సాక్షి, న్యూఢిల్లీ: విభజన హామీల అమలుపై వైఎస్ఆర్ సీపీ ఎంపీలు పార్లమెంట్ లో తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. వాయిదా అనంతరం శుక్రవారం మధ్యాహ్నం రాజ్యసభ ప్రారంభం కాగానే వైఎస్ఆర్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి వెల్ లోకి దూసుకెళ్లారు. ఏపీకి న్యాయం చేయాలని, విభజన హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. సుజనా చౌదరి మంత్రిగా ఉండి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారని, అలా సలహాలు ఇవ్వడంలో తప్పులేదని చైర్మన్ అన్నట్లు విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. సుజనా చౌదరి ప్రభుత్వంలో ఉన్నారా.. లేదా చెప్పాలన్నారు. ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలనుకుంటే మంత్రి పదవికి సుజనా రాజీనామా చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. రాజీనామా చేయకుండా ప్రభుత్వాన్ని ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించారు.
‘ఎన్డీఏ సంకీర్ణంలో టీడీపీ కూడా భాగస్వామిగా ఉంది. ప్రభుత్వంలో భాగస్వామి అయిన టీడీపీకి చెందిన నేతలే ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రశ్నించాల్సిన పరిస్థితి తలెత్తింది. రాష్ట్రానికి న్యాయం జరగదని భావించినప్పుడు మంత్రి పదవులకు రాజీనామా చేయడం ఉత్తమ’మని సూచించారు. కేవలం తమ స్వార్థం కోసం టీడీపీ డ్రామాలాడుతోందని విమర్శించారు.
మరోవైపు గురువారం సభలో ఎంపీ విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తగా.. దీనిపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు స్పందిస్తూ కేంద్రమంత్రులు సలహాలు ఇవ్వచ్చని, సుజనా మాటలు కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకం కాదని చెప్పారు. దీనిపై ఇతర సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. విభజన చట్టాన్ని గౌరవించాలని, బిల్లులో పొందుపరిచిన అంశాలను అమలు చేయాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సూచించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment