా ఉన్నాయి కనుక తీసుకోవడం లేదని 86 శాతం మంది చెప్పగా, ప్రస్తుతం ఉచితంగా దొరికే వంట చెరకుతో వంట చేసుకుంటున్నామని, గ్యాస్ సిలిండర్ల కోసం డబ్బులు ఎక్కడ పెడతామని 83 శాతం మంది చెప్పారు. గ్యాస్ కనెక్షన్ కోసం 15 రోజులకు పైగా గ్యాస్ రీఫిల్లింగ్ కోసం నిరీక్షించాల్సి వస్తోందని దాదాపు 90 శాతం మంది చెప్పారు. ఈ నివేదిక ముందు వెలువడి ఉంటే ప్రధాని మోదీ ఉజ్వల పథకాన్ని ప్రవేశపెట్టడానికి ముందు అమలు తీరు గురించి ఆలోచించే వారేమో! ఈ నివేదిక 2016 డిసెంబర్‌లో విడుదలయింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ పొయ్యిల నుంచి వచ్చే పొగవల్ల ఏటా దాదాపు లక్ష మంది భారతీయులు మరణిస్తున్నారనే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలకు మన ప్రధాని మోదీ స్పందించినట్లున్నారు. పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు ఉజ్వల పథకాన్ని తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment