16న బీజేపీ వికాస్ పర్వ్
► టీడీపీ విమర్శలకు పారికర సమాధానం
నెల్లూరు: నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిన ప్రయోజనాలను వివరించేందుకు ఈ నెల 16న ఆ పార్టీ నెల్లూరులో సభ నిర్వహించనుంది. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
ఈ సభలో రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం నేతల విమర్శలు, ఆరోపణలకు గట్టిగా సమాధానం చెప్పేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. ప్రత్యేక హోదా, రాజధాని నిర్మా ణం, రెవెన్యూలోటు భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నామమాత్రపు సాయం చేసిందని సీఎం చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కొంత కాలం నుంచి విమర్శల దాడి పెంచారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ నిధులు సాధిస్తామని ఓ వైపు చెబుతూనే మరో వైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల సవతి ప్రేమ చూపుతోందనే భావనను ప్రజల్లో కల్పించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇటీవల నెల్లూరులో నిర్వహించిన తెలుగుదేశం మినీ మహానాడులో మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో పాటు ఇతర నేతలు బీజేపీ ప్రభుత్వంపై గట్టిగా విమర్శలు గుప్పించారు. బీజేపీ జిల్లా నేతలు వీటికి సమాధానం ఇచ్చినా జనంలోకి పెద్దగా వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న మోదీ రెండేళ్ల పాలనపై నిర్వహించే సభలో కేంద్ర మంత్రుల ద్వారా సమాధానం చెప్పించాలని జిల్లా నాయకత్వం నిర్ణయించింది. ఇందుకోసం రక్షణ మంత్రి మనోహర్ పారికర్, సహాయ మంత్రి విజయ్ సంప్ల, రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, జాతీయ ఉపాధ్యక్షుడు దినేష్ శర్మను సభకు రప్పిస్తున్నారు. పారిశ్రామిక వేత్త పొన్నలూరి సీతారామిరెడ్డి అధ్యక్షతన టౌన్ హాల్లో సాయంత్రం 5 గంటలకు సభ ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రుల రాక సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.