లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చలో మాట్లాడుతున్న అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం వివరాలను బహిర్గతం చేయాలంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పికొట్టారు. రాఫెల్ యుద్ధ విమానం, దీంతోపాటు కొనుగోలు చేసిన యుద్ధ సామగ్రి వివరాలన్నీ దేశ భద్రతకు సంబంధించిన అంశాలని దీనిపై వివరాలు కోరటం హాస్యాస్పదమన్నారు. ‘మాజీ రక్షణ మంత్రి ప్రణబ్ ముఖర్జీ దగ్గర జాతీయ భద్రతపై పాఠాలు నేర్చుకోండ’ని కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌కి సూచించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా విపక్షాలు రాఫెల్ వివరాలు వెల్లడించాలని పట్టుబడ్డటంపై జైట్లీ ఈ విధంగా స్పందించారు.
‘మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై మీరు రాజీ పడ్డారు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వంపైనా అవినీతి బురద చల్లాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగేళ్లుగా మోదీ స్వచ్ఛమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అందుకే ఓ సంక్షోభాన్ని, ఓ వివాదాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే రాఫెల్ వివరాలు వెల్లడి చేయాలని వివాదం చేస్తున్నారు’ అని జైట్లీ రాజ్యసభలో పేర్కొన్నారు. 36 రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి భారత్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
రామాయణ వ్యాఖ్యలపై దుమారం
కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిపై ప్రధాని మోదీ చేసిన ‘రామాయణ’ వ్యాఖ్యలపై గురువారం రాజ్యసభలో దుమారం రేగింది. అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన మోదీ క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ మహిళా ఎంపీలు డిమాండ్ చేశారు. దీనికి తోడు మోదీ తనపై వ్యంగ్యంగా మాట్లాడుతున్న వీడియో క్లిప్‌ను హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేయటంపై రేణుక మండిపడ్డారు. ప్రధాని హోదాకు తగ్గట్లుగా మోదీ వ్యవహరించలేదని.. ఆయన క్షమాపణ చెప్పాలని మహిళా కాంగ్రెస్ నేత సుష్మితాదేవ్ డిమాండ్ చేశారు. రేణుక వ్యాఖ్యలపై దుమారం కారణంగా రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది.
మోసపూరిత ఆర్థిక విధానంతో..
అంతకుముందు, రాజ్యసభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత చిదంబరం కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం వ్యవసాయ సంక్షోభాన్ని పట్టించుకోవటం లేదని, ఉపాధికల్పనను పూర్తిగా విస్మరించిందని.. ఆరోపించారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానం పూర్తిగా మోసపూరితమని.. దేశంలో ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పోతోందని తీవ్రంగా దుయ్యబట్టారు. తాజా బడ్జెట్ ద్వారా వేతన జీవులు, వయోవృద్ధలుకు రూ.12వేల కోట్ల లబ్ధి చేకూరిందని ఆర్థిక మంత్రి జైట్లీ లోక్‌సభలో వెల్లడించారు. దీర్ఘకాల మూలధన రాబడి పన్ను పెంచటాన్ని సమర్థించుకున్న జైట్లీ.. దీని కారణంగా తలెత్తే సమస్యలను ఎలా ఎదుర్కొవాలో ప్రభుత్వానికి తెలుసన్నారు.
ప్రణబ్, ఆంటోనీలూ చెప్పలేదు
రూ.58వేల కోట్ల ఒప్పందాన్ని బహిర్గతం చేసేందుకు విముఖత చూపిన జైట్లీ.. యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి రక్షణ మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఏకే ఆంటోనీలు 15 సందర్భాల్లో ఇలాంటి వివరాలు వెల్లడించలేదని గుర్తుచేశారు. అప్పుడు దేశ భద్రత, జాతి ప్రయోజనాలను వారు కారణంగా చూపించారని సభకు వెల్లడించారు.
‘ధరలు, ఇతర వివరాలను బయటపెట్టడం ద్వారా.. సదరు హెలికాప్టర్/ఆయుధానికి సంబంధించిన సాంకేతిక వివరాలన్నీ బయటకొస్తాయి. అది మన రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్నీ వెల్లడిస్తుంది. ఇది శత్రువుకు తెలియజేయటానికి రక్షణ వ్యవస్థ, ప్రభుత్వం ఒప్పుకోవు’ అని జైట్లీ వెల్లడించారు. అయితే జాతి భద్రతకు సంబంధించిన వివరాలను తాము అడగటం లేదని.. పారదర్శకతను మాత్రమే కోరుతున్నామని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment