అవును.. లోపాలున్నాయ్! | Manohar parikar comments terrorist attack on the Pathankot | Sakshi
Sakshi News home page

అవును.. లోపాలున్నాయ్!

Published Wed, Jan 6 2016 1:44 AM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM

అవును.. లోపాలున్నాయ్!

అవును.. లోపాలున్నాయ్!

పఠాన్‌కోట్‌పై ఉగ్రదాడికి అవి తోడ్పడ్డాయి: పరీకర్
 
♦ అక్కడ ఉగ్రవాదులెవరూ లేరు.. అయినా కూంబింగ్ కొనసాగుతోంది
♦ ఉగ్రవాదులు భారీగా ఆయుధాలతో వచ్చారు.. ఆపరేషన్ కష్టమైంది
♦ పఠాన్‌కోట్‌ను సందర్శించాక మీడియాతో రక్షణమంత్రి వెల్లడి
 
 పఠాన్‌కోట్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ భారత వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడికి కొన్ని లోపాలు దోహదం చేశాయని రక్షణమంత్రి మనోహర్ పరీకర్ అంగీకరించారు. సుదీర్ఘ రక్షణగోడ ఉన్న ఎయిర్‌బేస్ లోపలికి ఉగ్రవాదులు ఎలా చొరబడగలిగారన్నది ఆందోళన కలిగిస్తున్న అంశమన్నారు. అయితే భద్రతకు సంబంధించిన ప్రతి విషయాన్నీ బాహాటంగా చర్చించలేమన్నారు. పరీకర్ మంగళవారం ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైమానిక స్థావరంపై దాడికి దిగిన ఉగ్రవాదులందరినీ నిర్మూలించటం జరిగిందని.. అయితే స్థావరంలో కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు.

‘ఇప్పుడు లోపల అనుమానిత ఉగ్రవాది ఎవరూ లేరు. అయితే.. కూంబింగ్ ఆపరేషన్లు పూర్తయ్యే వరకూ దీనిని నిర్ధారణగా చెప్పను. ఈ ఆపరేషన్లు బుధవారం పూర్తికావచ్చు’ అని పలు ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. ఉగ్రదాడిలో చనిపోయిన ఏడుగురు సైనిక సిబ్బందిలో.. డిఫెన్స్ సెక్యూరిటీ కోర్‌కు చెందిన ఫతేసింగ్, కుల్వంత్‌సింగ్‌ల కుటుంబ సభ్యులను కూడా ఆయన మంగళవారం కలిశారు. పరీకర్  ఏమన్నారంటే..  

► శనివారం ఉదయం 3:30 గంటలకు ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. సోమవారం రాత్రి 7:30 గంటలకు ఆ ముష్కరులు చివరిసారిగా తారసపడ్డారు. ఆ తర్వాత కొనసాగుతున్న ఆపరేషన్లు కూంబింగ్ కోసమే. ఆ ప్రాంతంలో చాలా బాంబులున్నాయి.. దీంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవటంలో జాప్యం జరుగుతోంది. చివరి ఉగ్రవాది మృతదేహం బూబీ ట్రాప్(బాంబుల వల) కావచ్చని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. దీంతో ఆ మృతదేహాన్ని ఇంకా స్వాధీనం చేసుకోలేదు. తొందరపడాల్సిన అవసరం లేదని  చెప్పాను. ఇప్పటికే ఒకరిని బూబీ ట్రాప్‌లో కోల్పోయాం.. మరింత మందిని కోల్పోరాదు. రిస్కు తీసుకోలేం.

► ఉగ్రవాదులు ఏకే47 రైఫిల్లు, మోడిఫైడ్ అండర్ గ్రెనేడ్ బారెల్ లాంచర్లు, పిస్టళ్లు, స్విస్, కమాండో కత్తులు, -50 కిలోల బుల్లెట్లు,  డజన్లకొద్దీ మేగజీన్లు, మోర్టార్ల వెంట తెచ్చారు. వారిపై ఆపరేషన్ చాలా కష్టంతో కూడుకున్నది. మూడు వేల మంది కుటుంబాలు, ఐదారు దేశాలకు చెందిన విదేశీ ట్రైనీలు (శిక్షణ కోసం వచ్చిన వారు) ఉన్న ఈ స్థావరంలోని ఆస్తులన్నిటినీ సురక్షితంగా ఉంచుకోవటంపైనే తొలుత దృష్టి కేంద్రీకరించటం జరిగింది. స్థావరంలోని అన్ని ఆస్తులూ.. వ్యూహాత్మక ఆస్తులు, భవనాలు, సిబ్బంది కుటుంబాలను రక్షించుకోవటం జరిగింది. ఉగ్రవాదులు దాక్కున్న భవనం ఒక్కటే దెబ్బతిన్నది.

► ఉగ్రవాదులతో ఎదురు కాల్పుల్లో చనిపోయిన ఏడుగురు భద్రతా సిబ్బందినీ అమరులుగా పరిగణిస్తాం. యుద్ధ పరిస్థితుల్లో చనిపోయిన సైనిక మృతులకు లభించే అన్ని ప్రయోజనాలూ వారికి వర్తిస్తాయి. మృతుల్లో గరుడ్ కమాం డో మినహా ఎవరూ ఆపరేషన్‌లో చనిపోలేదు. ఐదుగురు ఢిఫెన్స్ సెక్యూరిటీ కోర్ సిబ్బంది దురదృష్టవశాత్తూ చనిపోయారు. వారిలో జగదీశ్‌చంద్ర ఒక ఉగ్రవాదితో ప్రత్యక్షంగా కలబడి అతడిని హతమార్చాడు. వీరు అత్యుత్తమ త్యాగం చేసిన అమరులు.

► భద్రతకు సంబంధించి కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. కానీ.. భద్రత విషయంలో రాజీపడటం జరిగిందని నేననుకోను. దర్యాప్తులు పూర్తయ్యాక అన్ని అంశాలూ స్పష్టమవుతాయి. భద్రతకు సంబంధించిన ప్రతి వివరాన్నీ బహిరంగంగా చర్చించలేం. ఈ దాడికి పాకిస్తాన్‌తో లింకు ఉందా అంటే.. ఉగ్రవాదులు ఉపయోగించిన కొన్ని పరికరాలు పాక్‌లో తయారయినట్లు తెలుస్తోంది. ఎన్‌ఐఏ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇది దర్యాప్తులో ఉన్న అంశం కనుక దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించటం సరికాదు.
► సైన్యం, వాయుసేన, ఎన్‌ఎస్‌జీలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేశాయి. ఈ మూడు విభాగాలు భవిష్యత్తులో సంయుక్త శిక్షణ చేపట్టాలి. ఉగ్రవాదులపై దాడికి సైన్యానికి చెందిన ప్రత్యేక బలగాలను కాకుండా ఎన్‌ఎస్‌జీని ఎంచుకోవటంపై విమర్శలు సరికాదు. ఎన్‌ఎస్‌జీలో సగం మంది సైన్యం నుంచే ఉన్నారు. అన్ని ఆయుధాలనూ ఆర్మీయే అందించింది. వారు కలసి సజావుగా పనిచేశారు.  హతులైన ఉగ్రవాదుల్లో నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. రెండు మృతదేహాలు గుర్తుపట్టటానికి వీలు లేనంతగా కాలిపోయాయి. శరీరభాగాలు రెండు ప్రాంతాల నుంచి లభించాయి.  

 కాగా, ఆపరేషన్ పూర్తవటంతో మంగళవారం రాత్రి ఎయిర్‌బేస్‌లోకి మీడియా ప్రతినిధులను అనుమతించారు. ఆ ప్రాంత దృశ్యాలు  పోరాటానికి అద్దంపట్టాయి.
 
 మూగబోయిన తుపాకులు

 ఉగ్రదాడి నేపథ్యంలో 3 రోజుల పాటు తుపాకీ కాల్పులు,  పేలుళ్లతో  నాలుగో రోజు మంగళవారం ఎట్టకేలకు శాంతించింది.  సైనిక చర్య.. సోమవారం రాత్రి ఆరో ఉగ్రవాదిని ఎదురు కాల్పుల్లో హతమార్చినట్లు భావిస్తున్నప్పటికీ.. భద్రతా బలగాలు ఈ స్థావరం పూర్తిగా సురక్షితమని నిర్ధారించుకునేందుకు అణువణువూ గాలిస్తూ కూంబింగ్  చేస్తున్నాయి. . శనివారం తెల్లవారుజామున ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడటం.. అప్రమత్తంగా ఉన్న భద్రతా బలగాలు వారిని నిలువరించి ఎదురు దాడికి దిగటం తెలిసిందే.

శనివారమే నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టగా.. ఆదివారం, సోమవారమూ కొనసాగిన సైనిక చర్యలో మరో ఇద్దరు ఉగ్రవాదులను హతవుర్చారు. అయితే.. ఎయిర్‌బేస్‌లోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఎంతమంది అనేది కచ్చితంగా తెలియటం లేదు. ఈ నేపథ్యంలో స్థావరంలో కూంబింగ్ ఆపరేషన్లను కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement