ఏపీకి తీవ్ర అన్యాయం | ysrcp mps says injustice to ap in union budget | Sakshi
Sakshi News home page

ఏపీకి తీవ్ర అన్యాయం

Published Fri, Feb 2 2018 3:23 AM | Last Updated on Thu, Aug 9 2018 2:49 PM

ysrcp mps says injustice to ap in union budget - Sakshi

ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. చిత్రంలో ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, విజయసాయిరెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కేంద్ర బడ్జెట్‌లో చేర్చకపోవడం పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా హామీలు అమలవుతాయని ఎదురుచూస్తున్న ఏపీ ప్రజల ఆశలను కేంద్రం నీరుగార్చిందని వారు అభిప్రా యపడ్డారు. రాష్ట్రానికిచ్చిన హామీలను సాధించుకునే వరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని పేర్కొన్నారు. గురువారం పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రిఅరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్ర బడ్జెట్‌ ఏపీ ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించింది. విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ బడ్జెట్‌లో చేర్చలేదు. ఎన్డీయేకు ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్‌ కావడంతో ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్‌ప్లాంట్, పోలవ రం పూర్తికి నిధుల మంజూరులో స్పష్టత ఇస్తుందని ఆశించాం. 

కానీ ఏ ఒక్క విషయంలోనూ స్పష్టత ఇవ్వలేదు. హామీలను సాధించుకునేవరకు వైఎస్సార్‌ సీపీ పోరాడు తుంది. ఇప్పుడు మేం రాజీనామాలు చేస్తే హామీలపై ఎవరూ కేంద్రాన్ని ప్రశ్నిం చరు. తుదివరకు పోరాడి అప్పటికీ కేంద్రం తలొగ్గకపోతే అప్పుడు రాజీనామా అస్త్రాలు ప్రయోగిస్తాం’’ అని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏపీలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోందని, ఏటా ప్రతి ఒక్కరికీ 5లక్షల మేరకు ఆరోగ్య బీమా కల్పించడం అభినందనీయమని అన్నారు.

విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. పార్లమెంటులో కేంద్రాన్ని విభజన హామీలపై ప్రశ్నిస్తామన్నారు. హామీలను అమలు చేయకుండా కేంద్రం చేస్తున్న అన్యాయంపై టీడీపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement