సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనలో కొత్తేమీ లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. నాలుగేళ్లు అయినా విభజన హామీలను అమలు చేయరా అని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. ఏపీకి అన్యాయంపై లోక్‌సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబు తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రయోజనాల విషయంలో టీడీపీ ద్వంద్వ వైఖరిని ప్రజలు చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జైట్లీ ప్రకటనలో కొత్తగా ఏం చెప్పారని టీడీపీ ఎంపీలు సంతృప్తి చెందారని ప్రశ్నించారు. అధికారంలో ఉండి టీడీపీ ఎంపీలు ఆందోళన చేయడం ఏమిటని ఆయన నిలదీశారు.
శాసనాలు చేయాల్సింది.. ప్రధానమంత్రిపై ఒత్తిడి తేవాల్సింది మీరే కదా.. ఆ బాధ్యతను మరిచిపోయి.. ప్రజలను మోసం చేస్తారా? అని టీడీపీ నేతలను ఉద్దేశించి వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. టీడీపీ ఆడుతున్న డ్రామాను ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్, స్టీల్‌ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు, పోలవరం సహా విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే పార్లమెంటు లోపల, బయట ఆందోళన కొనసాగిస్తామని, ఏపీ ప్రజల తరఫున తాము నిలబడతామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీకి చెందిన కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి ఎందుకు ఆందోళనలో పాల్గొనలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు. హోదా కసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని తెలిపారు. విభజన హామీలను ఇంకెప్పుడు అమలు చేస్తారని నిలదీశారు. ఏపీకి న్యాయం జరిగేవరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment