manohar parikar
-
చిన్న రాష్ట్రంలో పెద్ద పోరు.. గోవా.. ఎవరిది హవా?
బీజేపీలో మనోహరంగా వెలిగిపోయిన పారికర్ లేకుండా జరగబోయే తొలి ఎన్నికల్ని ఆ పార్టీ ఎంతవరకు ఎదుర్కోగలదు? పదేళ్లుగా అధికారంలో ఉన్న కమలదళం అధికార వ్యతిరేకతను ఎదుర్కొని నిలబడగలదా? తృణమూల్ కాంగ్రెస్, ఆప్, శివసేన వంటి పార్టీల సత్తా ఎంత? కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది? అతి చిన్న రాష్ట్రమైన గోవాలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా అయిదు నెలలు గడువు ఉన్నప్పటికీ ఎందుకు రాజకీయాలు హీటెక్కుతున్నాయి? పర్యాటక ప్రాంతమైన అతి చిన్న రాష్ట్రం గోవా. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో దాదాపుగా పదో వంతు ఉంటుంది. 3,702 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఈ రాష్ట్ర జనాభా దాదాపుగా 15 లక్షలు. 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. వచ్చే ఏడాది మార్చి 15 వరకు అసెంబ్లీకి గడువుంది. ఎన్నికలకి ఇంకా అయిదు నెలలు సమయం ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్‌లు గోవా బరిలోకి పూర్తి స్థాయిలో దిగుతూ ఉండడం, శివసేన కూడా 25 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో ప్రధాన పార్టీలైన అధికార బీజేపీ, కాంగ్రెస్‌లో ఎవరి ఓటు బ్యాంకుని కొల్లగొడతారన్న చర్చ ఆసక్తికరంగా మారింది. గోవా కాథలిక్కులు కూడా గౌరవించే మనోహర్ పారికర్ కేన్సర్‌తో 2019లో మరణించడం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బే. రాష్ట్రంలో ప్రమోద్ సావంత్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని రాష్ట్ర మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన ఆరోపణల్ని కాంగ్రెస్ ప్రచారాస్త్రాలుగా మలచుకుంది. ప్రచారం జోరు గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద గత జులై నుంచి నియోజకవర్గాల వారీగా పర్యటించడం ప్రారంభించారు. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నప్పటికీ ఈసారి ఎలాగైనా మెజార్టీ సాధించాలని భావిస్తోంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పటికే గోవాలో పర్యటించి సమర్థవంతులైన నాయకుల్ని ఎన్నుకోవాలంటూ పిలుపునిచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చిదంబరం వంటి జాతీయ స్థాయి నేతలు కూడా ప్రచారం బరిలోకి దిగారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇటీవల మూడు రోజులు గోవాలో మకాం వేసి బీజేపీకి బెంగాల్లో పట్టించిన గతే ఇక్కడా పట్టిస్తామని ప్రతినబూనారు. ఆప్ గత ఎన్నికల్లో ఒక్క సీటు సాధించకపోయినా 6.3% ఓట్లను సాధించింది . దీంతో ఈసారి ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ దూకుడు పెంచారు. ఆప్ అ«ధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పన, అందరికీ ఉచితంగా తీర్థయాత్రల హామీతో ముందుకు వెళుతున్నారు. చిన్న నియోజకవర్గాలతో పార్టీలకు చింత గోవాలో ప్రతీ నియోజకవర్గంలో 25 వేల నుంచి 30 వేల మంది మాత్రమే ఓటర్లు ఉంటారు. దీంతో స్వల్ప ఓట్లతోనే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. బలమైన అభ్యర్థిని దింపడం కూడా కీలకంగా మారింది. గత ఎన్నికల్లో ముగ్గురు స్వతంత్రులు విజయం సాధించడానికి చిన్న నియోజకవర్గాలే కారణం. ఈసారి బీజేపీ, కాంగ్రెస్, ఆప్, తృణమూల్ కాంగ్రెస్, గోవా ఫార్వార్డ్ పార్టీ మహారాష్ట్రవాది గోమాంతక్ పార్టీ, ఎన్సీపీ, శివసేన , స్థానిక పార్టీలు, స్వతంత్రులు ఎన్నికల బరిలో ఉండడంతో అన్ని నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ నెలకొని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లో ఎవరికి కలిసి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో దొడ్డి దారిలో వచ్చిన బీజేపీ 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17 స్థానాలు నెగ్గి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, 13 స్థానాలు గెలుచుకున్న బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో రక్షణశాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ని గోవా ముఖ్యమంత్రిని చేసి చిన్న పార్టీలతో చేతులు కలిపిన బీజేపీ గద్దెనెక్కింది. కేవలం 13 స్థానాలను గెలుచుకున్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచిన అప్పటి గోవా గవర్నర్ మృదుల సిన్హాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా బీజేపీ పారికర్ ఇమేజ్‌తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సభ్యుల్ని లాగేసి బలం పెంచుకుంది. ప్రస్తుతం గోవా అసెంబ్లీలో బీజేపీకి సభ్యుల బలం 28 ఉంటే కాంగ్రెస్ బలం నాలుగుకి పడిపోయింది. అప్పట్నుంచి గోవా కాంగ్రెస్ తమకు దక్కాల్సిన అధికారాన్ని కొల్లగొట్టిందని బీజేపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు ►పర్యాటక రంగంపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్న రాష్ట్రంలో కరోనా ప్రభావంతో వచ్చే పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,200 కోట్లు నష్టం వచ్చినట్టుగా అంచనా. పర్యాటకుల్ని అనుమతిస్తున్నప్పటికీ చాలా హోటల్స్‌లో ఆక్యుపెన్సీ 20 శాతానికి మించడంలేదు. ప్రజల జీవనోపాధిపై దెబ్బపడింది. ►గోవాలో మైనింగ్‌ను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో గ్రామీణ ఆర్థిక రంగానికి గట్టి దెబ్బ తగిలింది. జీడీపీలో 30%వాటా, లక్షకు మందికి పైగా ఉద్యోగాలను కల్పించే మైనింగ్ నిలిచిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది ►కరోనా సమయంలో పర్యాటక రంగంలో 1.22 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతే, మైనింగ్ నిలిచిపోయి లక్ష మంది వరకు ఉపాధి కోల్పోయారు. దీంతో నిరుద్యోగం అంశం రాష్ట్రంలో అతి పెద్ద సమస్యగా మారింది. -
ఆయన ఆరోగ్యానికి ఢోకా లేదు..!
న్యూఢిల్లీ : గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ కోలుకుంటున్నారని ఆ రాష్ట్ర సీఎం కార్యాలయం శనివారం తెలిపింది. ఆయన ఆరోగ్యంపై రకరకాల కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో తాజా ప్రకటనతో బీజేపీ శ్రేణులకు ఊరట లభించినట్లయింది. ‘సీఎం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయనకు రోజూవారీ వైద్యం అందుతోంది’ అని సీఎంవో వెల్లడించింది. కాగా, మార్చి 4న గోవా మంత్రి విజయ్ సర్దేశాయ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో కలకలం రేపాయి. ‘పరీకర్ అడ్వాన్స్డ్ కాన్సర్‌తో బాధపడుతున్నారు. అయిన్పటికీ ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నారు’ అని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలతో పాటు పాంక్రియాటిక్ కాన్సర్‌తో బాధపడుతున్న పరీకర్ బాగా నీరసించిపోయి ప్రభుత్వ కార్యకలాపాల్లో పాలుపంచుకోవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు వెలువడ్డాయి. -
పరామర్శలోనూ రాజకీయాలా?
న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని పరామర్శించి, దానిని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం తగదని గోవా సీఎం మనోహర్ పారికర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ధ్వజమెత్తారు. మంగళవారం పారికర్‌ను పరామర్శించిన అనంతరం రాహుల్‌గాంధీ కోచిలో ఓ సమావేశంలో మాట్లాడుతూ తమ మధ్య రఫేల్ కుంభకోణంపై చర్చ జరిగిందని వెల్లడించిన విషయం విదితమే. అనిల్ అంబానీకి ప్రయోజనం కలిగించేందుకు మోదీ ప్రయత్నించారని, ఈ విషయంలో పారికర్ తనకు సంబం ధం లేదని తెలిపారని రాహుల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై పనాజీలోని గోవా అసెంబ్లీ భవనంలో పారికర్ మాట్లాడుతూ ‘రాహుల్‌తో నా భేటీ కేవలం అయిదు నిమిషాలు మాత్రమే జరిగింది. ఆ భేటీలో రాహుల్ రఫేల్‌పై మాట్లాడలేదు. అసలు భేటీలో ఆ అంశమే ప్రస్తావనకు రాలేదు’ అని స్పష్టం చేశారు. తనతో జరిగిన పరామర్శ భేటీని కూడా రాహుల్ అల్పమైన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కూడా రాహుల్‌పై మండిపడ్డారు. -
గోవా సీఎం పారికర్‌తో రాహుల్ భేటీ
పనాజీ : గోవా సీఎం మనోహర్ పారికర్‌తో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మంగళవారం సమావేశమయ్యారు. వీరి మధ్య ఏయే అంశాలపై చర్చలు జరిగాయనే వివరాలు వెల్లడికాలేదు. పారికర్‌తో తాను కేవలం మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యానని, ఇది వ్యక్తిగత పర్యటనగా రాహుల్ వెల్లడించారు. నేటి ఉదయం గోవా సీఎం మనోహర్ పారికర్‌ను తాను కలిశానని, ఆయన సత్వరం కోలుకోవాలని ఆకాంక్షించానని రాహుల్ ట్వీట్ చేశారు. గోవా శాసన సభ ప్రాంగణంలోని సీఎం చాంబర్లో పారికర్‌తో రాహుల్ సమావేశమయ్యారు. పారికర్‌తో ముచ్చటించిన అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాహుల్ అసెంబ్లీలోని విపక్ష లాబీలో సమావేశమయ్యారు. కాగా రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన కీలక పత్రాలు గోవా సీఎం వద్ద ఉన్నాయని కాంగ్రెస్ చీఫ్ ఆరోపించిన మరుసటి రోజే పారికర్‌తో రాహుల్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు పారికర్‌తో రాఫెల్ ఒప్పందంపై రాహుల్ ఎలాంటి చర్చలూ జరపలేదని, కేవలం ఆయన ఆరోగ్య పరిస్ధితిని వాకబు చేసేందుకే కలిశారని గోవా విపక్ష నేత చంద్రకాంత్ కవ్లేకర్ వివరణ ఇచ్చారు. పారికర్‌ను రాహుల్ కేవలం మర్యాదపూర్వకంగానే కలిశారని చెప్పుకొచ్చారు. మనోహర్ పారికర్ పాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతూ 2018 ఫిబ్రవరి నుంచి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. -
గోవా బీచ్‌లో మందేస్తే అంతే!
పనాజీ : గోవా బీచ్‌లో బీరు తాగుతూ ఎంజాయ్ చేయలనుకుంటున్నారా? అయితే మీరు రూ. 2 వేల రూపాయల జరిమానా లేక మూడు నెలలు జైలు శిక్ష అనుభవించడానికి సిద్దంగా ఉండాలి. అదేంటి బీచ్‌లో బీరు తాగితే ఇంత శిక్షా? అని అంటారా? అవును గోవా ప్రభుత్వం పర్యాటక చట్టంలో మార్పులు తీసుకురాబోతుంది. బీచ్‌లో మద్యం తాగినా, బహిరంగంగా వంట చేసినా రెండువేల రూపాయలు జరిమానా విధించాలని గోవా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గోవాలో కాలుష్యాన్ని నివారించేందుకు వీలుగా బీచ్ లో మద్యం తాగినా, వంట చేసినా రెండువేల రూపాయలు జరిమానా విధించాలని గోవా మంత్రివర్గ సమావేశం తీర్మానించిందని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అజ్ గోంకర్ వెల్లడించారు. జరిమానా చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష విధిస్తామని మంత్రి పేర్కొన్నారు. ‘ పర్యాటక చట్టంలో మేం రెండు మార్పులు తీసుకొచ్చాం. పర్యాటకశాఖలో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే హోటల్ బుకింగ్ చేసుకునేలా నిబంధనను తీసుకొచ్చాం. ఈ విషయంలో కొన్ని అభ్యంతరాలు మా దృష్టికి వచ్చాయి. చాలా ట్రావెల్స్ కంపెనీలు పర్యాటకశాఖతో సంబంధం లేకుండా హోటల్స్‌ను బుక్ చేస్తున్నాయి. ఈ తరహా చట్ట వ్యతిరేక పనులను మేం సహించం. ఇక రెండోది.. బహిరంగ ప్రదేశాల్లో, బీచ్‌లో మద్యం సేవించినా, వంట చేసినా రూ.2 వేలు జరిమానా కట్టాల్సిందే. లేకుంటే మూడు నెలలు జైలు శిక్షఅనుభవించాలి.’ అని పర్యాటక మంత్రి తెలిపారు. బీచ్‌ల్లో బహిరంగంగా మద్యనిషేధం విధిస్తామని ఇచ్చిన హామీ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. -
పరీకర్ పడకగదిలో ‘రఫేల్’ ఫైల్స్!
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పంద వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ ఒప్పందానికి సంబంధించిన ఓ దస్త్రం అప్పటి రక్షణ మంత్రి, ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ పడక గదిలో ఉందని, ఆయన సహచర మంత్రి ఒకరు వ్యాఖ్యానిస్తున్న ఆడియోను కాంగ్రెస్ బయటపెట్టింది. అయితే ఈ వీడియో ఎంత వరకు నిజమో తెలియరాలేదు. ఓసారి కేబినెట్ సమావేశంలో పరీకర్ ఈమేరకు వ్యాఖ్యానించినట్లు గోవా మంత్రి విశ్వజిత్ రాణె గుర్తుతెలియని వ్యక్తితో అంటున్నట్లు ఆడియోలో ఉంది. రఫేల్ ఒప్పంద విషయమై మోదీని పరీకర్ బెదిరిస్తున్నారని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సంచలన వ్యాఖ్య చేశారు. ఈ ఆడియో టేపులు అబద్ధం, కట్టుకథలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొట్టిపారేశారు. కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని సుప్రీంకోర్టే ఎండగట్టిందని, నిజాల్ని తారుమారు చేసేందుకు మరే మార్గం లేకపోవడంతో ఆ పార్టీ ఇలా నకిలీ ఆడియోల్ని విడుదలచేస్తోందని పరీకర్ దుయ్యబట్టారు. ఆడియోలో ఉన్నట్లుగా తానెప్పుడూ కేబినెట్ సమావేశంలోగానీ, మరే ఇతర సమావేశంలోగానీ చర్చించలేదని స్పష్టం చేశారు. ‘సీఎం పరీకర్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. రఫేల్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఆయన పడకగదిలోనే ఉందట. దీనర్థం.. ఏదో ఆశించే ఆయన ఆ సమాచారాన్నంతా తన వద్ద భద్రపరుచుకున్నారు’ అని రాణెను ఉటంకిస్తూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. ఈ ఆడియో కల్పితమని, దాని విడుదల వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు రాణె అమిత్ షాకు చెప్పారు. పరీకర్‌కు లైడిటెక్టర్ పరీక్షలు: గోవా కాంగ్రెస్ రఫేల్ ఒప్పంద ఫైల్‌ను గుర్తించడానికి పరీకర్ నివాసంపై సీబీఐతో సోదాలు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పరీకర్, ఆయన సహచరులకు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కూడా కోరింది. ఈ ఆడియోను వెలుగులోకి తెచ్చిన వేగును గుర్తించి రక్షణ కల్పించాలని, దివంగత జడ్జి లోయా లాంటి పరిస్థితి ఎదురుకాకుండా, పరీకర్‌కు కూడా భద్రతను పెంచాలని గోవా కాంగ్రెస్ ప్రతినిధి సిద్ధాంత్ బుయావో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. -
‘అతన్నో సూపర్మ్యాన్లా చూపిస్తోంది’
పణాజి : అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రిని బీజేపీ హీ - మ్యాన్, సూపర్‌మ్యాన్ లాగా చూపించే ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో బుధవారం (నిన్న) నిర్వహించిన 57వ గోవా లిబరేషన్ డే పరేడ్ కార్యక్రమాలకు సీఎం మనోహర్ పారికర్ హాజరుకాకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉర్ఫాన్ ముల్లా మాట్లాడుతూ.. ‘బీజేపీ గోవా సీఎమ్‌ను ఫోటో సెషన్ కోసం వాడుతూ.. అతన్ని ఓ హీ - మ్యాన్, సూపర్‌మ్యాన్‌గా చూపించే ప్రయత్నం చేస్తోంది. వైద్యులను వెంటబెట్టుకుని వెళ్లి మరి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను పర్యవేక్షించిన పారికర్‌కు ఇంత ముఖ్యమైన గోవా లిబరేషన్ డే పరేడ్ వేడుకలకు హాజరుకావడానికి మాత్రం ఆరోగ్యం సహకరించలేదా’ అంటూ ప్రశ్నించారు. నిజంగా ఇది చాలా విచారకరమన్నారు. ఇదిలా ఉండగా గోవా లిబరేషన్ డే పరేడ్ వేడుకల్లో గోవా అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్, పారికర్ స్థానంలో ఉండి కార్యక్రమాలు నిర్వహించారు. పారికర్ అనారోగ్య కారణాల వల్ల అసెంబ్లీకి హాజరు కాలేకపోయారన్నారు. ఆయన బదుల ఈ ఉపన్యాసాన్ని తాను చదువుతున్నానంటూ సావంత్ చెప్పుకొచ్చారు. -
బీజేపీలో చేరిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
పనాజీ : గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు సుభాష్ శిరోడ్కర్, దయానంద్ సోప్టే మంగళవారం బీజేపీలో చేరారు. కాంగ్రెస్ నుంచి మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారని వారు తెలిపారు. తాము బీజేపీలో చేరుతున్నామని, మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లో బీజేపీలో చేరతారని శిరోడ్కర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో బీజేపీ చీఫ్ అమిత్ షాతో భేటీ అనంతరం వారు పార్టీలో చేరికపై ప్రకటన చేశారు. కాగా తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను అమిత్ షా బెదిరింపులకు గురిచేసి బీజేపీలో చేర్చుకున్నారని గోవాకు కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ ఇన్ఛార్జ్ చెల్లకుమార్ ఆరోపించారు. గోవా సీఎం మనోహర్ పారికర్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వైదొలిగితే సభలో కాంగ్రెస్‌కు సమానంగా సభ్యుల సంఖ్యను పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. మొత్తం 38 మంది సభ్యులు కలిగిన గోవా అసెంబ్లీలో తాజా బలాబలాలను చూస్తే బీజేపీకి 14 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 14 మంది ఎమ్మెల్యేలుండగా, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి ముగ్గురు, గోవా ఫార్వార్డ్ పార్టీకి ముగ్గురు సభ్యులున్నారు. ముగ్గురు ఇండిపెండెంట్లు, ఓ ఎన్సీపీ ఎమ్మెల్యే ఉన్నారు. గత కొద్దివారాలుగా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న సీఎం మనోహర్ పారికర్ ఆదివారం ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పారికర్ ప్రస్తుతం గోవాలోని దోనాపౌలాలోని తన ప్రైవేట్ నివాసంలో చికిత్స పొందుతున్నారు. -
ఎయిమ్స్ నుంచి గోవా సీఎం డిశ్చార్జి
సాక్షి, న్యూఢిల్లీ : పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో గత నెల రోజుల నుంచి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. పారికర్ ఆరోగ్య పరిస్థితి ఆదివారం ఉదయం విషమించగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కు తరలించి ఆ తర్వాత ఐసీయూ నుంచి వార్డుకు అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశామని ఎయిమ్స్ అధికారి ఒకరు వెల్లడించారు. ఆదివారం రాత్రికి ఆయన గోవా చేరుకుంటారని పారికర్ సన్నిహితులు తెలిపారు. గత ఏడు నెలలుగా పారికర్ గోవా, ముంబై, న్యూయార్క్, న్యూఢిల్లీలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఎయిమ్స్‌లోనే శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కేబినెట్ మంత్రులతో సమావేశమయ్యారు. మరోవైపు దీర్ఘకాలంగా అస్వస్ధతతో బాధపడుతున్న పారికర్ సీఎం పదవి నుంచి వైదొలగాలని విపక్ష కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. -
పరీకర్ మంత్రిత్వ శాఖల అప్పగింత?
పణజి: ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో పాంక్రియాటిక్ వ్యాధికి చికిత్స పొందుతున్న గోవా సీఎం మనోహర్ పరీకర్ శుక్రవారం మంత్రులు, బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులు, పాలనపై మంత్రులతో పరీకర్ చర్చించారు. తన వద్ద ఉన్న మంత్రిత్వశాఖలను మిగతా మంత్రులకు అప్పగించాలని నిర్ణయించారు. ‘గోవాలో పరిపాలనతో పాటు కీలక శాఖల పనితీరుపై పరీకర్ సమీక్ష నిర్వహించారు. పరీకర్ కోలుకుంటున్నారు. ఆయనే సీఎంగా ఉంటారు. దీపావళి కల్లా డిశ్చార్జ్ అవుతారు. తన వద్ద ఉన్న మంత్రిత్వశాఖల్లో కొన్నింటిని మిగతా మంత్రులకు అప్పగించడంపైనా చర్చించాం’ అని కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ తెలిపారు. -
‘ఎన్నికల్లో డబ్బు ఖర్చుపెట్టకపోతే శ్రీరాముడైనా గెలవలేడు’
పనాజీ : ‘ఈ రోజుల్లో రాముడైనా సరే డబ్బులు పంచకపోతే ఎన్నికల్లో గెలవలేడు’ అంటూ గోవా ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ సుభాష్ వెలింకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవాలో యువతను ఉద్దేశిస్తూ నిర్వహించిన ‘గోవా సురక్ష మంచ్’ కార్యక్రమానికి సుభాష్ వెలింకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ‘ఎన్నికలు వస్తున్నాయి.. ఓటర్లలో ఎక్కువ సంఖ్యలో ఉన్న యువత, మహిళలే నాయకులకు ముఖ్యం. వారిని ఆకట్టుకోవడానికి పార్టీలు ఎంత డబ్బునైనా ఖర్చు పెడతాయి. అయినా ఇప్పటి రాజకీయాలన్ని డబ్బు చూట్టే తిరుగుతున్నాయి. డబ్బు లేకపోతే గెలవడం చాలా కష్టం. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే స్వయంగా శ్రీరాముడే వచ్చి ఎన్నికల్లో పోటీ చేసినా.. డబ్బు పంచకపోతే ఆయన కూడా గెలవడు’ అన్నారు. ఈ సందర్భంగా ఆయన గోవా ముఖ్యమంత్రిపై, బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ పార్టీ తన విలువలను కోల్పొతుంది. అది కూడా తక్కిన పార్టీలతోవలోనే నడుస్తుందని ఆరోపించారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను ఉద్దేశిస్తూ పారికర్ అనారోగ్యంతో ఉన్న ఇద్దరు మంత్రులను తొలగించారు. ఇప్పుడు ఆయన కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మరి ఆయన మాత్రం ఎందుకు తన పదవి నుంచి వైదొలగటం లేదని ప్రశ్నించారు. అంతేకాక నాయకులు చిన్న జబ్బుల చికిత్స కోసం కూడా అమెరికా వెళ్లడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. -
గోవా సీఎం ఆయనే..
న్యూఢిల్లీ : గోవా సీఎంగా మనోహర్ పారికర్ స్ధానంలో మరొకరిని నియమిస్తారని సాగుతున్న ప్రచారాన్ని బీజేపీ చీఫ్ అమిత్ షా తోసిపుచ్చారు. గోవా సీఎంగా పారికర్ కొనసాగుతారని, త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపడతారని స్పష్టం చేశారు. గోవా బీజేపీ కోర్ గ్రూప్ సభ్యులతో సంప్రదింపులు జరిపిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు షా పేర్కొన్నారు. కాగా సీఎం మనోహర్ పారికర్ ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో గోవాలో అనిశ్చిత పరిస్థితి నెలకొందని, రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని విపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ కోరుతుండగా, అసెంబ్లీలో తమకు మెజారిటీ సంఖ్యా బలం ఉందని బీజేపీ స్పష్టం చేసింది. గోవా సీఎం పారికర్ ప్రస్తుతం ఎయిమ్స్‌లో ప్రాంకియాస్ చికిత్స పొందుతున్నారు. -
సీఎంలు జబ్బు పడితే ఇక అంతేనా!
సాక్షి, న్యూఢిల్లీ : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ మొదటిసారి అనారోగ్యానికి గురై అప్పుడే ఏడు నెలలు గడచి పోయాయి. ఆయన మొదటి సారి ఫిబ్రవరిలో అనారోగ్యానికి గురైనప్పటి నుంచి సుదీర్ఘ కాలం పాటు ఇటు ముంబై, అటు అమెరికాలో వైద్య చికిత్సలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. క్లోమగ్రంథి క్యాన్సర్‌తో బాధ పడుతున్న మనోహర్ పరీకర్ చికిత్స కోసం గత మార్చి నెలలో అమెరికా వెళ్లారు. జూన్ నెలలో తిరిగొచ్చారు. ఆగస్టు 10న మరోసారి అమెరికా వెళ్లి ఆగస్టు 22న తిరిగొచ్చారు. మళ్లీ చెకప్ కోసమని ఆగస్టు 30న అమెరికా వెళ్లారు. సెప్టెంబర్ 6న తిరిగొచ్చారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 13న పరీకర్ స్థానిక ఆస్పత్రిలో చేరారు. ఇప్పుడు ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలా మాటిమాటికీ ముఖ్యమంత్రి మనోహర్ స్థానికంగా ఉండకుండా.. చికిత్స కోసం వెళ్తుండటంతో రాష్ట్రంలో పాలనా వ్యవస్థ పూర్తిగా స్థంభించి పోయిందని ఆరోపిస్తూ ప్రభుత్వం ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కోరింది. ఎలాంటి భంగం కలగడం లేదు!! గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీకన్నా నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక పోవడం, నాలుగు సీట్లు తక్కువ వచ్చిన బీజేపీ ఇతర పార్టీల మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెల్సిందే. మనోహర్ పరీకర్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నప్పటికీ పాలనా వ్యవస్థకు ఎలాంటి భంగం కలగడం లేదని పాలకపక్ష బీజేపీ చెబుతోంది. పరీకర్ తాను నిర్వహిస్తున్న హోం, ఆర్థిక, పర్సనల్, సాధారణ పాలన తదితర కీలక శాఖల ఫైళ్లను ఆస్పత్రికి తెప్పించుకొని ఎప్పటికప్పుడు పెండింగ్ అంశాలను క్లియర్ చేస్తున్నారని వాదిస్తోంది. ఇలా జరగడం కొత్తేం కాదు.. కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న రాజకీయ నాయకులు ఇలా అనారోగ్యం పాలైనప్పుడు కూడా బాధ్యతలు నిర్వహించాల్సిన అవసరం ఉందా? నిర్వహిస్తే పాలనా వ్యవస్థ దెబ్బతినదా? అన్న ప్రశ్నలు ఇక్కడ ఉద్భవిస్తాయి. అయితే ఆస్పత్రి పాలైనపుడు కూడా పదవి వదులుకోకుండా బాధ్యతలు నిర్వహించడం ఇప్పుడే కొత్త కాదు. 2016లో, అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి దాదాపు 70 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆమె చనిపోయే వరకు కూడా యావత్ కేబినెట్ ఆమెతోపాటు ఆస్పత్రిలోనే ఉండి పోయింది. అప్పుడు కూడా పాలనా వ్యవస్థ స్తంభించి పోయినట్లు ప్రతిపక్షం నుంచి ఆరోపణలు వచ్చాయి. 1980వ దశకంలో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లి కొన్ని నెలలపాటు అక్కడే ఉండిపోయారు. ఆయన అక్కడ అస్పత్రి పడకపై ఉండే ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. కేబినెట్ తీసుకునే నిర్ణయాలన్నింటికీ మంత్రులంతా సమష్టి బాధ్యత వహించాల్సి ఉంటుంది కనుక ముఖ్యమంత్రి దూరంగా ఉన్నంత మాత్రాన కొంపలేవి మునిగి పోకపోవచ్చు. కానీ భారత్ లాంటి ప్రజాస్వామిక దేశంలో నిర్ణయాల్లో జాప్యం జరగడం వల్ల పాలనా వ్యవస్థ మందగించి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సమయం, ప్రజాధనం వృథా అవుతుంది కదా.. ముఖ్యమంత్రి అనే వ్యక్తి షిప్‌కు కెప్టెన్ లాంటి వ్యక్తి అన్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఢిల్లీలో చికిత్స పొందుతున్న మనోహర్ పరీకర్ తన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అన్ని ఫైళ్లను తెప్పించుకొని ఎప్పటికప్పుడు నిర్ణయాలను తీసుకుంటున్నారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. గోవా నుంచి ఈ ఫైళ్లను ఎప్పటికప్పుడు ఢిల్లీకి తీసుకెళ్లాలంటే ఎంత సమయం వృథా అవుతుందో, సమయం ఆదా కోసం విమానంలో తీసుకెళితే ఎంత ప్రజా సొమ్ము వృథా అవుతుందో ఎవరు ఆలోచించాలి? చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది.. ఇలాంటి సమయాల్లో ఆస్పత్రుల్లో చేరిన ముఖ్యమంత్రులు తమ పదవులకు తాత్కాలికంగా రాజీనామా చేసి, ఆ బాధ్యతలను ఇతరులకు అప్పగించవచ్చు. కోలుకున్నాక ఆ బాధ్యతలను తిరిగి తీసుకోవచ్చు. అయితే ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంలో పార్టీ నాయకుల మధ్య పోటీ పెరిగి కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతాయని, లేదా అలా తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తే చుట్టున్న వారిని తనవైపునకు తిప్పుకొని అసలు ముఖ్యమంత్రికే ఎసరు పెట్టవచ్చన్నది పార్టీల భయం. కానీ ఎప్పటికైనా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిందే. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నియామకానికి సంబంధించి పార్లమెంట్ ద్వారా చట్టమైన తీసుకురావాలి. -
ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వండి
పణజి: గోవా రాజకీయం మరో మలుపు తిరిగింది. ప్రభుత్వం ఏర్పాటుకు తాము సిద్ధమంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ముఖ్యమంత్రి మనోహర్ పారికర్(62) దీర్ఘకాల అనారోగ్యం, ఆస్పత్రిలో చేరిక.. అనంతర పరిస్థితులను అంచనా వేసేందుకు వచ్చిన ముగ్గురు సభ్యుల బీజేపీ కేంద్ర బృందం ప్రస్తుతం రాష్ట్ర నేతలతో చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడం గమనార్హం. మొత్తం 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పార్టీ నేత చంద్రకాంత్ కవ్లేకర్ నేతృత్వంలో సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లారు. అయితే, గవర్నర్ మృదులా సిన్హా లేకపోవడంతో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కవ్లేకర్ విలేకరులతో మాట్లాడారు. ‘బీజేపీ నాయకత్వం తమాషాలు చేస్తోంది. ఏడాదిన్నరలోనే మరోసారి ఎన్నికలు జరపడం అంటే రాష్ట్ర ఖజానాపై భారం వేయడమే. అందుకే అసెంబ్లీని రద్దు చేయడానికి బదులు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరాం. మాకు అవకాశమిస్తే అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామని తెలిపాం’ అని ఆయన అన్నారు. కాగా, సంకీర్ణంలోనే ఉంటామని, సమస్య పరిష్కారం కోసం బీజేపీ తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా తమకుఆమోదయోగ్యమేనంటూ భాగస్వామ్య పక్షాలు ప్రకటించాయి. అసెంబ్లీలోని 40 సీట్లకు గాను కాంగ్రెస్‌కు 16 మంది సభ్యులుండగా ప్రభుత్వం ఏర్పాటుకు మరో ఐదుగురు సభ్యుల మద్దతుంటే సరిపోతుంది. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ (14), మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (3), గోవా ఫార్వర్డ్ పార్టీ (3), ఎన్సీపీ (1), స్వతంత్రులు(3) కలుపుకుని 21 మంది సభ్యుల మద్దతుంది. -
మళ్లీ ఆస్పత్రిలో చేరిన పారికర్
న్యూఢిల్లీ: దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా సీఎం మనోహర్ పారికర్ (62) శనివారం మరోసారి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. దీంతో బీజేపీ నాయకత్వం ఇతర మార్గాల అన్వేషణలో పడింది. ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న పారికర్ వారం పాటు అమెరికాలో చికిత్స పొంది ఈనెల మొదటి వారంలోనే ఆయన తిరిగి వచ్చారు. కొన్ని రోజులకే మరోసారి గోవాలోని కండోలిమ్ ఆస్పత్రిలో చేరారు. అంతకు ముందు ఈ ఏడాది ప్రారంభంలో 3 నెలల పాటు పారికర్ అమెరికాలో సుదీర్ఘ చికిత్స పొందిన విషయం తెలిసిందే. తరచూ ఆయన అనారోగ్యానికి గురికావడం, తదనంతర పరిణామాలపై చర్చించేందుకు ఇద్దరు సభ్యుల బీజేపీ కేంద్ర బృందం సోమవారం గోవా వెళ్లనుంది. పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యామ్నాయాల మార్గాల అన్వేషణలో ఉందని సమాచారం. నాయకత్వ మార్పిడికి సంబంధించి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా పారికర్‌తో చర్చించినట్లు కూడా తెలుస్తోంది. -
గోవా సీఎం ఆరోగ్యంపై అసత్య వార్తలు..
పణాజీ, గోవా : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ ఆరోగ్యంపై అసత్య ప్రచారం చేస్తున్న వాస్కో పట్టణానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తిని క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ‘అమెరికాలో క్లోమ గ్రంధి సంబంధిత చికిత్స పొందుతున్న పరీకర్ ఆరోగ్యం క్షీణించింది. ఇక ఆయన మనకు లేరు’ అంటూ సదరు వ్యక్తి మంగళవారం తన ఫేస్బుక్లో పోస్టు చేయడం కలకలానికి దారి తీసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సీఎం ఆరోగ్యం మెరుగు పడుతుందనీ, బహుశా ఆయన వచ్చే నెలలో ఇండియాకు రావొచ్చని గోవా బీజేపీ ప్రధాన కార్యదర్శి సదానంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లోగానే పరీకర్ ఆరోగ్యంపై పుకార్లు మొదలు కావడం బాధ కల్గించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘పరీకర్ కోలుకుంటున్నారు. ఆయన వచ్చే నెలలో స్వదేశానికి వస్తారు’ అని కర్కోరం ఎమ్మెల్యే నీలేష్ కాబ్రల్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. సీఎం ఆరోగ్య వివరాలను ప్రభుత్వం వెల్లడించడం లేదంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు అర్థరహితమని నీలేష్ మండిపడ్డారు. ఆయన ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తోందని వివరణ ఇచ్చారు. కాగా, కడుపు నొప్పితో ఫిబ్రవరి 5న ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరిన పరీకర్ మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లారు. -
ఆ అవమానకర ప్రశ్నే ‘సర్జికల్’కు కారణం
పణాజి: మయన్మార్ సరిహద్దు వెంట ఉగ్రవాదులను ఏరివేసిన తరువాత ఎదురైన ఓ అవమానకరమైన ప్రశ్నే సర్జికల్ దాడులకు దారితీసిందని మాజీ రక్షణ మంత్రి , గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ శుక్రవారం తెలిపారు. 2015, జూన్ 4న ఈశాన్య ప్రాంత మిలిటెంట్ గ్రూప్ ఎన్ఎస్సీఎన్–కే మణిపూర్‌లో భారత ఆర్మీ వాహనంపై మెరుపుదాడికి దిగి 18 మంది జవాన్లను పొట్టనపెట్టుకుంది. ప్రతీకారం తీర్చుకోవడానికి నాలుగు రోజుల తరువాత అంటే జూన్ 8న మయన్మార్ సరిహద్దులో ఆర్మీ జరిపిన దాడిలో సుమారు 80 మంది మిలిటెంట్లు మరణించారు. ఆ తరువాత జరిగిన ఓ టీవీ కార్యక్రమంలో... పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూడా అలాంటి ఆపరేషన్ నిర్వహించే సత్తా భారత ఆర్మీకి ఉందా? అని యాంకర్ కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌ను అడగడం తనలో ఆలోచనలు రేకెత్తించిందని పరీకర్ తెలిపారు. 2016 సెప్టెంబర్ 29న పాక్ ఉగ్ర శిబిరాలపై దాడులకు 15 నెలల ముందు అంటే 2015 జూన్ 9 నుంచే ప్రణాళికలు రచించామని పేర్కొన్నారు. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన అధునాతన రాడార్‌తో పాక్ ఆర్మీ ఫైరింగ్ యూనిట్లను గుర్తించి ధ్వంసం చేశామని తెలిపారు. -
జాతీయ క్రీడలు మళ్లీ వాయిదా
పనాజీ: జాతీయ క్రీడల నిర్వహణలో జరుగుతోన్న జాప్యంపై కేంద్ర క్రీడాశాఖ అసంతృప్తిగా ఉన్నప్పటికీ రాష్ట్ర సంఘాలు మాత్రం ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకుంటున్నాయి. 2016 సెప్టెంబరులో గోవాలో జరగాల్సిన జాతీయ క్రీడలను వచ్చే ఏడాది నిర్వహిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ బుధవారం వెల్లడించారు. క్రీడల నిర్వహణకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశాకే నేషనల్ గేమ్స్‌ను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా ప్రతీ రెండేళ్లకొకసారి జాతీయ క్రీడలను నిర్వహించాలి. గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ క్రీడలు జరగాల్సి ఉండగా వాటిని ఈ ఏడాది నవంబర్‌కు వాయిదా వేశారు. అయితే పరీకర్ తాజా నిర్ణయంతో గోవా జాతీయ క్రీడలు మరోసారి వాయిదా పడటం గమనార్హం. -
‘అక్రమ మార్గాల్లో అధికారంలోకి’
న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ శుక్రవారం రాజ్యసభకు హాజరుకావడంపై విపక్ష కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. పార్టీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. జీరో అవర్‌లో పరీకర్ సభకు రాగానే దిగ్విజయ్ సింగ్, బీకే హరిప్రసాద్ తదితరులు లేచి నిలబడి నిరసన తెలిపారు. గోవా ఎన్నికల్లో మెజారిటీ రాకున్నా బీజేపీ అక్రమ మార్గాల్లో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బీజేపీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. గోవా పగ్గాలు చేపట్టేందుకు పరీకర్ రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. సభ్యులు లేకుండా ఎలా కొనసాగిస్తారు? సభలో తగినంత మంది సభ్యులు లేకున్నా ప్రభుత్వం సభా కార్యక్రమాలను కొనసాగిస్తోందని రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ ధ్వజమెత్తారు. శుక్రవారం మధ్యాహ్నం సభలో విపక్ష సభ్యులు లేకపోవడాన్ని సాకుగా తీసుకుని వివాదాస్పద బిల్లులను సర్కారు ముందుకు తీసుకెళ్లడమేమిటని ప్రశ్నించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ స్పందిస్తూ.. విపక్ష సభ్యులు సభలో ఉండేలా చూడడం తన బాధ్యత కాదన్నారు. ప్రైవేటు సభ్యుల కార్యకలాపాలు ముగియగానే శత్రు ఆస్తుల బిల్లును చేపడతామన్నారు. ఏకాభిప్రాయం లేకుండా దీనిపై చర్చ ఉండదని ప్రభుత్వమే చెప్పిందంటూ ఆజాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్‌పాల్ నియామకమేదీ? లోక్‌పాల్‌ను ఇంతవరకూ ఎందుకు నియమించలేదని రాజ్యసభలో సీపీఎం సభ్యుడు తపన్‌కుమార్ సిన్హా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం పూనుకుంటే ఆర్డినెన్స్ ద్వారా ఈ పోస్టును భర్తీ చేయొచ్చన్నారు. మంత్రి నక్వీ సమాధానమిస్తూ.. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. జనపనార సంచులు వాడండి వరి, కూరగాయలను జనపనార సంచుల్లో ప్యాక్ చేయాల్సిందిగా పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలను కోరతామని జౌళి మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభకు తెలిపారు. జనపనార రైతులకు అధీకృత విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాజ్యసభకు 4 రోజుల సెలవు రాజ్యసభకు శనివారం నుంచి 4 రోజులు సెలవు ప్రకటించారు. శని, ఆది సాధారణ సెలవు రోజులు కాగా మంగళవారం శ్రీరామనవమి కావడంతో ఆరోజు, పండగ సందర్భంగా అదనంగా సోమవారం సెలవుగా ప్రకటించారు. సభ బుధవారం తిరిగి సమావేశమవుతుంది. -
పరీకర్ విధానాలే కొనసాగుతాయి: జైట్లీ
న్యూఢిల్లీ: రక్షణ మంత్రిగా తాను అదనపు బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆశాఖ మంత్రిగా మనోహర్ పరీకర్ అమలు చేసిన విధానాలనే కొనసాగిస్తానని ఆర్థికమంత్రి జైట్లీ స్పష్టం చేశారు. రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన మనోహర్ పరీకర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్తున్న నేపథ్యంలో ఆశాఖ బాధ్యతలను మంగళవారం అరుణ్‌జైట్లీ చేపట్టారు. గతంలోనూ 2014 మే నుంచి నవంబర్ వరకు జైట్లీ రక్షణ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. పరీకర్ తన విధుల్ని ఎక్కడ విడిచి పెట్టారో అక్కడి నుంచి తాను కొనసాగిస్తానన్నారు. -
నేడే మనోహర్ పరీకర్ ప్రమాణం
-
నేడే పరీకర్ ప్రమాణం
⇒ రక్షణ మంత్రి పదవికి రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం ⇒ జైట్లీకి అదనంగా రక్షణ శాఖ బాధ్యతలు పణజి, సాక్షి, న్యూఢిల్లీ: గోవా సీఎంగా మనోహర్ పరీకర్ మంగళవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో సోమవారం ఆయన రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రధాని సలహా మేరకు పరీకర్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారని రాష్ట్రపతిభవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. పరీకర్‌తో పాటు 8 లేదా 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గోవాలో మెజార్టీ రాకపోయిన ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రుల సాయంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కేబినెట్లో గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ)కి రెండు, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ)కి రెండు మంత్రి పదవులు దక్కనున్నాయి. కాంగ్రెస్ లెక్కకు గడ్కరీ చెక్... గోవాలో బీజేపీ 13 స్థానాలే సాధించినా... జీఎఫ్‌పీ, ఎంజీపీ, ఇద్దరు స్వతంత్రుల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అసెంబ్లీలో మొత్తం 40 మంది సభ్యులుండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 21 మంది అవసరం. కాంగ్రెస్ 17 సీట్లు గెల్చుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినా మెజార్టీ సభ్యుల్ని కూడగట్టడంలో విఫలమైంది. అదే సమయంలో బీజేపీ తరఫున సీనియర్ నేత గడ్కరీ రంగంలోకి పరిస్థితిని బీజేపీకి అనుకూలంగా మార్చేశారు. పరీకరే సీఎం అభ్యర్థి అంటూ గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో జోరుగా ప్రచారం సాగింది. జైట్లీకి రక్షణ శాఖ బాధ్యతలు పరీకర్ రాజీనామాతో రక్షణ శాఖ బాధ్యతల్ని ఆర్ధిక మంత్రి జైట్లీకి అదనంగా అప్పగించారు. ప్రధాని సలహా మేరకు రక్షణ శాఖను జైట్లీకి కేటాయించారని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. రక్షణ శాఖ బాధ్యతల్ని జైట్లీ చేపట్టడం ఇది రెండోసారి. సీఎంగా పరీకర్ వెళ్తుండడంతో ... శాసనసభకు పోటీ చేసేందుకు వీలుగా మాపుసా స్థానానికి డిప్యూటీ సీఎం ఫ్రాన్సిస్ రాజీనామా చేశారు. త్వరలో కేబినెట్లో మార్పులు రెండో విడత బడ్జెట్ సమావేశాల తర్వాత కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరగవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని మార్పులు చేస్తారని భావిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల్లో ఒకరిని కేంద్ర ప్రభుత్వంలో చేర్చుకునే అవకాశాలున్నాయని, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరిని ఆ రాష్ట్రానికి సీఎంగా చేయవచ్చని చెబుతున్నారు. మమ్మల్ని ఆహ్వానించండి..: కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గోవా కాంగ్రెస్ శాసనసభా పక్షం సోమవారం రాత్రి రాష్ట్ర గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. తమ పార్టీకి తగినంత మద్దతు ఉందని, అసెంబ్లీలో బలం నిరూపించుకుంటామని గవర్నర్‌కు సమర్పించిన విజ్ఞాపన పత్రంలో పేర్కొంది. సుప్రీంను ఆశ్రయించిన కాంగ్రెస్ మనోహర్ పరీకర్‌ను గోవా సీఎంగా నియమిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హా తీసుకున్న నిర్ణయాన్ని సవాలుచేస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సోమవారం రాత్రి సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఖేహర్ నివాసంలో పిటిషన్ దాఖలుచేసింది. మంగళవారం ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి అంగీకరించారు. హోలీ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వారం రోజులు సెలవు కావడంతో కేసును ప్రత్యేక బెంచ్ విచారించనుంది. గోవా సీఎల్పీ నేత చంద్రకాంత్ కవ్లేకర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ నిర్ణయాన్ని రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. -
దేశీయ 'నేత్ర'
స్వదేశీ సాంకేతికతతో రూపొందిన 'నేత్ర' భారతీయ వాయుదళంలో చేరింది. నేత్రలో వినియోగించిన ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టం(ఏఈడబ్ల్యూ&సీ)ను దేశీయంగా అభివృద్ధి చేశారు. యుద్ధ సమయాల్లో శత్రువుల రాకను దాదాపు 300 కిలోమీటర్లు ముందే నేత్ర గుర్తించగలదు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎయిర్ షో ఎరో ఇండియా ప్రారంభ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ నేత్రను ఐఏఎఫ్ స్క్వాడ్రన్‌కు అప్పగించారు. పంజాబ్‌లోని భతిండా బేస్ నుంచి నేత్ర తన సేవలను ప్రారంభించనుంది. నేత్రలో ఉపయోగించిన రాడార్ వ్యవస్ధ, మరికొన్ని కీలక విభాగాలు స్వదేశీయంగా అభివృద్ధి చేసినవే. ప్రస్తుతం రెండు నేత్ర విమానాలను ఐఏఎఫ్‌కు అందిస్తున్నారు. భవిష్యత్తులో నేత్ర సిస్టంను భారత ఇంజనీర్లు మరింత తీర్చిదిద్దుతారని భావిస్తున్నట్లు పరీకర్ చెప్పారు. -
నో డౌట్.. అధికారం మాదే!!
గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీలు మళ్లీ తమదే అధికారమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటింగ్ సరళీ అధికార పార్టీలకు అనుకూలంగా ఉందని అంచనా వేస్తున్నాయి. కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ.. గోవా ఎన్నికల్లో మరోసారి బీజేపీదే అధికారమని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని పేర్కొన్నారు. అటు పంజాబ్‌లో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న అధికార శిరోమణి అకాలీ దళ్ కూడా మరోసారి తమదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేసింది. పంజాబ్‌లో తాము మరోసారి గెలిచితీరుతామని అకాలీ దళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ తెలిపారు. కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్‌ది డ్రామా అని, ఆయనకు డిపాజిట్ కూడా రాదని ఆయన పేర్కొన్నారు. ఆప్ మూడోస్థానానికి పరిమితమవుతుందని బాదల్ జోస్యం చెప్పారు. మరోవైపు పంజాబ్, గోవాలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ప్రజలు, పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు క్యూలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. -
ఆర్మీ, నేవీలకు కొత్త అధిపతులు
న్యూఢిల్లీ: భారత 27వ సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ శనివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ పొందిన జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు అనూప్ రాహా స్థానంలో వైమానిక దళాధిపతిగా ఎయిర్ మార్షల్ బిరేందర్ సింగ్ ధనోవా బాధ్యతలు స్వీకరించారు. జనరల్ రావత్ కన్నా ప్రవీణ్ భక్షి, పీఎం హరీజ్‌లు ఎంతో సీనియర్లు కావడం గమనార్హం. అయితే రావత్‌కు ఈస్ట్రన్ కమాండ్‌కు అధిపతిగా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ భక్షి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఆర్మీ చీఫ్‌గా రావత్ నియామకం నేపథ్యంలో భక్షి రాజీనామా చేయవచ్చు లేదా ముందస్తు రిటైర్మెంట్ తీసుకోవచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఇటీవల రక్షణ మంత్రి మనోహర్ పరీకర్‌తో కూడా ఆయన భేటీ అయ్యారు. కానీ మీడియాతో పాటు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వదంతులన్నిటికీ స్వస్తి పలకాలని భక్షి విజ్ఞప్తి చేశారు. సైన్యంతో పాటు జాతి ప్రయోజనాలపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని సూచించారు. ఇలావుండగా ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని శనివారం పదవీ విరమణ చేసిన జనరల్ సుహాగ్ చెప్పారు. ఒక ర్యాంకు ఒక పింఛను పథకం అమలు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మధ్యాహ్నం జనరల్ రావత్‌కు ఆయన బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు జనరల్ సుహాగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ రాహా అమర్ జవాన్ జ్యోతి వద్ద నివాళులర్పించి గౌరవ వందనం స్వీకరించారు.