సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రభుత్వం, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని, ఇదే రాజ్యసభలో ఈ మేరకు ఒప్పుకుంటూ ప్రకటనలు చేశారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని.. అప్పుడు అమల్లో ఉన్న ప్రణాళిక సంఘానికి సిఫారసు కూడా చేసిందని ఆయన తెలిపారు. ఈ విషయంలో ప్రణాళిక సంఘం సిఫారసులతో నిమిత్తం లేకుండా కేంద్రం కావాలనుకుంటే రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను మంజూరు చేయవచ్చునని, ఈ అధికారం పూర్తిగా కేంద్రం పరిధిలోనే ఉంటుందని పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ఏపీ ఎంపీల ఆందోళన నేపథ్యంలో రాజ్యసభలో మంగళవారం విజయసాయిరెడ్డి మాట్లాడారు. బీజేపీ తన మ్యానిఫెస్టోలోనూ ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరించి ఏపీ ప్రయోజనాలను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను తెలంగాణకు ఇచ్చారని, దీంతో హైదరాబాద్‌లో ఉన్న సినీ పరిశ్రమ, సాఫ్ట్‌వేర్ పరిశ్రమ, ప్రభుత్వ రంగ సంస్థలు.. ఇలా అన్నీ తెలంగాణకు వెళ్లిపోయాయని, ఏపీ వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా మిగిలిపోయిందని తెలిపారు. పారిశ్రామికంగా ఇతర రాష్ట్రాలతో పోటీపడాలనే ఉద్దేశంతో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పట్లో నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేశారు.
ఏపీకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో విభజన చట్టంలోని షెడ్యూల్ 30లో ప్రత్యేక రైల్వేజోన్ విశాఖ కేంద్రంగా ఏర్పాటుచేయాలని పేర్కొన్నారని గుర్తుచేశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుచేయాలని, దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణం చేయాలని, విశాఖ-చెన్నై కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చారని, విశాఖ, విజయవాడలో మెట్రోరైలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారని గుర్తుచేశారు. అలాగే, పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాలని, ఇందుకు అయ్యే ఖర్చును పూర్తిగా కేంద్రమే భరించాలని విభజన చట్టంలో చాలాస్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. విభజన చట్టంలో రాష్ట్రంలోని ఏడు జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించారని, కానీ ఈ ఏడు వెనుకబడిన జిల్లాలకు కేంద్రం అందిస్తున్న ఆర్థిక ప్యాకేజీ అత్యంత స్వల్పంగా ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment