
పణాజి : అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రిని బీజేపీ హీ - మ్యాన్, సూపర్‌మ్యాన్ లాగా చూపించే ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో బుధవారం (నిన్న) నిర్వహించిన 57వ గోవా లిబరేషన్ డే పరేడ్ కార్యక్రమాలకు సీఎం మనోహర్ పారికర్ హాజరుకాకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉర్ఫాన్ ముల్లా మాట్లాడుతూ.. ‘బీజేపీ గోవా సీఎమ్‌ను ఫోటో సెషన్ కోసం వాడుతూ.. అతన్ని ఓ హీ - మ్యాన్, సూపర్‌మ్యాన్‌గా చూపించే ప్రయత్నం చేస్తోంది. వైద్యులను వెంటబెట్టుకుని వెళ్లి మరి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను పర్యవేక్షించిన పారికర్‌కు ఇంత ముఖ్యమైన గోవా లిబరేషన్ డే పరేడ్ వేడుకలకు హాజరుకావడానికి మాత్రం ఆరోగ్యం సహకరించలేదా’ అంటూ ప్రశ్నించారు. నిజంగా ఇది చాలా విచారకరమన్నారు.
ఇదిలా ఉండగా గోవా లిబరేషన్ డే పరేడ్ వేడుకల్లో గోవా అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్, పారికర్ స్థానంలో ఉండి కార్యక్రమాలు నిర్వహించారు. పారికర్ అనారోగ్య కారణాల వల్ల అసెంబ్లీకి హాజరు కాలేకపోయారన్నారు. ఆయన బదుల ఈ ఉపన్యాసాన్ని తాను చదువుతున్నానంటూ సావంత్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment