రాజ్యసభలో ఆందోళనకు దిగిన విపక్షసభ్యులు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రఫేల్ విమానాల కొనుగోలు విషయంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. శుక్రవారం నాలుగో రోజు సమావేశాలు వాడివేడిగా సాగాయి. రఫేల్ కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపణలు చేయగా, అధికారపక్షం ఎదురుదాడికి దిగింది. రఫేల్ డీల్‌లో సుప్రీం కోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని ఆయుధంగా మలుచుకుంది. రఫేల్ ఒప్పందంపై దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ క్షమాపణలు చెప్పాలని విదేశాంగ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ డిమాండ్ చేశారు. రాజ్యసభలో ఆర్థిక మంత్రి జైట్లీ మాట్లాడుతూ.. రఫేల్ ఒప్పందంపై చర్చకు పట్టుపడుతున్న నేపథ్యంలో ప్రశ్నోత్తరాలను నిలిపివేయాల్సిందిగా కోరారు.
‘కావేరీ’పై అన్నా డీఎంకే ఆందోళన
రఫేల్ ఒప్పందంపై కాంగ్రెస్ నిరసనలు చేపట్టగా, అన్నా డీఎంకే ఎంపీలు కావేరీ నదీ జలాల సమస్యపై ఆందోళన చేపట్టారు. ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. రఫేల్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీకి (జేపీసీ) వామపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఓ వ్యాపారికి మేలు చేసేలా రఫేల్ కొనుగోలు వ్యవహారం ఉందని, ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ విషయంలో నష్టపోయిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. సంయుక్త పార్లమెంటరీ కమిటీని వేయాల్సిందేనని కాంగ్రెస్ పట్టుపట్టింది. ప్రతిపక్షాలు ఆందోళనలు ఆపేయకపోవడంతో ఆఖరికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను సోమవారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment