సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్న ప్రతి అంశాన్ని, పలు సందర్భాల్లో కేంద్రం ఇచ్చిన హామీలను గౌరవిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టంచేశారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ మంగళవారం వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్లమెంట్ లోపల, బయట ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జైట్లీ ఉభయ సభల్లో దీనిపై ఒక సమగ్ర ప్రకటన చేశారు. ఏపీలో ఏర్పాటు చేయాల్సిన సంస్థలు, వివిధ పద్దుల కింద ఇవ్వాల్సిన నిధులను ఎప్పటికప్పుడు అందిస్తున్నట్లు చెప్పారు.
అయితే ప్రత్యేక ప్యాకేజీగా మారిన ప్రత్యేక హోదాకు సంబంధించిన నిధుల చెల్లింపుల్లో సమస్యలున్నాయన్నారు. దీనిపై సంప్రదింపుల అనంతరం ఎక్స్‌టెర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు (ఈఏపీ)ల ద్వారా నిధులు స్వీకరించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. అయితే ఈఏపీలకు ప్రపంచబ్యాంకు, జైకాల ఆమోదం కావాల్సినందువల్ల ప్రాజెక్టులు ఆలస్యమవుతాయని, అందువల్ల ఈఏపీ కాకుండా నాబార్డ్ నుంచి నిధులు ఇప్పించాలని ఏపీ సీఎం చంద్రబాబు 2018 జనవరి 3న లేఖ రాశారని చెప్పారు. కానీ నాబార్డ్ ద్వారా నిధులు అందించడం వల్ల రాష్ట్రం ద్రవ్యలోటులో సమస్యలు వస్తాయని జైట్లీ తెలిపారు. అంటే అప్పు తీసుకునే అవకాశాలు తగ్గిపోతాయన్నారు. అందుకే ప్రత్యామ్నాయ మార్గం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శిని వెంటనే ఢిల్లీకి పిలిపించి రాష్ట్రానికి ఉన్న బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యయ కార్యదర్శిని ఆదేశించినట్లు చెప్పారు.
రూ.3,900 కోట్లు ఇచ్చాం
సాధారణంగా రాష్ట్రాల్లో అమలయ్యే కేంద్ర పథకాల్లో కేంద్రం 60శాతం, రాష్ట్రం 40శాతం భరిస్తాయని, ప్రత్యేకహోదా అయితే కేంద్రం 90శాతం, రాష్ట్రం 10శాతం భరిస్తాయని జైట్లీ వివరించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ఈ తేడా 30శాతం నిధులను ఐదేళ్లపాటు చెల్లించాల్సి ఉందన్నారు. అందులో రూ.3,900 కోట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్లు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన లెక్కలను ఖరారు చేయడంలో కొన్ని వివాదాలున్నట్లు అంగీకరించారు. ఏపీ అధికారులతో చర్చించి ఈ సమస్యను పరిష్కరించాలని తమ అధికారులను సూచించాన న్నారు.
నూతన రాష్ట్రం ఏర్పాటు తర్వాత 10 నెలల రెవెన్యూ లోటు కేంద్రం సర్దుబాటు చేయాలని 14వ ఆర్థిక సంఘం సూచించిందని తెలిపారు. అయితే ఆ లోటును ఎలా సర్దుబాటు చేయాలో ఫార్ములా లేదన్నారు. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు అంశం ఇప్పటికీ కేంద్రం పరిశీలనలో ఉందని, దీనిపై త్వరలోనే ఒక పరిష్కారం కనుక్కొంటామని కేంద్ర రైల్వే శాఖమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కొత్త రైల్వేజోన్ ఏర్పాటు చేయాలన్నా, పరిధులు మార్చాలన్నా ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందన్నారు. అందువల్ల ఎలాంటి వివాదాలు లేని పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
విభజన బిల్లులోని అంశాలను గౌరవిస్తాం: జైట్లీ
Published Wed, Feb 7 2018 1:26 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment