లోక్‌సభలో రఫేల్‌పై చర్చ సందర్భంగా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ, అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ
రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలు ఒప్పందంపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య బుధవారం పార్లమెంటులో హైడ్రామా నడిచింది. రఫేల్ వ్యవహారంలో దేశ ప్రజలకు జవాబు ఇచ్చే ధైర్యంలేక ప్రధాని మోదీ ఇంట్లో దాక్కుంటున్నారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ సందర్భంగా రఫేల్ ఒప్పందంపై గోవా మంత్రి విశ్వజిత్ రాణే మరొకరితో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో టేపును సభలో వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని రాహుల్ స్పీకర్‌ను కోరారు. వెంటనే కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ స్పందిస్తూ, అవినీతిలో నిండా మునిగిన కాంగ్రెస్ మోదీ ప్రభుత్వంపై అబద్ధాలను ప్రచారం చేస్తోందన్నారు.
ఈ టేపు నకిలీ, కల్పితమని ఆరోపించారు. ఈ టేపు నిజమైనదేనని రాహుల్ నిరూపించగలరా? అని సవాలు విసిరారు. ఒకవేళ నిరూపించలేకపోతే ప్రివిలేజ్ మోషన్‌ను రాహుల్ ఎదుర్కోవాల్సి ఉంటుందనీ, అలాగే సభ నుంచి సస్పెండ్ అవుతారని హెచ్చరించారు. దీంతో బీజేపీ సభ్యులు భయపడుతున్నందున ఈ టేపును పార్లమెంటులో వినిపించబోనని రాహుల్ వ్యాఖ్యానించారు. కాగా, ఆడియో టేపు నకిలీ అని తెలుసు కాబట్టే రాహుల్ భయపడి వెనక్కి తగ్గారని జైట్లీ దుయ్యబట్టారు.
సభలో కాగితపు విమానాలు
అరుణ్ జైట్లీ మాట్లాడుతుండగా విపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాగితపు విమానాలను సభలో విసిరి ఆందోళనకు దిగడంతో కార్యకలాపాలు కొద్దిసేపు స్తంభించాయి. దీంతో కాంగ్రెస్ సభ్యులపై అసహనం వ్యక్తం చేసిన స్పీకర్ సుమిత్రా మహాజన్ ‘మీరంతా ఇంకా చిన్నపిల్లలా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రఫేల్ టేపును సభలో వినిపించేందుకు అనుమతి నిరాకరించారు. బీజేపీ మిత్రపక్షం శివసేన సైతం విపక్షాలకు మద్దతు పలికింది. రఫేల్‌పై జేపీసీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. రఫేల్ జెట్లు మంచివే అయినప్పటికీ ఒప్పందం మాత్రం లోపభూయిష్టంగా ఉందని వ్యాఖ్యానించింది. మరోవైపు కావేరీ నదీజలాల వివాదంలో ఆందోళనకు దిగిన 24 మంది అన్నాడీఎంకే ఎంపీలను స్పీకర్ మహాజన్ ఐదు రోజుల పాటు సస్పెండ్ చేశారు.
బీజేపీ నేతలు భయపడొద్దు: రాహుల్
లోక్‌సభలో రాహుల్ మాట్లాడుతూ..‘మీరు(మోదీ) ఈ కాంట్రాక్టును మీ ప్రియమైన మిత్రుడు ఏఏ(అనిల్ అంబానీ)కి ఎందుకు ఇచ్చారు? ఖనాజాపై రూ.30వేల కోట్ల భారాన్ని ఎందుకు మోపారు. మోదీకి పార్లమెంటులో ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం లేదు. అందుకే ప్రధాని తన ఇంట్లోని బెడ్రూమ్‌లో దాక్కుంటుంటే, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకే సభ్యుల వెనుక దాక్కుంటున్నారు. ఈ విషయంలో వెంటనే సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణకు ఆదేశించాలి. నిజం నిదానంగా బయటకు వస్తుంది. ప్పటికైనా మోదీ వెంటనే సభకు వచ్చి జవాబు చెప్పాలి.
దేశమంతా ఆయన ఏం చెబుతారోనని ఆసక్తిగా చూస్తోంది’ అని తెలిపారు.రఫేల్ యుద్ధవిమానాల ధరను రూ.526 కోట్ల నుంచి రూ.1,600 కోట్లకు పెంచడాన్ని రక్షణశాఖ అధికారులు స్వయంగా వ్యతిరేకించలేదా? అని రాహుల్ ప్రశ్నించారు. ఈ ఒప్పందాన్ని హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హాల్) నుంచి లాక్కుని ఏఏకు అప్పగించారని ఆరోపించారు. అలాగే యుద్ధ విమానాల సంఖ్యను 126 నుంచి 36కు తగ్గించేశారని విమర్శించారు. మోదీ ఇటీవల ఇచ్చిన 90 నిమిషాల ఇంటర్వ్యూలో రఫేల్‌పై ప్రశ్నలకు జవాబివ్వలేదని దుయ్యబట్టారు. రఫేల్ ఒప్పందం విషయంలో తనపై ఎవరూ వేలెత్తి చూపడం లేదని ప్రధాని అంటున్నారనీ, కానీ దేశమంతా ఆయనవైపే వేలెత్తి చూపుతోందని అన్నారు.
జేపీసీతో నిష్పాక్షిక విచారణ జరగదు: జైట్లీ
రఫేల్ ఒప్పందంలో అవకతవకల్లేవని స్వయంగా సుప్రీంకోర్టు చెప్పిందని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు.అలాంటప్పుడు రఫేల్‌పై జేపీసీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ‘అవినీతిలో నిండా మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు అబద్ధాలను ప్రచారం చేస్తోంది. బోఫోర్స్ కుంభకోణంపై ఏర్పాటైన జేపీసీని గుర్తుకు తెచ్చుకోండి. లంచం అందుకున్నారన్న ఆరోపణలను అది కొట్టివేసింది. అసలు అవినీతే జరగలేదని స్పష్టం చేసింది.
జేపీసీ అన్నది ఇరుపార్టీలకు చెందిన కమిటీ. దీనివల్ల నిష్పాక్షిక విచారణ జరగదు. యూపీఏతో పోల్చుకుంటే మా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న రఫేల్ యుద్ధవిమానం 9 శాతం చవకగా, ఆయుధ వ్యవస్థలు అమర్చిన రఫేల్ 20 శాతం చవకగా అందుబాటులోకి రానుంది. కొందరు వ్యక్తులు నిజాలను ఇష్టపడరు. వాళ్లు గత ఆరు నెలలో పార్లమెంటు లోపల, బయట రఫేల్‌పై చెప్పినవన్నీ అబద్ధాలే. అబద్ధాలను వండివార్చడం వారికి వారసత్వంగా సంక్రమించింది. నిజాలను అంగీకరించలేని అలవాటు రాహుల్‌కు ఉంది.
అందుకే ఆయన ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడితో మాట్లాడినట్లు కట్టుకథలు అల్లారు. సుప్రీంకోర్టు తీర్పును ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదు’ అని జైట్లీ వెల్లడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు కాగితపు విమానాల్ని విసరడంపై స్పందిస్తూ.. ‘ఐఏఎఫ్ కాంట్రాక్టును దక్కించుకోడానికి డసో కంపెనీతో పోటీపడిన యూరో ఫైటర్‌కు గుర్తుగా కాంగ్రెస్ నేతలు వీటిని విసురుతున్నారేమో’ అని ఎద్దేవా చేశారు. అగస్టాస్కాæం, నేషనల్ హెరాల్డ్ కేసు, బోఫోర్స్‌లో మధ్యవర్తి ఖత్రోచీ పేర్లను ప్రస్తావించిన జైట్లీ.. కాంగ్రెస్‌కు డబ్బుపై ఉన్న శ్రద్ధ దేశభద్రతపై లేదన్నారు. గతంలో పలు కుంభకోణాలకు పాల్పడిన వ్యక్తులు ఇప్పుడు మోదీ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతున్నారని దుయ్యబట్టారు.
‘జేమ్స్‌బాండ్’పై సంవాదం
చర్చలో మంత్రి జైట్లీ మాట్లాడుతూ.. ‘‘రాహు ల్ గతంలో జేమ్స్‌బాండ్ సినిమాలు చూసుంటారు. అందులో ‘ఏదైనా ఘటన ఒకసారి జరిగితే అనుకోకుంటే జరిగిందనుకోవాలి. రెండుసార్లు అదే జరిగితే యాదృచ్ఛికమనీ, మూడుసార్లు జరిగితే అది కుట్ర అని అర్థం చేసుకోవాలి’ అని బాం డ్ చెబుతాడు. కాంగ్రెస్ చీఫ్ అదే చేస్తున్నారు’’ అని అన్నారు. దీనికి తృణమూల్ ఎంపీ సౌగత రాయ్ స్పందిస్తూ.. ‘జైట్లీ ఆ డైలాగ్ తప్పుగా చె ప్పారు. ఓ ఘటన మొదటిసారి జరిగితే దాన్ని అనుకోకుండా జరిగిన విషయంగా భావించాలి. అదేరెండుసార్లు జరిగితేయాదృచ్ఛికమనీ, మూడు సార్లు జరిగితే అది శత్రువుల చర్య అని అర్థం చేసుకోవాలి’ అని సినిమాలో ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment