న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పంద వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ ఒప్పందానికి సంబంధించిన ఓ దస్త్రం అప్పటి రక్షణ మంత్రి, ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ పడక గదిలో ఉందని, ఆయన సహచర మంత్రి ఒకరు వ్యాఖ్యానిస్తున్న ఆడియోను కాంగ్రెస్ బయటపెట్టింది. అయితే ఈ వీడియో ఎంత వరకు నిజమో తెలియరాలేదు. ఓసారి కేబినెట్ సమావేశంలో పరీకర్ ఈమేరకు వ్యాఖ్యానించినట్లు గోవా మంత్రి విశ్వజిత్ రాణె గుర్తుతెలియని వ్యక్తితో అంటున్నట్లు ఆడియోలో ఉంది.
రఫేల్ ఒప్పంద విషయమై మోదీని పరీకర్ బెదిరిస్తున్నారని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సంచలన వ్యాఖ్య చేశారు. ఈ ఆడియో టేపులు అబద్ధం, కట్టుకథలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొట్టిపారేశారు. కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని సుప్రీంకోర్టే ఎండగట్టిందని, నిజాల్ని తారుమారు చేసేందుకు మరే మార్గం లేకపోవడంతో ఆ పార్టీ ఇలా నకిలీ ఆడియోల్ని విడుదలచేస్తోందని పరీకర్ దుయ్యబట్టారు. ఆడియోలో ఉన్నట్లుగా తానెప్పుడూ కేబినెట్ సమావేశంలోగానీ, మరే ఇతర సమావేశంలోగానీ చర్చించలేదని స్పష్టం చేశారు.
‘సీఎం పరీకర్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. రఫేల్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఆయన పడకగదిలోనే ఉందట. దీనర్థం.. ఏదో ఆశించే ఆయన ఆ సమాచారాన్నంతా తన వద్ద భద్రపరుచుకున్నారు’ అని రాణెను ఉటంకిస్తూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. ఈ ఆడియో కల్పితమని, దాని విడుదల వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు రాణె అమిత్ షాకు చెప్పారు.
పరీకర్‌కు లైడిటెక్టర్ పరీక్షలు: గోవా కాంగ్రెస్
రఫేల్ ఒప్పంద ఫైల్‌ను గుర్తించడానికి పరీకర్ నివాసంపై సీబీఐతో సోదాలు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పరీకర్, ఆయన సహచరులకు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కూడా కోరింది. ఈ ఆడియోను వెలుగులోకి తెచ్చిన వేగును గుర్తించి రక్షణ కల్పించాలని, దివంగత జడ్జి లోయా లాంటి పరిస్థితి ఎదురుకాకుండా, పరీకర్‌కు కూడా భద్రతను పెంచాలని గోవా కాంగ్రెస్ ప్రతినిధి సిద్ధాంత్ బుయావో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment