'ఆ విషయం సైనికునికే వదిలేయాలి'
న్యూ ఢిల్లీ: పఠాన్కోట్ ఎయిర్ బేస్పై ఉగ్రవాద దాడి ఘటనపై ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన ఆపరేషన్ మూడు రోజులు సాగిందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు.
ఉగ్రవాదుల ఏరివేతలో భద్రతా బలగాల మధ్య పూర్తి సహకారం ఉందని దల్బీర్ సింగ్ తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదులు ఓ భవనంలో నక్కి ఉండటం వలన వారిని బయటకు రప్పించాల్సి రావడం, ప్రాణ నష్టం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేయడానికి ప్రాధాన్యతనివ్వడం మూలంగా కొంత సమయం తీసుకున్నామన్నారు. అయినా ఉగ్రవాదులను ఏరివేయడానికి ఎంత సమయం తీసుకుంటారనే విషయం యుద్ధక్షేత్రంలో ఉన్న సైనికునికే వదిలేయాలని దల్బీర్ సింగ్ స్పష్టం చేశారు.
నిఘా వర్గాల వైఫల్యం వలనే ఉగ్రదాడి జరిగిందన్న విమర్శలపై ఆయన మాట్లాడుతూ.. ఇంటలిజెన్స్ వర్గాలకు చిక్కకుండా ఉగ్రవాదులు ఎలా వచ్చారనే విషయాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతోందన్నారు. ఈ దాడి ఘటన మనం అప్రమత్తంగా ఉండాలని తెలుపుతోందన్నారు.