ఇంకెంత మంది సైనికులు మరణించాలి?
న్యూఢిల్లీ: ‘దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయడంతో టెర్రరిస్టులకు, మిలిటెంట్లకు నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక మన దేశ సరిహద్దులన్నీ పూర్తిగా సురక్షితం’ అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ నవంబర్ 27వ తేదీ నాడు వ్యాఖ్యానించారు. ‘ఒక్కసారి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరు కూడా భారత్‌లోకి అడుగు పెట్టేందుకు సాహసించరు’ అని 2014, ఏప్రిల్ నెలలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఓ ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ భూభాగంలోకి మన సైనికులు చొచ్చుకుపోయి ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు సూపర్‌గా చేశారని ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో కిందిస్థాయి నుంచి పైస్థాయి నాయకత్వం వరకు చంకలు గుద్దుకున్నారు. ఈ వ్యాఖ్యలన్నీ నేడు నిజమే అయితే మంగళవారం నాడు జమ్మూకు సరిగ్గా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగ్రోటాలోని భద్రతా బలగాల స్థావరంపై సరిహద్దులు దాటి వచ్చిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఎలా దాడి చేశారు? సర్జికల్ దాడులతోపాటు పెద్ద నోట్ల రద్దు వ్యవహారం కేవలం ప్రచార అస్త్రాలుగానే మిగిలిపోతున్నాయా?
నగ్రోటాలో భద్రతా బలగాల స్థావరంపై సైనిక దళాలు జరిపిన దాడుల్లో ఇద్దరు అధికారులు, ఐదుగురు సైనికులు మరణించిన విషయం తెల్సిందే. ఈ ఒక్క నెలలోనే 11 మంది మరణించగా, గడిచిన మూడు నెలల్లో టెర్రరిస్టుల దాడులకు 40 మంది సైనికులు మరణించారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌తో మొదలైన ఈ దాడులు పఠాన్‌కోట్, ఊడికి విస్తరించి, ఇప్పుడు నగ్రోటాకు పాకాయి. ఈ అన్ని దాడులు సూచిస్తున్న ఓ కామన్ పాయింట్‌నన్నా కేంద్ర ప్రభుత్వం పట్టుకుందా? అదే సైనికులను మాత్రమే లక్ష్యంగా చేసుకొని టెర్రరిస్టులు దాడులను నిర్వహించడం.
ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ....
నగ్రోటాలోని 16వ పటాలానికి కమాండింగ్ జనరల్ ఆఫీసర్‌గా గత అక్టోబర్ నెలలోనే బాధ్యతలు స్వీకరించిన లెఫ్ట్‌నెంట్ జనరల్ ఏకే శర్మకు వారం రోజుల క్రితమే పటాలంపై పెద్ద దాడి జరగబోతోందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందిందట. వాస్తవానికి రెండో సిక్కు రిజిమెంట్ బెటాలియన్‌కు చెందిన శర్మకు తిరుగుబాటు కార్యకలాపాలను ఎదుర్కోవడంలో అపారమైన అనుభవం ఉందట. అందుకనే ఈకొత్త విధులు అప్పగించారట. అయినా ఆయన తనకందిన సమాచారం ప్రకారం తన కిందిస్థాయి అధికారులందరికి అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారట.
అయినా అన్ని చోట్ల లోపాలు....
నగ్రోట స్థావరంలోకి వచ్చిన తమిళ పటాలంకు అసలు ఆయుధాలే ఇవ్వలేదట. భోజన శాలకు సమీపంలో టెంటుల్లో పడుకున్న సైనికుల వద్ద ఎదురు కాల్పులు జరపడానికి ఆయుధాలే లేవట. ఎదురుకాల్పుల్లో చనిపోయింది ముగ్గురు ఉగ్రవాదులని, మరో ముగ్గురు ఉగ్రవాదులు తప్పించుకుపోయారని కొందరు అధికారులు చెబుతుండగా, మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు చనిపోయారని మరికొందరు అధికారులు చెబుతున్నారు. ఎందుకీ సమన్వయ లోపం, లోపాలకు ఎవరు బాధ్యలు?
పక్కా ప్రణాళిక ఎప్పుడు?
పఠాన్‌కోట్ నుంచి ఊడి వరకు టెర్రరిస్టులు దాడులు జరిపినా, 40 మంది వీరులు మరణించినా పాలకులు ఎందుకు మేల్కోవడం లేదు? ఇలాంటి దాడులు పునరావతం కాకుండా పక్కా ప్రణాళికను ఎందుకు రచించడం లేదు ? సైన్యానికి, ప్రభుత్వానికే కాకుండా, ప్రభుత్వం పెద్దల మధ్యనే సమన్వయలోపం ఉందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. పఠాన్‌కోట్ దాడిలో ఆరుగురు టెర్రరిస్టులు మరణించారని సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించగా, ప్రభుత్వం నలుగురే దాడి చేశారని, ఆ నలుగురు మరణించారని నవంబర్ 29న పార్లమెంట్‌లో ప్రకటించింది. పాలకులు కేవలం ప్రచారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా, చిత్తశుద్ధితో పక్కావ్యూహంతో ముందుకు వెళ్లనంతా కాలం మన సైనిక వీరులు అన్యాయంగా మరణిస్తూనే ఉంటారు. పాలకులు నివాళులర్పించడం మినహా చేయగలిగిందీ ఏమీ ఉండదు.
-ఓ సెక్యులరిస్ట్ కామెంట్