రాజ్యసభలో అరుణ్ జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్ని ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేసినా మోదీ సర్కారు దిగి రాలేదు. తమ రాష్ట్రానికి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా మొత్తుకున్నా కేంద్రం కదలలేదు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై మళ్లీ పాత పాటే వినిపించింది. ఎంతో చేశాం, ఇంకా చేశామన్న పడికట్టు పదాలనే మళ్లీ వళ్లించింది. ప్రత్యేక హోదా, విభజన హామీలపై స్పష్టం మామీ ఇవ్వకుండా సమాధానం దాటవేసింది.
నాలుగే నాలుగు ముక్కల్లో..
కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చకు రాజ్యసభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానమిచ్చారు. లోక్‌సభలో చెప్పిందే ఇక్కడా చెప్పారు. నాలుగే నాలుగు వాక్యాల్లో ఏపీ డిమాండ్ల గురించి ప్రస్తావించిన విత్తమంత్రి ఎటువంటి అదనపు కేటాయింపులు ప్రకటించలేదు. రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ-చెన్నై కారిడార్‌పై సంబంధిత మంత్రిత్వ శాఖ సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాయన్నారు.
ఆ మాట వాస్తవమే..
విభజన సమయంలో ఏపీకి న్యాయం కోసం తాము కూడా పట్టుబట్టామని జైట్లీ చెప్పారు. విభజనతో ఏపీ ఆదాయం కోల్పోయిన మాట వాస్తవమంటూనే మొదటి ఏడాది రెవెన్యూ లోటు భర్తీకి రూ.3979 కోట్లు ఇచ్చినట్టు వెల్లడించారు. ఇతర అంశాలు పరిశీలిస్తున్నామని, వివిధ శాఖలతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు.
ఇంకా ఇస్తాం..
ఇప్పటికే చాలా ఇచ్చాం, మరికొన్ని వివిధ దశాల్లో ఉన్నాయని జైట్లీ చెప్పుకొచ్చారు. రాజధాని, పోలవరం నిర్మాణం కోసం నిధులు ఇచ్చినట్టు తెలిపారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేస్తున్నామని, కేంద్ర విద్యాసంస్థల్ని ఏపీలో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఎన్ని రకాలు నిరసన వ్యక్తం చేసినా కేంద్ర ప్రభుత్వంలో చలనం రాకపోవడం పట్ల ఏపీ నాయకులు, ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment