
న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌కు మోదీ విజ్ఞప్తి
భారత వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారనివ్వొద్దని సూచన
భారత్, న్యూజిలాండ్ మధ్య ఆరు ఒప్పందాలపై సంతకాలు
న్యూఢిల్లీ: ద్వీపదేశమైన న్యూజిలాండ్‌లో ఖలిస్తానీ శక్తుల ప్రాబల్యం నానాటికీ పెరుగుతుండడం, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయా శక్తులను కఠినంగా అణచివేయాలని న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్‌కు విజ్ఞప్తి చేశారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు న్యూజిలాండ్‌ను అడ్డాగా మారనివ్వకూడదని కోరారు. మోదీ, లక్సన్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు.
భారత్–న్యూజిలాండ్ సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. 2019లో న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగరంలో జరిగిన ఉగ్రవాద దాడులు, 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులకు సారూప్యం ఉందని మోదీ గుర్తుచేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నాసరే వ్యతిరేకించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఉగ్రవాద దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, రాడికల్ శక్తులపై పోరాడే విషయంలో భారత్, న్యూజిలాండ్ మధ్య సహకారం కొనసాగుతుందని స్పష్టంచేశారు.
రక్షణ పరిశ్రమ రంగంలో సహకారానికి రోడ్‌మ్యాప్
భారత్, న్యూజిలాండ్ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై చర్చలు ప్రారంభం కావడాన్ని మోదీ, లక్సన్ స్వాగతించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అలాగే భారత్, న్యూజిలాండ్ మధ్య నేరుగా విమానాలు నడిపేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలపై చర్చించారు.
ఇండో–పసిఫిక్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహాత్మక వైఖరిపై తాము చర్చించామని లక్సన్ వివరించారు. మోదీ, లక్సన్ భేటీ సందర్భంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆరు కీలక ఒప్పందాలు కుదిరాయి. రెండు దేశాల నడుమ రక్షణ సంబంధాలను వ్యవస్థీకృతంగా మార్చడం, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంతోపాటు విద్య, క్రీడలు, వ్యవసాయం, వాతావరణ మార్పుల నియంత్రణ వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి ఇరు పక్షాలు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రక్షణ పరిశ్రమ రంగంలో సహకారం కోసం ఒక రోడ్‌మ్యాప్ రూపొందించాలని ఇరు దేశాలు నిర్ణయానికొచ్చాయి.
విస్తరణవాదం వద్దు.. అభివృద్ధే కావాలి
స్వేచ్ఛాయుత, భద్రతతో కూడిన, సౌభాగ్యవంతమైన ఇండో–పసిఫిక్‌కు భారత్, న్యూజిలాండ్ బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇండో–పసిఫిక్‌లో అభివృద్ధిని కోరుకుంటున్నాం తప్ప విస్తరణవాదాన్ని కాదంటూ పరోక్షంగా చైనా తీరును తప్పుపట్టారు. ఇండో–పసిఫిక్ సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతను అందరూ గౌరవించాలని మోదీ, లక్సన్ పేర్కొన్నారు.
ఈ మేరకు ఇరువురు నేతలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అక్రమ వలసల సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఒక దేశానికి చెందిన నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, కార్మికులకు మరో దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా చట్టబద్ధమైన ఏర్పాటు చేసుకోవాలని, దీనిపై చర్చలు ప్రారంభించాలని అంగీకారానికి వచ్చారు. గాజాలో శాశ్వతంగా శాంతి నెలకొనాలన్నదే తమ ఆకాంక్ష అని వెల్లడించారు.
అందుకే క్రికెట్ మాట ఎత్తలేదు
ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన చర్చల్లో క్రికెట్ అంశం ప్రస్తావనకు రాలేదని న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ చెప్పారు. తాను ఉద్దేశపూర్వకంగానే ఆ అంశాన్ని విస్మరించానని అన్నారు. భారత్–న్యూజిలాండ్ మధ్య దౌత్య సంబంధాల దెబ్బతినకుండా అడ్డుకోవాలన్నదే తన ఆలోచన అని వివరించారు. దీంతో పక్కనే ఉన్న ప్రధాని మోదీ బిగ్గరగా నవ్వేశారు. సోమవారం భేటీ తర్వాత లక్సన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఇటీవల జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోïఫీలో భారత్ చేతిలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఓడిపో యిన సంగతి తెలిసిందే. అలాగే ఇండియాలో జరిగిన టెస్టు క్రికెట్ సిరీస్‌లో న్యూజిలాండ్ నెగ్గింది. తమ చర్చల్లో క్రికెట్ గురించి మాట్లాడనందుకు మోదీని అభినందిస్తున్నానని లక్సన్ చెప్పారు. మరోవైపు మోదీ, లక్సన్ కలిసి సోమవారం ఢిల్లీలోని చరిత్రాత్మక గురుద్వారా రకాబ్‌గంజ్ సాహిబ్‌ను సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment